Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 11

    పెద్దలముందు కూర్చోవడం మావాడి కిష్టముండదు. నేను చెబితేనే కూర్చుంటాడు. చిన్నప్పటినుంచీ అంతా నా శిక్షణ!" అంది సుభద్రమ్మ.   
    ఆఫీసులో మీ అబ్బాయిని ఆఫీసరు చాలా మెచ్చుకుంటాడని నా అనుమానం. నిజమేనా!" అన్నాడు రాయుడు.   
    "మీకెలా తెలుసండీ?" ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు.   
    "ఆ కంఠం గంభీరంగా ఉంది. రాయుడు మనసులో "సుబ్బారావూ! నువ్వేనా హీరోవి" అనుకుని మంచివాళ్ళని ఎవరైనా మెచ్చుకుంటారు. అసలు మా ఆఫీసరు చెప్పడంవల్లే నేనిక్కడకు వచ్చాను. మా కంపెనీలో ఉద్యోగమొకటుంది. జీతం ఇప్పుడు నీకొచ్చేదానికి రెట్టింపు. పని బాగుంటే ఇంకా ఇంకా పెరుగుతుంది...." అన్నాడు రాయుడు.   
    సుభద్రమ్మ ఆశ్చర్యంగా "ఈ రోజుల్లో ఆడపిల్లకు సంబంధాలూ, మగపిల్లాడికి ఉద్యోగాలూ వెతుక్కుంటూ రావటం చాలా ఆశ్చర్యం. మీరు మా వాడికి ఉద్యోగం యివ్వడానికి వెతుక్కుంటూ వచ్చారా?" అంది.   
    "అదంతా మీ ట్రయినింగ్ గొప్పతనం!" అన్నాడు రాయుడు. తర్వాత ఆయన సుబ్బారావువంక తిరిగి "రేపోసారి మా ఇంటికిరా!" ఉద్యోగం విషయాలు మాట్లాడుకుందాం! ఆఫీసుకు సెలవొద్దులే! వెళ్ళేముందు కనబడితే చాలు...." అన్నాడు.   
    రచయిత రాయుడివంక చూసి "మీరు అడ్వాన్సేమీ ఇవ్వలేదు!" అన్నాడు.   
    రాయుడు చటుక్కున జేబులోంచి ఓ వందరూపాయల నోటు తీసి "మరిచేపోయాను. ఇది అడ్వాన్సు. రేపు తప్పకుండా రావాలి!" అన్నాడు.   
    "మా అమ్మకివ్వండి!" అన్నాడు సుబ్బారావు. తల్లికిది ఇష్టమో కాదో తెలుసుకోవడం కోసం అతనలాగన్నాడు.   
    "తీసుకోరా....నీకిస్తే నాకిచ్చినట్లే గదా!" అంది సుభద్రమ్మ.   
    గీత, రాయుడు, రచయిత కలిసి తిరిగి ఇల్లు చేరారు. గోంగూరపచ్చడి గీత తీసుకుని వచ్చింది. అక్కడ జరిగిందంతా గీత తల్లికీ తదితరులకీ చెప్పి నవ్వించింది. రాయుడు, రచయిత ఆ సంభాషణలో పాల్గొనలేదు. వారిద్దరూ వేరే గదిలో కూర్చున్నారు.   
    "కుర్రాడు చాలా బాగున్నాడు. ఇతన్ని మన దారిలోకి తీసుకురావాలి!" అన్నాడు రాయుడు. "అది చాలా కష్టంగా కనిపిస్తోంది. మరీ తల్లి చాటు పిల్లాడు. ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి కుర్రాళ్ళున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది."   
    రచయిత నవ్వి__"మనం సినిమాల్లో చూపించేలాంటి కుర్రాళ్ళు బయట ప్రపంచంలో అనగా మన దేశంలో లేరండి. అంతా యించుమించుగా సుబ్బారావులాంటి వాళ్ళే! మగ కుర్రాళ్ళందరూ తల్లి చాటు బిడ్డలు కాబట్టే కదండీ__ వరకట్న సమస్య జాతి నిలా పీడిస్తోంది. మంచి డ్రస్సు  వేసుకుని, చలాకీగా, హీరోల్లా తిరిగేవాళ్ళు కూడా పెళ్ళి విషయం వచ్చేసరికి తల్లిదండ్రులచాటు బిడ్డలే! సుబ్బారావు అమాయకుడు కాబట్టి తన అసలు స్వరూపాన్ని దాచుకోలేక పోతున్నాడు. మిగతావాళ్ళు దాచుకోగల్గుతున్నారు" అన్నాడు.   
    "అబ్బా__సమస్యల జోలికి వెళ్ళకుండా సినిమా తీయాలని నేననుకుంటే నువ్వు నన్ను సమస్యలున్న కథలోకి లాగుతున్నావు"__అన్నాడు రాయుడు చిరాగ్గా.   
