Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 13

                                 


                                  కరాటే చదువులు

 


    
    చాలా హడావుడిగా ఉందా ప్రాంతం.
    ఆవరణమంతా కార్లతోనూ, స్కూటర్లతోనూ నిండి ఉంది. వరండాలో వేసిన బెంచీల మీద వాటి తాలూకూ ఓనర్లందరూ ఆ పబ్లిక్ స్కూల్ గురించీ, దాని స్టాండర్డ్ గురించీ చాలా ఎగ్జయిటింగ్ గా మాట్లాడుకుంటున్నారు.
    గొడవ కొంచెం ఎక్కువయ్యేసరికి ఫ్యూన్ బయటికొచ్చాడు, ఆఫీస్ లో నుంచి. "ష్! సైలెన్స్!" అన్నాడు గట్టిగా.
    అంతా నిశ్శబ్దం అయిపోయారు.
  "ఎందుకయ్యా- గట్లలొల్లి పెడతారు! ఇదేం స్కూలనుకున్రా, మీ ఇల్లనుకున్రా?"కోప్పడ్డాడు ఫ్యూన్.
    అక్కడున్న వాళ్ళలో గెజిటెడ్ ఆఫీసర్లున్నారు. కోటీశ్వరులయిన వ్యాపారులున్నారు. మాలాంటి గుమాస్తాగాళ్ళూ ఉన్నారు.
    అయినా ఎవ్వరూ జవాబివ్వలేదు.
    జవాబిస్తే ఆ ఫ్యూన్ కి ఆగ్రహం కలుగుతుందనీ, ఆ ఫ్యూన్ కి ఆగ్రహం కలుగుతే ఆ ప్రిన్సిపాల్ కి ఆగ్రహం కలుగుతుందనీ ఆ ప్రిన్సిపాల్ కి ఆగ్రహం కలుగుతే మహా ప్రఖ్యాతిగాంచిన ఆ పబ్లిక్ స్కూల్లో తమ పిల్లలకు సీటు దొరకదనీ అందరికీ తెలుసు.
    గోపాల్రావ్ ప్రాస్ పెక్టస్ తీసి అందులోని రూల్స్ మళ్ళీ చదివాడో సారి! అంతకుముందు వారం రోజుల్నుంచీ ఇద్దరం ప్రాస్ పెక్షన్ లో ప్రతిలైనూ చదివి, చర్చించుకుని అర్ధం చేసుకుంటూనే ఉన్నాం! అయినా ఏదో భయం!
    "గురూ! మనవాళ్ళను అలా చెట్టుకిందకు తీసుకెళ్ళి ఓసారి మళ్ళీ అన్నీ అప్పజెప్పించుకుందామా?" అడిగాడు గోపాల్రావ్.
    "పద!" అన్నాను.
    నేను కిరణ్ గాడిని, వాడుచిన్నిగాడిని నడిపించుకుంటూ దూరంగా ఉన్న ఓ చెట్టుకింద వెళ్ళి నిలబడ్డాం.
    "ఒరే చిన్నీ చెప్పమ్మా! వాటీజ్ యువర్ నేమ్?" అడిగాడు గోపాల్రావ్.
    "మైనేమీజ్ కె. శరత్ బాబు."
    "వాటీజ్ దిస్?" అన్నాడు వాడు పుస్తకం లోని పిల్లిబొమ్మను చూపించి.
    "దిసీజ్ కాట్! సి ఎ టి కాట్!"
    "టెల్ మీ ఆల్ఫాబెట్స్ ఫ్రం ఎ-టు-జడ్-"
    వెంటనే వాడు ఎబిసిడిలు ఊపిరితిరగనంత స్పీడులో చెప్పేశాడు.
    "ఇంకేం ఢోకాలేదులేరా?" అన్నాన్నేను ధైర్యం తెచ్చుకుని.
    "అవును!" సంతృప్తిగా అన్నాడు వాడు.
    తర్వాత ఇద్దరం కలిసి కిరణ్ గాడిని కూడా టెస్ట్ చేశాము.
