Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 13

    నిర్లక్ష్యంగా నవ్వాడు నా వెనకాతల ఆ రోజంతా ఎలా ప్రతీకారం తీర్చుకుని వాడికి బుద్ది చెప్పాలా అని ఆలోచించాను ఆంటీ. ఆఖరికి వీలయితే వాడిని కోర్టు కెక్కించి న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించాను. ఎవరైనా లాయరు సహాయం కావాలి, అసలు నేను వాడి మీద కేసు పెట్టగలనో లేదో ఈ విషయాలన్నీ లాయరుతో సంప్రదించనిదే తెలియదు కదా. నాకెవరు తెల్సిన లాయరు లేరు. హఠాత్తుగా మీరు గుర్తుకు వచ్చారు. నాకు చాలా సంతోషం కల్గింది. మగలాయారు కంటే ఓ స్రీగా నా బాధ, ఆవేదన, నిస్సహాయస్థితి మీరు బాగా గుర్తించి సహాయపడగలరని నమ్మాను.
    మీకు ఫీజివడానికి తగిన శక్తి నాకు లేదు. మీరు ఒంటరివారు, ఇంత ఆర్జించారు. ఒక ఆడపిల్లకి సహాయపడడానికి ఫీజు తీసుకోకుండా నా తరుపున వాదించగలరు- అన్న నమ్మకంతో మిమ్మల్ని కలవటానికి ఇంతకీ తెగించాను. నేను ఇంట్లోంచి బయటికి కదలడానికి అమ్మ లక్ష ఆంక్షలు పెడ్తోంది. ఇంచుమించు బందిఖానా అయింది ఇల్లు నాకు. ఒకవేళ వెళ్ళినా తమ్ముడి తోడులేనిదే గుమ్మం కదలకుడదని అజ్ఞ. ఈ పరిస్థితిలో ఇల్లు వదలడానికి రాత్రి అంతా నిద్రపోయాక దొంగతనంగా మీ దగ్గర్కి రావాల్సి వచ్చింది ఆంటీ! అంతా మీకు చెప్పాను. ఏం చేస్తారో నన్ను నేను మీకు అప్పగించుకున్నాను. నా మీద దయతల్చి ఈ కేసు టేకప్ చేసి ఓ  ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి న్యాయస్థానంలో పోరాడాలి మీరు.
    నేను చేయ్యబోయేది సాహసమే. దాని వల్ల చాలా అనర్ధాలున్నాయి. నా భవిష్యత్తుకి దారి ముసుకుపోతుందని తెలుసు. ఏది ఏమైనా ఫర్వాలేదు నాకు ఈనాడు జరిగిన అన్యాయం ఇక ముందు ఒక ఆడపిల్లకి ఏ మగాడైనా చేసేముందు పదిసార్లు ఆలోచించేలా భయపడాలి. దానికి ఇదొక్కటే దారి. మీరే నాకు దిక్కు." రూప రెండు చేతులు జోడించింది. ఆమెకి తెలియకుండానే ఆమె కంఠం రుద్దమయి కళ్ళు నీళ్ళతో నిండాయి.
    సుమతి కళ్ళు కూడా అప్రయత్నంగా చమర్చాయి. "ఛ!ఛ! కన్నీరు పెట్టకు నీవు చాలా ధైర్యస్తురాలివి! నీలాంటి ఆడపిల్ల కన్నీరు పెట్టకూడదు. యీ మనో నిబ్బరం, ఈ ధైర్యం చివరివరకు లేకపోతే నేవేం సాధించలేవు. ముందా కళ్ళు తుడుచుకో. నేను నీ కేసు టేకప్ చేస్తాను. నేను నీకు అండగా వుంటాను రూపా. నీవేం భయపడకు." సుమతి లేచి రూప తలమీద చెయ్యివేసి నిమిరింది ప్రమాణం చేస్తున్నట్టు.
    ఆ ఓదార్పుకి ఆ సౌమ్యతకి, రూప కరిగిపోయింది. ఇన్నాళ్లూ తనలో దాచుకు కుమిలిపోయిన ఆ దుఖం కట్టలు తెంచుకు బయటపడింది. సుమతి చెయ్యి మీద తల ఆన్చి చిన్నపిల్లలా బావురుమంది.
