Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 10


    "ఇంతకూ మీరేమిస్తున్నారు మరి? బిందెలా, చీరలా?" సావిత్రమ్మ అడిగింది మధ్యనుంచి.
    "అమ్మా, మీకో నమస్కారం నాకు అంతటి తాహతులేదు, నేనేమీ ఇవ్వలేను."    
    "మరి అవతలివాళ్ళు ఇవ్వన్నీ ఇస్తుంటే ఎవరొదులుకుంటారు?"
    "అయ్యో! వదులుకోమని ఎవరన్నారమ్మా? ఎవరేమిస్తే అది తీసుకోండి. ఎలక్షన్లుండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్న సామెత ఉండనేవుంది గదా! అందరి దగ్గరా అన్నీ తీసుకుని ఓటు మాత్రం నాకు వేయండి. నాలాంటి బీదాడికి ఓటుదానం చేస్తే ఎంతో పుణ్యం మీకు. దానాలన్నిటిలోకి 'ఓటుదానం' గొప్పదని మన శాస్త్రాలు ఘోషిస్తూన్నాయి కదా."
    అందరూ చర్చించుకోవడం మొదలెట్టారు. చర్చముగిసే వరకూ అతను నమస్కారం పెడుతూ అలాగే ఉండిపోయాడు.
    చివరకు అందరూ కలిసి శ్యామల్రావుకే ఓటువేయాలన్న నిర్ణయానికొచ్చారు.
    ఆ నిర్ణయం విన్నవెంటనే శ్యామల్రావు ఆనందంతో పొంగిపోయాడు.
    "నాకు చాలా సంతోషంగా ఉంది. మన కాలనీ ఓట్లంటే మాటలు కాదు. సుమారు అయిదువేల ఓట్లు. నేనింక ఎలాంటి ఢోకాలేకుండా గెలుస్తాను. నమస్తే నమస్తే" అంటూ నమస్కారాలు చేసుకుంటూ టాక్సీ దగ్గరకు వెళ్ళాడు. వెనకే అతని కొడుకు "శ్యామల్రావ్ గారికి జై" దేశ్ కీ నేతా - శ్యామల్రావ్ బన్ తా" "ఇండిపెండెంట్ అభ్యర్ధి శ్యామల్రావ్ జిందాబాద్-" అని అరుచుకుంటూ వెళ్ళాడు.
    టాక్సీ వెళ్ళిపోగానే గోపాల్రావ్ మళ్ళీ మైకు దగ్గరకొచ్చాడు.
    "కాలనీ వాళ్ళందరూ కలసి శ్యామల్రావ్ గారికే ఓటు వేయాలని నిర్ణయించడం నిజంగా చాలా గొప్పవిషయం. శ్యామల్రావుగారు డబ్బుకి బీదాడే గాని చదువులో కాదు. ఆయన రెండుసార్లు బి.ఏ. పాసయ్యారు. ఒకసారి కార్పొరేషన్ ఎలక్షన్లో నుంచుని ఓడిపోయారు. గనుక రాజకీయ అనుభవం కూడా వుంది."
    అతనలా మాట్లాడుతూండగానే మరో అరడజను టాక్సీలు వచ్చి ఆగాయ్ అక్కడ. మొదటి టాక్సీలొ నుంచి ఎర్ర టర్కీబనీనూ, పచ్చపాంటూ వేసుకున్న నల్లని లావుపాటి ఆకారందిగింది. ఆ ఆకారం వెనుకే మరికొన్ని ఆకారాలు పంచరంగుల బనీన్లు, దుబ్బు జుట్టూ, చేతుల్లో కత్తులూ చైన్లతో దిగారు. ఒక్కొక్కరే రొమ్ము విరుచుకుని నడుస్తూ అక్కడషామియానాలొ ఉన్న మాకు గస్తీ పోలీసుల్లా నిలబడ్డారు.
