Previous Page Next Page 
సృష్టి పేజి 14


    బాల్యంలో అసంకల్పితంగా మనసులో నాటుకుపోయే కొన్ని దారుణమైన సంఘటనలే ఫోబియాలకు దారి తీస్తాయి. కొంతమంది బలహీన మనస్కుల్లో ఈ ఫోబియాలు జీవితాంతం వుండిపోతాయి. మరికొంత మందిలో కొంతకాలం తర్వాత వాళ్ళకు తెలియకుండానే మాయమయిపోతాయి.

 

    ప్రసవ సమయంలో స్త్రీ భరించలేని పురిటి నొప్పులకు తట్టుకోలేక అదొక అంతర్లీన భయంగా మారిపోవడం-

 

    ఆ కారణంగా భర్తకు ఆమెకు, ఆ పురిటి నొప్పులకు కారణమైన ఆ పిల్లకు, ఆ తల్లికీ మధ్య  మానసికమైన దూరం  కలగడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి  కేసులు వైద్య  శాస్త్రంలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి.

 

    ఫైర్  ఫోబియా కారణంగానే  మనుషులు చీకటిని యిష్టపడతారనే రూలేం లేదు. అకస్మాత్తుగా కన్పించిన వెలుగు, చంచలమైపోయిన మనసు, చెలరేగిన పాత జ్ఞాపకం, ఇవ్వన్నీ ఆ వ్యక్తిని ఆ ఫోబియాలకు అనుకూలంగా చేస్తాయి" చెప్పడం ఆపాడు సైక్రియాటిస్టు అరుణ సుందరం.

 

    "ఈ ఫైర్ ఫోబియా ఆధారంగా ఒక వ్యక్తిని గుర్తు పట్టడం జరగొచ్చా? అడిగాడు హరిహరన్.

 

    "జరగొచ్చు. కానీ సదరు వ్యక్తి సైకలాజికల్ ఫీలింగ్స్ ని అబ్జర్వ్  చేసే  నేర్పరితనం మనకుండాలి. ఇటీజ్ ఎ టఫ్ జాబ్" చెప్పాడాయన.

 

    "క్రిమినల్ పుష్పరాజ్ ని ఈ ఫోబియా ఆధారంగా కనిపెట్టడంలో మీ  సలహా కావాలి." హరిహరన్ ప్రశ్నకు రెండు నిమిషాల సేపు ఆలోచనలో పడ్డాడు అరుణ సుందరం.

 

    "ఫోబియాస్ ఆర్ మెంటల్ డిసీజెన్ బట్ నాట్ వీక్ నెస్. మానసిక  బలహీనతల్ని మనం గుర్తుపట్టగలం. కానీ మానసిక వ్యాధుల్ని గుర్తుపట్టాలంటే చాలా పేషన్స్ కావాలి. ఇంకో పాయింట్- ఒక్క ఫోబియా ద్వారా మనిషిని గుర్తుపట్టలేం. ఇట్స్ నాట్ ఎక్స్ రే ఫర్ హ్యూమర్ బీయింగ్. యూనో?"

 

    "పుష్పరాజ్ గురించి అధేంటిగ్గా తెల్సిన విషయం యిదొక్కుటే!?" కరచాలనం చేసి లేవబోతున్న సమయలో అరుణ సుందరం యిలా అన్నాడు.

 

    ప్రపంచంలో ప్రతి వ్యక్తినీ గుర్తుపట్టడానికి తెలియని కొన్ని అంశాలుంటాయి. ఆ అంశాల్ని విశ్లేషించడం ద్వారా సదరు వ్యక్తుల  సైన్స్ కి సంబంధించిన విషయమే. మీకు నేను ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను."

 

    "ఎస్ డాక్టర్! వెరీ  కైండాఫ్ యూ" బయటకొచ్చి జీపెక్కాడు హరిహరన్. పుష్పరాజ్ ని పట్టుకోగలనన్న నమ్మకం ఆయనలో మరికొంత చోటు చేసుకుంది.

 

    ఆ రోజు రాత్రి చాలాసేపటి వరకూ హరిహరన్ ఆఫీసులోనే గడిపాడు పుష్పరాజ్ కి సంబంధించిన ఫైల్స్ ని తిరగేస్తూ.

 


                                       *    *    *

 

    పుష్పరాజ్, జాఫ్నాలో సైనికులపై జరిగిన దాడిలో ఒక ప్రధానమైన వ్యక్తి.

 

    జాఫ్నాలో రెండేళ్ళున్నాడు పుష్పరాజ్.

 

    త్రివేండ్రంలో ఆరు నెలలున్నాడు. ఆ సమయంలో అక్కడ రెండు పవర్ ఫుల్ బాంబ్ బ్లాస్టింగ్స్ జరిగాయి. ఆ బాంబుల్లో ఉపయోగించిన శక్తి వంతమైన కెమికల్స్ శ్రీలంకలో తప్ప ఇండియాలో దొరకవు. అలాంటి కెమికల్స్ ఏడాది క్రితం మహాబలిపురం ఏరియాలోని బీచ్  ఒడ్డున వున్న గెస్ట్ హౌస్ లో బయటపడ్డాయి.

 

    పుష్పరాజ్ అక్కడ కొన్నాళ్ళున్నాడు.

