"అది కాదయ్యా బాబూ- మధ్యన ప్రశ్నలు వేయవద్దన్నావుమరి నీవే ప్రశ్నలు వేస్తున్నావే అనీ?"
"కాదండీ వదినగారు......ఇంతవరకూ చెప్పిందాన్లో విశేషం ఏమిలేదు.....ఆ అమ్మాయితల్లిదండ్రులెలాంటి వాళ్ళో చెప్పాను.....ఇకముందు చెప్పబోయేదోచాలా ముఖ్యమైనది. శ్రద్దగా వింటున్నారాలేదా అని"
"చెప్పేవాళ్ళు ఎంత శ్రద్దగా చెపితే-వినేవాళ్ళం అంత శ్రద్దగా వింటాం.....అయినా అమ్మాయి అమ్మాయి అంటువున్నావు ఇంతకి ఎవరీ అమ్మాయి?"
వదినగారి ప్రశ్నని వినిపించుకోకుండా అన్నాడు.
"సరేవినండి"
"ఆదర్శదంపతుల్లా తల్లిదండ్రులుండి పిల్లల్ని పెంచటం-అలాంటివాళ్ళు క్రింద పెరిగి పెద్దకావటం- ఆకుటుంబం సుకృతమే అంటాను. ఇద్దరూ చదువుకున్నవాళ్ళు- బాధ్యత నెరిగినవారూ అయివుండి. ఎనలేని ప్రేమతో అనురాగంతో పిల్లల్ని పెంచితే ఆ సంతానంకూడా పెరిగి పెద్దదై వృద్దిలోకి వచ్చి తననీ తన కుటుంబాన్ని మాత్రమేకాక తనచుట్టుపట్టున వున్నవాళ్ళని కూడ పునీతం చేస్తుంది అంటే ఎందుకు చేయదు?
కూతురు తమలాగే అన్నింటా అని కళ్ళల్లోనూ రాణిని చేయాల్ని అనుకుని సామాన్యంగా చాలామంది లాగా వ్యర్ధకోర్కెలు కాకుండాకోరిక తీర్చుకున్నారు అంతేకాకుండా బి.ఎ.వరకు చదివించారు కూడా.
నవ్యనాగరికతా పంధాలో పయనిస్తున్న ఆమెకు అన్నీ నాగరికతా లక్షణాలే ఉమెన్స్ కాలేజిలో సిమ్మింగ్ పూల్ లో ఈదటం అలవాటైనది ప్రాణి కాబట్టి ఇక్కడ అలాంటి అవకాశంలేకముందు ముందు కొంతబాధపడిచివరికి కెనాల్లో ఈదటం ప్రారంభించింది.......తోటివిద్యార్ధులు ఇక్కడివారు ఏమనుకుంటారోననే ప్రసక్తి ఆమెలో కలిగేదికాదు.
మధ్య మధ్య ప్రక్క పొలాల్లో వున్న పశువులు కాసే కుర్రాళ్ళు కట్టమీదుగా నిలబడిదైర్యంగా మగాడిలా ఈదుతున్న ఆమెను వింతగా చూస్తుంటేవారి అమాకత్వానికి నవ్వుకొని తనతోపాటు ఈదటానికి రమ్మనేది. మగపిల్లలు ముందుముందు కొంచెంభయపడుతూ వుండినా తర్వాత తర్వాత ఆమెతోపాటు ఈదటానికి వచ్చే చిన్న చిన్న అమ్మాయిల్ని కూడా ఈదటానికి రమ్మనేది. వాళ్ళు సిగ్గుతో పారిపోతూ వుంటే మళ్ళీ మళ్ళీ పిలుస్తూ నవ్వుకునేది.
ఓనాడు-
అలవాటు ప్రకారం ఈదుతూ వుంది. కెనాల్లో ప్రవాహం ఎక్కువైంది.
నీటిగేజి ఎక్కువైంది. నీటిఎద్దడి ఎక్కువైంది.
ఒడ్డుకుఈదటానికి ప్రయత్నించి చేతకాక అవకాశం లేక అలాగే పడుకుని అసహాయంగా ముందుకు సాగిపోయింది. వెల్లకిల్లా- కేకవేద్దామన్నా దరిదాపుల్లో ఎవరూ లేరు. రోజూ వచ్చే పశువులుకుర్రాళ్ళు వెళ్ళిపోయారు.
