తను కట్టిన తాజ్ మహల్ నిర్మాణం పూర్తవగానే వుక్కిరిబిక్కిరైపోయిన శాజ్ హాన్ మనసులా వుంది అభినవ్ హృదయం. పుప్పొడి మీద సుగంధం కళ్ళముందే కమనీయమైన అత్తరుగా మారుతున్నట్టుగా వుంది.
"హలో ....హలో ..... కావ్యా.....కావ్యా" దూరంగా తన గొడవలో తనున్న కావ్యవైపు పరుగెత్తాడు అభినవ్. భరించలేని సంతోషంతో.
అదే రోజు సాయంత్రం ఫ్లయిట్ లో హైద్రాబాద్ వచ్చేశారు వాళ్ళిద్దరూ.
* * *
మద్రాస్......
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్ క్వార్టర్స్.
ఇన్వెస్టిగేషన్ చీఫ్ ఆఫీసర్ హరిహరన్ దీర్ఘలోచనలో నిమగ్నుడై వున్నాడు.
అంతకు పది నిమిషాల క్రితం సెంట్రల్ హోమ్ డిపార్ట్ మెంటు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వచ్చిన స్పెషల్ మెసేజ్ ని రెండోసారి చదివి ఎదురుగా కూర్చున్న.....
పోలీస్ ఉన్నతాధికారుల వైపు చూశాడు గంభీరంగా.
తనెదురుగా టేబుల్ మీద స్పెషల్ కాలికోబైండ్ చేసున్న ఫైల్ ని అసహనంగా తిప్పాడోసారి.
"పుష్పరాజ్ ను పట్టుకోలేని అసమర్దులమా మనం?" ఇంగ్లీషులో అన్నాడు హరిహరన్. ఏభై ఏళ్ళ హరిహరన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లైఫ్ లో సాధించిన విజయాలెన్నో వున్నాయి.
మధ్యప్రదేశ్ లో బందిపోటు నాయకుడు మల్కాన్ సింగ్ లొంగిపోవడం వెనక, గోవాలో ఇంటర్నేషనల్ స్మగ్లర్ శోభరాజ్ ను పట్టుకోవడము వెనక హరిహరన్ మేధస్సు, ప్లానింగ్ వున్నాయి. అందుకు గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చిన రివార్డులు, అవార్డులు కూడా వున్నాయి.
పుష్పరాజ్ ఇంటర్నేషనల్ వెపన్ డీలర్ - పేరు మోసిన స్మగ్లర్ శివరాసన్ మరణం తర్వాత ఇండియాలో ఎల్. టి.టి.ఇ. తరపున యాక్టివ్ గా ఉదృతంగా వర్కు చేస్తున్న వ్యక్తి పుష్పరాజ్.
పుష్పరాజ్ ను సాధ్యమైనంత త్వరలో పట్టుకోవడానికి అన్ని రకాలైన చర్యల్ని తీసుకోవాలని గత వారం రోజులుగా హోం మినిస్ట్రీ నుంచి స్పెషల్ మెసేజెస్ వస్తున్నాయి. పుష్పరాజ్ ను అరెస్ట్ చేస్తేనే తప్ప భారత్ శ్రీలంకల మధ్య దౌత్య వ్యవహారాలు చక్కబడడానికి అవకాశం వుండదని హోం మినిస్టర్ హరిహరన్ కి స్వయంగా ఫోను చేసి చెప్పాడు కూడా.
"సార్" ఆ మాటకు తలెత్తి చూశాడు హరిహరన్. ఎదురుగా డి.సి.పి. స్థాయి అధికారి అరవిందస్వామి నుంచుని వున్నాడు.
"గత వారం పదిరోజులుగా చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా పీలేరు ఏరియాలో ఏ విధమైన అనుమానించదగ్గ సంఘటనలు జరగలేదు. వ్యక్తులూ కన్పించలేదు" చెప్పాడు అరవిందస్వామి.
"నో మిస్టర్ స్వామీ! అయామ్ ష్యూర్ ఎబౌట్ దట్. హిఈజ్ ఇన్ ఆంధ్ర. అతి త్వరలో ఆంధ్రాలోకానీ, తమిళనాడులో గాని కీలకమైన సంఘటనలు జరగబోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు. ఉయ్ మస్ట్ కేచ్ హిమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్" హరిహరన్ గొంతులో ధ్వనించిన ఆవేశాన్ని గుర్తుపట్టాడు అరవిందస్వామి.
"తమిళనాడు పార్టీ ప్రెసిడెంట్ ని మర్డర్ చేస్తానని బెదిరించి మర్డర్ ఎటెమ్డ్ కూడా చేశాడు. ఆ ఎటెమ్డ్ లో బాంబ్ బ్లాస్ట్ లో యాభై మంది చనిపోవటం, పొలిటికల్ కమీషన్ రేగడం ఆ సంఘటన నాకిప్పటికీ గుర్తు- హి ఈజ్ డెడ్ లీ డేంజరస్ మేన్" శివనాధం అనే యాభై రెండేళ్ళ ఎ.సి.పి. నెమ్మదిగా అన్నాడు.