    అడగడం ఆలస్యం ఠకీమని చెప్పేశాడు వాడు.
    ఒకటా-రెండా?
    అంతకుముందు మూడు నెలల నుంచీ వాళ్ళను చిత్రహింసలు పెట్టి వాళ్ళు పెట్టే చిత్రహింసలు భరించి నేర్పించాము అవన్నీ! లేకపోతే వాళ్ళకి మంచి స్కూల్లో ఎడ్మిషన్ దొరకదని తెలుసుకదా! మళ్ళీ ఇద్దరం వెళ్ళి బెంచీల మీద కూర్చున్నాం.
    మమ్మల్ని చూసి మిగతావాళ్ళు కూడా చెట్లకిందకు పిల్లలను తీసుకెళ్ళి వాళ్ళతో అన్నీ చెప్పిస్తున్నారు.
    హఠాత్తుగా ఫ్యూన్ మళ్ళీ తలుపు తీసుకుని బయటికొచ్చాడు.
    "అరె! ఎన్నిసార్లు చెప్పాలివయ్యా సైలెన్స్ గుండమని! ఏయ్-ఇగో నీకే చెప్పెడిది- ఎందుకట్ల లొల్లిపెడుతున్నావ్?" ఓ గెజిటెడ్ ఆఫీసర్ని పట్టుకుని దబాయించాడతను.
    గెజిటెడ్ ఆఫీసర్ ఖంగారుపడ్డారు. "పిల్లలకు కోచింగ్ ఇస్తున్నాను-" అన్నాడు దీనంగా.
    "అదంతా గిప్పుడు చేస్తారువయ్యా- ఇన్నిదినాలకెళ్ళి ఏం జేసినావ్? ఇంక బంద్ చెయ్-" అని అందరివేపూ ఓసారి చూశాడు.
    "హెచ్ శ్రీనివాసరావ్ ఎవరు" అనడిగాడు అందరి ముఖాల వంక సెకండ్ రౌండ్ చూస్తూ. "నేనే" అంటూ ఓ మూల వాళ్ళపాపకు బిస్కెట్లు తినిపిస్తున్న వ్యక్తిలేచి నిలబడ్డాడు.
    "పాపన్దీసుకుని లోపలకు నడు!"
    అతను ఖంగారుగా పాపచేతిలో బిస్కెట్లులాగి అవతలపారేసి ప్రిన్సిపాల్ రూమ్ లోకి ఈడ్చుకుపోయాడు.
    అందరూ ఊపిరి బిగపట్టేశారు.
    లోపల ఏం జరుగుతుందా అన్న ఆత్రుత!
    పావుగంట తర్వాత చెమటలు తుడుచుకుంటూ బయటి కొచ్చాడతను. అందరం అతని చుట్టూ మూగాము.
    "ఏమి అడుగుతున్నారండీ?" అన్నాడొకతను.
    "ఏమదిగితే ఏం లాభం లెండి- ఎడ్మిషన్ దొరకలేదు-" అన్నాడతను నీరసంగా-అక్కడి నుంచి వెళ్ళిపోతూ అందరికీ భయం పట్టుకుంది.
    మరోవ్యక్తిని లోపలకు తీసుకెళ్ళాడు ఫ్యూన్.
    అతను బయటకొచ్చాక అందరూ మళ్ళీ అతను చుట్టూ మూగేశారు.
    "ఏమడిగాడండీ పాపను?" ప్రశ్నించాడొకతను కాగితం పెన్నూరడీగా పట్టుకుని.
    "పాపనేమీ అడగలేదండీ?" బెంచీమీద కూలబడుతూ అన్నాడతను.
    "మరి?"
    "నన్నే అడిగాడు ప్రశ్నలన్నీ!"
    "మిమ్మల్నా?" అందరి గుండెలూ గుభేలుమన్నాయి.
    "అవును!"
    "ఏమడిగారు?"
    "వేరీజ్ మూర్ ఐలెండ్?" అనడిగారు.
    "ఆ!" అందరూ అదిరిపడ్డారు.
    "మూర్ ఐలెండా?" ఓ లక్షాధికారి తెల్లబోతూ అడిగాడు.
    "అవును."
    "అంటే ఏమిటసలది?"

 Previous Page Next Page