Previous Page Next Page 
భారతి పేజి 10

    భారతికి ఆ మాటలు సరిగా అర్ధంకాలేదు .అందులోని  భావమేమై  వుంటుందా  అని ఆలోచిస్తూ మౌనంగా ఆమెను అనుసరించింది.

    మేడమీద  విశాలమైన హాలు, పెద్ద పెద్ద గదులు, వాటిలోని  అపురూప వస్తువులు, అలంకరణ మరింత  కనులపండువుగా  కనిపించాయి.

    "ఈ వైభోగమంతా  నీదే సుమా!" అని ఆమె చెవిలో  ఎవరో పలికినట్లయింది.

    ఉలిక్కిపడి  ఆమె అత్తగారి ముఖంలోకి చూసింది. అదే సమయానికి  ఆమె కూడా కోడలు ముఖంలోకి  చూసి, చిరునవ్వు నవ్వింది. ఆ మాటలైతే  అత్తగారు అనలేదుగానీ, ఆమె విశాల నయనాలలోంచి  అదే భావం వెలువరించి నట్లయింది.

    భారతి చేయి పట్టుకుని  ఓ విశాలమైన  గదిలోకి తీసుకువెళ్ళింది రంగాజమ్మగారు. "అబ్బాయీ సారధి గది యిది"

    భారతి నలువైపులా  కలయచూసింది. నేలమీద మెత్తని తివాచీ, కిటికీలకు  రంగురంగుల తెలుపూ, మల్లెపువ్వు  లాంటి  దుప్పటి  పరిచి వున్న  పరుపుతో  పందిరి మంచమూ, విలువైన రేడియో, గోడలకు ఎక్కడెక్కడి నుంచో  సేకరించినట్లు  ప్రకృతి  సౌందర్యాన్నీ, అందులోని రకరకాల  రమణీయ శోభలనూ, స్త్రీత్వంలోని  మాదుర్యాన్ని వ్యక్తపరిచే  చిత్రాలూ, ఒకమూల  బల్లమీద  వయొలినూ, అప్పుడే వాయించి పెట్టిపోయినట్లు  దాని పక్కనే కమానూ....

    "బాబు ఓ కళాకారుడు  భారతీ!" అన్నదామె  కోడలి చెయ్యి మెల్లిగా నొక్కుతూ. "చిత్రకారుడు, ఎక్కడెక్కడి నుండో  చిత్రాలు తెప్పించి  తన గదినిండా  అలంకరించుకుంటాడు  స్వయంగా  ఎన్నో చిత్రాలు రచించాడు గాయకుడు, మధురంగా  పాడతాడు. అద్భుతంగా  ఫిడేలు వాయిస్తాడు."

    తన భావనలకు  తనే  స్పందిస్తున్నట్లుగా  ఓ క్షణం మౌనంగా  ఊరుకుని, "అయితే అలాంటి బద్ధకస్తుణ్ణి ప్రపంచంలో మరి చూడబోము. ఈ గది ఇంత శుభ్రంగా, అందంగా అలంకరించి ఉందంటే  అదంతా  ఈ సవతితల్లి  పడిన అవస్థ. ఒక్కరోజు  నేను పట్టించుకోకపోతే  ఇదంతా  ఎంత భయంకరంగా  తయారవుతుందో  చెప్పలేను. ఇరవయి ఏళ్ళుగా ఈ బాధ్యత నేను వహిస్తున్నాను. ఇహ ఈవేళటి నుంచీ  నీకు అప్పచెబుతున్నాను." అంటూ గబుక్కున భారతిని దగ్గరకు  తీసుకుని  తన అక్కున చేర్చుకుంది.

    హఠాత్తుగా అత్తగారు  చేసిన  ఈ చర్యకు  భారతి  విస్తుపోయింది. ఆమెకు ఏడుపు వచ్చినట్లయింది. కిష్టంమీద కన్నీళ్ళ నాపుకుంది. కాని నిట్టూర్పు  మాత్రం  ఆపుకోలేకపోయింది.

