ఆ వ్యక్తి భావాలు నాకెంతవరకు అర్ధమయాయి?
ఇది చంచలం, చపలత్వం కాదనీ, శాశ్వతమైన విలువలు కలిగినవని నేను నమ్ముతున్నానా?
కుటుంబసభ్యుల ఆమోదంతో ఈ ప్రేమకు ఓ రూపం ఇవ్వగలనా?
కుటుంబసభ్యులు ఆమోదించకపోతే స్వతంత్ర్య జీవనంతో ఈ ప్రేమను నేను నిలబెట్టుకోగలనా?
అసలిప్పుడు నేను ఎందుకు ప్రేమలో పడుతున్నాను? ఈ దశలో ప్రేమలోకి ప్రవేశించటం నాకంత అవసరమా?
అలా ప్రేమలో పడి నా భవిష్యత్తును పూర్తిగా గానీ, కొంతవరకు గానీ చెరిపేసుకుంటున్నానా?
న అజీవితాన్ని నేను తీర్చిదిద్దుకునేదాకా ప్రేమలో పడకుండా వుండలేనా?
ఈ ప్రేమవల్ల అవతలి వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నానా?
అవతలి వ్యక్తి జీవితంతో ఆడుకుంటున్నానా?
ఒకవేళ మా పెళ్ళి జరిగితె మధ్యలో మా పెళ్ళి తెగిపోదనే నమ్మకం నాకుందా?
ఆర్ధిక సమస్యలూ, కోరికలూ మా ప్రేమకు విఘాతం కలిగించవన్న ఆత్మ విశ్వాసం నాకుందా?
ఇదేమిటి ఇంత దీర్ఘంగా, చాదస్తంగా ఆలోచించాలా అన్న మీమాంస మీకు వద్దు ఆలోచించితీరాలి!
ప్రేమ పరాకాష్ఠకు చేరుకుంటున్న దశలో, అప్పుడు సీరియస్ గా ఆలోచించి సమస్యల వలయంలో చిక్కుకునే బదులు ముందే సీరియస్ గా ఆలోచించగలిగితే సమస్యలు ఆ తర్వాత ఏర్పడకుండానే తప్పించుకోవచ్చు.
మీరు పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలు చూశారు. ఎంతోమంది ప్రముఖ సినీనటుల జీవితాలను చూశారు. ప్రిన్సెస్ డయానా దయనీయగాథను చూశారు. వాళ్ళ జీవితాలు ఎందుకు అతలాకుతలమైపోయాయి? వాళ్ళెందుకు రాజీపడలేకపోయారు? వాళ్ళు తెలివితక్కువ వారా? వాళ్ళ ప్రేమలో నిజాయితీ లేదా? వాళ్ళకి సంసార జీవితమ్మీదా, సాంఘిక జీవితంమీదా గౌరవం లేదా?
అన్నీ వున్నాయి. కాని వారి నిర్ణయంలో ఎక్కడో తప్పు వున్నది. వారేమీ బాధ్యతను విస్మరించలేదు. కాని ఆ తప్పు బాధ్యతను కాపాడుకోవటంలో అశక్తులు అయ్యేటట్లు చేసింది.
పాజిటివ్, నెగెటివ్
ప్రతిమనిషిలోనూ పాజిటివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ అనే రెండు దృక్పథాలు వుంటూ వుంటాయి.
పాజిటివ్ థింకింగ్ అంటే అనుకూల దృక్పథంతో ఆలోచించటం. నెగెటివ్ థింకింగ్ అంటే వ్యతిరేక దృక్పథంతో ఆలోచించటం. తెలుగు వ్యక్తీకరణ కంటే ఇంగ్లీషు వాడకమే సరిపోయినట్లుగా వుంటుందని ఇంగ్లీషు పదాలే వుంచేస్తున్నాను.
ఈ రెండు దృక్పథాలు గురించీ విశదంగా, చాలా లోతుగా రాయదలిచాను. ఎందుకంటే మిమ్మల్ని మీరు చూసుకోవటానికి పనికివచ్చే ఏ అంశమూ, మీ ఎదుగుదలకు పనికివచ్చే ఏ అంశమూ నేను తేలిగ్గా విడిచిపెట్టదలచలేదు.
మనుషుల్ని పీల్చి పిప్పి చేసే ముఖ్యాతి ముఖ్యమైన అంశం నెగెటివ్ థింకింగ్.
నిజం చెప్పాలంటే మనిషి నెగెటివ్ థింకింగ్ కు అలవాటు పడిపోయాడు.
ఏ మనిషి గురించీ... సంఘం గురించీ.... చుట్టుముడుతున్న సమస్యలగురించీ, స్నేహితుల గురించీ, బంధువుల గురించీ, కుటుంబసభ్యుల గురించీ, భార్యాభర్తల్లో ఒకరి గురించి ఒకరూ, ఆఖరికి తనని గురించి తానూ నెగెటివ్ దృక్పథంతో ఆలోచిస్తూ వుంటాడు.
