ఆ టిక్కెట్టుని అందుకుని చూశారు సుబ్రహ్మణ్యంగారు.
దాని అంచుకి సన్నటి దారంలా సిరా మరక అంటి వుంది. అది వయొలెట్ కలర్ ఇంకు. తను వాడేదే. ఇది తను కొన్న టిక్కెట్టే! సందేహం లేదు!
ఈ సంగతి ఇతనితో చెప్పాలా? వద్దా?
కొద్ది క్షణాలు అలోచించి , వణుకుతున్న చేతులతో ఆ టిక్కెట్టుని అతనికి తిరిగి ఇచ్చేసారు సుబ్రహ్మణ్యంగారు.
తరువాత గొంతుని స్వాదినంలోకి తెచ్చుకుని అన్నారు.
"అందుకే నాయానా పెద్దలంటారు. అదృష్టవంతుడిని చెడిపే వాళ్ళు, దురదృష్టవంతుడిని బాగుచేసే వాళ్ళు లేరు అని!" అని ఆగి, ఇంట్లోకి తొంగి చూశారు. "ఏమోయ్! మాకు కాస్త కాఫీ గిఫీ ఏమన్నా దొరుకుతుందా!" అన్నారు హాస్యాన్ని పలికించడానికి విఫలప్రయత్నం చేస్తూ.
అలా అన్న వెంటనే అనిపించింది ఆయనకి. తనకు రాను రాను మతిపోయింది. ఇంట్లో అన్నీ ఉన్నాయో లేవో చూసుకోకుండా కాఫీ పెట్టమంటే ఎలా పెట్టగలదు శారద? కాఫీ పొడి అయిపోయిందని ఆమె మధ్యాహ్నమే చెప్పినట్లు గుర్తు!
అలా అనుకుంటూ ఉండగానే కొంగుచాటున ఒక చిన్న గిన్నె పట్టుకుని శారదమ్మ పక్క వాటాలోకి వెళ్ళడం కనబడింది ఆయనకి.
పక్క వాటాలో ఇంటి ఓనరు భ్రమరాంబిక ఉంటోంది.
"కాస్తంత కాఫీ పొడి ఉందా వదినగారూ?" అంది శారదమ్మ, మొహమాటంతో ఒళ్ళు చచ్చిపోతూ ఉండగా. "తెలిసిన వాళ్ళోచ్చారు ఇంటికి."
గొంతు అదొలా పెట్టి అంది భ్రమరాంబిక - "అయ్యో, ఇప్పుడే నిండుకుందమ్మా. అయినా ఎవరు దిగబడ్డారు? అప్పులవాళ్ళూ? అవునులే, కూర్చోబెట్టి కాస్త కాఫీ గిఫి ఇచ్చి ఖుషి చేస్తే గానీ వదలరు కసాయి వెధవలు.
"అప్పుల వాళ్ళు కాదు వదినా! మాకు తెలిసిన వాళ్ళబ్బాయి. చిన్నప్పుడు మావారి దగ్గర చదువుకున్నాడు. ఆ అభిమానంతోనే చూడటానికి వచ్చాడు." అంది శారదమ్మ.
"మీ అయన మీద అభిమానమా? ఓహో!" అంది భ్రమరాంబిక సాగదీస్తూ. అలా సాగదీయడంలోనే ఏదో అభియోగం ధ్వనిస్తోంది. "అన్నట్లు చెప్పడం మర్చేపోయా. రేపు మా కనక దుర్గ ని చూడడానికి పెళ్ళి వారోస్తున్నారు వదినా."
"అలాగా! చాలా సంతోషం" అంది శారదమ్మ మనస్పూర్తిగా.
"రాజాలాంటి సంబంధం. అబ్బాయి మున్సిపాలిటిలో గుమాస్తా. కామధేనువు లాంటి ఉద్యోగం. పై నెల్లో చేసేద్దామనుకుంటున్నాం పెళ్ళి. ఏ ఈడులో జరగాల్సిన ముచ్చట ఆ ఈడులోనే జరగాలి వదినా. ఏళ్ళు ముదిరాక చేసినా ఇంక దాంట్లో అందం చందం ఏముంది? అన్నట్లు మన సౌమ్యకి కూడా ఏదో ఒక సంబంధం చూసి తొందరగా ముడి పెట్టేయ్యకూడదు? అయినా ఈ మధ్యెం సంబంధాలు చూస్తున్నట్లు లేదే! కొంపదీసి మానేశారా ఏమిటి?" అదేమీటోదినా , మా ఎరికలో ఓ రెండో పెళ్ళి సంబంధం ఉంది చూడనా ఏమిటి?" అంది భ్రమరాంబిక గడగడా వడగళ్ళు పడుతున్నట్లు.
ఆ మాటలు వింటుంటే మ్లానమైపోయింది శారదమ్మ వదనం. మనసు బరువుగా అయిపొయింది.
సౌమ్య పెళ్ళి - ఈ జన్మలో చేయగలరా తాము?
సరిగ్గా అదే సమయంలో వసారాలో నుంచి వినబడింది శశికాంత్ గొంతు. చాలా మృదువుగా , కానీ చాలా స్థిరంగా చెబుతున్నాడు అతను.
అవును మేస్టారూ! సౌమ్యలక్ష్మి నిజంగా నా పాలిట లక్ష్మే అని నాకు నమ్మకం కలిగింది. నేను బిజిన్స్ మాన్ ని మేస్టారూ. అందుకని ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువ నాకు.
"మేస్టారూ! నేను సౌమ్యని పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. దానికి చాలా కారణాలు ఉన్నాయి.
"ఒకటి , సౌమ్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.
రెండు , సౌమ్య చాలా బాగుంటుంది. నాకు నచ్చింది.
మూడు, సౌమ్య లక్ తెచ్చి పెడుతుందని, లక్షలు గడించి పెడుతుందని నాకు గురి కుదిరింది.
నాలుగు, సౌమ్య పెళ్ళి ఎలా చెయ్యాలా అని మీరు మధనపడుతుండడం నాకు తెలుసు.
"సౌమ్యని నేను పెళ్ళి చేసుకుంటే న కోరికా తీరుతుంది. మీ సమస్యా తిరిపోతోంది, మేస్టారూ.
అప్పటిదాకా విభ్రాంతితో వింటున్నా సుబ్రహ్మణ్యం గారు అన్నారు.
"నాయనా శశికాంత్! నేను వింటున్నది నిజమేనా బాబూ!"
నవ్వాడు శశికాంత్.
"ఇందులో అనుమానించడానికి ఏం ఉంది మాస్టారూ? ఇదేమంత పెద్ద విషయమని?"
వెంటనే అతని చేతులు పట్టుకున్నారు సుబ్రహ్మణ్యం గారు.
ఇవి చేతులు కావు బాబూ, కాళ్ళు! శశికాంత్! నీ రుణం ఎలా తీర్చుకొను నేను!"
"ఎందుకు మేస్టారూ అంతంత పెద్ద మాటలు?" అన్నాడు శశికాంత్ ఆయన్ని వారిస్తూ. 'నేను ఎవరో ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోక తప్పదు కదా! ఆ చేసుకోవడం సౌమ్యనే చేసుకుంటే అందరికి సుఖం. ఇందులో నా స్వార్ధం కూడా బోలేదంతా వుంది. లేదనకండి. కాదనకండి.
"కావాలని నువ్వు దగ్గరవుతుంటే కాదని నేనెందుకంటాను? వెయ్యేళ్ళు వర్ధిల్లు నాయనా" అన్నారు సుబ్రహ్మణ్యం గారు సంతోషంతో జీరబోతున్న గొంతుతో.