Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 10


    పైకి చూపుడువేలు చూపించాడు శశికాంత్ నిస్సేజంగా.

 

    "అంటే?" అన్నారు సుబ్రహ్మణ్యంగారు.

 

    "యాక్సిడెంట్ లో పోయారు మాష్టారు! ఇద్దరూ ఒకసారే." అన్నాడు శశికాంత్ - పాత విషాదం పైకి పొర్లిపోకండా జాగ్రత్తపడుతూ.

 

    తరువాత కాసేపు ఒడార్పులా- పరామర్శలు- సానుభూతి వచనాలు.

 

    "ఇప్పుడు మీరు ఏ స్కూల్లో మాస్టారూ?" అన్నాడు శశికాంత్.

 

    "ఇంకా స్కులేమిటి నాయనా! రిటైరయిపోయాను" అన్నారు సుబ్రహ్మణ్యం గారు.

 

    "యాభై అయిదేళ్ళకే రిటైర్ మెంట్ అని రాత్రికి రాత్రే రూలోకటి పెట్టారుగా? ఆ దెబ్బ తగిలింది ఆయనకి" అంది శారదమ్మ.

 

    "నేను రిటైరయిపోయినందుకు బాధ పడడం లేదు గానీ......అమ్మాయి సంగతే ఏం చేయాలో దిక్కు తోచటం లేదయ్యా! ఇంకా మూడేళ్ళు సర్వీసు వుంది. ఈ లోగా దీనికి మూడు ముళ్ళు వేయించలేక పోతానా" అన్న భరోసా తో ఉన్నాను. ఆలోగా పిడుగుపాటులా ఇది వచ్చిపడింది. ముగ్గురమ్మాయిలకు పెళ్ళి చేశాను నాయనా! ఇది నాలుగోది. ఇప్పుడు దీనికి పెళ్ళి చెయ్యలేకపోతే నలుగురూ నవ్విపోతారు నన్ను చూసి" అన్నారు సుబ్రహ్మణ్యం గారు బాధగా.

 

    శశికాంత్ వైపు ఇబ్బందిగా చూసింది సౌమ్య.

 

    "సర్లెండి! వచ్చే పోయే వాళ్ళందరితో ఆ సంగతే చెప్పుకోవాలా? దాని రాతా మన రాతా ఎలా ఉంటె అలా జరుగుతుంది" అంది శారదమ్మ ఆయన్ని వారిస్తూ.

 

    తరువాత కాఫీ తాగి - అరగంట సేపు మాట్లాడి వెళ్ళిపోయాడు శశికాంత్.

 

    మళ్ళీ సరిగ్గా వారం రోజుల తరువాత తిరిగి వచ్చాడతను.

 

    "కూచో నాయనా! కూచో! అన్నారు సుబ్రహ్మణ్యం గారు చేతిలో ఉన్న భవాన్స్ జర్నల్ పాత కాపి పక్కన పెడుతూ.

 

    "ఏమిటి విశేషాలు?"

 

    "పెద్ద విశేషమే మాస్టారూ!

 

    "ఏమిట్రా అది!"

 

    "మన సౌమ్య సాక్షాత్తూ లక్ష్మిదేవే! మీకు తెలుసా?" అన్నాడు శశికాంత్ నవ్వుతూ.

 

    "తెలియకేం!" లక్ష్మి అని పేరు పెట్టింది నేను కాదూ!"

 

    "ఉత్త పేరుకి మాత్రమే కాదు మాస్టారూ! సౌమ్య నిజంగా లక్ష్మే! శుక్రవారంనాడు నాకు పదిలక్షలు ఇప్పించింది! అని నవ్వి జరిగినదంతా చెప్పాడు శశికాంత్.

 

    అది వింటూనే సుబ్రహ్మణ్యం మొహంలో రంగులు మారాయి.

 

    "ఒక్క నిముషం!" అంటూ లేచి లోపలికెళ్ళారు అయన.

