Home » Suryadevara rammohan rao » త్రినేత్రుడు-2


    ఎంతందంగా నవ్వగలదీమె...?!

    "పవిత్రం, నిష్కల్మషం, నైర్మల్యం వగైరా పదాలు ఎన్నివాడినా ఆడ మగ మధ్య వుండే ఆకర్షణ వొరవడికి తట్టుకొని, తేరుకుని అది కాకుండా ఇంకేదో మాత్రమే కావాలనుకొనే ఆడా, మగా అరుదు. ఏ మగాడైనా నీతో స్వచ్చమైన స్నేహాన్ని మాత్రమే కోరుకుంటున్నాను, నీ పట్ల ఆకర్షణ లేదు, అనంటే విరగబడి నవ్వాలనిపిస్తుంది. ఇంతవరకూ ఏ మగాడు అనలేదు. సాధారణంగా నా ఆకర్షణలో పడి తలమునకలయి నన్ను సొంతం చేసుకోవాలనుకుని, నాకు వళ్ళు మండి నా చుట్టూ పర్చుకుంటున్న వాళ్ళ అస్థిత్వాన్ని దులిపేసుకునే టైమ్ కి, పోనీ నీ స్నేహం చాలు అనే మగవాడంటే నాకు అవహేళన" ఆమె నవ్వుతూనే అంది.

    ఆ మాటలు విన్నాక అక్కడికక్కడ తల కొట్టుకు చావాలనుకున్నాడు సైంటిస్ట్.

    "మగవాడితో అంతగా విసిగిపోయావా?" సైంటిస్ట్ తెగించేశాడు. ఇప్పుడతనికి తన ఉద్యోగం ఏమవుతుంది. ఆమెకు ఎదురు తిరిగితే అన్న భయం లేదు.

    "మగవాడితో విసిగిపోయినా అతని ఆకర్షణ నుంచి తప్పించుకోలేనన్న నిజాన్ని అంగీకరించినదాన్ని. అయితే ప్రస్తుతం ఏ విధమైన ఇన్ వాల్వుమెంట్ కి టైమ్ లేనిదాన్ని-" ఆమె స్థిరంగానే అంటోంది.

    "అంటే... నీకు నచ్చిన మగాడు ఇంతవరకు దొరకనట్లేనా? అయితే పాపం బ్రహ్మచారిణిలా మిగిలిపోతావా? అసలయినా నీవు కోరుకొనేటు వంటి వాడు నీకు దొరకడని చెప్పటానికి చింతిస్తున్నాను."

    అతను తనకిప్పుడు భయపడే స్టేజ్ దాటి చాలాదూరం వెళ్ళినట్టు ఆమె అప్పటికే గ్రహించింది.

    "నా స్థాయిలోనే ఆలోచించే మగాడు నాకు ఎదురైతే ఆ ఆనందంలో నిర్భయంగా మునకవేస్తాను. ఆ మునకలో ఆనందాన్ని పొందగలిగితే చలంలా జీవితాన్ని ప్రేమతో స్పందింప చేసుకుంటాను. నేను మునిగి నాతో మునిగేవాళ్ళు దొరక్కపోతే గీతలా అసంపూర్తిగా మిగిలిపోతాను. దానికి అతీతంగానో, వ్యతిరేకంగానో వుండాలన్న ప్రయత్నం మాత్రం చేయను."

    "నీకు నచ్చే మగాడు ఈ భూమండలం మీద దొరకడు. అదీగాక త్వరలోనే తీవ్రమైన పరాభవానికి గురికాబోతున్నావ్ నువ్వు" బెదిరిస్తున్నట్టు అన్నాడు సైంటిస్ట్.

    ఆమె కలువపూవుల్లాంటి కనులు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.

    "నాకా- పరాభవమా?"

    "అవును. నీకే- పందెం కాసింది నీవే అయినప్పుడు నీకు కాక పరాభవం నాకు జరుగుతుందా?" సర్ క్కాస్టిగ్గా అన్నాడు సైంటిస్ట్.

    "ఓడిపోయినప్పుడు కదా పరాభవం...?" ఆమె చప్పున అతని పాయింట్ క్యాచ్ చేసింది.

