Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 13

"మరి నా ఉద్యోగం ఎప్పటినుంచీ మొదలుపెట్టమంటారు మేడం?" కవ్వింపుగా అడిగాడు.
"ఈరోజే ఇంట్లో చెప్తాను. నాన్న నా మాట కాదనరు" అంది.
"పెళ్ళికి ఈరోజు మంచిరోజే అనుకుంటా కానిచ్చేద్దామా?" హుషారుగా అడిగాడు.
అతని తొందరకి ఆమె నవ్వి "మొదటి పరిచయమే స్నేహంగా మారి ఆ కలయితే పెళ్ళిదాకా దారితీయడం విచిత్రంగా లేదూ!" అంది.
"నా అంత అందగాడూ, తెలివైనవాడూ ఇంకోడు మళ్ళీ దొరకడని అంత త్వరగా తెలుసుకున్నందుకు నిన్ను అభినందించాలి" అన్నాడు.
"కాదు! నా అంత ప్రయోజకురాలు నీకు తారసపడినందుకూ, నువ్వు నా కోరిక కాదనకుండా వెంటనే ఒప్పుకున్నందుకూ నిన్ను అభినందించాలి" అంది.
"సరే కానీ.... మన పెళ్ళిలో మంగళసూత్రం నేను నీకు కట్టాలో లేక నువ్వు నాకు కట్టాలో త్వరగా డిసైడ్ చేయడం మంచిది. అక్కడ కూడా ఇలా మనం పోట్లాడుకుంటూ కూర్చుంటే వచ్చినవాళ్ళు ఆకలికి శోషొచ్చి పడిపోతారు" అన్నాడు.
శక్తి కాసేపు ఆలోచించి "నువ్వే కట్టు ఆ మూడుతులాల చైనూ, మంగళసూత్రాలతో నువ్వు ఎక్కడికైనా పరారైపోతే నాకు కష్టం" అంది.
అతను తేలిగ్గా నవ్వేసి "నీకు మనుషులమీద నమ్మకం చాలా తక్కువన్న సంగతి నాకర్ధం అయింది శక్తీ! నువ్వు పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి తెచ్చి ఇచ్చే బాధ్యత నాది" అన్నాడు.
"సరే కానీ ముందు డాక్టర్ బిల్ కట్టేసి వస్తాను. మనం మా ఇంటికి వెళదాం" అంది.
అతను తల ఊపాడు.
డాక్టర్ మాలతి ఇంద్రనీల్ కి ఏవో మందులు రాసి ఇస్తూ "అతనికి కాస్త స్క్రూలూజ్ అనుకుంటాను. లేకుంటే ఎవరైనా అలాంటి సాహసాలు చేస్తారా?" అంది.
"అవును! ఇప్పుడు ఇంకో సాహసం చెయ్యబోతున్నాడు" అంది శక్తి.
"ఏమిటీ? సింహం నోట్లో తలపెట్టబోతున్నాడా?" అడిగింది మాలతి.
"కాదు, ఈ శక్తి మెడలో తాళి కట్టబోతున్నాడు" అని చిన్నగా నవ్వింది.
"వాట్!? నిజంగానా? కంగ్రాట్స్" శక్తిచేతిని పట్టుకుని ఊపేస్తూ "అదీ అలా చెప్పు. ఇదంతా అమ్మగారి ప్రేమ మహిమ అన్నమాట. ఎన్నాళ్ళనుంచీ..." కుతూహలంగా అడిగింది మాలతి.
"నిన్న నీ నర్సింగ్ హోంలో ఎడ్మిట్ చేసినప్పటినుంచీ..... మా ప్రేమ వయసు పన్నెండుగంటల ఇరవై నిముషాల నలభై సెకండ్లు" వాచీ చూస్తూ చెప్పింది శక్తి.
"నువ్వు అన్నింట్లోనూ ఫాస్టేగా" మెచ్చుకోలుగా అంది మాలతి.
"వస్తాను నీ సహాయానికి థాంక్స్" అని శక్తి లేచింది.
ఆమె గదిలోంచి బయటికి వెళుతుండగా, మాలతి "శక్తీ.... నీ హబ్బీ చాలా హేండ్సమ్ గా వున్నాడు" అరిచింది.
"వన్స్ ఎగైన్ థాంక్స్!" అని వెళ్ళిపోయింది.   
