గోపాలరావుగారి కళ్ళల్లో తడి రెపరెపలాడింది.
"ఇప్పటిదాకా అల్లుళ్ళ మాటలకి చాలాసార్లు కంటతడి పెట్టాను బాబూ! కానీ ఈరోజు ఆనందంవల్ల కళ్ళు చెమరుస్తున్నాయి" అని భుజం మీదున్న తుండుతో తుడుచుకున్నాడు.
అరుంధతి అక్కసుగా "పోనీ జాతీ, మతం అయినా మనవేనా?" అడిగింది.
శక్తి చురుగ్గా ఏదో అనేలోగానే, ఇంద్రనీల్ నవ్వి "మతం.....హిందూమతం, జాతి భారతీయత" అన్నాడు.
అరుంధతి విసవిసా లోపలికి వెళ్ళిపోయింది.
"నిన్న పెళ్ళిచూపులకని తెచ్చిన కారప్పూసా, లడ్డూ ప్లేట్లో పట్టుకురా తల్లీ" చెప్పాడు గోపాలరావు.
శక్తి లోపలికి వెళ్ళింది.
గోపాలరావు మాట్లాడదామని అతనివైపు చూసేసరికి అతను స్టూలుమీద బయటకు పొడుచుకు వస్తున్న మేకుని సుత్తితో అణగకొడుతూ కనిపించాడు.
అది చూసి ఆయన తృప్తిగా నిట్టూర్చారు.
* * *
అరుంధతి భర్త శంకర్ కట్నంలేకుండా మరదలి పెళ్ళి జరుగుతోందని తెలిసి హుటాహుటీ బయల్దేరి వచ్చాడు. అతనికి ఇంద్రనీల్ పేరెత్తితేనే కంపరంగా వుంది. ఇప్పటి మార్కెట్ రెట్లని బట్టి శక్తిమతికి ఏ రెండులక్షలో కట్నం ఇస్తే తనూ తక్కువైన కట్నం డబ్బుగురించి పేచీ పెట్టవచ్చని అతని వూహ!
కానీ ఇంద్రనీల్ నిరుద్యోగి అని తెలుసుకున్నాక అతని మనసు కాస్త శాంతించింది.
"అలా చెప్పండి తాడూ బొంగరం లేని అనామకుడిని ఎవర్నో పిలిచి పిల్లనిస్తున్నారా? అప్పుడే అనుకున్నాను. ఎంత తలమాసినవాడైనా కట్నం లేకుండా చేసుకోడే అని" అన్నాడు హేళనగా.
"అవును.... తలమాసినవాడెవాడూ కట్నం లేకుండా చేసుకోడు" వ్యంగ్యంగా అంది శక్తి.
గోపాలరావు ఓపిక పట్టమని కూతురికి సైగ చేశాడు.
శంకర్ శక్తిని ఏమీ అనలేక కాఫీ అందిస్తున్న అరుంధతిని "చూసుకోకుండా ఇస్తావేం? కప్పు కిందంతా నీళ్ళు కారుతున్నాయి" అంటూ చెంప చెళ్ళుమనిపించాడు.
గోపాలరావు ఆ దెబ్బ తన హృదయంమీదే పడినంతగా విలవిల లాడాడు. ఆ నిముషంలోనే మనసులో బలంగా "వీడికి ఓ ఆడపిల్లని పుట్టించి, ఆ బాధ అర్ధం అయ్యేట్లు చెయ్యి స్వామీ!" అని భగవంతుడ్ని వేడుకున్నాడు. మరునిముషంలో తనదెంత కసాయికోరికో తెలుసుకుని చెంపలు వాయించుకున్నాడు.
"ఏమిటీ చెంపలు వాయించుకుంటున్నారూ?" అడిగాడు గర్వంగా చూస్తూ శంకర్.
"ఆడపిల్లని కన్నందుకు నాయినా!" అన్నాడు.
మనసులో మాత్రం 'ఆడపిల్ల తండ్రికి మాటా, చూపూ, వినికిడీ మందగించటం ఎంత అదృష్టం' అనుకున్నాడు.