ఆ సాయంసమయంలో-బయటికివెళ్ళి కెనాల్ గట్టంటే నడుస్తూ వస్తున్న ఓ యువకుడిని సహాయంచేయమని అర్ధించింది-
నాగరికతబలిసిందనుకుని వెర్రిచేష్టలు చేసే అమ్మాయిలంటే అతనికి ఒళ్ళుమంట-
పైగాచిలిపిగా అడుగుతోందనుకుని తగిన శాస్తి చేసి ఏడిపించాలను కుని కెనాల్ లో దిగి ఆ అమ్మాయి పక్కపక్కగా చాలాదగ్గరగా ఈదుతూ చేయి అందించినట్లు అందించి అందుకోబోతే దూరంగా పోతూ చాలాసేపు బాధపెట్టాడు.
చివరికి చేతకాక-చేయెత్తిదండం పెట్టింది. ఒక్కసారిగా మనస్సు యేదో తట్టి సిగ్గుపడిచేయి అందించి ఒడ్డుకి చేర్చాడు. వంటికి అతుక్కుని పోయిన చీరతో నీళ్ళు కారుతూ అచ్చం మేఘమాలికలా వున్న కేశరాసితో-తడిసి మిలమిలా మెరుపులా మెరుస్తున్న మిసిమి శరీరచ్చాయతో ఆ అమ్మాయి అందచందాలు ఆ యువకుని మనస్సుపై మాసిపోని మరపురాని మరువలేని ముద్రవేశాయి.
ఆనాటి పరిచయాన్ని మెల్లిమెల్లిగా స్నేహంగా మార్చుకున్నవారిద్దరూ పరస్పరం ఇళ్ళకువెళ్లేంత చనువుసంపాదించుకున్నారు.
ఇంటికి పిలుచుకుని వెళ్ళినాన్నగారికి పరిచయంచేసింది మనిషి మనిషికి మధ్యమమతలు పెంచేవి కొన్ని సంఘటనలు జరుగుతాయి వదినా!
అవేఒకరిని ఒకరు విడిపోకుండా వుంచేవి. సాంఘిక సంబంధాలు-నిబంధనలూ ఏవి అడ్డు లేవు. మమతలేమనిషిని పరిపాలిస్తాయి.
ఒకరోజు మనసంతా గాడాంధకారం అలుముకున్న దినంజీవితంలో మళ్ళీ అలాంటిరోజు అతనికేకాదు మరెవరికీ రారాదు.
ఆ అబ్బాయి-పరిపూర్ణవయస్కుడైవున్న తరుణం. ఒక విషయంలో తండ్రికీ అతనికీ విభేదం వచ్చింది. తండ్రికి ఎదురుగా నిలబడి ఏనాడూ మాట్లాడి ఎరుగని వాడు-కర్టెన్ ఇవతలినుండే జవాబుపొందేవాడు-అంత భయభక్తులతో పెరిగినవాడు-మెలిగినవాడు-తిరుగుబడి తండ్రికి ఎదురు మాట్లాడలేకపోయి మనసులో అగ్ని పర్వతాలు ఒకేసారి చెలరేగి కుళ్ళుకుని పోయినరోజు-
ఆమె అతన్ని ఓదార్చిన మాటలువింటారా వదినా?
"తల్లిదండ్రీసీతారాములని భావించే ఏ పరమ సుకుమారమైన భావనగల ఆంధ్రదేశంలో మనం జన్మించాం తల్లితో, తండ్రితో మృదువుగా ప్రేమగా మాటలాడాలేకాని ఒక్క పరుషవాక్యం కూడా ఎప్పుడూ పెదవిని దాటి రానివ్వరాదు-
పరువంపొంగే వయసులో మెదిలే భావాలని-అణచుకోవాలి-
అనుభవజ్ఞులు ఆదరాభిమానాలని ఉగ్గుతో పాటు పోసి పెంచిన వారు దూర దృష్టితో చెప్పేవి ఎన్నడూ తప్పులుకావు.