                                                 * * *
"నిర్ణయం తీసుకున్నాక అమలుచేయడంలో ఆలస్యం చెయ్యడం నాకు ఇష్టం వుండదు. అందుకే ఈరోజే అతణ్ణి వెంటబెట్టుకుని వచ్చాను నాన్నా!" అంది శక్తి.
వంటింటి గుమ్మందగ్గిర కూర్చుని తోటకూర తరుగుతున్న అరుంధతి నోరంతా తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయింది.
ఇంద్రనీల్ అటూ ఇటూ చూసి తనే ఓ స్టూల్ జరుపుకుని కూర్చున్నాడు.
గోపాలరావు గంభీరంగా ఆలోచిస్తూ వుండిపోయాడు.
"ఇంతకీ అతనికి ఏం ఉద్యోగం? ఎంత సంపాదిస్తాడూ? మన కులమేనా? ఇంటి పేరూ, గోత్రం ఏమిటి? వాళ్ళ నాన్నగారిది ఏ వూరూ? వెనకా ముందూ ఏమైనా వుందా?" అరుంధతి ఆపకుండా ప్రశ్నలు మొదలుపెట్టింది.
శక్తిమతి వాడిగా "అవన్నీ చూసి చేసిన మీ కాపురాలు ఏమంత సౌఖ్యంగా ఏడిశాయని ఈ వివరాలన్నీ అతడ్ని అడగడం అక్కా?" అంది.
అరుంధతి చర్రున కత్తిపీట ముడిచి పక్కకితోసి "అయితే మగాడైతే చాలంటావా?" అంది.
"చిన్న సవరణ అర్ధంచేసుకునే మగాడైతే చాలు" అంది.
"అయ్యో! పెద్దవాళ్ళతో ఒక్కమాటైనా సంప్రదించకుండా ఇలా నీ నిర్ణయాలు నువ్వే తీసేసుకుంటావా? మీ పెద్దబావనైనా అడగొద్దూ....నాన్నగారు ఇంకా వున్నారన్న విషయం అయినా గుర్తుందా నీకూ?" అని అరిచింది అరుంధతి.
గోపాలరావు మాట్లాడకుండా వెళ్ళి లైట్ స్విచ్ వేశాడు. ట్యూబ్ లైట్ వెలగలేదు. వెలిగి మళ్ళీ వెంటనే ఆరిపోసాగింది.
"లూజ్ కనెక్షన్ అనుకుంటాను. ఉండండి నేను చూస్తాను" అని ఇంద్రనీల్ స్టూలుమీద ఎక్కి సరిచేశాడు.
లైటు వెలిగింది.
ఆయన గోడకి తగిలించిన శ్రీరామా అండ్ కో వారి తెలుగు కేలండర్ చేతిలోకి తీసుకుని "పంచమి బుధవారం... శ్రవణా నక్షత్రం బావుందమ్మా వినాయకుడి గుడిలో కానిద్దామా?" అన్నాడు.
"నాన్నా!" శక్తికళ్ళు ఆనందంతో మెరిశాయి.
ఇంద్రనీల్ వైపు తిరిగి 'నే చెప్పలేదూ నా నిర్ణయం పట్ల మా నాన్నకు నమ్మకం ఎక్కువనీ" అన్నట్లు చూసింది.
అరుంధతి రుసరుసలాడుతూ "బావుంది వరస. ఇంటి పెద్దల్లుడూ, పెద్ద కూతురూ మీకు తోటకూరలో పురుగులతో సమానం" అంది.
"బాబూ... నీ పేరైనా తెలుసుకోవచ్చా?" అడిగాడు గోపాలరావు.
"ఇంద్రనీల్" వినయంగా చెప్పాడు.
"మంచి పేరు నీకు మా శక్తిగురించి ఈపాటికి తెలిసే వుంటుంది. అయినా నా బాధ్యతగా మళ్ళీ చెప్తున్నాను. దాని మనసు కాకినాడ కాజా లాంటిది. లోపలంతా అమృతమే బయటికి మాత్రం మనుషుల తెలివి తక్కువతనంపట్ల అంతులేని అసహనం చూపిస్తుంది. అర్ధంచేసుకుని మసలుకో" అని వినయంగా ఒంగి అతని చేతులు పట్టుకున్నాడు.
"అలాగేనండీ! ఇంకొకమాట. మీరు నాతో అలా ఒంగి మాట్లాడనక్కర్లేదు. నేను మీ అల్లుడిని కాదు. ఈ నిముషంనుంచీ మీ కొడుకు ననుకోండి" అన్నాడు.

 Previous Page Next Page