భృకుటి మడిచి కణతల్ని నొక్కుకున్నాడు హరిహరన్.
"ఎలా సార్ పట్టుకోవడం? ఒక్క ఆధారమైనా మన దగ్గరుంటేనా? మనిషి ఎలా వుంటాడో తెలీదు. ఏం చేస్తాడో తెలీదు. అతని మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా వుంటుందో తెలీదు. అతను మారణాయుధాల్ని ఎలా మూవ్ చేస్తాడో అంతకంటే తెలీదు. మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అతని కోసం మన సర్వ శక్తులూ వినియోగిస్తున్నామనే విషయం తెల్సుకోకుండా పట్టుకోండి, పట్టుకోండని హోండిపార్ట్ మెంటు మెసేజ్ లు మీద మెసేజ్ లు పంపిస్తుంటే ఎలా సర్? స్వామి నారాయణ్ అనే డి.సి.పి. అన్నాడు.
గత ఆరు నెలలుగా హరిహరన్ సారధ్యంలో వాళ్ళందరూ పుష్పరాజ్ కోసం అహోరాత్రులు ప్రయత్నిస్తున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్.
సీట్లోంచి లేచి పచార్లు చెయ్యడం ప్రాంభించాడు సీట్ చీఫ్ హరిహరన్.
"ఇన్నేళ్ళ నా సర్వీస్ లో నేరస్తుడు. తప్పించుకోవడం మాత్రమే నాకు తెలుసు. దొరక్కపోవడం మాత్రం నాకు తెలీదు. బట్ - క్రిమినల్ ఎంతజీనియస్ అయినా నామీద నేను విశ్వాసాన్ని కోల్పోను" అని టెలిఫోను వైపు నడవబోతూ.
అప్పుడే డోరు తెరుచుకుని లోనికొస్తున్న వ్యక్తిని చూసి ఆగిపోయాడు హరిహరన్.
ఆ వ్యక్తి పేరు మేఘమలై. ముప్ఫై అయిదేళ్ళ మేఘమలై చాకులాంటి పోలీస్ ఇన్స్ స్పెక్టర్. అతని ప్రతిభ మీద హరిహరన్ కి నమ్మకం ఎక్కువ.
లోనికోచ్చిన మేఘమలై సెల్యూట్ చేసి తన చేతిలోని ఫైలుని హరిహరన్ కు అందించాడు.
ఆ ఫైలుని గబగబా తిప్పాడు హరిహరన్.
లోపల పది పేజీల టైపు చేసిన మేటరు..... ఆ ఇంగ్లీషు అక్షరాల వెంబడి హరిహరన్ కళ్ళు పరిగెట్టాయి.
అంతా చదివి మిగతా ఆఫీసర్ల వేపు తలెత్తి చూశాడు హరిహరన్.
ఆ చూపుల్ని అర్థం చేసుకున్న మిగతా ఉన్నతాధికారులు ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోయారు. ఆ ఛాంబరులో వాళ్ళిద్దరు మాత్రమే వున్నారు.
"కంగ్రాట్స్ మిస్టర్ మేఘ. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. పీలేరులో రెండు నెలల నిరీక్షణ ఫలించిందన్నమాట" తన సీట్లో కూర్చుంటూ అన్నాడు హరిహరన్.
"పీలేరులో పదిహేను రోజులపాటు నాకేవిధమైన క్లూ దొరకలేదు. సార్! ఆ తర్వాత ఓ రోజు డెబ్భై ఏళ్ళ వ్యక్తి అనుకోకుండా నాకు పరిచయమయ్యాడు ఓ కల్లుపాకలో.
అతనికి పుష్పరాజ్ కుటుంబం బాగా తెలుసు" హరిహరన్ నేత్రాలు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి.
"ఆ వ్యక్తి పేరు?" అడిగాడాయన ఆతృతగా.
"చలమణి" చెప్పాడు మేఘమలై, మళ్ళీ కంటిన్యూ చేశాడు మేఘమలై.
"పుష్పరాజ్ కి సరిగ్గా ఎనిమిదేళ్ళ వయసులో ఓ అర్థరాత్రి ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. పుష్పరాజ్ తండ్రి జయరాజ్ మిడిల్ క్లాస్ వ్యక్తి. మొదటి భార్యా చనిపోయాక రెండో పెళ్ళి చేసుకున్నాడు. పుష్పరాజు మొదటి భార్య కొడుకు. రెండో భార్యకు ఒక కూతురు. ఆ సంఘటన జరిగిన నాటికి ఆ అమ్మాయి వయసు నాలుగేళ్ళు.