ఆ మాటలకు నవ్వొచ్చింది సురభికి.
"ఏం నవ్వుతున్నావ్."
"ఏం లేదు సర్ మీతో సీరియస్ గా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను సర్ చెప్పనా?"
"చెప్పు!"
"ఇప్పుడు మన మాట్లాడుతున్న విషయం మీకూ, నాకూ సంబంధించిన విషయమే సర్."
తలొంచుకుని మెల్లగా చెప్తున్న సురభి మాటలకు శ్రీధర్ షాక్ తిన్నాడు. చాలా సేపటివరకూ తేరుకోలేకపోయాడు. స్త్రీ మనస్సును అద్దంలో అతి తేలిగ్గా చూడగలిగినా, ఆలోచనల్ని మాత్రం భూతద్దంలో కూడా చూడలేము అని ఎవరో అనగా విన్నాడు. అది గుర్తుకొచ్చింది శ్రీధర్ కి. ఒక ఆడపిల్ల ఎవర్ని ఎందుకు, ఎప్పుడు ప్రేమిస్తుందో?!! ఎవ్వరూ చెప్పలేరేమో?!
"నువ్వు ప్రేమిస్తున్నది నాన్నా ఆర్యూ మేడ్?" చాలా పెద్దరికం ధ్వనించింది శ్రీధర్ గొంతు.
సురభి ఏం మాట్లాడలేదు.
"ఎస్....సర్. అయామ్ మేడ్ ఆఫ్టర్ యూ... ఐలవ్ యూ ఐలవ్యూ..... మీరంగీకరించకపోయినా మిమ్మల్నే నేను ప్రేమిస్తుంటాను" స్థిరంగా చెప్పింది సురభి.
ఒకింతసేపు ఆలోచనల్లో పడ్డాడు శ్రీధర్.
"మీరేమాలోచిస్తున్నారో నాకు తెల్సు... సమాజం మన జంటను అంగీకరిస్తుందా లేదా అనేనా.... యాభైనాలుగేళ్ళ వయసున్న చార్లి చాప్లిన్ ని ఊనాఆనిల్ ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పటికి ఊనావయసెంతో తెల్సా...? పదిహేనేళ్ళు... ప్రపంచ ప్రఖ్యాత సితార విద్వాంసుడు పండింట్ రవి శంకర్ చే అరవై తొమ్మిదేళ్ళ వయసులో, మొన్న మొన్ననే ప్రేమించి పెళ్ళి చేసుకుంది సుకన్య..ఆమెకు పెళ్ళిచేసుకున్నప్పటికి ముఫ్ఫైతొమ్మిదేళ్ళ వయసైనా, అంతకు పదిహేనేళ్ళ క్రితంనుంచి రవిశంకర్ ని ప్రేమిస్తోంది సుకన్య. చరిత్రలో కెళితే ఇలాంటి సంఘటనలెన్నో మనకు కన్పిస్తాయి. మీరు..." ఏదో చెప్పబోతున్న సురభిని శ్రీధర్ అడ్డొచ్చాడు.
"చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా ఉండవచ్చు కానీ మీ చరిత్ర మేడమ్ సంగతి వేరు" అన్నాడు శ్రీధర్ సురభిని ఎలా అర్ధం చేసుకోవాలో తెలీక.
"నిజంగా చెప్పండి సర్. మీకన్నా విశాలాక్షి గరితోనే నాకెక్కువ పరిచయం ఆవిడ మనస్తత్వం నాకు బాగా తెల్సు మీరు ఒంటరిగా మీ దాంపత్య జీవనం గురించి ఎంత బాధపడుతున్నారో నాకుతెల్సు మీకు సంబంధించిన ప్రతి చిన్నవిషయాన్నీ నేను స్పష్టంగా గమనించాను. మీకు మీ శ్రీమతిగారి ప్రోత్సాహం నిజంగా ఉండివుంటే పరిశోధనా రంగంలో ఈ పాటికి మీ కీర్తి మన ఇండియా పరిధులు దాటివెళ్ళేది అవునా"
పరిశోధన... పరిశోధన....
ఫిజిక్స్ లో ఎన్నో పరిశోధించాల్సిన విషయాలున్నాయి.
కానీ ఏవీ కొలిక్కిరావడంలేదు.
తనొక్కడే - తనకు ఇన్ స్పిరేషన్ లేదు. భార్యనుంచి చీత్కారాలు తప్ప ప్రోత్సాహంలేదు. నిజంగా తన భార్యగనక తనకు కావలసిన మానైస్క ఆనందాన్నిస్తే తనీరోజు ఇలా వుండేవాడుకాదు.
శ్రీధర్ తరచూ బాధపడే విషయం ఇదే.
"సమ్ థింగ్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్. ఏదో నిరాసక్తత, చిరునవ్వులతో బతకవల్సిన లైఫ్ లో ఏవో చీకటినీడలు ఎన్నెన్నో సాధించాలనుకున్నాను. ఏమీ సాధించలేకపోతున్నాను."
అస్పష్టంగా తన మనసులో బాధను వెళ్ళగ్రక్కాడతను.
దానికి ముగింపు వాక్యంగా-
"ఈ పరిస్థితుల్లో నువ్వు..." అని ఆగి సురభివేపు చూసాడు అతను.
"నేనంటే ఇష్టంలేదా మీకు."
అభింనంగా తనని అడుగుతున్న సురభిని ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్.
"సర్ నాహ్దో చిన్న రిక్వెస్టు నాకు మీనుంచి సెక్స్ సుఖం అక్కర్లేదు. ఆ సుఖాన్ని విశాలాక్షిగారికే ఇవ్వండి. నా ప్రేమను అర్ధంచేసుకోండి మీరు ఈ ప్రపంచంలో ఒక ఐన్ స్టీన్ లాంటి వ్యక్తి అవుతారని నమ్మకంవుంది. మీరు సాధించే విజయం వెనుక నన్నుండనివ్వండి. అదే నాకు చాలు" ఎంతో అనుభవశాలిలా అన్న సురభి మాటలను ముచ్చటగా వింటున్నాడు ఆ సైంటిస్ట్.
సురభి నిజంగా తన జీవితానికో ఇన్ స్పిరేషన్ అవుతుంది.
తన జీవితంలో కలలుగన్న చిరకాలపు సత్యాన్ని తను కనుగొనగలుగుతాడు.
ఎస్.ఎస్.ఇట్ షుడ్ బి హేపెన్డు జరుగుతుంది.
తను చేస్తున్న ప్రయోగం సఫలం అవుతుంది.
తను కోరుకుంటున్నది స్త్రీ ప్రేమకాదు. స్త్రీ నుంచి లభించే స్వాంతన. ఆ స్వాంతన తనకు లభించిననాడు తనేమయినా చెయ్యగలడు.
రోజుకొక్క ప్రేమలేఖలు రాసుకున్న రోజులు నిజంకావు.
రోజుకొక్కసారి ప్రేయసి చిరునవ్వుని చూడాలనుకున్న రోజులు నిజంకావు.
జీవితంలో పిల్లలు, వ్యామోహం, బంధాలు ఇవ్వేవీ నిజంకావు.
మానవ జగతి మనుగడకోసం, ఆ మనుగడ మరింత సుఖంగా జరగడం కోసం తన జీవితం ఉపయోగపడాలి.
అందుకు తనకో ఇన్ స్పిరేషన్ కావాలి.
నిజంగా సురభి ఇన్ స్పిరేషన్ అవుతుందా? అవుతుంది ఆ అమ్మాయి తనతో మాట్లాడిన పద్ధతిలోనే ఆ విషయం అర్ధమవుతోంది.
శ్రీధర్ రెండు నిమిషాలసేపు ఆలోచనల్లో పడ్డాడు.
"నాకో వారంరోజులు టైమివ్వగలవా" అతను నెమ్మదిగా అన్నాడు.
తలూపింది సురభి అంగీకార సూచకంగా మరో ఐదు నిమిషాల తర్వాత ఇద్దరూ లేచారు.
* * * * *
"కాయా, పండా?" కాటేజ్ లో కడుగుపెట్టిన సురభిని ముగ్గురూ ఒక్కసారే ప్రశ్నించారు.
"కాయా కాదు, పండూ కాదు. విత్తనమే" నవ్వుతూ జవాబిచ్చి, కుర్చీలో కూర్చుని "వేటయిపోయిందా కూలబడ్డారు" అంది ముగ్గురు వేపు చూస్తూ సురభి. వాళ్ళు మౌనంగా వుండిపోయారు.
"రోడ్డుమీద వెతకాల్సిన హీరోయిన్ లు గదిలో కూర్చుంటే ఎలాగే? ఆ వచ్చే హీరోలు గదుల్లో దొరకరుకదా" సురభి అంది తిరిగి.
"తిరుమల రోడ్డుమీద తిరిగితే తప్పు లేదే! ఎవరో వయసులో వున్న భక్తురాలనుకుంటారు. తప్పేంలేదు వెళ్ళండి. స్వయంవరంలో సిగ్గు పనికిరాదు."
"అయితే సరదాగా అలా తిరిగొద్దాం పద" ముగ్ధవేపు చూస్తూ లేచి నిలబడింది నీలిమ.
"లంచ్ టైమ్ కొచ్చేయండి. ఆల్ ది బెస్ట్" టాటా చెప్పారు సురభి, అలక.
అలక మనసంతా గౌతమ్ జయాధ్యక్షమీదే ఉంది.
మిగతా ముగ్గురిచేత అతనే తన సెలక్షన్ గా ఒప్పించాలని ఉంది.