"బార్ రేటెంత? చెప్పు" మధుకర్ మత్తు పూర్తిగా తలకెక్కి పోయింది.
"సార్! మీరు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు" ఆత్మాభిమానం దెబ్బతిన్న స్టీవర్డ్ అన్నాడు ఒకింత బాధగా.
"అమర్యాద... ఏమిట్రా మీకు తెల్సిన మర్యాద? మీ సర్వీస్ ఏమిట్రా? సూట్, బూట్ వేసుకుని ఆంగ్లంలో "ఎస్ ప్లీజ్' అంటూ అటూ ఇటూ ఊరికే తిరిగే బడుద్ధాయిలు - మీకసలు కస్టమర్ ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసా?"
చూస్తుండగానే గొడవ పెరిగిపోతోంది.
మూర్తికి చాలా ఆనందంగా వుంది.
ఇన్ ఫీరియారిటీని నరనరాన నింపుకున్న మూర్తి ప్రశాంతత, శాంతి, స్నేహం, ఎదుగుదల అంటే భరించలేడు.
తను ఎదగడు- ఎదిగేందుకు ప్రయత్నం చేయడు. ఎదిగేవాళ్ళను చూస్తే మనశ్శాంతిగా వుండలేడు.
"రాఘవేంద్ర నాయుడుగారు తెలుసా? ది గ్రేట్ ఇండస్ట్రియల్ ఎంపరర్. ఆయన మా ఫాదర్. మేం ఒకసారి సరదాగా పార్టీ ఇచ్చినంత కూడా వుండదు ఈ,మీ, బోడిబార్" మధుకర్ నోటివెంట మాటలు ముద్దగా వస్తున్నాయి.
అంతలో మేనేజర్ అక్కడికి వచ్చాడు చస్తూ బ్రతుకుతూ. "ఏమయింది సార్... ఏదైనా అసౌకర్యం?" మేనేజర్ ఎయిర్ ఇండియా మహారాజులా వినయంగా తలని ఒకింత వంచుతూ అడిగాడు.
"ఏమయిందా? ఏమి కావటం లేదిక్కడ? బార్ ని మెయిన్ టైన్ చేసే విధానమా ఇది? నీట్ గా యూనిఫాం వేసుకుని, గుసగుసలాడుకుంటూ ఆంగ్ల దొరల్లా ఫోజు కొడుతున్నారే తప్ప కస్టమర్స్ ని పట్టించుకుంటున్నారా? అడిగింది సప్లై చేస్తున్నారా? అలా అని మీ మేనేజ్ మెంట్ అబ్జర్వ్ చేస్తుందా? సైకలాజికల్ ట్రీట్ మెంట్ అండ్ సాటిస్ ఫేక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దేన్ అదర్ థింగ్స్. ఒకసారి బార్ కి వచ్చినవాడు మరోసారి వచ్చేలా చేసుకోవాలి.
మానసికమైన తృప్తి చాలా అవసరం. ఏదో వచ్చారు, మందు సప్లై చేశాం, డబ్బిచ్చి వెళ్ళారు.ఇంతేనా బిజినెస్ అంటే? యూనో జపనీస్ స్టయిల్ ఆఫ్ బిజినెస్...? యూ డోంట్ నో... గల్లాపెట్టె దగ్గర కూర్చుని డబ్బులు లేక్కేసుకోవటం, వాటిని పొందికగా పేర్చుకుని, రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవటం. స్టుపిడ్ ఫెలోస్.
హోమ్లీ ట్రీట్ మెంట్.
యూ నో హోమ్లీ ట్రీట్ మెంట్??
ఆ! చెప్పు...?" బిట్టర్ గా అన్నాడు మధుకర్.
బిజినెస్ గురించి బాగా తెల్సినవాడతను అని బార్ స్టాఫ్ మధుకర్ గురించి అనుకుంటే, తనకు తెలీకుండానే అంతర్లీనంగా తన తండ్రి రాఘవేంద్రనాయుడి వ్యాపార సూత్రాన్ని జీర్ణించుకున్నాడా మధుకర్ అని మూర్తి ఆశ్చర్యపోయాడు.
పులిబిడ్డ పులిబిడ్డే...
బిజినెస్ మెన్ కొడుకు బిజినెస్ మెన్నే-!!
"అసలు మీ బోడి బార్ రేటెంత-?" అంతకంతకు రెచ్చిపోతున్నాడు మధుకర్.
ఇక్కడిలా వుండగా కౌంటర్ లో వున్న ఫోన్ రింగయింది. అది తెలిసిన మేనేజర్ ఇప్పుడేవస్తానంటూ అటుకేసి పరుగెత్తికెళ్ళి ఫోన్ ఎత్తాడు.
"హలో... మధుకర్ బార్ అండ్ రెస్టారెంట్ ప్లీజ్" అన్నాడు మేనేజర్ టెన్షన్ పడిపోతూ.
"నేను... మహతిని... మడికేరీ నుంచి మాట్లాడుతున్నాను. నాన్నగారున్నారా?" ఫోన్ కి అటువైపు నుంచి మహతి ప్రశ్నించింది.
"లేరమ్మా... ఇంకా రాలేదు...!!" మేనేజర్ హడావిడి పడిపోతూ.
