Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 11

    "దా..... తల్లీ!" అని అమల చెయ్యి పుచ్చుకుని సోఫా వద్దకు తీసుకెళ్ళాడు భుజంగరావు.

    ముగ్గురు సోఫాల్లో కూర్చున్నారు.

    "రోజా! నన్ను గుర్తుపట్టావా? నీ బావ కృష్ణని." అన్నాడు కృష్ణ అమల చెయ్యి తన చేతిలోకి తీసుకొని మృదువుగా నిమురుతూ.

    అమల శరీరం గగుర్పొడిచింది. సిగ్గు వేసింది. పిచ్చి వాలకంగా చూడటానికి అవస్థపడింది.

    "కృష్ణా! నా తల్లి నీవంటే యిష్టంగానే వుండేదిరా. ఆ ప్రభాకర్ ఏ దుర్ ముహూర్తాన కళ్ళపడ్డాడో ప్రేమ పిచ్చిలో పడిపోయింది. కూతురనే మమకారం, నీ విశాల హృదయంవల్ల, వివాహానికి ఒప్పుకోటం అయింది. కాని..... కృష్ణా, విధిరా విధి! పూర్తిగా నన్ను వంచించింది. సరోజ పూర్తిగా పిచ్చిదయిపోయిందిరా!"

    భుజంగరావుగారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

    "గతం ఇప్పుడెందుకు మామయ్యా! ముందు జరగబోయేది ఆలోచిద్దాం.

    మీకు హార్టెటాక్ వచ్చిందన్న వార్త, రోజా ఇంటిలోంచి మాయంకావటం, విని భరించలేని బాధపడ్డాను మామయ్యా! అప్పటికప్పుడు బయలుదేరి వద్దామనుకుంటే, నువ్వు రావద్దని గట్టిగా లెటర్ రాస్తివి. మీ ఆజ్ఞ మీరటం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ లేదు. మామయ్యా నే వచ్చేశాను. ఇంకే విధమైన వర్రీస్ పెట్టుకోకు. పూర్తి రెస్ట్ తీసుకో. రోజా సంగతి నే చూసుకుంటాను. రోజాకి పిచ్చికాదు మామయ్యా పట్టింది. మన పూర్వీకులలో ఎవరికైనా పిచ్చి వుంటే ఆ రక్తం రోజాలో వుంది. కాబట్టి పిచ్చిదయిందని అనుకోవచ్చు. ఆ పిచ్చి కుదర్చటం కూడా కొంచెం కష్టమే.

    ఇది ప్రభాకర్ పోయిన వార్త విని షాక్ తగిలింది. షాక్ వల్ల తలకి గాయం తగలటంవల్ల వచ్చిన మెంటల్ షాక్ కి మామూలు మనిషిని చేస్తాను, సరేనా మామయ్యా? అమల వైపు చూస్తూ అన్నాడు కృష్ణ.

    అమల ఉలిక్కిపడింది.

    'తనకి పిచ్చి లేదు, వెర్రిలేదు, ఈయనగారు పరీక్ష చేస్తే తన గుట్టు బైటపడదు కదా? లేక తనకి పిచ్చి ఏ రకమైనదో తెలియక ఈయనగారి బుర్ర గిర్రున తిరిగిపోతుందో?'

    "ఏంటి రోజా, నీలో నీవు నవ్వుకుంటున్నావు?" కృష్ణ అడిగాడు.

    ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రకంలా ఉన్నాడు ఈ కృష్ణమూర్తి. బాప్ రే జాగ్రత్తగా ఉండాలి, అనుకుంది అమల "హిహ్హిహ్హీ" అంటూ ఓ పిచ్చినవ్వు నవ్వింది. గోళ్ళు కొరుక్కుంటూ కూర్చుంది.

    "ఇదీ వరసరా కృష్ణా!" అన్నారు భుజంగరావుగారు.

    భారంగా నిట్టూర్పు విడిచాడు కృష్ణ.

    మామయ్యా! రోజా ఇంట్లోంచి ఎలా వెళ్ళింది? ఎవరూ గమనించలేదా? చివరిసారిగా ఆ రోజు రోజాని ఎవరు చూశారు? రోజా లేనట్లు ఎంతసేపటికి గ్రహించారు. మళ్ళి రోజాని ఎవరు చూశారు? అప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉంది?"

    కృష్ణ వివరాలు అడిగితే భుజంగరావుగారు చెప్పటం మొదలుపెట్టారు జరిగింది.

    'బాప్ రే, ఇతగాడు సైక్రియాటిస్ట్ మాత్రమే గాదు, నా పాలిట యముడు. జేమ్సబాండ్ తాతలా వున్నాడు అనుకుంది అమల.

 Previous Page Next Page