Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 12

    "హు.....ఇలా పరువుకోసం పాకులాడే నాలాంటి కన్నెతల్లులందరూ ఏ నుయ్యో గొయ్యో చుసుకోవడమో లేదా తమ బిడ్డని నూతిలో గోతిలో తోయ్యడమో, అది చేతనవకపోతే ఏ అనాధ శరణాలయాల పలుచెయ్యడమూ చేశారు ఇన్నాళ్లూ. నేను చేసిన తప్పుకి నా బిడ్డని శిక్షించను కష్టమో, నష్టమో ఆ శిక్ష నేనే అనుభవిస్తాను. ఈ తప్పులో సురేష్ కి భాగం వుంది కనక వాడ్ని తప్పించుకుని పోనియను ఆ శిక్ష వాడు పొందాలి. నాతో పాటు వాడి పరువు పోవాలి!
    స్రీ పురుషులిద్దరూ చేసిన తప్పుకి యుగయుగాలుగా స్రీ ఒక్కతే శిక్ష అనుభవిస్తోంది. కనీసం ఈ యుగంలో ఒక్క పురుషుడైనా స్రీతో పాటు శిక్షార్హుడని నిరూపించడానికే కోర్టు కేక్కదలిచాను లాయరుగారూ దానికి మీ సహాయం కావాలి. నా పరువు పోనిండి. నన్ను చూసి అందరూ అసహ్యంచుకోనిండి. దీనివల్ల విషమ సమస్యలు తలెత్తనిండి. ఏ పరిణామాలన్నా ఎదుర్కోవడానికి సిద్దపడే వచ్చాను. నా తల్లితండ్రులు నన్ను తిడ్తారు. పరువు ప్రతిష్ట బజారు పాలు చేశానని దుఃఖించనీయండి. మొదట నన్ను తిట్టిన అందరూ కోర్టులో నా ధైర్యాన్ని అభినందించక మానరు. లాయరుగారూ!
    ఈనాటి నా నిర్ణయం నాలాంటి ఆడపిల్లలందరు మనో ధైర్యాన్నిచ్చి ముందడుగు వేయిస్తే, ఆ ప్రయత్నంలో నేనొక సమిధ నయినా నాకు సంతోషమే! ఈనాడు నే తీసిన యీ పునాది మీద నాలాంటి అమ్మాయిలందరూ తలో ఇటిక వేస్తె రేపు అది మహా భవనమై ఎంతమంది పురుషులు ఏకమైనా ఆ తాకిడికి కులిపోలేనంత పటిష్ట మవాలని నా కోరిక. ఇది పురుషులకోక గుణపాఠం అవాలని నా కోరిక. ఆడపిల్లల్ని ప్రేమించడానికి  తప్ప పెళ్ళాడగలిగే హృదయ వైశాల్యం లేని పిరికిపందలందరికి చేసిన తప్పు నుంచి తాము తప్పించుకు పారిపోతే, ఈనాటి అమ్మాయిలు తెలివితక్కువ వారు కాదు అన్న భయం కల్గించడానికి నా పరువు, నా కుటుంబం పరువు పణంగా పెట్టుతున్నాను లాయరుగారూ...." రూప ఆవేశంగా అంది.
    సుమతి విప్పరిత మొహంతో రూపవంక ప్రశంసాపూరకంగా చూస్తూ
    "బెష్ రూపా భేష్ ! నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. చిన్నదానివైనా ఇంత మనో నిబ్బరం నీకు కల్గినందుకు అభినందిస్తున్నాను. రూపా, నీకు....నీకు తప్పకుండా సహాయపడతానమ్మా. నా చేతనైనంతగా నీకు సహకరిస్తాను. ఈసారి నీకున్న ధైర్యంలో పదోవంతు నీలా ఒక్క ఆడపిల్లైనా తెగించి ధైర్యం చేయగలిగితే మన ఆడవాళ్ళ కధలు ఎప్పుడో మరేవేమో. పరువు ప్రతిష్ట ప్రలోభాలకి లోబడి ఇంతమంది ఇన్ని భ్రూణ హత్యలు చేసేవారు కాదేమో. మరెంతమంది అనాధ శిశువుల్ని తాయారు చేసేవారు కారేమో.
