"పుర్రెకో బుద్ది, జిహ్వాకోరుచి ఎవరిష్టానుసారం వాళ్ళని అనుకోనివ్వండి" అతను తేలికగా అనేశాడు.
"శక్తిమాయి అనే స్త్రీ వుందా? ఈ విషయం ఆడిగినా మీరు చెప్పలేదు?" రమణ అడిగాడు.
"భగవంతుడిని ఎవరైనా చూశారా! కనులారా ఆయన రూపం చూశామన్న వాళ్ళులేరు....అలాగే భగవంతుడు వున్నాడు. అనుకున్న వాళ్ళకి వున్నాడు...లేడు అనుకున్న వాళ్ళకి లేడు. శక్తిమాయి అంతే! ఆమె వున్నది అని నమ్మిన వాళ్ళకి ఉంది. లేదుఅనుకున్న వాళ్ళకి లేదు" అంటూ అతను నవ్వాడు.
ఇంతకి శక్తిమాయి వున్నట్లా? లేనట్లా?
రాజు, రమణలు ముఖ ముఖాలు చూసుకున్నారు.
అతను శెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
ఆనాడు జరిగింది అది.
వాళ్ళ పధకం సక్సెస్ అయింది. పోవటం గత్యంతరం లేకను ఎవరైనా ఏదైనా యిస్తే తీసుకుంటారు.... అంతవరకే సంపాదించే తెలివిమాత్రం లేదు భయం.
ఇలాంటి పరిస్థితులలో శక్తిమాయి నుండి కబురు వచ్చింది....ప్రతిఫలం ఆశించకుండా పని చేశారు ....వాళ్ళయినా ఈ పని చేసినందుకు ఫలానా కానుక ఇస్తామని చెప్పలేదు.
కాని__
పని పూర్తయిన వారానికి....
రాజు రమణలకి చెరి అయిదువేలు అందాయి. అయిదు వేలు మీకందిన క్షణం నుంచీ మీవి. అవి ఎలా వచ్చాయి అన్నది మాత్రం ఆలోచించకండి, ఆరా తీయకండి" మాత. అన్న చీటీ డబ్బుతో పాటు వుంది.
శక్తిమాయి ఎవరినోరు అన్యాయంగా కొట్టదు.
ఇన్ స్పెక్టర్ కి ఒకడు పదివేలు లంచం ఇచ్చాడు. ఆ పదివేలు మధ్యలో మాయం అయ్యాయి. శక్తిమాయి చేతి లోకి వచ్చాయి...అక్కడనుంచి రాజురమణలకు అందాయి.
ఈ కథ యిలా వుంటే అక్కడ....
పదివేలు పంపించానంటాడు వాడు. నా కందలేదు అంటాడు ఇన్ స్పెక్టర్. డబ్బు తీసుకుని ఇన్ స్పెక్టర్ అబద్ద మాడుతున్నాడని అతను__డబ్బు ఇవ్వకుండా ఇచ్చానని అతడు బుకాయిస్తున్నాడని ఇన్ స్పెక్టరు అనుకుని చాటుగా పోట్లాడుకుంటున్నారు.
ఇదంతా మాయీ మాయ.
"ఇన్ స్పెక్టర్ మళ్ళీ మళ్ళీ మనని తికమక ప్రశ్నలతో వేధించవచ్చు. మనం చిన్న పొరపాటుకూడా పడకూడదు గుర్తుంచుకోరాజా!" అన్నాడు రమణ.
"బొందిలో ప్రాణం బొందిలోనో వుండాలనుకుంటే పొరపాటు చేయను, చేయను" అన్నాడు రమణ.
ఇరువురు నవ్వుకున్నారు.
10
నెత్తిమీద చేతులు పెట్టుకొని కూర్చున్నాడు ఇన్ స్పెక్టర్.
"సార్!" అన్నాడు రాజు.
"సార్!" కాస్త గట్టిగానే పిలిచాడు రమణ.
"ఏమిటి?" విసుగ్గా తల ఎత్తి అడిగాడు ఇన్ స్పెక్టర్.
"తల నొప్పాసార్!" రాజు వినయంగా అడిగాడు.
"ఇది తలనొప్పి కాదు వళ్ళుమంట. వెధవ బారి తెగించి ఏదో వాగుతున్నాడు. తప్పుడు నా కొడుకు ఏదో ఓ కేసు బనాయించి చీకటికొట్లోకి తోస్తేగాని...
"ఎవరి సంగతి సార్!"
ఇన్ స్పెక్టర్ గతుక్కుమన్నాడు. పొరపాటుగ నోరు జారునందుకు నాలుక కొరుక్కున్నాడు. దొంగ వెధవలు ఖూనీకోర్లు అంతా నేరాలు చేసేవాళ్ళే. ఎవడు మంచో, ఎవడు చెడో ఏది అర్ధమయిచావదు. దగాకోర్లు దగుల్ బాజీలు" అంటూ మాట మార్చాడు.
ఇన్ స్పెక్టరు అబద్దం ఆడుతున్నాడని ఇరువురు గ్రహించారు. ఏమీ తెలియనట్లు ముఖంపెట్టి "నిజమేనండి" అన్నారు.
లోకంలో దొంగ వెధవలు ఎక్కువయితే ఇన్ స్పెక్టర్ నెత్తిన చేయి పెట్టుకోనక్కరలేదు. దొంగ వెధవలు ఎక్కువ అయితే ఈయనలాంటి ఇన్ స్పెక్టర్ కి మరీ మంచిది. ఆరుకేసులు దొరికితే మూడు కేసులు చీకటికొట్లోకి మరో మూడు కేసులు కాసుల గలగలకి పనికొస్తాయి. ఇన్ స్పెక్టరు నెత్తిన చేయి పెట్టుకున్నాడు అంటే ఏ విషయంలోనో గురుడు గట్టి దెబ్బ తిన్నట్లే. దెబ్బతో తల బొప్పికట్టి వుంటుంది.
రాజు రమణలు అనుకున్నారు.
"ఆ రోజు ఏం జరిగిందో మళ్ళీ చెప్పండి" ఉన్నట్లుండి ఇన్ స్పెక్టర్ ని అడిగాడు.
వీళ్ళు చెప్పేదానిలో చిన్న పొరపాటు దొర్లినా చాలు...భల్లూకంలాగా పట్టేద్దామని ఇన్ స్పెక్టరు ఆలోచన. ఆ సంఘటన జరిగి ఇరవై రోజులు దాటింది....అయినా మధ్య మధ్య అడుగుతూనే వున్నాడు.