    "ఆ... అప్పుడు ఎప్పుడో అని ముచ్చట పడిపోకు... త్వరలోనే... నాతో త్రినాధ్ మెషిన్ చెయిన్ తెగ్గొట్టిచ్చినప్పుడు నీమీద ఆకర్షణతో కాక దేశ సేవతో చేసాననుకుంటున్నావా...? వేలికివేస్తే కాలికి, కాలికి వేస్తే వేలికీ అన్న పద్ధతిలో వున్నావ్- త్రినాధ్ అసాధారణమైన తెలివితేటలున్నవాడు. ఆ తెలివితేటలు రోజురోజుకు పదునెక్కుతుంటే కొత్తకొత్త వ్యాపారాలకు శుభారంభం పలుకుతున్నాడు. నువ్వు పొగరుతో కుందేలులా నిద్రిస్తుంటే, అతను తాబేలులా ఆత్మవిశ్వాసంతో ముందుకు చొచ్చుకు పోతున్నాడు. ఆరునెలలవరకు అతని మెషిన్ బాగుపడదని కలలుకన్నావ్. ఏమైంది నీ కల...?ఆర్రోజులలోపే చెదిరిపోయింది. అతను అనితరసాధ్యుడు. పైగా నీమీద పగబట్టి వున్నాడు. పంతం నెగ్గించుకోవటం అనివార్యం- అతని చేతిలో నీ పతనం అనివార్యం-" కసిగా అన్నాడు సైంటిస్ట్.

    "రేపనేది మనచేతిలో లేదు- ముందే ఎలా చెప్పగలవ్? ఎవరు గెలిచేది? ఎవరు ఓడేది?"

    "శెభాష్ త్రినాధ్... ఈ పొగరుబోతు పిల్లలో ఎవరూ తేలేని గొప్ప మార్పును తెచ్చావ్- మొన్న నిన్నటివరకు నిన్న, నేడు, రేపు నాదే అని పొగరుతో అన్న ప్రియాంకలో రేపు మనచేతిలో లేదన్న గొప్ప మార్పును తెప్పించావ్- శెభాష్...."

    ఆమె హతాశురాలైంది.

    అవును- నిజమే- అతనన్నది నిజమే- కొద్దిరోజుల క్రిందట వరకు రేపు సయితం నా చేతిలోనే ఓడిపోవాలన్న తను... ఇప్పుడు తను తనకు తెలియకుండానే రేపటిమీద విశ్వాసాన్ని కోల్పోయింది.

    క్షణాల్లో తేరుకుందామె.

    "కర్ణుడు నకులుడి చేతిలో ఓడిపోవడం అవమానంగాని- అర్జునుడి చేతిలో కాదుగా-? అలాగే అంతటి పౌరుషవంతుడు, ఆత్మ విశ్వాస సంపన్నుడు, పగ, పట్టుదల, ప్రతీకారాల్నే జపించే మానభిమానుడు- మహా యోధుడు- అనితర సాధ్యుడైన త్రినాధ్ చేతిలో ఓడిపోవడం సంభవిస్తే అది అవమానం కాదు. నువ్వే నాకో ఐడియా కలిగించావ్. నేను ఓడితే నేనతని కాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. పిచ్చివాడైతే అతను నన్ను తృణీకరిస్తాడు. తెలివి కలవాడైతే చేరదీసి గుండెకత్తుకుంటాడు.

    ఇకపోతే అతను ఓడితే నా బానిసవుతాడు. రసమయ హృది వున్న ఆడది తన బానిసను భర్తను చేసుకుంటుంది కాని బానిసగానే మిగల్చదు.

    "ఎంతో చదివి- ఎన్నో మార్కులు తెచ్చుకుని, మరెందరివో ప్రశంసలు అందుకున్న నీవు విశ్వవిద్యాలయ ప్రాంగణం దాటీ దాటగానే నిరాశ నిస్పృహలో కూరుకుపోయావు. పూట తిండికి పొర్లి పొర్లి ఏడ్చేవు.

    అమోఘమైన ణీ తెలివితేటలకు ఒకింత ఓర్పును, శ్రమను, జిజ్ఞాసను, పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని జోడించలేకపోయావు. ఫలితంగా సామాజిక రోగిష్టివయ్యావు. సరీగ్గా ఆ టైమ్ లోనే త్రినాధ్ ఇసుకనుంచి నూనెలు పిండేందుకు సిద్ధపడితే హేళన చేశావు.

    నీవు సముపార్జించుకున్న విజ్ఞానంతో ఎలాంటి అద్భుతాన్నయినా సృష్టించగల నీవు- నా ఆకర్షణలోపడి ణీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకున్నావు. చివరకు నా దగ్గరే ఉద్యోగిగా చేరావు... ఇప్పుడు చెప్పు. నీకంటే అన్ని విధాలుగా త్రినాధ్ గొప్పకాదా?"

