ఓ మహాత్మా! ఓ మహర్షీ!
ఓ మహాత్మా! ఓ మహర్షీ
ఓ క్షమా పీయూష వర్షీ
ఓ తపస్వీ ఓ యశస్వీ
ఓ అహింసాశయ మనస్వి
ఎక్కడయ్యా నీ అహింస
ఏడ నీ కరుణా రిరంస
చూడు దేశం ద్వేష భుగ్నం
క్షురత్ జిహ్వానల విభుగ్నం
ఇరవదైదేడులకు పైగా
మురిగి కాలం కరగిపోగా
ఎక్కడా క్షమ కానిపించదు
హింస తన ఆయుధం దించదు
ఔను నిజమే నువ్వు పాపం
అస్త్రతకు ఇచ్చావు శాపం
సాగుతాయా మంత్రమాయలు
రాలుతాయా చింతకాయలు
సర్వమానవ సమానత్వం
సరే అది నీ మూలతత్వం
అమానుష పైశాచికత్వం
అదే ఎదురౌతున్న సత్యం
తిండి దొంగను మనిషనాలా
లంచగొండిని క్షమించాలా
లోఫరబ్బి నవాబనాలా
డఫరయ్య షరీఫనాలా
శాక్యముని1లా క్రీస్తులాగ
శాంతి బోధించావు బాగా
మతం మీద గతం మీద
మక్కువగా చేశావు జాగా
ఎందుకయ్యా ఈ మతాలు
అందుతాయా గత దినాలు
దేవుడా మన ఈతి బాధలు
తీర్చిదిద్దగల నాథుడు
మంచి గతమున కొంచెమేనోయ్
అని మహాకవి చెప్పలేదో?
ఆగతానికి స్వాగతంగా
పాడవలె ఈ ఇల సుఖంగా
కలదు మా ఓ కర్మచందా!
గతవితర్కం అనే పంథా
చర్యపై ప్రతిచర్య రహింసకొక ప్రతిహింస లేదా
నేను పూర్వం నిజం సుమ్మీ
నిన్ను పూజించాను నమ్మి
పోయె నా విశ్వాసమంతా
మారె నా భావాల పంథా
యువతరం విసిగింది బాపూ
నవతరం విరిసింది బాబూ
వెతుకుతున్నది కొత్తరోజులు
దులుపుతున్నది పాత బూజులు
తెల్ల బీభత్సాని కెదురుగ
ఎర్రభీతి జనించె కుదురుగ
చెప్పు దెబ్బలు కుక్క కాటుకు
దెయ్యమైనా వెరచు వ్రేటుకు
కవులు నీకు గరం గరమ్మగు
కవిత లిస్తారవ్వి నమ్మకు
నిన్ను పొగిడే వాళ్ళ చాయను
నన్ను చేర్చకు పుణ్యమాయెను
వెన్నెముక విరిచావు తండ్రీ
దేశమే ఒక మురికి లాండ్రీ
ఏమి లాభం వెన్ను నిమిరి
రాజకులంతా తప్పుకొనిరి
చీడ పురుగులు పేడ పురుగులు
అన్నివైపుల తీయు పదేశమంతా రుజాగ్రస్తం
లేదు లేదొక వైద్య హస్తం
మత నినాదం మిత వివాదం
రెండు కూడా కడు ప్రమాదం
ముంచుకొచ్చిన సమయమందు
ఉగ్రవాదం ఒకటి మందు
సాటి మనిషిని దోచుకొనియెడి, క
సాయి మనుజ బ్రువుడు మనడిక
నీటిలో పాల్చిలికి అమ్మే
నికృష్టుడిక చిటారుకొమ్మే
నీవు చూపిస్తున్న బాట
యధాస్థితికొక కంచుకోట
హింసతోనే సృష్టి పూస్తది
హింసతోనే మార్పు వస్తది.
73, ఆగస్టు 14న రవీంద్ర భారతిలో ఆకాశవాణి నిర్వహించిన కవి సమ్మేళనంలో
ఈ శ్రీశ్రీ గీతాన్ని ఆరుద్ర చదివారు.
ముద్రణ : ఆంధ్రజ్యోతి వార పత్రిక, 7-9-1973
పునర్ముద్రణ: మరో ప్రస్థానం, విరసం ప్రచురణ - మే, 1980
1. శాక్యముని" గౌతమబుద్ధుడు