Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 9

 

    సురేష్ తులసిని కౌగిట్లోకి తీసుకున్నాడు.
    "ఇంటికి రాగానే నీతో విషయం చెప్పాలని ప్రయత్నిస్తుంటే వెధవ అడ్డంకులన్నీ."
    "ఏమిటది?"
    "అయ్ లవ్ యూ డార్లింగ్."
    తులసి నవ్వింది, "ఇదా?"
    "ఇదేనని ఎవరన్నారు? ఇది మొదలు."
    "దేనికి?"
    అతను చెప్పటం ప్రారంభించాడు.
    చేతులతో.
    "సాయంత్రం నేను త్వరగా ఇంటికొస్తాను. నువ్వు కూడా వచ్చేసేయ్." అంది అద్దం ముందు నిలబడి.
    "ఓ! నేను ఎప్పుడయినా రడీయే! నువ్వే సాయంత్రాలు వద్దంటావు."
    "ఎప్పుడూ?" అన్నాడు సురేష్.
    తులసి పెదాలు బిగపెట్టి అద్దం ముందున్న దువ్వెన తీసి అతని మీదకు విసిరేసింది.
    "అబ్బ" అన్నాడతడు.
    "లేకపోతె! నేను చెప్పేదేమిటి/ ఇవాళ సాయంత్రం స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేశాను."
    "ఎందుకు?"
    తులసి అతని దగ్గరకొచ్చి బుగ్గ పట్టుకుని గిల్లింది.
    "ఓ మతిమరుపు అవతారం ! మనిద్దరికీ ఫ్రెండ్ షిప్ అయిన రోజిది ఇవాళే నాకు జీతం కూడా వస్తుంది కాబట్టి."
    "ఓస్ అదా! ఇంకా మనిద్దరం హోటల్లో గడిపిన ఆ రోజు తాలుకూ ఉత్సవం అనుకున్నాను."
    తులసి నవ్వుతూ చేయి వూపి త్వరత్వరగా వెళ్ళిపోయింది.
    అతను స్నానం ముగించాడు. డ్రస్ చేసుకుని హిందీ పాటల్లో తన కొచ్చిన ఒకే ఒక్క పాట తాలూకు చరణం మొదలుపెట్టాడు.
    "నైన్ మిలాకర్, చైన్ చురానా కిస్ కా హై యే కాం"
    "అరె, హమ్ సే పూచో, హమ్ కో పతా హై, ఉన్ జాలిమ్ కా నాం."
    గంగాభవాని గడపలో నిలబడి తను వచ్చినట్లు తెలియపరచడానికి దగ్గింది.
    "హలో! లోపలకు రండి!" చిరునవ్వుతో ఆహ్వానించాడు సురేష్.
    "ఇక్కడే మాట్లాడవచ్చు!" అందామె అక్కడే నిలబడి.
    "ఇక్కడ మనిద్దరం ఇలా నిలబడడం ఎవరయినా చూస్తే........"
    "చూస్తే చుడనీయండి! తప్పేముంది?"
    "మన మధ్య ఏమీ లేదనుకుంటారు."
    ఆమె మొహం ఎర్రబడింది . కోపం -సిగ్గు.
    "అంటే?"
    'అంటే అదే - సరే అదలా వుండనీయండి. తులసి కోసం వచ్చారు కదూ యిప్పుడు?"
    "మీతో మాట్లాడానికే వచ్చాను."
    "నాకు ముందు మాట్లాడటం యిష్టముండదు - తర్వాతయితే ఎంత సేపయినా మాట్లాడతాను.'
    "ముందేమిటి?" అనుమానంగా అడిగింది.
    'ఇంతకూ ఏం మాట్లాడానికొచ్చారు?"
    "ఇంటి అద్దె గురించి."
    "దాన్ని గురించి మాట్లాడేదేముంది? రెండు నిమిషాలు మౌనం పాటిస్తాము నేను తులసి."