    "ఈ కాలనీ ప్రెసిడెంటెవళ్ళయ్యా ఈడ?" అంటూ ఓ పచ్చ బనీనూ నా దగ్గరకొచ్చి అడిగాడు.
    "ప్రెసిడెంటా- అడుగో-వారే!" అంటూ గోపాల్రావుని చూపించాను.
    "ఏయ్ ప్రెసిడెంటూ- జరా బయటకొచ్చి శంకర్ దాదా ని కలువ్!" అన్నాడతను జనార్ధన్ తో.
    "శంకర్ దాదానా!" ఉలిక్కిపడి గోపాల్రావ్.
    "అవ్!"
    అందరం మొఖాలు చూచుకున్నాం.
    శంకర్ దాదా అంటే మా ఏరియాలో తెలీనివారు లేరు. వాడుచేసే కిరాతకాలు అందరికీ తెలుసు.
    ఎప్పుడూ తన గాంగ్ ని వెంబడేసుకుని రోడ్లమీద అడ్డుపడ్డవాడినల్లా పొడుస్తూ- ఉంగరాలు, గడియారాలు, డబ్బులాక్కుపోవడం, పండుగ మామూళ్ళు కత్తిచూపి వసూలు చేయటం చాలా మామూలు విషయం.
    "ఇప్పుడు..... నా..... నా.... నా...... తో ఏమిటి ప....ప..... ప.. పని? ఖంగారుగా అడిగాడు గోపాల్రావ్.
    "గట్ల పరిషానెందుకవుతున్నావ్- శంకర్ దాదా జర్ర నీతో మాట్లాడాల్నని వచ్చిండువయా- నడుమళ్ళా!"
    "అలాగే-పదండి! మీరు కూడారండి వెళ్దాం!" అన్నాడు గోపాల్రావ్ మా వంక చూస్తూ. ముగ్గురం కలిసి శంకర్ దాదా దగ్గరకెళ్ళాం.
    "నమస్కారమండీ? నేనే గోపాల్రావ్ ని" వినయంగా అన్నాడు గోపాల్రావ్.
    "నమస్తే అన్నా! నిన్ను కలవాలని నాల్గుదినాల కెళ్ళి కోషిష్ చేస్తున్న!" అని షేక్ హేండిచ్చి నావంకచూసి "నువ్వెవళ్ళు?" అనడిగాడు.
    "నాపేరు ఉదయార్కర్!"
    "నీ పేరు గాదువయ్యా అడిగేది - నువ్వెళ్ళు అనడుగుతున్న!"
    "అదా- అదీ- నేను కాలనీవైస్ ప్రెసిడెంట్ నండీ!" వినయంగా అన్నాడు గోపాల్రావ్.
    "నీ యవ్వ- గట్ల చెప్పరాదువయ్యా! నాకు తెలీకనేపాయె. ఏదీ- చెయ్ కలుపు-" అంటూ చేయిజూపాడు.
    అయిష్టంగానే కరచాలనంచేశాను.
    "నేను కాలనీ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీనండీ!" ఎందుకయినా మంచిదని అడగకముందే చెప్పేసుకున్నాడు శాయీరామ్.
    "నీయవ్వ- మంచిగయింది- అందరు ఈడనే జమయిన్రు! చెయ్ కలుపు" అంటూ శాయీ రామ్ తో కూడా కరచాలనం చేశాడు.
    "అది సరేగానీ, నేనిప్పుడు ఈడకి ఎందుకొచ్చినానో ఎరుకనా?" అడిగాడతను.
    "తెలీదండీ!"
    "నేను ఎలక్షన్ల ఎమ్మెల్యేగా నిలబడినా- సమజయిందా! అగో- ఆ పని మీదనే ఈడకొచ్చినా! మీరు నాకు జర్ర మదద్ చేయండ్రి! మీ కాలనీ ఓళ్ళందరూ- మీ మాటకు ఇజ్జతిస్తరని మా గాంగోళ్ళుచెప్పిన్రు!" ముగ్గురం షాక్ తిన్నట్లయిపోయాం!