    "ఆంటీ నాకు మీరే దిక్కు, ఏం చేస్తారో! నిటా ముంచినా, పాల ముంచినా మీదే భారం. యీ సంగతి తెలిసి అమ్మా నాన్న ఇంటిలోంచి గెంటివేసినా మీరే దిక్కవాలి. మీరే నాకో దారి చూపాలి. పిరికిదానిలా చచ్చి పోవాలని లేదు ఆంటీ! యీ ప్రపంచాన్ని ఎదించాలని వుంది. నాకు పెళ్ళి వద్దు, సంసారం వద్దు. మగాళ్ళంటేనే అసహ్యం పుట్టింది. ఈ మగాళ్ళని ధిక్కరించి వాళ్ళ అండదండలు లేకుండానే బతికి, నా బిడ్డని బతికించుకుని - ఆ రాస్కెల్ కి బుద్ది చెప్పి సగర్వంగా తలెత్తుకు తిరగాలని వుంది.
    వాడు నాకు భర్త కాకపోయినా నా బిడ్డకి తండ్రని లోకానికి చెప్పాలి ఆంటీ. పెళ్ళికాకుండా బిడ్డని కనడంలో ఓ స్రీ తప్పు ఎంతవుందో, దానికి ఆమె బాధ్యత ఎంత వుందో పురుషుడిది అంతే బాధ్యత వున్నప్పుడు ఆ పురుషుడు తప్పించుకుని ఎందుకు వెళ్ళాలనే విషయంలో న్యాయం కావాలి నాకు ఆంటీ. తల్లి ఎలా కన్న బిడ్డని కన్నతల్లికి ఆ బిడ్డ మీద వుండే మమతానురాగాలు ఒకటేనని అలాంటి బిడ్డని ఆమె పెంచుకునే హక్కు కోసం నేను ఈ లోకంలో పోరాడాలి ఆంటీ. ఈ బిడ్డని నాకు చంపుకోవాలని లేదు ఆంటీ. నే సాధించదాల్చింది సాదించడానికి ఈ బిడ్డ బతకాలి.......ఆంటీ ఇదంతా జరగాలంటే మీ సహాయం కావాలి ఆంటీ" రూప ఏడుస్తూ అంది.
    సుమతి ఆమెను చూసి కరిగిపోయింది స్థిర నిశ్చయానికి వచ్చిన దానిలా తల పంకించింది. "రూపా.....చూడమ్మా! నీవు ఇంక ఏడవకు. ఇదివరకు నా తెలివితక్కువ తనం మూలాన ఒక జీవితం నాశనం అయింది. నీ మాటలతో నా కళ్ళు తెరిచావు. నాకో మార్గం చూపావు. ఇది నీకే కాదు నాకు ఒక సవాలే! నా చాతనయినంతగా నీకు న్యాయం జరిగేలా చూస్తాను. అలా కాకపోయినా నీకు అండగా నిలుస్తాను. నీ వాళ్ళు నిన్ను ఆదుకోలేకపోతే నేనే ఆదుకుంటాను.
    నీవు నీ కాళ్ళమీద నిలబడే ప్రయత్నం చేస్తాను. అంతవరకు నీ భారం నేను వహిస్తాను. నేనింత ఆర్జించాను. నా డబ్బు నాకుపయోగ పడకపోయినా నాలాంటి ఒక అమ్మాయికి వుపయోగపడితే  అంతకంటే సద్వినియోగం ఏముంది. రూప! నీ భాధ అర్ధం అయింది. నీవు ధైర్యం చేసి నా దగ్గరకు రావడం చాలా మంచిపని చేశావు. మనిద్దరిమధ్య ఏ పూర్వజన్మ బంధమో వుండి వుంటుంది. ఆ దేవుడే నిన్ను నా దగ్గరకు పంపాడేమో నీ కధ విన్నాక న్యాయస్థానంలో నేను దేనికి పోరాడలో తెలిసింది. ఆడదానికి జరుగుతున్న అన్యాయాలని ఎదిరించి న్యాయం కోసం పోరాడుతాను. పురుష అధికారానికి, మోసానికి గురై వంచించబడ్డ స్రీలకే న్యాయం జరిగేలా చూస్తాను. అలాంటి స్రీలకి పుట్టిన బిడ్డలు అక్రమ సంతానాలు కాదని వారికీ సంఘంలో గుర్తింపు వుండాలని వాదిస్తాను.
    రూపా! నీ బిడ్డని చంపుకోవద్దు. ఆ బిడ్డని నీకు దూరం చేసే హక్కు ఎవరికి లేదు. ఆ బాధ ఎలాంటిదో నాకు తెలుసు రూపా. నీకు, నీ బిడ్డకి నేను అండగా నిలుస్తాను రూపా" సుమతి ఆవేశంగా రూప చెయ్యి నొక్కి పట్టుకుని గొంతుతో అంది.
    రూప ఆశ్చర్యంగా చూసింది. ఆమె తడి కళ్ళు ఆనందంతో మిలమిల లాడాయి.