    "ఇది ఎవరి అదృష్టం? నీలాంటి భార్య దొరకటం తన అదృష్టమని బాబు  భావించవచ్చు; తనలాంటి పెనిమిటి లభించటం  అదృష్టమని నువ్వు  మురిసిపోవచ్చు. కాని యివన్నీ  కొంతవరకే  నిజం, నీలాంటి కోడలు లభించటం ఈ ఇంటి అదృష్టం."

    "అత్తయ్యా" గాద్గదికంగా  అని ఆమె గుండెల్లో తల దాచుకుంది.

    రంగాజమ్మగారు ప్రేమగా  ఆమె తల నిమురుతూ  చాలాసేపు ఉండిపోయింది. తరువాత పసిపిల్లను తీసుకెళ్ళినట్లు  భారతిని నడిపించి తీసుకువెళ్ళి  ఓ సోఫాలో కూర్చోబెట్టి, తనూ ప్రక్కన కూర్చుంది.

    "ఓ రహస్యం చెబుతాను  విను" అంది  తగ్గుస్వరంతో. "ఈ ఇంట్లో  నీ వెవ్వరెని  చూసీ భయపడనక్కర్లేదు.ఒక వ్యక్తిని తప్ప ఆయన మీ మామగారు!"

    భారతి గుండె  వడివడిగా  కొట్టుకుంది. గంగాధరంగారి  స్వరూపం__చింతనిప్పుల్లాంటి  ఆయన కళ్ళూ, బుర్రమీసాలూ కొట్టవచ్చినట్లుగా  కళ్ళెదురుగా  కనబడింది.

    వేటగాణ్ణి  తలుచుకున్న  పావురంలా  గజగజ వణికింది  భారతి. ఆమె తనూలతలోని  ప్రతి అణువూ కంపించినట్లయింది.

    "ఆయన మాటకు  ఎదురుచెప్పటం  కష్టం  అసలు  ఎవరూ  ఎదురు చెప్పలేరు. బెదర గొడుతున్నానని  అనుకోకు చండశాననుడని  అంటారే_ఆ బాపతు మనిషి. కాపరానికి వచ్చిన  తొలిరోజుల్లో  ఆయన్ని  చూసి హడలిపోయేదాన్ని. నోటంట  మాట వచ్చేదికాదు. హడలిపోయానని ఒకరికి చెప్పుకోవటం కూడా చేతనయేది కాదు."

    భారతి  ముఖంలో  రక్తపు చుక్క లేదు.

    రంగాజమ్మగారి  మృదువైన చెయ్యి భారతి భుజంమీద పడింది. అనుకోకుండా  భారతి అత్తగారి వైపు  జరిగింది.

    "ఇదంతా  ఎందుకు చెబుతున్నానని  ఆశ్చర్యపోతున్నావా! ఈ ఇంట్లో  ప్రతివారి స్వభావం నీకు తెలియాలనే అందరి స్వభావాలనూ  గుర్తించి నువ్వు జాగ్రత్తగా మసులుకుంటావనే  నీ పెళ్ళికి సోపానం ఎలా ఏర్పడిందో చెబుతాను విను."

    భారతి తల ఎత్తి  అత్తగారి ముఖంలోకి  చూసింది.

    "ఒకనాడు  డ్రైవర్ని  తీసుకుని బాబు మీ ఊరివైపుగా  కారులో వచ్చాడట. క్రొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చాక ఎవరితోనూ  మాట్లాడకుండా గదిలోకి వచ్చి పడుకున్నాడు. నేను వచ్చి 'బోజనానికి లే బాబూ?' అన్నాను. 'నాకివాళ  ఆకలిగా లేదమ్మా' అన్నాడు. ఎంత బలవంతం చేసినా తిన్నాడుకాదు. చివరకు కష్టంమీద కాసిని  పాలుమాత్రం  త్రాగించగలిగాను.

    "ఆ మరుసటి నుంచీ  అతని వైఖరి  మరీ మారిపోయింది. అసలే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే స్వభావం కాదనుకో. దానికితోడు ఏదో వేదనతో కుమిలిపోతున్నట్లు  గమనించాను. ముఖంలోని వన్నె తరిగిపోతోంది.