ఆవేశంలో మనం వాదించేకన్నా తలవంచటం ఎప్పుడూ శ్రేయస్కరం అందులో మనకు మంచేకానీ చెడులేదు.
అలాంటికన్యని భాగసామిగా పొందేభాగ్యం ఎందరికి వుంటుంది? కల్గుతుంది? చెప్పండి వదినా? దేవతలాంటివారు మీరు- మీ మనస్సుని భగవంతుడు వెన్నతో-మల్లెపూలతో-మంచు ధారలతో చేశాడు. పోత పోశాడు. మీ కంటే అర్ధం చేసుకోగలవారూ-ఆదరించేవారూ ఎవరూ ఉండరు-లేరు ఇప్పుడు చెప్పండి.
సనాతనాచారాలతో కొట్టుమిట్టాడే సత్సంప్రదాయక కుటుంబం అతనిది- అన్ని విధాలావేరైన కుటుంబం వాళ్ళది-మనసనేమల్లెపందిరి క్రింద మమతాను బంధాల్ని మనవుగా మార్చుకోవాలని ఉవ్విళ్ళూరుతూన్న వారికి మీరిచ్చే సలహాఏమిటి? చెప్పండి వదినా?"
అంతవరకూ ప్రశాంతంగా సాగిన అతని కంఠస్వరం ఆవేశంవలన బొంగురు పోయింది.
"సారధీ"
"వదినా"
"ఆవేశం వద్దు బాబూ! అణుచుకో, అది ఎప్పుడూ మనిషిని హద్దులు దాటేట్టు చేస్తుంది? గుర్రానికి కళ్ళెం వేసికట్టేయ్ బాబూ" సిగ్గుపడ్డాడు అతను.
"మనసు-మమత-వీటికిచాలా అర్ధం వుంది నాయనా మూడక్షరాలపదాలే అయినా వాటివైశాల్యం ముల్లోకాలు కూడా దాటుతుంది......అవి అందరూ అర్ధం చేసుకోలేనివి సహాయమూ, సానుభూతీమాటల ద్వారా కాక చేతలద్వారా చూసేవాళ్ళుబహు తక్కువ......"
కొద్దిసేపు ఆగింది.
"ఇంతకీవాళ్ళెవరు సారధీ"
"తెలీదా వదినా"
"తెలిసీ తెలియని అయోమయంలో కొట్టుక చస్తున్నాను"
ఒక్కనిమిషం మౌనంగా వున్నాడు మెల్లిగా కుర్చీలోంచి లేచివచ్చి ఆమె పాదాలదగ్గర కూర్చున్నాడు. కంగారుపడి లేపబోయింది. సుభద్ర ఆమె కూర్చున్న కుర్చీపై ఓ చేయివేసి, మరోచేతిలో ఆమెపాదాలునిమురుతూ మెల్లిగా అన్నాడు మంద్రస్వరంలో.
"వదినా!"
"చెప్పు బాబూ"
"ఆ అబ్బాయి ఎవరో ఇంకా చెప్పాలా మీకు. ఇక పోతే ఆ అమ్మాయిని త్వరలో మీ దగ్గరి కి పిలుచుకుని వస్తాను అర్ధం చేసుకున్న మీరు ఆశీస్సులివ్వండి వదినా......"
సుభద్ర ఏమీ జవాబు ఇవ్వలేదు.
"వదినా"
"మరిదీ"
"......"
"ఎందుకు అలా చూస్తావు సారధీ ఎన్నడూ నిన్ను పేరుతో కాని పిలువని వదినగారు అలా పిలిచిందేమా అని అనుకుంటున్నావా స్త్రీహృదయంలో అమృతంలాంటి అనురాగం పొంగి పొరలితే ఏమౌతుందో ఏంచేస్తుందో నీకేం తెల్సు బాబూ?"
మనసు నిండుగా వున్నప్పుడు మాటలు దొరలిరావుకొద్దిసేపు అలాగే వుండిఅంది.
"బంగారుపంజరంలో ఇరుక్కోవటం ఆనందమే సారధీ, కానీ అందులోదొరికే జంటని చూసి అసూయపడే నిషాదులని గురించే బాధ అంతా"