"ఏమిటి మీ వాయిస్ అలా వుంది? ఆందోళన, ఉద్రిక్తత తొంగిచూస్తోంది. ఎనీ థింగ్రాంగ్...?" మహతి ఫోన్ కి అటువైపు నుంచి తిరిగి ప్రశ్నించింది.
మేనేజర్ నాలిక్కరుచుకున్నాడు.
ఆమె సంగతి మేనేజర్ కి తెలుసు.
అసలు సంగతి చెప్పకుంటే వదలదు.
"చిన్న గొడవమ్మా. ఎవరో కస్టమర్ గొడవ చేస్తున్నాడు."
"ఏమంటున్నాడు?"
"మీ బార్ రేటెంతో చెప్పు కొనేస్తానంటున్నాడు."
"అక్కడిదాకా వచ్చిందా? సర్ది చెప్పండి.... కస్టమర్స్ ని మర్యాదగా చూసుకోవాలి. సైకలాజికల్ సాటిస్ ఫేక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దేన్ జస్ట్ ఫిజికల్ సర్వీస్."
"అతనూ అదే అన్నాడమ్మా...." అని తిరిగి నాలిక్కరుచుకున్నాడు మేనేజర్.
"అతనూ అదే అన్నాడా? దెన్ హి ఈజ్ ఏ ఇంటలిజెంట్ బిజినెస్ మెన్. బైదిబై హు ఈజ్ దట్ గై..."
"ఎవరో మధుకర్... డి గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రాఘవేంద్ర నాయుడుగారి కొడుకట" మేనేజర్ యధాలాపంగా చెప్పాడు.
"వ్వాట్...?" ఫోన్ కి అవతలివైపున్న మహతి ఉలిక్కిపడుతూ అరిచినట్లుగా అంది.
"అవునమ్మా..."
"ఏమంటున్నాడన్నారు?" ఆమె కంఠంలో తొంగిచూసిన ఆసక్తికి, ఆతృతకి మేనేజర్ క్షణకాలం ఆగాడు.
"బార్ రేటెంతో చెప్పు, కొని అవతల పడేస్తానంటున్నాడు. ఎంత చెప్పినా వినటం లేదు. డబ్బుందన్న పొగరమ్మా- అతనితోపాటు ఒక ఎఫ్. ఎస్ గాడొచ్చాడు మూర్తని- వాడిదివరకు మన బార్ కొచ్చి బాగా తాగి డబ్బులేదంటే వాచీ ఊడబెరుక్కుని పంపించాం. అతనే ఇతన్ని రెచ్చగొట్టాడని మనవాళ్ళు చెప్పారు. ఇవి మనకెప్పుడూ వుండేవేగా-! నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. టూర్ బాగా సాగుతోందా తల్లీ - బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అక్కడ చలి, మంచు, వర్షం ఎక్కువట - అదే చెప్పి అమ్మ ఇక్కడ భయపడుతున్నారు. జాగ్రత్తమ్మా... స్వెట్టర్ వేసుకో తల్లీ." మేనేజర్ తన సహజ ధోరణిలో అన్నాడు.
అవేమీ ఫోన్ కి అవతల వున్న మహతి చెవికెక్కలేదు.
"నే చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పినట్లు చేయండి - మన బార్ రేటెంతుంటుంది?" మహతి కంఠంలో తొంగిచూసిన స్థిరత్వానికి మేనేజర్ ఉలిక్కిపడ్డాడీసారి.
"అదీ... నేను సర్దుతాగా?"
"టెల్ మి ద రేట్" సీరియస్ గా అడిగింది మహతి.
ఆమె సంగతి బాగా తెల్సున్న మేనేజర్ క్షణకాలం తికమకపడ్డాడు.
"అదీ...."
"టెల్ మి ఐసే."
"లైసెన్స్, సరుకు, గుడ్ విల్... అదీ కలిసి పదిలక్షలదాకా వుంటుంది" గడగడా చెప్పేసాడు భయపడుతున్నట్లుగా.
"ఆ మధుకర్ ని మీరెళ్ళి బాగా రెచ్చగొట్టండి. తిరిగి రేటడిగితే పాతిక లక్షలు - ఏం కొంటావా? నీవల్న ఏమవుతుంది? అని బాగా ఇరిటేట్ చేయండి. అతను మొండికెత్తి కొంటానంటాడు. అప్పటికప్పుడు ఐదు రూపాయల స్టాంప్ పేపర్స్ తెప్పించి మధువన్ బార్ ని పాతిక లక్షలకు కొన్నాను. డబ్బు వెంటనే ఏర్పాటు చేస్తున్నాను అని రాయించుకుని ప్రక్కనున్న కస్టమర్స్ సంతకాన్ని సాక్షి సంతకాలుగా తీసుకోండి. ఇందులో తేడా వచ్చిందో ఊరుకోను." "కాని... అమ్మా... అతడేదో తాగి, తమాషాకి అంటే... బంగారం లాంటి బార్ ని అమ్ముతాననటం... అయినా అతనేదో తాగిన మైకంలో అంటున్నాడు -నిజంగా జరిగేదేనా...?"