Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 13


    ఆవిడకి అన్నం తినిపిస్తూండగా మాటల మధ్యలో ఉండబట్టలేక "రేఖ నాన్నగారికి యేం పని? ఇందాక మేడమీదనించి వస్తున్న ఆయనేనా మీ అల్లుడుగారు" అనడిగింది.
    సరస్వతమ్మగారి మొహం ఆ ప్రసక్తికి కాస్త నల్లబడింది. ఆవిడ సుజాతనించి చూపులు మరల్చుకుని "ఆ.....అతనే మా అల్లుడు.....అతనూ డాక్టరేలే....." అంది ముభావంగా. త్రుంచేసినట్లు ఆవిడ అలా మాట్లాడుతుంటే యింకేం అడగాలో తెలియక సుజాత వూరుకుంది. సుజాత యెంగిలి కంచం తీసుకుని వంటింట్లోకి వెడుతూంటే లోపల రంగారావు, నాయరుని తనగురించి భోగట్టా చేయడం వినిగుమ్మం దగ్గిరే ఆగిపోయింది. నాయరుని వివరాలు అడిగి వంటింట్లోంచి వస్తూ గుమ్మం దగ్గిర వున్న సుజాతని పట్టి పట్టి చూస్తూ వెళ్ళిపోయాడు.
    
                                              6
    
    ఒంటిగంటన్నర అవుతూండగా డాక్టరు కల్యాణి ఆదరాబాదరా వచ్చింది. ఏదోపుస్తకం తిరగేస్తున్న సుజాత లేచి నిల్చుంది.
    "భోంచేశావా.....లేదూ.....అదేమిటి, నా కోసం వెయిట్ చేయడం యెందుకు? తినేయాల్సింది. సరే, నాయరూ! వడ్డించేయ్" అంటూ మేడ మీదకి వెళ్ళిందావిడ.
    భోజనానికి కూర్చుంటున్న కల్యాణి దృష్టికి డ్రాయింగ్ రూం నీటుగా వుండడం కనిపించింది. ఆవిడ మొహం విప్పారింది. "నీవా.....ఇదంతా సర్ధావు....." అంటూ మెచ్చుకోలుగా అడిగింది. సుజాత కాస్త సిగ్గుతో నవ్వింది. "చూశావా.....నీ విలా వచ్చావో లేదో యింటికి కళ వచ్చింది. ఎలాగయినా ఆడవాళ్ళు ఆడవాళ్ళే...." అంటూ పొడిగింది.
    భోజనం చేస్తున్నంతసేపూ సుజాత ఉద్యోగం చెయ్యాల్సిన పరిస్థితులన్నీ వింది సానుభూతిగా, భోజనం పూర్తిచేసి మేడమీదికి తీసి కెళ్ళింది సుజాతని తను పక్కమీద వ్రాలి. సుజాతకి కుర్చీ చూపింది.
    "సుజాతా చూడు యీ యింటిసంగతి యిప్పటికే నీకు కొంత అర్ధం అయి వుండాలి. అమ్మ యేమన్నా చెప్పిందా? నేను నిన్ను పెట్టుకోడానికి కారణం యేమిటో ఊహించావా?" చెప్పదలచినదానికి ఉపోద్ఘాతం అన్నట్టు ఆరంభించింది కల్యాణి.
    సుజాత తల వూపింది. "అవును మీ అమ్మగారు చెప్పారు-మీకు యింటిసంగతి చూసుకోడానికి టైమువుండదని, నాయరు దూబరా చేస్తున్నాడని...."
    "వట్టి దూబరా అయితే నేనింత బాధ పడకపోదును, దూబరాకాదు దోచేస్తున్నాడు నన్ను పోనీ డబ్బు తిన్నా యింట్లో అందరికి సదుపాయం జరుగుతూందా అంటే అదీ లేదు. ముఖ్యంగా పిల్లలు, వాళ్ళకి యేదీ సరిగాఅమరడంలేదు, వాడేం పెడుతున్నాడో, వాళ్ళేం తింటున్నారో దేముడి కెరిక. ఏణ్ణర్ధంవరకు అమ్మ యింట్లో ఉండి అన్నీ చూసుకునేది. అమ్మ మంచాన పడిందగ్గిరనించి నా పాట్లు దేముడికెరిక. ఖర్చు రెట్టింపు అవుతూంది, ప్రాణానికి సుఖం లేదు. ఈ ఏన్నర్ధంలో ముగ్గురు, నలుగురు వంటవాళ్ళని మార్చాను! ఎప్పుడడిగితే అప్పుడు డబ్బు యిస్తూంటాను.....మళ్ళీ అవసరానికి యేదీ లేదంటూనే వుంటారు...."
    "నే నింక అన్నీ చూసుకుంటాను లెండి."
    "ఇంతకాలం నీలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నాను.    
    సుజాతా, చూడు యింక యీ యింటి బాధ్యత నీకు అప్పచెపుతున్నాను. యింట్లో ఏమి ఉన్నాయో లేదో, బజారునించి ఏమేంమేం తేవాలో పిల్లలకి ఏం కావాలో అడక్కుండానే అన్నీ చూసుకోవాలి అవి కాక పిల్లలకు కావలసిన డ్రస్సులు అన్నీ చూసుకోవాలి. నీ యిల్లనుకో....నీ వీ యింటిని-ఇల్లు, వాకిలి సరిగ్గాచూసుకుంటావని అనుకుంటున్నాను. పనివాళ్ళని అజమాయిషీ చేస్తూ వుండాలి నేను , నువ్వు అయితే యింటిని సరిగాచూసుకుంటావు. అవునా! అలాగే యీ రోజునించి ఈ యింటితో పాటు పిల్లలు నీ పిల్లలనుకో..... బాధ్యత అంతా తీసుకోవాలి నువ్వే.
    సుజాత అలాగే నన్నట్లు తల వూపింది!
    "సరే నేను కాసేపు నిద్రపోతాను, నీవూ రెస్టు తీసుకో అంది ఆవలిస్తూ కల్యాణి. లేస్తున్న సుజాత చేతిని ఆప్యాయంగా పట్టుకున్న "సుజాతా, నీవు రాగానే అప్పుడే నాకు యెంతో నిశ్చింతగా అన్పిస్తూంది. చూస్తాను, నా నమ్మకం యెంతవరకు నిలబెడతావో" నవ్వుతూ అని చెయ్యినొక్కి వదిలింది.
    సుజాత సిగ్గుపడి "తప్పకుండా చూడండి" అంది నవ్వి.
    "మూడింటికల్లా నన్ను లేపుతావా! ఈ లోపల యెవరన్నా వస్తే మరీ సీరియస్ కేసయితే తప్ప లేపకు" చెపుతూ ఆగి బాగ్ లోంచి రెండు వందలు తీసి సుజాత కిస్తూ "ఈ డబ్బు ఉంచు. ఇంట్లోకివాడు.....కావలిస్తే మళ్ళీ అడుగు.....ఎకౌంట్ సరిగా మెయిన్ టెన్ చేసుకో" అంది.
    సుజాత మౌనంగా ఆ డబ్బు తీసుకొని పిల్లలగదిలో కెళ్ళి ఓ ప్రక్కమీద వాలింది.

 Previous Page Next Page