    "త్యాగరాజు ప్రతి కదలికలోనూ సంగీతముండేదని చెప్పుకుంటారు. ఆఖరికి ఆయన తీసి వదిలే ఊపిరిలోంచి కూడా సంగీతం పలికేదని అనేవారు. అలాగ మన దేశంలో ఏ విషయాన్ని తాకినా సమస్యలు పలుకుతాయి. వాస్తవం నుంచి దూరంగాపోయి లాభంలేదు."   
    "సరేలేవయ్యా! ఇంతకీ కథముందు కెలా పోతుందో చెప్పు!"   
    "అందు కుపాయం తట్టిందండి. మన కథలో ఎవరూ ఊహించని కొత్తదనం ఉంటుంది. పండితులు, పామరులు కూడా సెబాసని మెచ్చుకునే కొత్తదనం!" అన్నాడు రచయిత.   
    "కొత్తదనానికేం, ఇప్పుడే వచ్చింది. కాని మనక్కావలసింది కొత్తదనం ఒక్కటేకాదు. కథ ముందుకు నడవాలి" అన్నాడు రాయుడు.   
    "ఎందుకు నడవదూ? ఈ కథలో సుబ్బారావు హీరోయిన్. సుహాసిని హీరో! అప్పుడెలాగుంటుందో ఆలోచించండి" అన్నాడు రచయిత.   
    రాయుడి బుర్రలో ఏదో తళుక్కుమంది. "చాలా బాగుందయ్యా! కాని ఆ సుహాసిని కూడా మనకు కొరకరాని కొయ్యలా ఉంది కదా! ఆమె భర్తకు దురలవాట్లన్నీ చేసి పెళ్ళి చేసుకున్నాక అవి పోగొట్టి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాలనుకుంటోంది. అలాంటి ఆమె ఈ సుబ్బారావు నెలా ప్రేమిస్తుంది?" అన్నాడు దిగులుగా.   
    "మనం వాళ్ళిద్దర్నీ దగ్గరగా తీసుకువచ్చి వదిలేద్దాం" అన్నాడు రచయిత.   
    "అది మాత్రం ఎలా సాధ్యపడుతుంది? ఒకవేళ సాధ్యపడినా ప్రయోజనమేమిటి? మా శంకర్ అన్నీ ప్రయత్నించి ఫెయిలైపోయాడు గదా" అన్నాడు రాయుడు.   
    "మనసు మంచిది కానీ వయసు చెడ్డది. మీ  శంకర్ ఆమెకు వెళ్ళవలసినంత దగ్గరగా వెళ్ళలేదు. మొట్టమొదట అబ్బాయి అమ్మాయి మనసులో అంతో యింతో స్థానం సంపాదించుకోవాలి. ఆ తర్వాత దగ్గరవ్వాలి. ఏదో ఒక రోజున అది ప్రేమగా మారకపోదు; పెళ్ళికి దారి తియ్యక పోదు. మన సినిమా కథకు ముగింపు దొరక్కపోదు" అన్నాడు రచయిత.  
    "అసలింతకీ నీ ఉద్దేశ్యమేమిటో చెప్పు" అన్నాడు రాయుడు.   
    "ఎవరూలేని పార్కులోకి సుహాసిని వెళ్ళేలా చేయాలి. అక్కడ ఇంకెవ్వరూ ఉండకూడదు. అక్కడికి సుబ్బారావు వెళ్ళాలి" అన్నాడు రచయిత.   
    "వెళ్ళి ప్రయోజనమేముంది? అతగాడు తలెత్తి ఆమెను చూడనైనా చూడడు. ఆమె అతణ్ణి పలకరించదు" అన్నాడు రాయుడు నిరుత్సాహంగా, మీరలా కంగారు పడతారే మండీ! అప్పుడే జరుగుతుంది అసలు కథ. నలుగురు రౌడీలు సుబ్బారావుని చుట్టుముడతారు. సుబ్బారావుకీ వాళ్ళకీ గొడవవుతుంది. వాళ్ళు సుబ్బారావుని తన్నబోగా సుహాసిని వెళ్ళి అతణ్ణి రక్షిస్తుంది. ఆమెకు కరాటే వచ్చు. అసహాయ స్థితిలో ఉన్న సుబ్బారావుని ఆమె వదిలిపెట్టదు. అప్పుడు వారిద్దరికీ పరిచయం అవుతుంది."   
    రాయుడు చటుక్కున రచయిత భుజం తట్టి "ఇంత మంచి పథకం చెప్పినందుకు నువ్వెమడిగినా ఇవ్వొచ్చు" అన్నాడు.  
    "అడిగి ఏం ప్రయోజనం. నేనడిగింది మీకు గుర్తుండదు" అన్నాడు రచయిత భుజం తడుముకుంటూ.   
                                                7   
    మర్నాడు సుబ్బారావు సరిగ్గా తొమ్మిందింటికి రాయున్ని కలుసుకున్నాడు. "ఈరోజు నువ్వు సాయంత్రం అయిదింటికి నేతాజీ సుభాస్ చంద్రబోస్ పార్కుకి రావాలి. అక్కడ నీకో పని ఉంది" అన్నాడు రాయుడు.

 Previous Page Next Page