Previous Page Next Page 
మొగలిబాకు పేజి 13

   

     ఆ పక్కనే ఉన్న కొంతమంది కుర్రాళ్ళు ఆ మాటలు విని అప్పటికప్పుడు సిగరెట్ నాలికలమీద స్లోగన్ లు తయారుచేసేసి ఒక్కమ్మడిగా నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు.
   
    "వి.సీ ఆత్మ అమర్ రహే.....వి.సీ.....ఆత్మ....అమర్ రహే" ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి.
   
    "వి.సీ. భార్యను....."
   
    "అరెస్ట్ చెయ్యాలి....."
   
    "స్త్రీ జాతికి కళంకం తెచ్చిన వి.సీ భార్యను....."
   
    "ఘోర నరహంతకి......వి.సీ.....భార్యను....."
   
    "విద్యా వ్యవస్థకు మచ్చ తెచ్చిన వి.సి. భార్యను"
   
    "అరెస్టు చేయాలి....."
   
    "వెంటనే అరెస్ట్ చేయాలి....."
   
    "తక్షణం అరెస్ట్ చేయాలి......"
   
    నారాయణరావు సిటీ బస్సు దిగి, అక్కడకొచ్చేసరికి ఎదురయిన పరిస్థితి అది.
   
    వి.సీ. భార్యను నారాయణరావు రెండు మూడు సార్లు సభల్లో చూశాడు.
   
    పోలియో కారణంగా ఆవిడ కుడిచెయ్యి చచ్చుబడిపోయింది.
   
    ఒక్క పక్క గొంతు చించుకుని నినాదాలిస్తూనే ఇంకోపక్క తీవ్రంగా యోచింపడం ప్రారంభించాడు.
   
    అంటే వి.సీ భార్య, వి.సీని గంట తీసుకుని ఎడం చేత్తో ఒక్క టిచ్చుకుందన్నమాట.
   
    అంటే......
   
    కుడిచేతికి పోలియో వచ్చినా ఎడం చెయ్యిని మాత్రం కొట్టడానికి, హత్య చేయడానికి ఉపయోగించిందన్నమాట.
   
    అయినా వీ.సీ. భార్య చేసింది తప్పే.....ఆ తప్పును వి.సీ అభిమానిగా, యూనివర్శిటీ స్టూడెంట్ గా క్షమించజాలడు. జాలడుగాక......జాలడు.
   
    ఆ కఠినాతి కఠినమైన నిర్ణయానికొచ్చిన నారాయణరావు త్వరత్వరగా ముందుకు చొచ్చుకుపోతూ-
   
    జైకొట్టు తెలుగోడా టైపులో భీరవడం ప్రారంభించాడు-
   
    "ఘోర మర్డరర్.....వి.సీ.....వైఫ్ ని"
   
    "అరెస్టు చేయాలి....."
   
    "అరెస్టు చేయాలి......"
   
    ఎటుచూస్తే, అటు చెలరేగుతున్న నినాదాల పరంపర......
   
    సడన్ గా ఒక్కసారి పోలీసు వ్యానులు ఆగడం, అందులోంచి చీమల దండులా దిగిన పోలీసులు-
   
    విద్యార్ధుల్ని చెదరగొట్టడం-
   
    సరిగ్గా అప్పుడే-
   
    యూనివర్శిటీకి చెందిన ఓ జీప్ కె.జి.హెచ్. మెయిన్ గేట్ ముందు ఆగడం, అందులోంచి వైస్ చాన్సలర్, ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ భార్య దిగడంతో -
   
    విద్యార్ధిలోకం అంతా చప్పున చల్లారిపోయిన సముద్రంలా అయిపోయింది.
   
    "ఒరేయ్......వైస్ ఛాన్సలర్ బతికొచ్చేసాడ్రోయ్" ఎవరో గట్టిగా అరిచారు.
   
    విద్యార్దులందరూ ఒక్కుమ్మడిగా ముందుకి తోసుకొచ్చారు___దాంతో పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చింది.
   
    ఈ లోపల అక్కడున్న సబ్ ఇన్ స్పెక్టర్ ద్వారా జరిగినదంతా విని మొదట ఆశ్చర్యపోయి-
   
    చటుక్కున పోలీస్ ఇన్ స్పెక్టర్ చేతిలో ఉన్న మెగాఫోన్ అందుకొని - ఉపన్యాసం ప్రారంభించాడు.
   
    "డియర్ స్టూడెంట్స్.....యూనివర్సిటీ చరిత్రలో ఈ రోజు కడువిషాద దినం...."
   
    ఆ మాటకు ఎక్కడ్నించో పోలికేక వినబడింది.
   
    "అవును......నువ్వు చచ్చి బతికొచ్చావు గదా....." ఆ మాటకు వి.సి. ముఖం చిన్నబోయింది.
   
