ఆ మధ్యాహ్నం, సాయంత్రము కూడా గడిచాక సత్యమూర్తి ఆ ఇంట్లోని పరిస్తితులూ కొంతవరకూ అర్ధం చేసుకున్నాడు. తండ్రికి సీరియస్ గా వుందని యింతవరకూ ఎల్లమల్లిలోని వాళ్ళెవరికీ వర్తమానము పంపబడలేదు. రాధమ్మగారితమ్ముడు వీరభద్రం ఒకడే యింటివ్యవహారాలన్ని చూస్తున్నాడు. విజయకి కూడా యీ విషయము ఇంతవరకూ తెలియ చెయ్యబడలేదు.
"ఏమండీ? చిన్నతనంచేత దుస్సాహసం చేసినా, అది మన కన్న కూతురు ఎక్కడ ఏమి యిబ్బందులు పడుతుందో దాన్ని మనము క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? భద్రంతో చెప్పి దాన్ని ఇక్కడకు రప్పించడానికి ప్రయత్నం చెయ్యనా?" అదింట రాధమ్మగారు.
బలరామయ్యగారు అంత నీరసస్థితిలోనూ ఆవేశముతో అరుస్తూ "వీల్లేదు అది యీ ఇంటి గుమ్మంతొక్కటానికివీల్లేదు. నామాట కాదని ధిక్కరించి అది కులగోత్రాలు లేని ఒక దగుల్భాజీతో లేచిపోయింది. నేను దాని మొహం చూడను" అన్నారట.
"కోపంతో అలా అంటారుగాని అంతరములో మీకు మాత్రం అదంటే ప్రేమలేదండీ?" అందిట రాధమ్మగారు.
"లేదు ఆ ప్రేమ ఎప్పుడో వొదిలేశాను" అన్నారట ఆయన. చేసేదిలేక రాధమ్మగారు తనలో తను ఏడ్చుకుని వూరుకుంది.
డాక్టరు వచ్చి తరచు చూసివెళ్తున్నాడు. సత్యమూర్తి ఆయన్ని కలిసి పరిస్థితి ఏమిటని చాటుగా అడిగాడు.
"వృద్దాప్యం. పెరాల్సిస్ స్ట్రోక్, చూద్దాం" అని ఆయన తటస్థంగా చెప్పి వెళ్ళిపోయాడు.
సత్యమూర్తి తన గదిలో నిలబడి కిటికీలోంచి బయటికి చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఏకాంతముగా వుండటం తనకి అలవాటే అయినా సమాధిలాంటి యీ యిల్లు...ఎందుకో విపరీత భయాన్ని కలిగిస్తూ వుంటుంది. ఎవరిదో నీడ వెన్నాడు తున్నట్లుగా వుంటుంది.
బయటంతా చీకటిగా వుంది. ఎందుచేతనో స్ట్రీట్ లైట్ల కాకుండా మందంగా వుంది. తమది ఆ సందులో మొదటి మేడ. ప్రక్కనే విశాలమైన ఖాళీ స్థలం వుంది. ఆ స్థలం యజమాని దూరప్రాంతములో ఎక్కడో వుండటం చేత అందులో ఏమీ కట్టించకుండా పనీ పాటలు చేసుకునే కొంతమంది పాకలు వేసుకొని ఉండటానికి అనుమతి యిచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా అద్దెకూడా తీసుకొంటున్నాడు. ఇప్పుడా స్థలంలో పాలమ్ముకునే వాళ్ళు యింకా ఇతర వృత్తులు చేసుకునే బీదసాదలు కొందరు వుంటున్నారు.
తనలాగే నిలబడి చూస్తుండగా కారు ఒకటి మలుపు తిరిగి గేటు ముందు ఆగింది. సత్యమూర్తి చూసి డాక్టరుగారి కారేమో అనుకున్నాడు. కాని కాదు, అందులో నుండి తలుపు తెరచుకొని ఓ నడివయసు దాటిన మనిషి, ఓ యువతి దిగారు.
వెలుగూ, చీకటి మిశ్రితంగా వున్న ఆ ప్రదేశంలో కూడా సత్యమూర్తి వాళ్ళిద్దర్నీ వేణు వెంటనే గుర్తుపట్టాడు. ఆయన సత్యానందం గారు, ఆయనతో వున్నది ఆయన కుమార్తె సుధ.
ఇద్దరూ మెట్లు ఎక్కి పైకి వచ్చేలోగా సత్యమూర్తి గదినుండి బయటికి వచ్చి వాళ్ళ కెదురుగా వెళ్ళాడు.
సత్యానందంగారు అతన్ని చూసి వికసించిన ముఖంతో "మీరు వచ్చారని ఇందాకనే తెలిసింది ఆ వెంటనే బయల్దేరాను. అమ్మాయి కూడా నాతో సిద్దమయింది" అని ఓరగంట ఓసారి కూతురు వంకచూసి "పరీక్షలు బాగా రాశారా?" అని అడిగాడు.
"బాగానే రాశాను" అని ఆయనకు సమాధానము చెప్పి అతను అప్రయత్నంగా సుధవైపు చూశాడు. ఆమె సిగ్గుపడుతూ సంకోచంగా తండ్రి వెనక నిలబడివుంది.
"ఎందుకమ్మా సిగ్గుపడతావు? బలరామయ్యగారితో నీకు బాగా పరిచయం వుంది. ఈయన్ని చాలాసార్లు చూసివుంటావుగాని కలుసుకోవడం యిదే ప్రధమం..." అని సత్యమూర్తి వైపు తిరిగి "దాని పేరు వగైరాలన్నీ తెలిసే వుంటాయి. యింటర్ పరీక్షకు ఎపియరైంది" అన్నాడు.
"నమస్తే" అన్నాడు సత్యమూర్తి నమ్రతాభావంతో.
ఆమెకూడా చేతులు జోడించి వినయంగా నమస్కారం చేసింది.
"ఆఁ నాన్నగారికెలా వుంది...? మెలకువగా వున్నారా యిప్పుడు?" అని అడిగాడు సత్యానందంగారు ఆదుర్దాకన్పరుస్తూ.
"ఏమీ నిమ్మదించలేదు. కొంచెంకూడా స్వస్థతగా లేరు. అమ్మకూడా అక్కడే వుంది. వెళ్ళి చూచిరండి."
ఆయన కూతురువంక తిరిగి "రామ్మా, బలరామయ్య గారిని చూసి వద్దాం" అన్నాడు ఆప్యాయంగా.
ఆమె ముఖం భయాన్ని సూచిస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవటం ఆమెకి అలవాటులేదనీ తడబడుతోందనీ ఆమెని ఆ క్షణంలో ఎవరు చూసినా యిట్టే తెలిసిపోతుంది. "నే...ను...నే...ను" అన్నది వినీ వినిపించని కంఠంతో.
ఆమె అవస్థ గ్రహించినట్లు తండ్రి చిరునవ్వునవ్వి "పోనీ-అక్కడకు వచ్చి ఆ వాతావరణం తట్టుకునే మనస్థయిర్యం లేకపోతే యిక్కడే వుండి యీయన్తో మాట్లాడుతూ వుండు. నేను ఓ పదినిమిషాల్లో తిరిగి వస్తాను." అని ఆమెవంక అనునయంగా చూసి వెళ్ళిపోయాడు.