    "ఒకరోజు  ఆయన  లేకుండా  చూసి  బుజ్జగించి  అడిగాను. అలా చాలాసేపు  అడగగా  అడగగా  డ్రైవింగ్ వేర్చుకోటానికి వెళ్ళి, నిన్ను చూసిన విషయం చెప్పాడు. చెప్పి__'మరునాడే డ్రైవరుని  పంపి ఆ అమ్మాయెవరో కనుక్కున్నానమ్మా. కరణం గారిమ్మాయిట. పేరు భారతిట' అన్నాడు.

    "అతని మనోభావం  నా కర్దమయింది."

    "అమ్మా" అన్నాడు దీనంగా  నా వంక  చూస్తూ. "సిగ్గువిడిచి దాపరికం  లేకుండా చెబుతున్నాను. భారతిని చూసిన క్షణం నుంచీ నా మనస్సు  వికలమైపోయింది. ఎన్నడూ తెలియని ఓ కొత్త స్పందనా, కొత్త తాకిడీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నాకేమీ తోచటం లేదు. దిగులు. భరించరాని దిగులు"
 
    "భారతిని నువ్వు ప్రేమించావా?" అని అడిగాను.

    "అవు" నన్నట్లు  తల ఊపాడు.

    "అయితే  ఆలస్యం  దేనికి? ఈ సంగతి మీ నాన్నగారికి స్వయంగా  చెప్పు బాబూ!" అన్నాను.

    "అమ్మో! నేనా?" అన్నాడు భయంగా. ఈ ఇంట్లో  విషయాలు తెలిపే ఈ మాట అన్నావా. అమ్మా? పుట్టి బుద్దెరిగాక  ఏ విషయాన్ని  గురించి అయినా నాన్నగార్ని  నోరు తెరిచి  గుడ్లురిమి చూస్తే నా పంచ ప్రాణాలూ ఎగిరిపోవూ? నన్నింత  పిరికివాణ్నిగా, అర్భకుడుగా, అసమర్దుడుగా  పెంచారు. ఆయన ఎదుట  ఊఁ, ఆఁ అని అనటం తప్ప మరో మాట మాట మాట్లాడి ఎరుగను. ఇహ  నా మనస్సు విప్పి  చెప్పటం  దాకా ఎక్కడ?"

    "అయితే  ఏం చేద్దాం బాబూ?" అని అడిగాను కర్తవ్యం తోచక.

    అమ్మా! చిన్ననాడే నా తల్లి మరణించిందనీ, తరువాత నీవు వచ్చావనీ చెబుతారు. అదేమీ నాకు తెలియదు నీవే నా తల్లివనీ, నా మొర ఆలకించేవారు నీవు తప్ప వేరెవరూ లేరనీ నా విశ్వాసం. చిన్న నాటి నుంచీ నా కోరికలెన్నో చెల్లిస్తూ వచ్చావు. అలాగే  ఈ బాధ్యత కూడా నువ్వే స్వీకరించాలి" అన్నాడు.

    "బి.ఎ. పాసయిన  యువకుడు  అంత పసిగా ,లేతగా, జాలిగా అడిగితే  ఏం చెయ్యాలి? ఆయనగారి ముందు అతనెంతో నేనూ అంతే. అయినా అతని బాధ చూడలేక 'అలాగే బాబూ!" అని మాట ఇచ్చి బరువెక్కిన హృదయంతో  ఇవతలకు  వచ్చేశాను.

    "నాలుగయిదు రోజులు  గడిచిపోయాయి. ఎన్నో సందర్భాలలో ఆయనకీ విషయం చెబుదామని పెదవి దాకా వచ్చేది  కాని ధైర్యం చాలేదికాదు. ఎర్రని  జీరలొలికే  ఆయన కళ్ళలోకి  చూడగానే లోపల మాట  లోపలే ఆగిపోయేది, బాబు దిగులుతో కృశించిపోతున్నాడు. నే నెదుట  పాడినప్పుడు నా వంక జాలిగా చూసేవాడు. ఇద్దరిమధ్యా నలిగి నేను పతనమై పోతున్నాను.

 Previous Page Next Page