8
"................
కృష్ణవల్ల నీవేం భయపడవద్దు. కృష్ణవల్ల ఏ చిన్న రిస్క్ ఏర్పడ్డా మేము చూచుకుంటాము. మీ వాళ్లకు లెటర్ రాయి, అందజేస్తాను. ఇంకెన్ని రోజులని అందోళన పడవద్దు. నీవు ఇక్కడ క్షేమంగా ఉన్నావు. మీ వాళ్ళు ఆచ్చట క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మా పని పూర్తి చేసుకొవాలని తీవ్ర ప్రయత్నంలో వున్నాము. తెలివిగా మసులుకో. లేకపోతే వేరే చెప్పే పనేముంది. మీ నాన్న రాసిన లెటర్ దీనితో జతచేస్తున్నాను.
భగవాన్."
నాన్నగారు లెటర్ రాశారుట. వీడు ఎంత శ్రద్ధగా అందజేస్తున్నాడో? దొంగ వెధవ. పేరు భగవాన్, చేసే తప్పుడు పనులు. ఈ ఇంట్లో అడుగుపెట్టి నెలకావస్తున్నది. ఆమ్మ నాన్నగార్లు ఎలా వున్నారో? నా గురించి ఏమనుకుంటున్నారో? తెలివిగా ఈ చెరలోంచి విముక్తి పొందుదామని నే రాసిన లెటర్ ఎవరికి అందివ్వాలో అర్ధంకాలేదు అలాగే వుండిపోయింది. పోనీ కృష్ణ తెలివి కలవాడిగా అవుపిస్తున్నాడు ఇతనికి అందిద్దామంటే, ఆవేశంతో అప్పటికప్పుడు ఎగిరిపడే రకం. లాభంలేదు. ఈ ఇంట్లో సగం మంది తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేవాళ్ళే. ఏం చేయాలి? ఎలా బైటపడాలి?
_ తీవ్రంగా ఆలోచిస్తున్నది అమల.
కృష్ణ పిల్లిలా చప్పుడు చేయకుండా అమల గదిలోకి వచ్చి తలుపులు లోపల గడియవేశాడు. అమల ఎదుటికొచ్చి నుంచున్నాడు.
"రోజా!" కృష్ణ పిలిచాడు తగ్గుస్వరంతో.
అమల ఉలిక్కిపడి "ఊ" అంది.
కృష్ణ నవ్వాడు. నిప్పులు కక్కుతూ అమల కళ్ళలోకి చూచి నవ్వాడు.
అమల రవంత భయంతో కృష్ణవైపు చూచి నలువైపులా చూచింది. తలుపులు లోపల గడియ పెట్టినట్లు, కావాలనే కృష్ణ తనవద్దకు వచ్చినట్లు గ్రహించింది. ఓ అడుగు వెనక్కు వేసింది. శంకరంలా పిచ్చిపని చేయటానికి కృష్ణ రాలేదు కదా?
"ఎవరు నువ్వు?" అమలవైపు తీవ్రంగా చూస్తూ అడిగాడు కృష్ణ.
అమల మౌనం వహించింది. గుండె టకటక కొట్టుకుంది. పిచ్చిగా కృష్ణవైపు చూసింది.
"నిన్నే అడిగేది? సరోజ ఏమయింది? నీ పేరేమిటి?"
"ప్రభా, హరహర ప్రభా!" అంది తెలివి తెచ్చుకున్న అమల.
"నోరు ముయ్యి. ప్రభట ప్రభ...... నేను ఇక్కడికొచ్చిన మూడోరోజునే గ్రహించాను, నీవు రోజావి కావని. పరీక్ష చేయటంతో నీ బ్రెయిన్ నిక్షేపంగా వుందని, నీకెలాంటి పిచ్చి లేదని తెలిసిపోయింది. మామయ్యకి చెపితే మళ్ళి హార్టెటాక్ వస్తుందో అని నోరు మెదపలేదు. రోజాకి తగ్గిపోతుందని అబద్ధం ఆడాను. ఎవరు నువ్వు? ఎందుకు రోజాస్థానంలో ఉండి నాటకం ఆడుతున్నావు?"
అమల మాట్లాడలేదు.
కృష్ణ చెయ్యి ఎత్తి చళ్ళున అమల చంపపై కొట్టాడు బలమంతా ఉపయోగించి.
అమలకి ప్రాణంపోయి తిరిగొచ్చింది. కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. "అబ్బా" అంది. చెంప చేత్తో తడుముకుంటూ.
"అబ్బా కాదు. నాలుగు వడ్డించానంటే నీ అబ్బ ఏ లోకంలో వున్నా తిరిగి వస్తాడు. చెప్పు, ఎవరు నువ్వు?"
'నేను సరోజనే. మీరు పోరపడుతున్నారంతే, ఓహో! నీకు పిచ్చి ఉందీ, లేనిదీ యీమాటే చాలు తెలిసిపోతున్నది, అంటాడు. సరోజను కాదంటే, కధంతా చెప్పాలి. ఆస్తికోసం తెగించిన భగవాన్ అరక్షణంలో ప్రాణం తీస్తాడు. వాడికి వేయికళ్ళు, పదహారువందల చెవులు వున్నాయి. ప్రస్తుతానికి మౌనం వహించటమే శ్రేయస్కరం.'