Previous Page Next Page 
హిమసుందరి పేజి 10

    మీనాక్షి కెవ్వుమంది.

    "ఏం- నెప్పిగా ఉందా? చేత్తో కొడితేనే భరించలేవు. చెప్పుతో కొడితే యింకేం భరిస్తావు సుకుమారీ! కూరల వాడితే తిరిగేటంత కమ్మగా లేదా?" వ్యంగ్యంగా అంటున్నాడు వెంకట్రావ్ మాస్టారు.

    "వదలండి. మీకు దండం పెడతాను." బాధతో గిల గిలలాడినట్లుగ మీనాక్షి కంటం వినిపించింది.

    అంతవరకూ కళ్ళకు ప్రత్యక్షంగా కానవచ్చేలా వెంకట్రావ్ మాస్టారు కధ చెప్పి - "ఇది నిజంగా జరిగిన ఓ అనుమానం మొగడి కధ సీతా!" అన్నాడు రామకృష్ణ.

    సీతామనోహరి తెరుకోటానికి నిమిషం పట్టింది.

    "మీరు చెప్పింది నిజమే కదూ!" సీత అడిగింది.

    "నిజం సీతా! కేవలం జాతకాన్ని నమ్మి - పెళ్ళాన్ని అన్నీ రకాల బాధలు పెట్టేవాడు." రామకృష్ణ నొక్కి చెప్పాడు.

    "అయ్యో సీతా! నన్నే అనుమానిస్తుంటివా! నామాటలను శంకించుచుంటివా? రాముడిని అనుమానం మొగుడు అన్నారు గాని, ఈ కలియుగమందున భర్తని అనుమానించేది ధర్మపత్ని సీతయే! అకటా! ఏమి కష్టము!"

    "ముందా నాటకాల భాష చాలించండి"

    "నాటకాలు కావు. కాకపోతే సరదాగా ఆ భాష వాడాను - అంతే!"

    "అసలు మీకీ విషయం ఎలా తెలుసు?"

    "మా అమ్మ, మా పక్కింటి పిన్నిగారు, అత్తయ్య గారె, రోజూ సమావేశం అయి, మీనాక్షి కష్టం గురించి చెప్పుకునేవారు. అందుకే మీనాక్షి ఇరుగుపొరుగుతో అంటీముట్టనట్లు ఉండేది విషయం తెలియక ముందు మీనాక్షిని అందరూ ఆదిపోసుకున్నారు. పేరంటానికి పిలవటానికి వెళ్ళిన ఆవిడ వల్ల ఈ రహస్యం బయటపడింది. అక్కడ నుంచి ఆ వీధిలో ఆడవాళ్ళంతా ఓ కన్ను వెంకట్రావ్ మేస్టారి యింటిపై వేశారు. వెంకట్రావ్ మాష్టారు ఇంట్లోంచి బయటకేల్లెటప్పుడు ఆమెని యింట్లో పెట్టి బైట తాళం వేసుకుని వెళ్ళేవాడు......"

    "ఛా......" అంటూ చీత్కారం చేసింది సీత.

    "నీవు ఛా అన్నా, ఛీ అన్నా ఇది సత్యం" అన్నాడు రామకృష్ణ.

    "ఆ తర్వాత ఏమైంది?"

    "ఓ రోజు స్టవ్ అంటుకుని మరణించింది కాని - స్టవ్ పొరపాటున కూడా అంటుకోలేదు. ఇది వెంకట్రావ్ మాస్టారి పని. మీనాక్షి రెండు రోజులు నరకయాతన పడి మరణించింది."

    "క్షణం క్షణం చచ్చేబదులు ఒకేసారి పోవటం ఆమె జీవితానికి విముక్తి వెంకట్రావ్ విషయం అందరికీ తెలిసి, ఎలా వూరుకున్నారు? నలుగురూ కలసి ఆయన కాళ్ళు చేతులు విరగకోట్టాల్సింది. లేకపోతే పోలీసులకి పట్టించాల్సింది!" సీత ఆవేశంగా అంది.

    "మాష్టారు కాళ్ళు విరగగోడితే అందరి పీకల మీదకీ రావటం తప్పించి ప్రయోజనం ఏముంది? పోలీసులకి విషయం చెప్పి పట్టిద్దామా అంటే - మీనాక్షి చావుబతుకుల మధ్య కొట్టుకుంటూ కూడా ప్రమాదానికి కారణం నా అశ్రద్ధ. మావారి మధ్య, నా మధ్య ఎటువంటి పోరాపోచ్చాలూ లేవని స్టేట్ మెంటు ఇచ్చింది."

    సీత నిర్ఘాంతపోయింది.

    "నిజం?!"

    "సీతా! నీవు ఇలా మాటిమాటికీ నిజమా అంటూ అనుమానం వెళ్లగక్కుతుంటే - ఇది నిజమా అని నాకే అనుమానం వస్తున్నది. నీకు లోకం తెలియదు సీతా! రకరకాల మనుషులు - రకరకాల కధలు."

    "మీనాక్షిలాంటి వాళ్ళు వుంటారా అండీ?" అమాయకంగా అడిగింది సీత.

    "పరాయి దేశాల సంగతి నాకు తెలియదు గాని సీతా! ఈ దేశంలో మాత్రం వుంటారు - ఈ పవిత్ర భారతం దేశంలో మాత్రమే పతివ్రతలు వుంటారు."

    "మీనాక్షి ఎందుకు ఆ పని చేసింది?"

    "ఏ పని?"

 Previous Page Next Page