    సుమతి నుంచి ఇంత సహాయం, సహకారం రూప ఆశించలేదు. తనకింత సహాయపడటానికి ముందుకు వస్తుందని అనుకోలేదు. తన కధ విని మందలించి యింటికి పంపిస్తుందని, నీవు తప్పు చేశావు నీ తల్లి తండ్రులు నీ మేలుకోరేవారు వాళ్ళ దగ్గర దాచకుండా నిజం చెప్పు వాళ్ళే ఏదో తోవ చూస్తారు. చేసిన తప్పు ఎలాగూ చేశావు అంతా మరిచి ఎవరినో పెళ్ళాడు అంటూ నీతులు చెప్పి పంపిస్తుందని అనుకుంది. కోర్టులో నీ కేసు నిలవదు. లా వప్పుకోదు, పాయింటు నిలవదు. సాక్ష్యాలు, ఆధారాలు లేవంటూ కేసు టేకప్ చెయ్యడానికి తిరస్కరిస్తుందని, ఆమెని ఎలాగైనా బతిమిలాడి ప్రార్ధించి ఒప్పించాలని ఏవేవో భయాలతో, సందేహాలతో తను తలపెట్టింది జరుగుతుందన్న ఆశ లేకుండానే అపనమ్మకంతోనే వచ్చింది.
    కానీ సుమతి చూపిన ఆదరణ తనపట్ల దయ, ఏం జరిగినా తనకండగా నిలుస్తానని చేసిన బాస-తనకోసం, న్యాయం కోసం పోరాడుతానని ఆవేశంగా ఇచ్చిన మాట.....అంతా ఆశ్చర్యంగా అనిపించింది. సుమతి ఇచ్చిన ప్రోత్సాహా ధైర్యాలతో అపుడే సగం పని సానుకూల పడినంత అనందం అనిపించింది. చటుక్కున వంగి ఆమె పాదాలంటి నమస్కారం చేసింది రూప.
    "ఆంటీ నాకు మీరు కొత్త జీవితం ప్రసాదించాలి. నాకు మీరు అండగా వుండాలి. నాకు మీరిచ్చిన ధైర్యం, నా పట్ల మీరు చూపిన ఆదరణతో నాలో ఆత్మ విశ్వాసం పెంపొందించారు. ఇన్నాళ్ళు తప్పుచేశానని కుమిలిపోతున్న నాకు మీ ఓదార్పు కొత్త జీవితం మీద ఆశ కల్గిస్తుంది. ఇంత సహాయం మీ నుంచి ఆశించలేదు ఆంటీ. ఈనాటి నుంచి మీరేం చెపితే అదే చేస్తాను. మీరే నాకు గురువు, దైవం, నా తల్లిదండ్రులు కాదంటే మిమ్మల్ని తల్లిగా బావించుకుంటాను. మీరే నాకు మార్గ దర్శకులు" అంది రూప గద్గిదికంగా.
    సుమతి ఆదరంగా రూపాని లేవనెత్తి నిలబెట్టి.....
    "రూప! నిజంగా నీ ధైర్య సాహాసాలు నాకు యిప్పటికి ఆశ్చర్యం కల్గిస్తున్నాయి. ఒక్క ఆడపిల్ల అయినా నీ అంత నిబ్బరంగా పరిస్థితిని ఎదుర్కోడానికి నిలబడి వుంటే ఈనాడు యిన్ని కన్నీటి కధలు వుండేం కావు, సరే.....యింక మనం కేసు వివరాలు మాట్లాడుకుందాం. అన్ని విషయాలు ముందునుంచి వివరంగా చెప్పు. అతను రాసిన ఉత్తరాలు గాని, మిమ్మల్ని చుసిన సాక్ష్యులు గాని ఎవరన్నా వున్నారా? ఆ వివరాలన్నీ కావాలి నాకు" అంది టేబిల్ ముందు కూర్చుని కాగితం, కులం తీసుకుని.
    రూప ప్రతి సంఘటన చెప్పడం మెదలుపెట్టింది. అందులో పాయింట్స్ నోట్ చేసుకోసాగింది సుమతి. మధ్యలో "ఆ అబ్బాయి పేరు సురేష్ కదూ! ఎవరబ్బాయి? తండ్రేం చేస్తున్నాడు. వాళ్ళ యిల్లు ఎక్కడ - ఆ వివరాలు చెప్పు" అంది సుమతి.
    రూప సురేష్ తండ్రి పేరు, ఇల్లు వివరాలు చెప్పగానే సుమతి ఆశ్చర్యంగా
    "లాయరు రామనాధం గారబ్బాయా సురేష్?" అంది తెల్లబోతూ, ఆమె మొహం ఒక్కసారిగా వివర్ణమయింది.

 Previous Page Next Page