 

    పుష్పరాజ్ ఎక్కడెక్కడ  వున్నాడని అనుమానించడం జరుగుతుందో, ఆ ప్రదేశాల్లో ఆ కెమికల్స్, వాటి అవశేషాలు దొరకడంతోపాటు ఆయా ప్రదేశాల్లో వున్న ఆర్ట్ గ్యాలరీల్లోంచి అతివిలువైన పెయింటింగ్స్ మాయం కావడం యాదృచ్ఛికమా? కాకతాళీయమా?

 

    పుష్పరాజ్ ఫైల్ లో పుష్పరాజ్  ఆయా ప్రాంతాల్లో వున్నాడనుకున్న సమయాల్లో మాయమైపోయిన పెయింటింగ్స్ కి సంబంధించిన వివరాలు, వాటి ఖరీదు- ఆ వార్తల్ని ప్రచురించిన పేపరు కటింగ్స్ అన్నిటినీ చూశాడాయన.

 

    క్షణాలు నిమిషాలుగా- నిమిషాలు గంటలుగా కరిగిపోతున్నాయి.

 

    లైబ్రరీలోకెళ్ళి ఆయా పెయింటింగ్స్ కి సంబంధించిన  ఇతర ఫాలో అప్ స్టోరీస కోసం వెతికాడు.

 

    రాత్రి రెండు గంటల సమయానికి హరిహరన్ ఒక కంక్లూజన్ కి వచ్చాడు.

 

    "పుష్పరాజ్ నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. బట్ ఆల్సో ఇంటర్నేషనల్ పెయింటింగ్ స్మగ్లర్" అన్నాడు గంభీరంగా హరిహరన్.

 

    హరిహరన్ అంచనా కరెక్ట్ అయితే పుష్పరాజ్ ఈజ్ నాట్ ఓన్లీ డెడ్ లీ డేంజరస్. బట్  ఆల్సో డెడ్ లీ  జీనియస్. కోట్లాది రూపాయల్ని సునాయాసంగా సంపాదించడం అతనికి తెల్సు.

 

    ఆ డబ్బును ఎవరికీ తెలియకుండా ఎలా పదిలపరచాలో అతనికి తెల్సు."

 

    "కోట్లాది రూపాయాల్ని రహస్యంగా అతనెలా దాచగలడు?" సందేహంగా అడిగాడు మేఘమలై.

 

    మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు హరిహరన్.

 

    "నీకూ, నాకూ పెయింటింగ్స్ గోడకు వేలాడే బొమ్మలు మాత్రమే. ఆ  ఫీల్డ్ కి చెందిన ఆర్టిస్టులకు, ఆర్ట్  లవర్స్ కి ఆ పెయింటింగ్స్ విలువెంతో తెలుస్తుంది. ఆ పెయింటింగ్స్ విలువ తెల్సిన ఆర్టిస్టులు కాని వ్యక్తులే పుష్పరాజ్ లాంటి  స్మగ్లర్స్-

 

    కోటి రూపాయల నోట్లను దాచడం కష్టం. అందుకు చాలా  స్థలం  కావాలి. కానీ కోటి రూపాయలు విలువ చేసే పెయింటింగ్ ను దాచడం చాలా సులభం.

 

    వంద కోట్ల రూపాయల్ని సూట్ కేసుల్లో సర్దాల్సి వస్తే దాదాపు రెండొందల సూట్ కేసులు కావాలి. ఐదొందల రూపాయల నోట్ల  రూపములో దాయాలన్నా పాతిక, ముప్ఫై సూట్ కేసులు కావాలి. అలాహే డైమండ్స్, గోల్డ్, సిల్వర్, అదే పెయింటింగ్ అయితే అతి తక్కువ స్థలం చాలు  ఎలాంటి  పెయింటింగ్ నయినా చుట్ట చుట్టి కోటు లోపల పెట్టుకొని వెళ్ళిపోవచ్చు."

 

    కాదనలేదు మేఘమలై.

 

    మళ్ళీ  కొనసాగించాడు హరిహరన్.

 

    "విలువైన పెయింటింగ్స్ ని మాత్రమే దొంగిలించి విదేశాలకు అమ్మటం, నకిలీ పెయింటింగ్స్ ని తయారుచేసి విదేశాల్లో విక్రయించడం ఇది దశాబ్దాలుగా కొంతమంది చేస్తున్న బిజినెస్.

 

    ప్రపంచంలో మొనాలిసా పెయింటింగ్ గురించి విననివారు అరుదుగా కన్పిస్తారు. ఆ పెయింటింగ్ ని సృష్టించింది డి గ్రేట్ ఆర్టిస్టు లియోనార్డో డావిన్సి. మోనాలిసా పెయింటింగ్ - మోనాలిసా నవ్వు విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. ఆ మోనాలిసా చిత్రానికి ఇన్ స్పిరేషన్ లియోనార్డో అనే ఇరవై నాలుగేళ్ళ వివాహిత స్త్రీ అని, ఆ స్త్రీ ఫ్రాన్ సెస్ కో అనే జమిందారు భార్య అని ఆ చిత్రం గీస్తున్న సమయంలో లియోనార్డో పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా వుండేందుకు విదూషకులు, సంగీత కళాకారులు చుట్టూ వుండేవారని చెప్తారు.

 Previous Page Next Page