    "ఇక్కడ మీరు ఇంట్లోలా చిన్నబోతే ఎలాగండీ.....అసలేం జరిగిందో, ఎక్కువమంది విద్యార్ధులకు తెలిసినట్లు లేదు.....ఎలాగూ మీరు నడిపే రాజకీయాలు ఎవరికీ అర్ధం కావు..... ఈ జరిగిన సంఘటనైనా విద్యార్దులందరికీ వివరంగా చెప్పండి"
   
    మిసెస్ వి.సీ అరచి చెప్పడంతో వి.సీ గారికి అసలు విషయం అర్ధం కావడంతో-
   
    "అలాగేలేవే..... అసలు..... వి.సీ వి నువ్వా, నేనా....." అని గట్టిగా కసురుకొని-
   
    "మైడియర్ స్టూడెంట్స్..... నిజంగా ఈ రోజు కడు విషాదదినం. ఎందుకో మీకు తెలుసు..... మన డేవిడ్.... మన దివ్య ప్రేమించుకొంటున్నారనే విషయం నాకు ఆలస్యంగా తెల్సింది. వారి పెళ్ళి విషయమై వాళ్ళిళ్ళల్లో ఇష్టం లేకపోవడం కడు విషాదం......"
   
    "నీ కడు విషాదం ఆపవయ్యా బాబూ.... అసలు జరిగిందేంటో చెప్పు" ఒక ముసలాయన టెన్షన్ తట్టుకోలేక అడిగాడు.
   
    "మీకు తెలీదా..... ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న దివ్యభారతి అనే దివ్య, సెకండియర్ వెలగబెడుతున్న జాన్ డేవిడ్ అనే దావీదూ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారండి...... ఏదో లవ్వాడుకున్నారని పెద్దవాళ్ళు వదలీయొచ్చుగదా.....ఆ పిల్ల నాన్న, ఈ పిల్లడూ డాడీ ఇద్దరూ ససేమిరా మీ పెళ్ళికి మేం ఒప్పుకోమని భీష్మించుకు కూచున్నారు__ తల్లులు అలాంటిది ఈ ఇంటా వంటా జరిగితే చస్తామని ఆల్టిమేటమ్ ఇచ్చార్ట...... మాది పవిత్రమయిన ప్రేమా.... మా ప్రేమను అడ్డుకునే శక్తి ప్రపంచంలో ఏదీ లేదని ఈ ఇద్దరు పిల్లలూ..... నిన్న రాత్రి తీరుబడిగా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి పురుగుల మందు తాగేసేరు-అదండీ.... స్టోరీ...." అక్కడే ఉన్న ఆ పిల్ల పక్కింటాయన చెప్పాడు.
   
    "మైడియర్ ఆంధ్రా యూనివర్శిటీ స్టూడెంట్స్.....రియల్ లవ్ కి చావొక్కటే పరిష్కార మార్గం కాదు.....వాళ్ళిద్దరూ ధైర్యంగా నా దగ్గరకొచ్చినా నా ఆధ్వర్యంలో నేను పెళ్ళి చేసేవాడ్ని....."
   
    "కొయ్...... కొయ్..... వాళ్ళిద్దరూ..... నీ దగ్గరకొస్తే, నువ్వు వాళ్ళని తిట్టి పంపించావ్...... అవునా.... కాదా...." ఒక కుర్రాడు - ఆ కుర్రాడు డేవిడ్ రూమ్ మేటు- వాడి పేరు భూతలింగం- ముందుకొచ్చి గట్టిగా అరిచాడు.
   
    "మైడియర్ స్టూడెంట్స్..... మిమ్మల్నెవరో తప్పు దారి పట్టిస్తున్నారు.....వాళ్ళిద్దరూ నా దగ్గరకు రాలేదు. వస్తే వాళ్ళకి నేను తగిన న్యాయం చేసేవాడిని. చూడండీ...... నేను కులాంతర, మతాంతర వివాహం నలభై ఏళ్ళ క్రితం చేసుకున్నవాడిని. మీరు నా మీద తిరగబడడం అన్యాయం..... మీరు..... ఇప్పటికీ కులాల్నీ, మతాల్ని పట్టుకొని పట్టింపుల్తో పిల్లల ప్రాణాలను తీస్తున్న చాందసుల మీద తిరగబడండి..... నేను మీ ముందుంటాను.....ప్రస్తుతం...... ఇపుడే డాక్టర్లు మన డేవిడ్, దివ్యల శవాల్ని మనకు అప్పగించారు__ ఈ ఊరేగింపుని ప్రశాంతంగా నిర్వహించమని, వారిద్దరి ఆత్మకు శాంతి కలుగజేయమనీ కోరుతున్నాను" మెగా ఫోన్ ని ఇన్ స్పెక్టర్ కిచ్చేసి కారులో కూర్చుండి పోయాడు వి.సీ.
   
    ఆస్పత్రిలోంచి శవాలు రావడంతో వాతావరణం విషాదకరంగా మారిపోయింది. కె.జి.హెచ్. నుంచి చావుల మఠం వరకూ ఊరేగింపు ఆ తర్వాత శవ దహనం- వేలాది మంది స్టూడెంట్స్ మధ్య జరిగిపోయింది.
   
                                               *    *    *    *
   
    సాయంత్రం నాలుగున్నర దాటింది.

 Previous Page Next Page