 

    టేబుల్ ద్రాయరులో బొత్తిగా పెట్టిన చాలా లాటరి టిక్కెట్లు తీశారు.

 

    అర్ధాంతరంగా ఉద్యోగం ఉడాక, స్టూడెంట్స్ కి ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టారు అయన. కూతురి పెళ్ళి ఎలా చెయ్యాలో అర్ధం కాక వచ్చే సంపాదనలో సగం పెట్టి లాటరి టిక్కెట్లు కొనడం మొదలు పెట్టారు. అదృష్టం తిరిగి లాటరీ తగిలితే కూతురి పెళ్ళి చెయ్యగలడు తను!

    
    "అంతే! అది తప్ప మరో మార్గం కనబడలేదు.

 

    టిక్కెట్లు పోయినట్లు ఆరోజు నుంచే అనుమానంగా ఉంది తనకి. తను అన్ని రకాల లాటరీ టిక్కెట్లు కొంటాడు.

 

    ఈసారి ఆ ఒక్క లాటరీ టిక్కెట్టు మరచిపోయాడా?

 

    ఉహు! అలా జరగడానికి ఆస్కారం లేదు! అన్నీ కొంటాడు తను. అంటే పోయిన ఆ టిక్కెట్టే సౌమ్యకి  దొరికింది రోడ్డుమీద. ఆ టిక్కెట్టునే సౌమ్య శశికాంత్ కి ఇచ్చింది. దానికే పది లక్షలు ప్రైజు వచ్చింది ఇప్పుడు!

 

    కానీ అంతా అయిపోయి ఆ టిక్కెట్టుకి ప్రైజు కూడా వచ్చిందని తెలిశాక ఇప్పుడు ఆ టిక్కెట్టు తనదంటే ఎలా ఉంటుంది? అత్యాశతో తను అబద్దాలు చెబుతున్నాడని అనుకుడూ శశికాంత్!

 

    ఆ పదిలక్షలు గనక తనకు వస్తే ఆకాశమంతా పందిరేసి ఆర్భాటంగా చేసి వుండేవాడు తన కూతురు సౌమ్య పెళ్ళి!

 

    కానీ ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం! ఎవరికెంత ప్రాప్తమో అంత!

 

    వణుకుతున్న శరీరాన్ని స్వాధీనం లోనికి తెచ్చుకుని - వసారాలోకి వచ్చారు అయన.

 

    అయన బయటికి వచ్చేసరికి సౌమ్య శశికాంత్ ని అడుగుతోంది.

 

    "ఆ లాటరి టిక్కెట్ ఎవరిదో కనుకున్నవా?"

 

    "ప్రయత్నిస్తున్నాను. కానీ తెలుస్తుందనే నమ్మకం తగ్గిపోతోంది" అంటున్నాడు శశికాంత్.

 

    "ఎవరి సొమ్ము వాళ్ళకి దక్కితేనే బాగుంటుంది. సిన్సియర్ గా ప్రయత్నించు. వదిలేయ్యకేం!" అంది సౌమ్య బ్రతిమాలుతున్నట్లు.

 

    "ఆ లాటరి టిక్కెట్టు ఎవరిదో కనుక్కుని, వాళ్ళకి ఇచ్చేయాలనే ప్రయత్నిస్తున్నాను సౌమ్యా! కానీ ఇంతవరకు ఏమి ఎలియలేదు" అన్నాడు శశికాంత్. తరువాత ఆ టిక్కెట్టుని జేబులోంచి తీసి సుబ్రహ్మణ్యం గారికి అందించాడు.

 

    "ఇదే మాస్టారూ! పదిలక్షల ప్రైజు గెలిచినా టిక్కెట్టు! ఎవరో దురదృష్టవంతుడు. దాన్ని పారేసుకున్నాడు. అదృష్టవంతుడిని కాబట్టి  నా దగ్గరికి చేరింది" అన్నాడు నవ్వుతూ.

 Previous Page Next Page