    అతను ఒక్కసారి కుప్పకూలిపోయాడు.

    కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు.  

    ప్రియాంక అతనివేపు జాలిగా చూస్తూ "We must learn the willingness to fail and to succeed. మిస్టర్ సైంటిస్ట్" అంది.

    కొద్ది క్షణాల వరకు అతనేం మాట్లాడలేదు.

    ఆ గదిలో నిశ్శబ్దం...

    వారి మదిలో మనస్తత్వ విశ్లేషణ.

    క్షణాలు... నిమిషాలు... గడిచిపోతున్నాయ్.

    అతను మానసిక యుద్ధానికి సిద్ధమవుతున్నాడు.

    అతని రియాక్షన్ ఎలా వుంటుందోనని ఆమె ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

    అతను సోఫాలోంచి లేచాడు...

    సూటిగా ఆమెవైపుచూశాడు.

    గొంతు సవరించుకున్నాడు-

    "No University can train a man for a situation that is compleetely unknlwn, but, it can prepare a man to face challenges with coursge, confidence and competence. అది నేనిప్పుడు రుజువు చేయబోతున్నాను. The degree is not end in itself but only the beginn-ing of a continuous learning process. నేనిప్పటివరకు చదువుకున్నాను. దాన్ని ఆధారం చేసుకుని ఏమీ నేర్చుకోలేదు. No one need feel powerless if we make a habit of grwoing through continuous- నా కళ్ళు బాగా తెరిపించావ్... ఇప్పుడు చూపిస్తాను నా తెలివితేటలు ఏమిటన్నది-!

    ఎలాంటి అద్భుతాన్ని నేను సృష్టించగలనన్నది...

    మరో విషయం...

    త్రినాధ్ తెలివితేటలకు, శక్తి సామర్ధ్యాలకు నీవు ఎడ్మైర్ అయినా ఓడి అతని కాళ్ళ దగ్గర పరాభవింపబడతావేగాని అతని హృదయేశ్వరివి కాలేవు. కారణం ఇప్పటికే అతని హృదయ సామ్రాజ్యంపై మరో స్త్రీ తనను తాను ప్రతిష్టించుకొనేందుకు వేగిరపడుతోంది.

    నాలాంటి మేధస్సున్నవాడ్ని త్రినాధ్ లాంటి తెలివి కలవాడైతే సక్రమ మార్గంలోనే ఉపయోగించుకుని సరికొత్త పారిశ్రామిక సౌధాలు నిర్మించుకొనేవాడు.

    పొగరు... జెలసీ... ఉక్రోషం... ఉన్మాదం... ఉన్మత్తత వున్న నీవు నన్ను వెధవ పనులకుపయోగించుకొక మరెలా ఉపయోగించుకోగలవు?

    ఇప్పుడే... ఈ క్షణమే త్రినాధ్ పారిశ్రామిక ప్రపంచపు సరిహద్దుల వైపుకు చొచ్చుకుపోతాను. అతనంగీకరిస్తే అద్భుతాలు సృష్టించి అందలం ఎక్కిస్తాను. గుడ్ బై... గుడ్ బై ఫరెవర్... మైడియర్ టీచర్- గుడ్ బై..." అని ఆవేశంగా బయటకు దూసుకుపోయాడు సైంటిస్ట్.

    ప్రియాంక అతని సత్వర నిర్ణయానికి, ఆవేశానికి నిశ్చేష్టయి పోయింది.  


                  *    *    *    *


    సుదర్శన్ రావును తొలిదెబ్బకొట్టే అవకాశం హార్బర్ టెండర్ ద్వారా వచ్చిందనుకుంటే.... ముందు నిలిచేవాడు దొరకక అది చేజారిపోతుందేమోనన్న నిరాశలో పడ్డాడు త్రినాధ్.


                                        *    *    *    *


    కాలగర్భం మరికొన్ని నెలల్ని కాటేసింది.

    హెచ్.వి. ల్యూబ్ ఫ్యాక్టరీ ఒకటి నుంచి నాలుగు మెషిన్స్ కి విస్తరించబడింది.

    బోస్, హిందూల శ్రమతో ఉత్పత్తి పదిరెట్లు పెరిగింది. త్రినాధ్ ఇనీషియేషన్ తో గుప్తా ఇతర రాష్ట్రాల రవాణా శాఖలకు వెళ్ళి పర్చేజ్ ఆర్డర్స్ సంపాదించుకు వచ్చాడు.