    "అలాగేనండీ అందరికీ చెప్పి తప్పక మీకే వేయిస్తాము-" అన్నాడు గోపాల్రావ్ షాక్ నుంచి త్వరగా తేరుకుని.
    "అయితే నడుమల్లా! మైక్ ల నేను గూడ జరమాట్లాడ్నికి కోషిష్ చేస్త!" అంటూ మైక్ దగ్గరకు నడవసాగాడు. ముగ్గురం అతని వెనకే నడిచాము.
    "సోదర సోదరీమణులారా, ప్రస్తుతం అర్జంటుగా ఓ విషయం మనవి చేయదల్చుకున్నాను. మన నియోజకవర్గం నుంచి శంకర్ దాదా కూడా పోటీ చేస్తున్నట్లు ఆయనే స్వయంగా ఇక్కడికొచ్చి తెలియజేశారు. శంకర్ దాదా గురించి నేను మీకు చెప్పాల్సిందేమీలేదు. ఆయన పేరు చిన్నపిల్లల క్కూడా తెలుసు. కనుక మన ఓట్లన్నీ ఆయనకే వేయాలని ఆయన కోరుతున్నారు. ఇప్పుడు శంకర్ దాదా మాట్లాడతారు" అనేసి పక్కకు జరిగాడు శాయీరామ్.
    శంకర్ దాదా మైక్ దగ్గరకొచ్చి అందరికీ నమస్కారం పెట్టాడు.
    "ఈడున్నోళ్ళందరికీ సలాం జెప్తున్న! శాయీరామ్ అన్న నా గురించి మీకు మంచిగా చెప్పిండు. ఈడున్నోళ్ళల్ల కొంతమంది సోంచాయిస్తుండొచ్చు. దాదాగిరీ చేసేటోడు- ఎమ్మెల్యేగా ఎట్ట నిలబడ్డాడు అని. నిజంవయ్యా నేను మర్డర్లు చేసినా, దొంగతనం జేసిన, జైలుకెళ్ళినా, రేప్ లు చేసినా కానీ ఇన్నిదినాలు మనదేశం పరిపాలించేటోండ్లలొ ఇవన్నీ చెయ్యనోళ్ళెవళ్ళు వయా? మంచిగా సోంచాయించండ్రి! ఇయ్యాళ్రేపు పేపర్లలో చూస్తున్రు గదా దొంగ సిమ్మెంటమ్ముకునేటోడొకడు, ప్రభుత్వం భూములమ్ముకునేటోడొకడు, దొంగస్టాంపులమ్మేటోడొకడు. డాక్టర్ల కొలువులమ్ముకునేటోడొకడు- గిట్ల మినిష్టర్లందరూ దందాలు జేస్తున్రు. గసంటోళ్ళకు ఓట్లువేస్తారువయ్యా? నన్ను గిట్ట గెలిపించిన్రంటే- ఖసమ్ తోటి జెప్తున్న- నేను ఈ మర్డర్లు చేసెడిది- దొంగతనాలు, రేప్ లు చేసెడిది- అన్నీ ఇడచిపెడత! ఏం జెప్తున్న? సమజయిందా. ఇంక నేను పోవాల్నామల్లా?"
    ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అందరూ భయంతో గుడ్లప్పగించి చూస్తుండిపోయారు.
    "అచ్చామైజారవూ అన్నా ఈళ్ళందరితో ఓట్లేయిపించే జుమేదారిమీది ఏమంటున్న? నాల్గుదినాలు అయినాక వస్తమల్లా." అనేసి వెళ్ళిపోయాడతను. మరుక్షణంలొ టాక్సీలన్నీ వెళ్ళిపోయినయ్.

 Previous Page Next Page