శంకర్ కాసేపు తననితాను పొగుడుకుని "నా స్థాయికి తగ్గవాడు కాకపోయినా, కాస్త నాలుగంకెలు సంపాదించేపాటివాణ్ని నే చూడక పోదునా? ఎందుకింత తొందరపడ్డారూ?" అని మామగారిని అడిగాడు.
శక్తి వాడిగా "నేను కోరుకునే మనిషి గుణాలూ, మగతనం అతనికి వున్నాయనే నా అభిప్రాయం చీటికీ మాటికీ ఆడదాన్ని హింసించి ఆనందంపొందే పైశాచికత్వం వున్నవాడు ఎంతటివాడైనా నేను కోరుకోను" అంది.
"చూశావా నీ చెల్లిలి కూతలు? ఇంకా ఏం మర్యాదలు మిగిలి పోయాయని ఇక్కడ నిలబడ్డావు? పద" అంటూ శంకర్ అరుధంతిమీద కేకలు వేశాడు.
గోపాలరావు అడ్డుపడి అల్లుడి కాళ్ళూ, గెడ్డం పట్టుకుని బతిమాలి ఆపాడు.
సాయంత్రం ఇంద్రనీల్ వచ్చాడు.
శంకర్ కి పరిచయం చేయగానే అతన్ని కిందనుంచి మీదకి ఒకసారి చూసి "పాపం.... నిన్ను చూస్తే జాలేస్తోంది బ్రదర్! ఆడదాని సంపాదన మీద ఆధారపడి బతకడంకంటే అథమం లేదు" అన్నాడు.
"ఔను! ఆడపిల్ల తెచ్చే కట్నం మీద ఆశపడడం అథమాథమం!" నవ్వుతూ అన్నాడు ఇంద్రనీల్.
శంకర్ గతుక్కుమన్నాడు. కాసేపు తన గొప్పలు చెప్పుకున్నాడు. ఆఫీస్ లో తన స్టాఫ్ కి తనపేరు చెప్తే ఎంత హడలో వర్ణించాడు.
మాట్లాడుతున్నంతసేపూ మామగార్ని చూసి సిగరెట్టు తెప్పించమనీ, వక్కపొడి తెప్పించమనీ పురమాయిస్తూనే వున్నాడు.
మధ్యాహ్నం భోజనాలయ్యాక మామగారిచేత సినిమా టిక్కెట్లు తెప్పించుకొని భార్యని తీసుకుని సినిమాకెళ్ళాడు.
వాళ్ళు వెళ్ళాక అరుంధతి పిల్లలకి అన్నం పెడుతూ శక్తి "చూశావుగా ఈయన సుపీరియారిటీ కాంప్లెక్స్! ఇంక రేపు రెండో ఆయన దిగబడతాడు. ఆయన ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ చూద్దూగాని" అంది.
ఇంద్రనీల్ నవ్వి "పెళ్ళిగురించి నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో అర్ధం అవుతోంది" అన్నాడు.
శక్తి చురుగ్గా "అవుతోందా? పూర్తిగా అర్ధం అయిపోతుంది రేపటికల్లా..." అంది.
గోపాలరావు రెండో అల్లుణ్ణి, కూతుర్నీ వెంటపెట్టుకు తీసుకురాడానికి స్వయంగా వెళ్ళాడు.
ఏం బతిమాలాడో, భంగపడ్డాడో కానీ మరునాటికల్లా తీసుకురాగలిగాడు.
చిన్నల్లుడు ఆటో దిగుతూనే గీజర్ లేక తనకి స్నానానికి ఎంత ఇబ్బందిగా వుందో, ఇంట్లో వీసీఆర్ కోసం ఎంతగా గొడవపెడుతున్నారో ఏకరువు పెడుతూ లోపలికి వచ్చాడు.
చిక్కి సగమైన సుమతి కూతుర్ని ఎత్తుకుని భర్త వెనకాల వినయంగా లోపలికి వచ్చింది. ఇదివరకటి హుషారు మచ్చుకైనా కనిపించడంలేదు.
శక్తిమతి ఎదురెళ్ళి అక్కని కౌగిలించుకుని "ఎంత చిక్కిపోయావే" అంది.