అంటే ఈ నెగెటివ్ దృక్పథం మనిషిని పీల్చి పిప్పి చేస్తోంది. ఎంత ప్రయత్నించినా దాన్నుంచి బయట పడలేకుండా వున్నాడు.
ఎందుకు బయట పడలేకపోతున్నాడంటే-అసలు బయటపడటం తనకిష్టంలేదు గనుక.
అసలు ఈ నెగెటివ్ థింకింగ్ ఎందుకు ప్రారంభమై వుంటుంది?
మీరు చిన్నపిల్లల్ని.... అంటే రెండునుంచి అయిదేళ్ళ మధ్య మరీ.... చూడండి వాళ్ళకి మన ఉద్దేశాలు తెలుస్తూ వుంటాయి. కాని ఆ ఉద్దేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వుంటారు.
మనం ఏ పనైతే చేయొద్దంటామో ఆ పని చేస్తూ వుంటారు. మనం చేయమన్న పని చేయరు.
"నా దగ్గరకు రా, ప్లీజ్!" అని ఎంత బతిమిలాడినా రారు. "రావద్దు, నేను నిన్ను ఎత్తుకోనుగా?" అంటే పరిగెత్తుకు వచ్చేస్తారు.
కొంత వయసు పెరుగుతున్నకొద్దీ వాళ్ళకు రకరకాల అభిరుచులు ఏర్పడుతూ వుంటాయి. అందులో కొన్ని మంచివి కావచ్చు. కొన్ని చెడ్డవి కాకపోయినా పనికి మాలినవి కావచ్చు. కొన్ని నిజంగా చెడ్డవి కావచ్చు. అవి శ్రుతిమించుతున్నప్పుడు తల్లిదండ్రులను వ్యాకులపరుస్తూ వుంటారు.
కొందరు పిల్లలు కనిపించిన వస్తువునల్లా పాడుచేస్తూ వుంటారు. వాటిలో కొన్ని విలువైనవి కూడా వుంటాయి. రిస్ట్ వాచీలు, కళ్ళజోళ్ళు, టేప్ రికార్డర్ లు, పెద్దలు వాయించుకునే ఇన్ స్ట్రుమెంట్స్, గిటార్ లాంటివి అర్ధంపర్ధం లేకుండా వాటిమీద దండయాత్ర చేసి నాశనం చేసి పారేస్తూ ఉంటారు. రోజూ చదువుకునే దినపత్రికలూ, ఎంతో అమూల్యంగా దాచుకుని చదువుకునే పుస్తకాలూ చించిపారేస్తూ వుంటారు.
అలాంటి సందర్భాలలో పెద్దలు మందలించటం, ఒక్కొక్కసారి చెయ్యి చేసుకోవటం జరుగుతూ వుంటుంది. ప్రపంచంలో అత్యంత సాధరణమైనది....ఎవరు తప్పు వాళ్ళు ఒప్పుకోకపోవటం.
ఈ తత్త్వం చిన్నతనంనుంచీ పునాదులు వేసుకుంటుంది.
మధ్యలో అప్రస్తుతమైనా ఓ విషయం..... కొంతమంది పెద్దవాళ్ళు..... ముఖ్యంగా తల్లులు తమ పిల్లలు పక్క ఇళ్ళకు వెళ్ళి వస్తువులు పాడుచేస్తూ వుంటే చూస్తూ ఊరుకోవటమే కాక ముఖాల్లో తన్మయత్వం కనబరుస్తూ వుంటారు. కొందరి ఇళ్ళల్లో ఇతరుల పిల్లలు వచ్చినట్లయితే బయట, లేకపోతే వరండాలో నిలబడి మాట్లాడాలి. తమ పిల్లలు మాత్రం పక్కఇళ్ళకు.... గదుల్లోకి దూసుకెళ్ళి పక్కలుకూడా ఎక్కి తొక్కేస్తారు. అయినా ఆ తల్లులు చిరునవ్వులతో తమపిల్లలు ఏదో ఘనకార్యాలు సాధిస్తున్నట్లు చూస్తూ ఊరుకుంటారు.
ఆ చిన్నతనంలోనే పెద్దలమీద వారికో అభిప్రాయం ఏర్పడుతుంది. అది ద్వేషం కాకపోవచ్చు. ఈ సందర్భంలో ద్వేషమనేది చాలా పెద్ద పదమవుతుంది. అది కేవలం తమ ఇంట్లోని పెద్దవారిమీదే కాకుండా అలా మలుపులు తిరుగుకుంటూ వెళ్ళిపోయి చివరికి ఓ ముద్రగా ఏర్పడుతుంది.
ఆ ముద్రలోంచే నెగెటివ్ నెస్ పుట్టుకువస్తుంది.
అలా ప్రారంభమైన నెగెటివ్ నెస్ వయసు పెరుగుతున్నకొద్దీ అనేకరూపాలు ధరిస్తూ వుంటుంది.
అతనిలో అనుకూల శక్తులు ఎన్నివున్నా, వాటిని హరించేసే బలీయమైన ప్రతికూల శక్తిగా మారిపోతుంది.