చలిరాత్రి అడవి దాటుకుంటూ వచ్చిన చిరుగాలితో ఆహ్లాదాన్ని నింపుతుంటే మౌనంగా నడిచాడు చైతన్య.
ఆ రాత్రికి రంపంగి గ్రామంలోనే ఉండిపోయిన చైతన్య నిద్ర లేచేసరికి ఊరి జనమంతా తండోపతండాలుగా వచ్చి చిరుతని చూస్తుంటే బడలికగా సమీపంలోని ఓ అరుగుపై కూర్చున్నాడు చైతన్య.
తోక నుంచి తలవరకూ సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న చిరుత అది. ఐరన్ ట్రాప్ మూలంగా పోగొట్టుకున్న కుడికన్ను ,మెడపై ఇంకా మానని గాయాలు తప్ప కాలిగోళ్ళు, పళ్ళతో ఆరోగ్యంగానే వుంది.
ఎక్కడి నుంచి వచ్చాడో సమ్మయ్య....గుంపులోంచి మధ్యగా దూరి చనిపోయిన చిరుత శరీరంపై కత్తితో కసిగా పొడుస్తున్నాడు. చర్మం సైతం పనికి రాకుండా చేస్తూ.
అతణ్ని అడ్డుకోబోయిన గిరిజనుల్ని సౌంజ్ఞచేస్తూ వారించాడు చైతన్య. నూరేళ్ళ దాంపత్య జీవితాన్ని నట్టేట కలిపినా ఆ చిరుతని_తను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యని పొట్టన పెట్టుకొన్న చిరుతపై నిస్సహాయంగా తన కసి తీర్చుకుంటున్నాడు. తన గుండెలోని వేదనకి ఆ విధంగా ఓదార్పును అందించుకుంటున్నాడు.
చైతన్య అలాగే చూస్తూ ఉండిపోయాడు ఎంతసేపో.
అలసిపోయిన సమ్మయ్య రొప్పుతూ పక్కకు చూసి అమాంతం చైతన్య పాదాలను చుట్టేశాడు.
"రాకాసిని సంపేశారు బాబూ!" గొణుగుతున్నాడు పాదాల్ని విడిచి పెట్టకుండానే.
అతని స్థానంలో వున్న వ్యక్తులకు తప్ప అర్ధం కాని విచిత్రస్థితి అది.
సమ్మయ్య ఇక మాట్లాడలేదు. ఉనికి వస్తున్న దుఃఖాన్ని నిగ్రహించుకునే ప్రయత్నంగా మూలుగుతున్నాడు.
నిబ్బరంగా గలవాడి మనసునయినా రంపపుకోతతో నలిపే దుర్భర క్షణాలవి. గుండెమెలిపెట్టినట్టయిన చైతన్య ఆప్యాయంగా అతని భుజంపై చేయివేసి పైకి లేవదీశాడు.
ఏం మాట్లాడినా, మాటలతో ఎలా ఓదార్చాలని ప్రయత్నించినా పూడ్చలేని వెలితితో మిగిలిన సమ్మయ్యను చివరిసారి చూసి అందరి దగ్గరా సెలవు తీరుకొని రెస్టుహౌస్ కు బయలుదేరాడు.
ఏటవాలుగా వున్న గుట్టను ఎక్కుతూ ఎందుకో మరోమారు వెనక్కి చూశాడు చైతన్య.
మనోవేదనకి మాటలతో భాష్యం చెప్పలేనట్టు చేతులు జోడించి ఇంకా తననే చూస్తూ స్థాణువులా నిలబడి ఉన్నాడు, పంజా దెబ్బతో నేల కొరిగిన పొదరింటిలోని ఒంటరి పసికందులాంటి సమ్మయ్య.
రెస్టు హౌస్ కి చేసేసరికి శ్రీశైలం రేంజ్ ఆఫీసు నుంచి వచ్చిన గార్డు మెసేజ్ తో సిద్ధంగా వున్నాడు.
"రిపోర్టు ఇమిడియట్లీ టు హెడ్ క్వార్టర్స్_ఇన్ స్ట్రక్షన్ కమ్యూనికేటెడ్ బై చీఫ్ కన్జర్వేటరాఫ్ ఫారెస్ట్స్."
5
"ఒక విధంగా అడవి పరిధుల్లోవున్నా ప్రజా జీవితం స్థంభించి పోయింది. అంతకంటే ఎక్కువగా అటవీశాఖను అటు పత్రికలూ, ప్రజలే కాక ప్రభుత్వ యంత్రాంగం సైతం దుయ్యబడుతూ వుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో మిగిలిపోయాను.
సామాజిక అరణ్య పధకం ప్రకారం కార్పొరేషన్ విభాగం చెట్లను పెంచే కార్యక్రమానికి కూలీలు సైతం అడవిలో అడుగుపెట్టటానికి తిరస్కరించడంతో అటవీశాఖ పనికూడా ఆగిపోయింది. ఇది అదనుగా తీసుకొని అక్రమంగా కలపను దోచుకునే కొందరు దొంగ వ్యాపారస్తులు కూడా విజృంభించినట్లు వార్త లందుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో బాగా ఆలోచించేక ఈ గురుతరమైన బాధ్యతను మీకు అప్పజెప్పాలని పిలిపించాను. యుద్ధ ప్రాతిపదికపై తగు చర్యను తీసుకుంటేతప్ప ఈ సమస్యను పరిష్కరించలేం....ఐ హోప్ యు విల్ సర్జెన్లీ ఒబ్లయిజ్ మై అప్పీల్!" చెప్పడం ఆపి, ఎదురుగా కూర్చొనివున్న చైతన్యవేపు చూస్తూ ఉండిపోయాడు చీఫ్ కన్జర్వేటర్ అనిల్ కుమార్.
