అన్విత కాసేపు ఆలోచించి "నేను జోక్ గా అనటం లేదు మిస్టర్ మిత్రా! మీ ప్రేమ నిరూపించుకోవటానికి ప్రాణత్యాగం చేయమని చెప్పట్లేదు. ఒకప్రాణం తియ్యమంటున్నా. మీరేమంటారే?" స్నేహితురాళ్ళని ప్రశ్నించింది!
మంచి సీరియస్ జోక్ లా ఉన్న ప్రపోజల్ మిగతా అందరికీ నచ్చింది.
సరేనన్నారు.
ఒక నిర్ణయానికి వచ్చినవాడినా "ఎవర్ని హత్య చెయ్యాలి?" గంభీరంగా అడిగాడు మిత్రా.
అన్విత అప్పుడే అటువైపు అటువైపు ఐస్ క్రీమ్ షాప్ ముందునించి వెళుతున్న ఓ రైన్ కోటు వ్యక్తిని చూపిస్తూ,
"మీరు ఓకే అనుకుంటే గనుక, ఆ వెళ్తున్న రైన్ కోటు వ్యక్తిని హత్య చేయాలి."
అందరు ఒక్కసారిగా రోడ్డువైపుకి చూశారు. ఒక రైన్ కోటు వ్యక్తి షాప్ ముందు నించి వెళుతున్నాడు. అతను దేనికోసమో అన్నట్లుగా ఒక రెండు నిముషాలు ఆగాడక్కడ.
"అతన్ని హత్య చేయాలా....? అతనేం ద్రోహం చేశాడని....? అయినా అతనెవరో కూడా తెలియదు....?"
అతను 'హత్య' అంటున్నప్పుడు ఎందుకో తెలియకుండానే కాస్త గొంతు వణకడాన్ని గమనించింది అన్విత, ఆమెకు అతన్ని ఏడిపించాలనిపించింది.
"యస్..... మీరీ హత్య చెయ్యాలి..... చూశారా.....! హత్య అనేసరికి ఎలా కంగారు పడుతున్నారో..... ఒకమ్మాయిని ప్రేమించడం మీరనుకున్నంత సులభం కాదు" అతన్ని సూటిగా చూస్తూ ప్రశ్నించింది.
ఆమెకు ఆ క్షణంలో తెలియదు అతను ఎంత సీరియస్ గా ఈ విషయం తీసుకున్నాడు అన్నది.
"మీరు కూడా ఇలా అంటే నేనేం సమాధానం చెప్పలేను. కాని ఒకటి మాత్రం నిజం, మీరీ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అంటే మాత్రం నేను కూడా నిజంగానే ప్రయత్నిస్తాను, కాదు చేసి చూపిస్తా" అప్రయత్నంగానే కుర్చీలోంచి లేచాడు.
"మేము అడిగేది అదే.... యు హావ్ టు ప్రూవ్ యువర్ లవ్, ఫర్ దట్ యు కిల్ ఎ మాన్ దట్సాల్" చెప్పింది సుజిత.
"యు స్టిల్ సే, దిస్ ఈజ్ ది ఓన్లీ వే టు ప్రూవ్ మై ట్రూ లవ్" స్థిరంగా పలికిందతని కంఠం.
"యస్, మీరీ విషయంలో సక్సెస్ ఐనా కాకపోయినా మీరు ఒప్పుకోవడం మాకానందాన్ని కలిగించింది.... విష్ యు ఆల్ ద బెస్ట్" అని సుజిత చెప్పగా మిగతా వాళ్ళంతా క్లాప్స్ కొట్టారు.
"ఇంతకీ మరో కండీషన్. మీరు ఎవరిదో శవాన్ని చూపించి ఏవో జిమిక్స్ చేస్తే కుదరదు, మేము చూపించిన వ్యక్తినే హత్య చేయాలి. అదీ. వారం రోజుల్లో! వాట్ డు యు సే....? ప్రశ్నించింది అన్విత.
"మీరు ఆవ్యక్తినే అని మీరెలా గుర్తిస్తారు....?" అతను ప్రశ్నించాడు.
అతని మొహం మీద స్పోటకం మచ్చలున్నాయ్.
"అది చాలు గుర్తుంచుకోవటానికి....." కాస్త గంభీరంగా అంది సుజిత.
"ధాంక్యూ అన్విత! మీరు పెట్టిన పరీక్షలో లాజిక్ కూడా వుంది. ఒకవేళ మీకోసం ఈ హత్య చేస్తే న్యాయపరంగా నేను జైలుకి వెళతాను. నేను ఫెయిలయితే ఓడిపోతాను.
ఎనీవే నేను సక్సెస్ అవుతాననే అనుకుంటున్నాను అని ఆవేశంగా ముందుకి వెళ్ళి ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి ఒకే మీకు మళ్ళీ కనబడటం అన్నది జరిగితే నేను సక్సెస్ ఐన తర్వాత.... బై" అని చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు.
అక్కడున్న వ్యక్తులలో ఒకరు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారన్న విషయం మిగిలిన వాళ్లకి తెలియదు.
* * *
తెల్లటి అంబాసిడర్ ఒకటి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బంజారాహిల్స్ వైపుగా దూసుకుపోతుంది.
కారులో వున్న ఇద్దరు పెద్దగా ఏం మాట్లాడుకోలేదు.
అందులో ఒకరు అలెక్స్, రెండవ వ్యక్తి ముజ్మిల్.
అతని పేరే కాదు, అపియరేన్స్ కూడా ప్రత్యేకంగానే వుంటుంది.
కాళ్ళకున్న షూ నుంచి తలకు పెట్టుకునే హాట్ వరకు తెల్లవే వేసుకున్నాడు. మనిషి కాస్త సన్నగా తెల్లగా వుంటాడు.
సరదాగా నవ్వుతూ నవ్విస్తూ వుండే అతన్ని చూసిన వాళ్ళెవరూ అతనో ప్రొఫెషనల్ కిల్లర్ గా భావించరు.
చీకటి ప్రపంచానికి అతను సుపరిచితుడు.
త్రివేది నుంచి వచ్చే మనుషులని రిసీవ్ చేసుకుని ఆతిథ్యం ఇవ్వటం అతని అలవాటు. త్రివేదితో వున్న సంబంధం అలాంటిది.
అలెక్స్ బొంబాయి నుంచి రాగానే ముజ్మిల్ రిసీవ్ చేసుకున్నాడు. ముజ్మిల్ ని కలవగానే తానెందుకు వచ్చింది వివరించాడు అలెక్స్.
అతనికి ముందుగానే వివరాలన్నీ తెలుసని తల వూపడంతో పెద్దగా మాట్లాడే అవసరం లేకపోయింది అలెక్స్ కి.