    ఒక్క పురిషుడికైనా చేసిన తప్పుకి నలుగురిలో నిలబెట్టి దోషిగా నిరూపిస్తే ఆడపిల్లల జీవితాలలో ఆడుకునే పురుషుల సంఖ్య తగ్గేదేమో. రూపా! చూద్దాం ఇద్దరం కల్సి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మనం చెయ్యగల్గింది చేద్దాం. ఐ విల్ బి విత్ యూ టిల్ ద ఎండ్
    రూప చెయ్యి అందుకుని ప్రామిస్ చేస్తున్నట్టు చేతిలో చెయ్యి వేసి ఆవేశంగా, ఉత్తేజితురాలైంది సుమతి.
    రూప మొహం విప్పారింది. "లాయర్ గారూ సారి మీరు నాకంటే పెద్దవారు నాకు తల్లిలాంటివారు. మిమ్మల్ని అంటి అని పిలుస్తాను. అస్తమాను లాయర్ గారూ అనడం ఏదోలా వుంది" రూప సందిగ్ధంగా అంది.
    "ష్యూర్! తప్పకుండా! అలాగే పిలవమ్మా. ఇంతలో నీవు ఈ పనికి నన్నే ఎందుకు ఎన్నుకున్నావు. నేను నీకు సహాయం చేస్తానని ఎలా అన్పించింది. నాతో పరిచయమన్నా లేదు గదా! సుమతి కుతూహలంగా అడిగింది.
    "అంటి! మిమ్మల్ని ఇదివరకు నాలుగైదు సార్లు చూశాను. కారులోంచి దిగుతుంటే, మీ ఇంటి ముందునించి వెడుతూ చాలాసార్లు చూశాం నేను మా ప్రెండ్స్ మీ అందం గురించి, మీ ఫిగర్, మీ హుందాని మెచ్చుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం.....చక్కగా మీరు పెళ్ళి చేసుకోకుండా, హాయిగా స్వతంత్రంగా ఫ్రీగా ఉండడం అది మాకు ఎంతో నచ్చింది. సురేష్ నన్ను మోసం చేసిన దగ్గర్నించి ఏదో చేసి కసిదిర్చుకోవాలని, వాడ్ని అంత సుళువుగా వదలకుడదని అనిపించి ఏం చెయ్యలా అని ఆలోచించాను ఇన్నాళ్ళు, ఆఖరికి ఈ పదిరోజులుగా పీరియడ్స్ ఆలస్యం అయ్యాక అనుమానం వచ్చాక, సురేష్ ని మళ్ళి కలుసుకున్నాను..."
    "సురేష్ ని మళ్ళి కలిశావా! ఇలా నీకు నెలతప్పినట్లు అతనికి తెలుసన్నామాట.
    ఏమన్నాడు?....."ఆతృతగా అడిగింది సుమతి.
    "హు .....ఏమంటాడు ఆంటీ ఆ సమయంలో ప్రతి మగాడు ఎలా మాట్లాడుతాడో అలాగే మాట్లాడి అవమానపరిచాడు. ఆరోజు మా ఇద్దరి మధ్య గొడవ జరిగాక అమ్మ నాన్న యింట్లో తిట్టి టైపు మానిపించేశారు. ఇల్లు వదలకుండా కట్టడి చేశారు. నాన్నగారయితే నాతో మాట్లాడడం మానేశారు. నన్ను చూసి మొహం చిట్లించి తల తిప్పుకునేవారు. అమ్మని పట్టుకుని సందు దొరికినప్పుడల్లా సాధించేవారు. అమ్మ నాతో ముభావంగా వుండడం ఆరంభించింది. ఇంట్లో అంతా నన్ను వేలేసినట్లు చూసేవారు.
    ఆ వాతావరణం ఆ పరిస్థితి, తప్పు చేశానన్న భావం అన్ని కల్సి నా పరిస్థితి మహా ఘోరంగా వుండేది. ఆ వాతావరణం నుంచి తప్పించుకుని పారిపోవాలనిపించేది. ఈ లోగా పీరియడ్స్ రాకపోవడంతో నా పరిస్థితి వుహించండి. అమ్మకింకా అనుమానం రాలేదనుకోండి. అయినా నా ఆరాటం వుహించండి. సురేష్ కి సంగతి చెపితే మనసు ఏమన్నా మార్చుకుని పెళ్ళి చేసుకుంటాడో లేక ఏదన్నా దారి చుపిస్తాడన్నా ఆశతో ఒకరోజు అమ్మ చూడకుండా ఇంట్లోంచి బయటికి టైపు ఇన్ స్టి ట్యుట్ కి వెళ్ళాను. నన్ను చూసి మొహం తిప్పేశాడు.
