నేను చేస్తున్న ఉద్యోగం పట్ల నాకు గౌరవం వుంది! ప్రేమ వుంది. దాన్ని ఎవరయినా కించపరిస్తే నేను సహించలేను!" బాధ వ్యక్తంచేసింది అరుణోదయ.
"సారీ అరుణా!" తన చెంపలమీద చిన్నగా కొట్టుకుంది అర్చన.
"నర్స్ అంటే నాకు చిన్నచూపులేదు! మీది పరమపవిత్రమైన సేవ! కానీ మనం పెళ్ళి విషయం మాట్లాడుతున్నాంకదా? ఆ దృష్టితో చూస్తే ఒక డాక్టర్ని చేసుకోవడానికి నీ ఉద్యోగం సరిపోయింది కాదని నా ఉద్దేశ్యం."
"నన్ను చూసి చేసుకోవాలిగానీ నా ఉద్యోగం చూసి చేసుకోవడం ఏమిటి నాన్సెన్స్! ఏం? ఒక డాక్టరు డాక్టర్నే పెళ్ళాడాలి, నర్స్ ని పెళ్ళాడకూడదని ఎక్కడయినా వుందా?"
"కూడదని ఎక్కడా లేదు! అదంతా అదృష్టం. ముఖ్యంగా బ్రహ్మరాత కావాలి దేనికైనా! ఆ రాత వున్నప్పుడు కొండమున్చూ నచ్చుతుంది. ఎలుగుబంటీ నచ్చుతుంది."
"అంటే నేను కొండముచ్చుననా అర్ధం?"
"మాటవరసకి."
"ఏవో దేవుడు గాడిదతోకతో రాశాడు అన్నట్టుగా కాదు. ఆయన్ని ఒప్పించి మరీ పెళ్ళాడతాను. అదృష్టంతో కాదు. నాకున్న అర్హతతోనే పెళ్ళాడతాను."
"కానీ, నీకూ ఆయనకూ వయసు తేడా చాలా వుంటుందే?"
"పది పన్నెండు సంవత్సరాలు! ఇరవై ముప్పై ఏళ్ళ తేడాతో కూడా ప్రేమించి పెళ్ళాడేవాళ్ళున్నారు."
"ఇంతకీ తమరు ప్రేమించి పెళ్ళాడుతున్నట్టా?"
"అదేం లేదనుకో! కానీ, నాకు ఏదో ఒకనాటికి పెళ్ళి కావలసిందే కదా. ఆ వచ్చేవాడు అరవింద్ లాంటి యోగ్యుడూ, ఉత్తముడూ అయితే బాగుంటుందనీ."
"నిజంగా అతడిని మెప్పించి, ఒప్పించి పెళ్ళాడావా_సంతోషించేవాళ్ళలో ముందు నేనుంటాను. తరువాత అతడి అమ్మా నాన్న వుంటారు. రెండేళ్ళ క్రితం పీటల వరకూ వచ్చిన పెళ్ళి చెడిపోయింది. అప్పుడు కూడా చాలా బలవంతంగా ఒప్పుకొన్నాడు."
"ఎందుకు చెడిపోయింది పెళ్ళి?"
"ఎందుకు చెడిపోయిందో చెప్పాలంటే కథ మొదటినుండీ చెప్పాలి. ఉండు, స్టౌవ్ మీద కుక్కరు పడేసి..." స్టౌ మీద కుక్కరు పెట్టి వచ్చి చెప్పడం మొదలు పెట్టింది అర్చన.
* * * *
ఆరోజూ ఇలాగే ఏదోపత్రికలో కథగురించే చర్చిస్తూ కూర్చున్నారు అర్చనా, అరవింద్.
మాట్లాడుతున్నవాడల్లా హఠాత్తుగా వాచీ చూసుకొన్నాడు. "అరే! పది అయిపోయింది. మాటల్లో టైమే తెలీలేదు" అని దిగ్గున లేచాడు.
"ఎందుకంత కంగారు? ఆలస్యమైందని అలగడానికి మీకు శ్రీమతి కూడా లేదుకదా?" నవ్వాడు రామకృష్ణ.
"శ్రీమతి లేకపోతేనేం అమ్మ వుందికదా? ఎంత రాత్రయినా సరే, నాకు అన్నం పెట్టందే ఆమె నిద్రపోదు. ఆమె వేళకు నిద్రపోకపోతే నాన్నగారు చిరాకుపడతారు. ఇద్దరూ వయసు మీరినవాళ్ళుకదా? వాళ్ళని అసౌకర్యానికి గురిచెయ్యాలని నాకూ అనిపించదు. మా నాన్నగారంటే నాకు ఇప్పటికీ భయమే. చాలా క్రమశిక్షణగల వ్యక్తి ఆయన.
హాస్పిటల్లో ఏదైనా ఎమర్జెన్సీ కేసు వుంటే తప్ప, ఎక్కడో హస్క్ కొడుతూ వేళతప్పి ఇంటికి వెడితే ఆయన చీవాట్లు పెడతారు."
"ఇంత పెద్ద డాక్టరువి! ఇంకా అమ్మా నాన్న అంటే ఇంతటి భయభక్తులా?" విస్మయం వ్యక్తం చేశాడు రామకృష్ణ.
ఆయన భార్యందుకొంటూ_" బాగుందండీ! ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేకదా అన్నట్టు ఆయన ఎంత పెద్ద డాక్టరు అయితేనేం? అమ్మకి నాన్నకి కొడుకేకదా?" అంది.
"వదినగారు కరెక్ట్ గా చెప్పారు!" నవ్వుతూ అన్న అరవింద్ రామకృష్ణ తో కరచాలనం చేసి వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయాడు హోండా మీద.
"జిల్లాలోనే నెంబర్ వన్ సర్జన్. అమెరికా వెళ్ళే ఛాన్స్ వచ్చినా అమ్మానాన్న బెంగపెట్టుకుంటారని వెళ్ళలేదు. వృత్తికి ఎంతగా అంకితమౌతాడో సంగీత సాహిత్యాలన్నా అంతే మక్కువ చూపిస్తాడు. పిట్టల్ని చూసినా, పువ్వుల్ని చూసినా చిన్నపిల్లాడిలా పరవశిస్తాడు. చాలా అద్భుతమైన వ్యక్తి అనిపిస్తుంది. నాకో చెల్లెలుంటే అతడి మెడలు వంచి అయినా పెళ్ళిచేసి, 'బావగారూ!' అని పిలిచే యోగ్యత సంపాదించుకునేవాడిని."
"అతడి మెడలు పంచడం మీ తరం ఏమౌతుంది? అతడెంతో భక్తి భావంతో చూసే తల్లిదండ్రులే ఆ పని చెయ్యలేకపోయారు. మొన్న జడ్జీ గారింట్లో పేరంటానికి వాళ్ళమ్మగారు కూడా వచ్చారు. కొడుకు పెళ్ళి చేసుకోవడంలేదని ఒకటే ఇదై పోయారావిడ. కళ్ళనీళ్ళు కూడా పెట్టుకొంటుందంటే నమ్మండి."
"ఇంతకీ పెళ్ళెందుకు చేసుకోలేదట ఇతడు? ఎంత క్లోజ్ గా వున్నా నేనతడి పర్సనల్ విషయాలు అడగలేకపోయాను."