స్వతహాగా మితభాషి అయిన చైతన్య వెంటనే బదులు చెప్పలేదు. డ్యూటీలో అవసరమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తాడేమో గానీ, ధీరోదాత్తుడు అనిపించుకోవాలనే మనస్తత్వం కాదతనిది. తన ప్రత్యేకతను పదిమందీ గుర్తించాలనే ఉద్దేశం లేనివాడు కావడంతో చాలా మంది కంటే సమర్ధుడైన చైతన్య అనిల్ కుమార్ దృష్టిలోకి అంతవరకూ రాలేదేమో.
గది కిరికీ ఆనుకుని వున్న వెనీషియన్ బ్లయిండ్స్ లోంచి వీస్తున్న చల్లనిగాలికి అతని ముంగురుఫాలభాగంపై నర్తిస్తున్నాయి.
అనిల్ కుమార్ చెప్పిన మాటల్ని మరోమారు మననం చేసుకున్న చైతన్య__"కెన్ ఐ గో త్రూ ద ఫైల్, సర్" అన్నాడు ,పాడేరు రిజర్వు ఫారెస్టుకు సంబంధించిన ఈవెంట్స్ అన్నింటినీ ఓమారు పరిశీలించాలన్న ఉద్దేశంతో.
మరికొన్ని సెకండ్ల వ్యవధిలో తన రేక్ లోనేవున్న ఫైలును చైతన్యకు అందించాడు.
మేనీటర్ విజృంభణ మొదలుకుని పాముకాటుతో మరణించిన ఎఫ్.ఓ. రఘునందన్ గురించి ,నిన్నగాక మొన్న పులివాత పడి ప్రాణాలు కోల్పోయిన నట్వర్ సింగ్ వరకూ జరిగిన ప్రతి సంఘటనా, రికార్డయిన ప్రతి విషయమూ క్షుణ్నంగా చదివేడు. ఇన్వెస్టిగేటివ్ ప్రొసీడింగ్స్ లో ఎక్కడో అర్ధం కాని అస్పష్టత ద్యోతక మౌతుంటే సాలోచనగా మరో పేజీ తిప్పాడు.
ఆ పేజ్జీలోని ఓ విషయం అతణ్ని చాలా బలంగా ఆకట్టుకుంది.
నట్వర్ సింగ్ మరణించిన రోజు సమీపంలోని పల్లె ప్రజలకు ఓ స్త్రీ ఆర్తనాదం కూడా వినిపించింది. కాని, ఆమె ఎవరో, ఆ రాత్రివేళ నట్వర్ సింగ్ తో ఎందుకు వుందో ఎవరూ చెప్పలేకపోయారు. నట్వర్ సింగ్ మరణాన్ని మించిన నిగూఢ రహస్యమది.
ఆకర్షణగా పెరిగిన గెడ్డంపై చేతినుంచి అవే వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదివాడు.
అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నట్వర్ సింగ్ అవివాహితుడు. ఆ రాత్రి అతనికి తోడుగా వేటలో సహకరించాల్సింది ఫారెస్టు గార్డు తవిటయ్య. అతడు కొన్ని రోజులుగా సెలవులో ఉన్నాడు కాబట్టి సహజంగా ధైర్యవంతుడైన నట్వర్ సింగ్ ఒంటరిగానే వేటకు బయలుదేరేవాడు. కాని ఎవరో ఆడదాని సహాయంతో అడవిలో అడుగు పెట్టాల్సిన అగత్యం లేదు.
తవిటయ్య సైతం ఇన్వెస్టిగేషన్ లో ఆ అమ్మాయి ఎవరన్నది ఇదమిత్ధంగా తేల్చి చెప్పలేకపోయాడు. టేఅం ప్రీప్లాన్డ్ గా ఏదన్నా జరిగిందా? నట్వర్ సింగ్ శవాన్ని పరిశీలిస్తే పులి మూలంగానే ప్రాణాలు పోయినట్లు నిర్ధారించబడింది.
అయితే ఆ అమ్మాయి యెవరు? అంత రాత్రివేళ నట్వర్ సింగ్ తో ఎందుకుంది? ఒకవేళ ఆ యువతి మూలంగానే వేటలో అపారమయిన అనుభవమున్న నట్వర్ సింగ్ నిర్లక్ష్యంతో వ్యవహరించి పులివాత పడ్డాడా?
స్వయంగా భేదించాల్సిన విషయాలివి.
ఫైలును మూసి ఆలోచిస్తూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయిన చైతన్య_"వెల్ సర్! లెట్ మి ప్రొసీడ్" అన్నాడు తన అభీష్టాన్ని వ్యక్తం చేస్తూ.
ఆ క్షణాన ఏ భావమూ కనిపించని చైతన్య కళ్ళను చూస్తుంటే అనిల్ కుమార్ మనసులో తొణకని వ్యక్తిత్వం అన్న ఆలోచన మాత్రమే కాదు, లేతగా అందమయిన ఆడపిల్లగా సుకుమారాన్ని నింపుకున్న ఈ పాతికేళ్ళ యువకుణ్ని అనవసరంగా రొంపిలోకి దింపుతున్నానా అన్నభావం కూడా కలిగింది.