    త్రినాధ్ పట్టుదలగా కలకత్తా వెళ్ళి తాజ్ మహల్ టీ ప్రోడక్ట్ కి డీలర్ గా అపాయింట్ అయి వచ్చాడు.

    ఇంజనీర్ మషాల దినుసుల కంపెనీని ఓ స్థితికి తీసుకువచ్చాడు.

    ఒక వ్యాపారం ప్రారంభించటం- దాన్ని అభివృద్ధి చేయడం వరకే కష్టం కాని... ఆ తరువాత ఆ ఒక్క వ్యాపారం మహావృక్షంలా విస్తరించుకు పోవటం సులభం అని త్రినాధ్ పట్టుదలతో రుజువు చేశాడు.

    స్కైప్యాక్ సర్వీస్ దేశంలో 25 ప్రధాన నగరాలలో ప్రారంభించబడింది.

    వసుంధరా ఇండస్ట్రీస్ సెంట్రల్ ఆఫీస్ ఇప్పుడు నగరపు ప్రధాన కూడలిలోకి వచ్చింది.

    ఇప్పుడు బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు త్రినాధ్ కి పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహపడుతున్నాయి. 

    షేర్స్ వ్యాపారం చేసే పెట్టుబడిదారులు వసుంధరా కంపెనీని బ్లూ చీఫ్ కంపెనీ క్రింద భావిస్తున్నారు.

    ఇవన్నీ ఇలా వుండగా త్రినాధ్, గుప్తా సింగపూర్ ట్రిప్ తర్వాత జపాన్ వెళ్ళటం జరిగింది.

    ఇక్కడ అనుకోకుండా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.

    హోండా అటోమొబైల్ ఫ్యాక్టరీకి వెళ్లడం తటస్థించింది. వాళ్ళిద్దరూ విజిటర్స్ లాగే లోపలకు వెళ్ళారు.

    హోండా ట్రాఫిక్ ఎడ్యుకేషన్ సెంటర్ కి దగ్గర్లో వున్న కేంటిన్ లోకి వెళ్ళి కూర్చున్నారు గుప్తా, త్రినాధ్.

    ఆ కేంటిన్ మరోప్రక్క కంపెనీలో తయారయిన మోటర్ బైక్స్, కార్లు పరీక్షించే టెస్టింగ్ గ్రౌండ్ వుంది.

    త్రినాధ్, గుప్తా కూర్చున్న టేబుల్ కి ఎదురుగా వృద్దుడొకడున్నాడు. అతను వీళ్ళనే పరీక్షగా చూస్తున్నాడు కాని త్రినాధ్ టెస్టింగ్ గ్రౌండ్ వేపు చూస్తుండగానే సర్వర్ ఏదో ఫుడ్ తీసుకొచ్చి వారి ముందు పెట్టాడు. త్రినాధ్ ఆ సూప్ ని కొద్దిగా చప్పరించి, వెంటనే సర్వర్ ని పిలిచి ఇంగ్లీషులో ఇందులో ఉప్పు, కారం ఎక్కువయిందని కంప్లైంట్ చేసి మరో కప్పు సూప్ వాటిని తగ్గించి తీసుకురమ్మన్నాడు.

    అదంతా విన్న వృద్ధుడు ఆసక్తిగా వాళ్ళ దగ్గరకు వచ్చి, "మీరు ఇండియన్స్ కదా?" అడిగాడు ఇంగ్లీషులోనే.

    "అవును" అన్నాడు త్రినాధ్.

    "ఇండియన్స్ ఉప్పు, కారం ఎక్కువ తీసుకుంటారు గదా? అందునా మీరు సౌత్ ఇండియన్స్ లాగా కనిపిస్తున్నారు?" అని ఆ వృద్ధుడు ఆశ్చర్యం వెలిబుచ్చాడు.

    గుప్తా వారి సంభాషణని మౌనంగా వింటున్నాడు.

    "నిజమే... కానందుకే మావాళ్ళు కొద్దిపాటి పని చేసేసరికి అలసిపోతారు. పైగా ఆవేశం ఎక్కువ. షార్ట్ టెంపర్. ఇవన్నీ ఆ రెంటి మూలంగానే అని శాస్త్రవేత్తలు ఎప్పుడో తెలియజేశారు. అయినా జిహ్వ- జిహ్వ చాపల్యం- మూలంగా కారం, ఉప్పు, మషాల వాడి ఉద్రేకపడి పోతుంటారు" అన్నాడు త్రినాధ్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra