స్నేహితులు, డైరెక్టర్లు ఆ ప్రాజెక్ట్ ని ఆపెయ్యమని సలహా యిచ్చారు.
ప్రాజెక్టుని, ఇంట్రడ్యూస్ చెయ్యడం, సక్సెస్ చెయ్యడమే ఇప్పటి వరకూ భానోజీరావుకు తెల్సు.
'B'FOR BATTLE
భానోజీరావంటే వ్యాపారవేత్త కాదు- యుద్ద తంత్ర నిపుణుడు.
వ్యాపారమంటే యుద్ధమని నమ్ముతాడు భానోజీరావు.
అందుకే-
ఏ ఒక్కరి మాటా వినలేదు భానోజీరావు.
యాభై కోట్లు కాదు.
ఇంకో యాభై కోట్లు ఖర్చు పెడతాను.
జింఖానా 1000ని ఇంటర్నేషనల్ మార్కెట్లో నిలబెడతాను.
శపధం చేశాడు భానోజీరావు.
అందులో భాగంగానే రెండో కూతురికి-
ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ని అప్పగించాడు.
ఆ విషయం మూడో కంటికి తెలీదు.
భానోజీరావు రెండో కూతురు గురించి అందరూ వినడమే తప్పించి, జింఖానా కంపెనీ ఉద్యోగస్తులెవరూ చూడలేదు.
ఒక అరగంట తర్వాత-
లేఖిని, భానుమతి రాజమండ్రి ప్రయాణమయ్యారు.
"అక్కడకు వెళ్ళగానే ఫోన్ చెయ్యండి" చెప్పాడు భానోజీరావు. తల్లీ, కూతుర్లు ఇద్దరూ పోర్టికోలో వున్న కారు దగ్గర కొచ్చారు. మరుక్షణం జింఖానా 1000 కారు గేటు దాటి రోడ్డు మీదకు దూసుకుపోయింది.
అయిదు నిమిషాలు గడిచాయి.
ఒక కారొచ్చి ఆ గేటు ముందు ఆగింది.
ఆమెను చూడగానే గూర్ఖా కంగారుగా సలాం చేసి, గేటు తీశాడు.
ఆ అమ్మాయి ఠీవిగా కారులోంచి దిగి లోనికడుగు పెట్టింది.
హాల్లో భానోజీరావు కోసం వెయిట్ చేస్తున్న పర్సనల్ సెక్రటరీ ఆమెను చూసి, రెస్పెక్టివ్ గా విష్ చేశాడు.
దాన్ని పట్టించుకోలేదా అమ్మాయి.
ఎదురొచ్చిన పనిమనిషి పక్కకు జరిగి, నిలబడింది.
ఆ పనిమనిషి వేపు చూస్తూ- "మమ్మీ ఎక్కడ?"
"పెద్దమ్మగారూ, లేఖినమ్మగారూ ఇప్పుడే వెళ్ళారమ్మా" వినయంగా జవాబు చెప్పింది పనిమనిషి.
"డాడీ ఎక్కడ?"
మేడమీద ఉన్నారన్నట్టుగా భయం, భయంగా సంజ్ఞ చేసింది పనిమనిషి.
నెమ్మదిగా మెట్లెక్కుతోంది ఆ అమ్మాయి.
ఇనప మెట్లమీద, ఆమె అడుగుల చప్పుడు-
టక్... టక్... టక్...
అడుగుల చప్పుడికి, టై సర్దుకుంటున్నవాడల్లా, తలతిప్పి చూశాడు భానోజీరావు.
గుమ్మం దగ్గర రెండో కూతురు.... లిఖిత.
"కమాన్ బేబీ! సడన్ గా వచ్చేశావేం?" ముఖమ్మీదకు నవ్వు తెచ్చుకుని అన్నాడాయన.
లిఖిత మాట్లాడలేదు.
సోఫాలో కూర్చుంది.
ఇంటర్ కమ్ తీసి కిందనున్న పి.ఏ. టు చైర్మెన్ కి కనెక్ట్ చేసింది.
"ఏవైనా ఇంపార్టెంట్ ఎంగేజ్ మెంట్స్ ఉన్నాయా చైర్మెన్ గారికి?"
"ఒన్ మినిట్ మేడం... ఎస్ మేడం.... లెవనో క్లాక్ కి స్టేట్ ఫైనాన్స్ మినిష్టర్ తో మీటింగ్, లెవన్ థర్టీకి- ఆఫీసులో యూనియన్ ప్రెసిడెంట్ తో మీటింగ్, ట్వెల్వ్ థర్టీకి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ తో మీటింగ్.... లంచ్ బ్రేక్ తో..... మధ్యాహ్నం మూడు గంటలకు సిన్మా డైరెక్టర్ నారాయణబాబుతో మీటింగ్."
"సిన్మా డైరెక్టర్ తో ఎందుకు?"
"మన ఆఫీసులో ఏదో సిన్మా షూటింగ్ తీస్తారట- పర్మిషన్ కోసం" చెప్పాడు పి.ఏ.
"సిన్మా డైరెక్టర్ తో చైర్మెన్ గారి మీటింగ్ కేన్సిల్ చేయండి. ఆస్క్ హిమ్ టు కాంటాక్ట్ జనరల్ మానేజర్... ఓ.కే." ఫోన్ పెట్టేసింది.
"మధ్యాహ్నం మూడుగంటలకు కలుస్తాను" చెప్పేసి టకటకా ఆ గదిలోంచి బైటకొచ్చేసింది.
లిఖితకు కోపం వస్తే, తండ్రి దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో భానోజీరావుకు తెలుసు. లిఖితకు ఎందుక్కోపం వచ్చిందో ఆయన వూహించగలిగాడు. తనలో తాను నవ్వుకున్నాడు. 'ఎంత తెలివైనదైనా చిన్నపిల్ల చిన్నపిల్లే' మనసులోనే అనుకున్నాడు.
మరో అయిదు నిమిషాల్లో ఆయన కిందకొచ్చాడు.
* * * * *
సరిగ్గా 2-50 నిమిషాలకు జింఖానాకి ఫోన్ చేసింది లిఖిత.
భానోజీరవు ఆఫీస్ పి.ఏ. లైన్లో కొచ్చాడు.
"సారీ మేడమ్! చైర్మెన్ గారు బయటికెళ్ళారు"
"ఎప్పుడొస్తారో తెల్సా?"
"ఫ్రైమ్ మినిస్టర్ స్టేట్ విజిట్ మేడం ఆయన్ని కలవడానికి గవర్నర్ గెస్ట్ హౌస్ కి వెళ్ళారు."
ఫోన్ పెట్టేసింది లిఖిత.
* * * * *
మళ్ళీ నాలుగ్గంటలకు ఫోన్ చేసింది.
చైర్మెన్ గారింకా రాలేదు. అయిదు గంటలకు ఫోన్ చేసింది.
మళ్ళీ అదే సమాధానం.
* * * * *
రాత్రి ఏడుగంటలకు ఫోన్ చేసింది.
"ఎస్... చైర్మెన్ స్పీకింగ్"
"మీకిప్పుడు ఖాళీ అయితే వస్తాను"
"సారీ అమ్మా! ఒక అరగంటలో ఇంటికొచ్చేస్తాను కదా అప్పుడు మాట్లాడుకోవచ్చు."
"నో డాడీ-ఆఫీసుకి సంబంధించిన విషయం ఆఫీసులోనే మాట్లాడాలి."
"యూ సిల్లీ.... అయితే ఆఫీసుకి రా"
* * * * *
"వికాస్ కి ప్రమోషన్ ఇస్తారని ఎక్స్ పెక్ట్ చేశాను" తండ్రి ముఖంలోకి సూటిగా చూస్తూ అంది లిఖిత.
చైర్మెన్ చాంబర్లో వాళ్లిద్దరే ఉన్నారు. చైర్మెన్ బిజీగా ఉన్నారన్న దానికి గుర్తుగా బయట 'రెడ్' బల్బ్ వెలుగుతోంది.
"ఎవరు- ఆ వైజాగ్ కుర్రాడి గురించా నువ్వు మాట్లాడుతున్నావ్" ఏదో ఫైలులోని పేపర్స్ ని చూస్తూ అన్నాడాయన.
"అక్కడ యూనిట్ ఎలా వుంది?" ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు లిఖిత.
"అతనిలో మంచి స్పార్క్ వుంది. ఆ విషయం అతనితో మాట్లాడిన మొదటి క్షణంలోనే గ్రహించాన్నేను. అందుకే మీకు ఫోన్ చేసి చెప్పాను. అతనికి ప్రమోషనిచ్చి, ఎంకరేజ్ చేస్తారనుకున్నాను. సర్వీస్ నుంచి తీసేయాల్సిన అవసరం ఏవొచ్చింది?"
"అతను తెలివైనవాడా.... అలాంటివాళ్ళు చాలామంది మన కంపెనీలో ఉన్నారు" ధీమాగా అన్నాడు భానోజీరావు.
"అతను జింఖానా థౌజండ్ విషయంలో సొల్యూషన్ ఇవ్వగలడు" నెమ్మదిగా అంది లిఖిత.
"నువ్వు కూడా మన జింఖానా 1000 ఫెయిల్యూర్ అనుకుంటున్నావా?" నవ్వాడాయన.
"ఎస్.... ఇటీజ్ హండ్రడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ ఆ ప్రాజెక్ట్ మీరు ఇంక పైసా ఇన్వెస్ట్ చేసినా శుద్ద వేస్ట్"
"మరి వికాస్ సొల్యూషన్ ఇస్తాడన్నావ్? చూడు బేబీ! సొల్యూషన్ నా దగ్గర కూడా ఉంది. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేముందు, అది ఫెయిలైతే ఏం చేయాలో ప్రతి బిజినెస్ మాన్ ఆలోచిస్తాడు."
"సొల్యూషన్ ఉండడం కాదు కావల్సింది, దాన్ని కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేయగలగాలి. అది వికాస్ చేయగలడని నా నమ్మకం."
కాసేపాగింది లిఖిత- మళ్ళీ అంది.
"నా ఒపీనియన్ని కన్సిడర్ చేయ్యకపోతే ఇంటెలిజెన్స్ వింగ్ లో నేనుండడం ఎందుకు? మీనింగ్ లెస్."
"చూడు బేబీ! ప్రతి విషయానికీ ఆర్గ్యూ చెయ్యడం మంచి పద్దతి కాహ్డు. నా వే ఆఫ్ ఆపరేషన్ నీకు తెల్సు. చిన్న టెస్ట్ పెట్టాను. దానికి ఇరిటేట్ అయ్యాడతను."
"అతన్ని ఇరిటేట్ అయ్యేట్టు చేసి, అతని కడుపు మీద కొట్టారు మీరు. ఇట్స్ హారిబుల్! నౌ లిటరల్లీ హీ ఈజ్ ఆన్ ది రోడ్స్."
"ఆన్ ది రోడ్స్?" ఆశ్చర్యంగా లిఖిత ముఖంవేపు చూసి-