    "మీ పాత రూమ్ తాలుకూ ఓనరు ఆరు నెలల అద్దె బాకీ కోసం వచ్చాడంటే , మా యింటి విషయంలోనూ అలాగే చేస్తారని నాకు తెలుసు. అందుకే ఇంకొక్క నెల అద్దె అడ్వాన్స్ కావాలి."
    అతను చకచకా ఆలోచించాడు.
    "మీరలా తొందరపడకండి. ఇంకొక నెల ఆగితే మీకు ఆరు నెలల అద్దె అడ్వాన్స్ కావాలన్నా యిచ్చేస్తాము."
    'అంటే........మీకు వుద్యోగం వచ్చిందా?"
    "అవును, ఇరాక్ లో ఇంజనీరుగా వెళుతున్నాను. అరబ్ దేశాల సంగతి మీకు తెలీందేముంది/ తెగ డబ్బు?"
    "అవును - ఆ సావిత్రి వాళ్ళ అయన కూడా......."
    "డబ్బే కాదు - బోలెడు ఫారిన్ గూడ్స్, కెమెరా, టి.వి. , వి.సి.ఆర్ , వాచీలు, టేప్ రికార్డర్లు , చీరలు."
    గంగాభవాని మోహంలో అనందం తొణికిసలాడింది.
    అతనూహించినట్లే అద్దె విషయం మర్చిపోయింది.
    "ఎప్పుడు వెళుతున్నారు?"
    "వచ్చేవారం. అంటే వచ్చే వారం ఈపాటికల్లా అక్కడి నుంచే మీతో ఫోన్లో మాట్లాడుతుంటాను. వస్తాను పాస్ పోర్టు ఆఫీస్ కెళ్ళాలి."
    వడివడిగా బయటికొచ్చి తలుపుకి తాళం వేశాడతను. గంగాభవాని వాళ్ళింటి గడపలోనే నిలబడింది.
    బస్ లో ఇంతర్య్వు జరిగేచోటకు చేరుకునేసరికి పది.......ఇంకో అరగంట టైముంది.
    అభ్యర్దులంతా గుమిగూడి మాట్లాడుకుంటున్నారు.
    "వేకేన్సీలు పాతిక! ఆ వేకేన్సీల్లో పాతికమందీ పనిచేస్తోనే వున్నారు. వాళ్ళను కన్ ఫారం చేయడానికే ఈ ఇంతర్య్వు ఏర్పాటు చేశారు."
    'అంటే బయటివాళ్ళెవరికీ దొరకవా?"
    "ఇంకేం దొరుకుతాయి మట్టి, సంవత్సరం నుంచీ పనిచేస్తున్న వాళ్ళు లోపల్లోపల సొరంగాలు తవ్వకుండా వుంటారా?"
    ఓ క్లర్క్ వచ్చి అందరి పేర్లు రాసుకెళ్ళడు.
    మొదటి పేరు సురేష్ కే వచ్చింది. లోపల కెళ్ళాడతను. ఇద్దరే ఉన్నారు ఇంటర్వ్యు చేసేవాళ్ళు.
    "ఈ కంపెనీలో తయారయ్యే వస్తువులు అమ్మకం పెరగాలంటే  మీరేం చేస్తారు?"
    "కొత్త స్కీమ్ పెడతాను."
    "ఏమిటా స్కీమ్స్?"
    "మీరు నాకు తప్పకుండా జాబ్ యిస్తానంటే చెప్తాను. లేకపోతె నా స్కీమ్స్ విని నన్ను బయటకు గెంటి మీరే ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకుని పైకి వెళ్ళిపోతారు."
    అతను నవ్వాడు.
    "గుడ్ జోక్!"
    "మీ టెస్ట్ చాలా పూర్ స్టాండర్డ్ లో వుంది. అది బాడ్ జోక్."
    అతని మోహంలో వోల్టేజ్ తగ్గిపోయింది.
    "వాటీజ్ దట్ స్కీమ్?"