    "సురేష్ నీతో మాట్లాడాలని వచ్చానన్నాను."
    "నీకు నాకు మాటలేమున్నాయింకా " అన్నాడు.
    "ఉంది, చాలా సీరియస్ విషయం. అర్జంటుగా మాట్లాడాలన్నాను." నా మొహం ఆదుర్దా చూసి ఏమనుకున్నాడో టాంక్ బండ్ కి నాతో వచ్చాడు కూర్చోగానే నాఅనుమానం వెళ్ళడించాను భయపడ్తూ.
    సురేష్ మొహం నల్లబడింది.
    "ఇంపాసిబుల్. ఎలా అవుతుంది. నీవబద్దం ఆడుతున్నావు" అన్నాడు తిరస్కారంగా చూసి. కోపం ముంచుకోచ్చినా నిగ్రహించుకుని శాంతంగానే ఏ లేడి డాక్టరు చేతన్నా పరిక్ష చేయించమన్నాను. ఆఫ్ కోర్స్ యింకా అనుమానమే అనుకో, అయినా నాకెప్పుడూ ఇలా అవలేదు. ఏం చేద్దాం సురేష్. అమ్మా నాన్నలకి తెలిస్తే నన్ను చంపేస్తారు " అన్నాను ప్రాధేయపూర్వకంగా చూస్తూ.
    "నన్నేం చెయ్యమంటావు. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నానని నీకూ తెల్సు అది ఫేలయితే ఏ డాక్టరు దగ్గరికన్నా తీసికెళ్ళి అబార్షన్ చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు నీకు తెలుసు, నేను స్టుడెంటని. ఓ రెండు మూడు వందలు ఖర్చు పెట్టి ఏ ప్రవేటు డాక్టరు దగ్గరికన్నా తీసికెళ్ళాడానికన్నా నాకు కుదరదు గవర్నమెంటు ఆస్పత్రికెళ్ళాలి. అక్కడ అంతా పబ్లిక్. ఏ దొంగపేర్లో చెప్పాలి. ఎవరన్నా చూస్తే గొడవ. ఇదంతా నాకేమిటో గందరగోళంగా వుంది. ఇంతకీ దీనికి నేనే కారకుడిని అని నాకు నమ్మకం ఏమిటి?" అదోరకంగా చూస్తూ హేళనగా అన్నాడు.
    స్థాణువయ్యాను ఒక్క నిమిషం. వాడన్నది అర్ధం అయ్యాక ఆగ్రహం అవధులు దాటింది. యూ బ్లడి బాస్టర్డ్" సిగ్గులెదూ ఆ మాట అనడానికి ఆవేశంతో వణికిపోతూ అరిచాను.
    "సిగ్గు ఆడవాళ్ళకే లేనప్పుడు నాకెందుకు. ఏం నాతో ఇంత ఫ్రీగా తిరిగినదానివి ఇంకేవడితో నన్నా ఎందుకు తిరగవు. ఇదేదో నా నెత్తిన రుద్దాలని, నామీద కసి తీర్చుకోడానికి నీవే ఇదంతా చేసి నన్నిరికించాలని చుస్తున్నవేమో" అన్నాడు. అలాంటి వాడితో మాట్లాడాటానికి కూడా అసహ్యం అనిపించింది. ఇంక ఏం అని వాడితో ప్రయోజనం లేదని అర్ధమైపోయింది.
    "డోన్ టాక్ అనదర్ వర్డ్. ఐ హేట్యు. నీవు మనిషివి కావు బిస్టువి. నీవు సంస్కారం అటుంచి మానవత్వం కూడా లేని మృగానివి అర్ధమైంది. సురేష్! నీవు చేసిన యీ అవమానానికి బదులు తిర్చుకుంటాను. నిన్నింత సుళువుగా వదలను. బి ప్రిపేర్ ఫర్ ఇట్ అన్నాను ఎగిసి పడుతున్న గుండెలతో, నిప్పులు చెరుగుతున్న కళ్ళతో, వాడి మొహాన వుమ్మేసి వచ్చేశాను.

 Previous Page Next Page