Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 12

 

    సౌమ్య సిగ్గుతో గబగబ లోపలికి వచ్చేసినట్లు పదధ్వని.

 

    అదంతా విని, ఆనందంతో అక్కడనుంచి కదలబోయింది శారదమ్మ.

 

    ఆమె అడుగెయ్యక ముందే ఆపింది భ్రమరాంబిక. ఆమె మొహంలో మత్సరం కనబడుతోంది.

 

    "ఏమిటేమిటి? ఇదంతా మహా చిత్రంగా ఉందే! ఇంతకీ అతనేవరూ? ఏం చేస్తుంటాడు?" అంది ఆరాగా.

 

    సగర్వంగా అన్నది శారదమ్మ . 'ఏం చేస్తాడా? లక్షలతో వ్యాపారం!"

 

    ఆ మాటలు చెవిన పడగానే తక్షణం భ్రమరంబికలో మార్పు వచ్చింది. హడావుడిగా అంది "లక్షలతో వ్యాపారమే? నేననుకుంటూనే ఉన్నా, మా సౌమ్య మొహంలో లక్ష్మి కళ ఉట్టిపడుతూ ఉంటుందని! ఆలస్యం అయినా మంచి సంబంధమే - ఉండండి వదినా! కాఫీ పొడి లేదన్నాను కదూ! నా మతిమరుపు మండా! నెస్ కేఫ్ పొట్లాం ఇంకా విప్పలేదుగా! అది పెట్టుకెళ్ళండి. కాబోయే అల్లుడికి కాఫీ అన్నా ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? " అంది గబగబా.

 

    ఆమె చేష్టలు చూస్తే చులకనగా ఉంది శారదమ్మకు. కానీ ఈ సంతోష సమయంలో ఎవరిని ఏమి అనాలనిలేదు. తప్పు పట్టాలనిపించడం లేదు. సంతోషంతో తేలికైపోతోంది మనసు.

 

    నిమిషాల్లో కాఫీ కలిపి వసారాలోకి వచ్చింది శారదమ్మ. "చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరించాలయ్యా" అంది శశికాంత్ తో."

 

    "ఎందుకండి ఎలాగూ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు కదా అన్నాడు శశికాంత్ నవ్వుతూ.

 

    కాఫీ తాగి , కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడతను.

 

    మళ్ళీ శుక్రవారం వచ్చాడు శశికాంత్. మరుసటి శుక్రవారం నాడు మళ్ళీ వచ్చాడు. ఆరోజు నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు. అన్నీ చకచక జరిగిపోయాయి.

 

    తాంబూలాలు తీసుకున్న వెంటనే ఆ పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీకి సౌమ్యని మాత్రమే తీసుకెళ్ళాడు అతను.

 

    సౌమ్య అతనికి కాబోయే భార్యే గనక సుబ్రహ్మణ్యం గారూ, శారదమ్మ కూడా అభ్యంతర పెట్టలేకపోయారు.

 

    పార్టీలో హఠాత్తుగా ఈ ప్రకటన చేశాడు శశికాంత్.

 

    తరువాత ఈ తతంగం? ఈ తాళి!

 


                                                                          5

 

    ఆలోచనల్లో నుంచి బయటపడి చూసింది సౌమ్య.

 

    నవ్వుతూ ఎదురుగా నిలబడి ఉన్నాడు శశికాంత్.

 

    అతని తెల్లటి చిరునవ్వు విషం మీది నురగలా కనబడింది సౌమ్యకి. అతను అందమైన రాక్షసుడిలా తేనే పూసిన పదునైన కత్తిలాగా కనబడటం మొదలెట్టాడు ఆమెకి. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది.

 

    ఇంతలోనే ఎంత మోసపోయింది తను! ఎలా ఉబిలో దిగబడిపోయింది.

 

    ఇలాంటి మోసగాడితో జీవితం పంచుకోవడం కంటే జీవితాంతం అవివాహితగా ఉండిపోవడం మేలు! చాలా మేలు!

 

    ఇప్పుడు మాత్రం ఏమయింది? ఈ తాళి తీసి అతని మీదకు విసిరేసి విసవిసా వెళ్ళిపోవచ్చుగా తను?

 

    ఎవరు చూశారు ఇది! ఎవరు చూడవచ్చారు? ఎవరున్నారు దీనికి సాక్ష్యం? ఎవ్వరు లేరు!

 

    నేనున్నాను ! అన్నట్లు ఒక్కసారిగా భగ్గున మండింది నెగడు లోని అగ్ని.

 

    'నన్ను మర్చిపోకు! నేను ఉన్నాను. నేను చూశాను. నేను చేశాను మీ పెళ్ళి. అగ్నిసాక్షిగా అతను నీ మెడలో తాళి కట్టాడు తెలుసా! తాళి! నువ్వింక ఏమన్నా ఏమనుకున్నా అతను నీ భర్త. నువ్వతని భార్యవి. కాదన్నావో కాల్చేస్తాను జాగ్రత్త! భగభగ భగభగ.

 

    ఆ వేడికి నిలువెల్లా చెమట పట్టింది సౌమ్యకి. అవును!

 

    తన మెడలో తాళి కట్టాడు ఇతను.

 

    ఎగతాళి కాదు. నిజం తాళి!

 

    తాళి కట్టి తన భర్త అయిపోయాడు.

 

    తను అతని భార్య అయిపొయింది.

 

    జరగవలసింది జరిగిపోయింది.

 

    ఇంక జీవితాంతం ఈ బంధం నిర్భంధమే తనకి!

 

    ఇతను ఎలాంటివాడయినా ఇతనితో జీవితం పంచుకోక తప్పదు. తప్పదు!

 

    అప్పుడు ఆ విషయం గుర్తొచ్చింది సౌమ్యకి.

 

    "ఆ లాటరి టిక్కెట్టు ఎవరిదో తెలిసిందా?"

 

    నిర్లక్ష్యంగా నవ్వాడు శశికాంత్.

 

    "తెలియలేదు సౌమ్యా! ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇంక తెలియక పోవచ్చు కూడా!"

 

    ''ఎందుకని!" అంది సౌమ్య హీనస్వరంతో.

 

    "ఎందుకంటె నేను ఇంక ఆ ప్రయత్నం మానేశాను సౌమ్యా! నో యూజ్. పైగా ఇంకొకటి అనిపించింది నాకు."

 

    "ఏమిటి?"

 Previous Page Next Page