    "మన కంపెని టీవీలు కొన్న వారందరిలోనూ లాటరీ వేసి వందమంది విజేతలను ఎన్నిక చేసి వారిని ఒక వారం రోజులు కాశ్మీర్ లో గడిపేందుకు పంపిస్తాం."
    "ఇందులో కొత్తేముంది?"
    "ఎందుకు లేదు? ఆ వారం రోజులూ వాళ్ళు ఎంజాయ్ చేసేందుకు అమ్మాయిలను కూడా మనమే సప్లయ్ చేస్తాం.'
    రెండో అతని ఒల్టేజ్ కూడా తగ్గిపోయింది.
    "ఒకవేళ విజేతలు స్త్రీలయితే ?"
    "అబ్బాయిలను సప్లయ్ చేస్తాం."
    "వెరీ బాడ్ టెస్ట్. మన దేశంలోని స్త్రీల గురించి అలా మాట్లాడటానికి నీకు సిగ్గువేయడంలేదు?"
    "మగాళ్ళ అండర్ వేర్స్ నుంచీ సిగరెట్లూ, బీడీలు, బ్రాందీలూ, పరుపులు, మంచాలు అన్నిటికి అడాళ్ళను వ్యాపార ప్రకటనల్లో వాడటం లేదూ?"
    "దటీజ్ డిఫరెంట్....."
    "దిసీజ్ అల్సొ డిఫరెంట్ సర్! డెఫినెట్ లీ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కి మన కస్టమర్లకి. ఇక అమ్మాయిలకా కొదవలేదు......! సంతలో అమ్మే దేశమేగా మనది......"
    "లేదా స్కీమ్ కొంచెం మార్చవచ్చు, అయిదు టీవీలు కొన్నవారికి ఒక అమ్మాయి వుచితం......."
    గమనిక : "అమ్మాయిల స్టాక్ ఉన్నంత వరకే ఈ స్కీమ్ అమలులో వుంటుంది గనుక వెంటనే పరుగెత్తండి."
    "యూ కెన్ గో నౌ"
    'ఇంకో స్కీమ్ కూడా వుంది సార్! నాకు జాబ్ ఇచ్చినా , ఇవ్వకపోయినా మీరు వుపయోగించుకోవచ్చది."
    "దట్సాల్ రైట్! యూ కెన్ గో...."
    "అదేమిటంటే - టి.విలో మన కంపెని తరపున ఒక సీరియల్ ప్రదర్శించడం! ఆ సీరియల్లో కద ఏమిటంటే - ఒక కంపెనీలో బంధువులందరికీ టెంపరరీ ఉద్యోగాలిచ్చేయటం. తరువాత సరదాగా నామమాత్రంగా ఒక ఇంటర్వ్యు పెట్టడం, ఆ ఇంటర్వ్యు కి యిద్దరు గుంటనక్కల ముఖాల వెధవలు రావడం, పాత వారినే సెలక్ట్ చేసుకుని, కొత్తవారిని చూసి నవ్వుకోవడం, మాంచి ఎంటర్ టయిన్ మెంట్ ప్రోగ్రాం అవుతుంది."
    వాళ్ళ పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
    సురేష్ బయటికొచ్చేశాడు.
    తిన్నగా లైబ్రరీ కెళ్ళాడు.
    "హలో" అంది కళ్ళజోడు పిల్ల.
    "హలో......."
    "రెండ్రోజుల్నింఛి రావడం లేదే?"
    అతను ఆ అమ్మాయి వైపు రెప్పవాల్చకుండా చూశాడు.
    "యూ ఆర్ వెరీ బ్యుటీపుల్."
    "నేనడిగిందది కాదు" నవ్వుతూ అంది.
    "ఆదివారం మా గాళ్ ఫ్రెండ్ కి హాలిడే కదా.......అందుకని చాలా బిజీగా వుంటాం."
    ఆమె సిగ్గుపడింది.
    "మీ కోసం కట్ చేసి ఉంచానిది" ఓ పేపర్ కటింగ్ అతనికిస్తూ అందామె.

 Previous Page Next Page