Previous Page Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 9

    ఫోన్స్ లో మాట్లాడుతూనే మధ్యమధ్య మోత్ పీస్ మూసి వాళ్ళతో మాట్లాడుతూ, అటు ఫోన్ లో మాటలూ, ఇటు వీళ్ళమాటలూ వింటూ చకచక వ్యవహారాలూ పరిష్కరిస్తున్నాడు జయపాల్. అతని సామర్ధ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది వేద-వేద 'సార్!' అని ప్రారంభించేలోగానే ఎవరో ఒకరు వస్తున్నారు. అతను 'యస్?' అంటున్నాడు. ఐనా ఆమె చెప్పలేకపోతోంది. తన సమస్య నలుగురిలో చెప్పుకునేది కాదు. ఈలోగా ఇతరులు తమ విషయం ప్రారంభించేవారు. ఈ రకంగా గంటలు దొర్లిపోయాయి. గడియారం నాలుగు కొట్టింది. ఎక్కడ పనులక్కడ ఆపేసి చటుక్కున లేచి నిలుచున్నాడు జయపాల్. ఆమెని చూస్తూ "సారీ! నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. నేను రేపే బొంబాయి వెళుతున్నాను. మీ పని అర్జంటయితే నన్ను వచ్చి బొంబాయిలో కలుసుకోవచ్చు. నా పి.ఏ.తో మాట్లాడండి. అతడు వివరాలన్నీ చెపుతాడు" అని ఆఫీస్ లోంచి వెళ్ళిపోయాడు, ప్రాణం ఉసూరుమంది ఆమెకి. తను బొంబాయి వెళ్ళగలదా? అదెలాగూ జరగదు.
    ఇక ఈ ఉద్యోగంకూడా దొరకదన్నమాట! అనుకుని నిరాశగా వెళ్ళిపోబోతూ పోనీ, అతడే మళ్ళీ బొంబాయినుంచి ఎప్పుడు వస్తాడో కనుక్కుందామని పి.ఏ. దగ్గరికి వెళ్ళింది....వేద చెప్పినమాటలకు పి.ఏ. ఆశ్చర్యంగా "బొంబాయివచ్చి కలుసుకోమన్నారా? సాధారణంగా అలా ఎవరినీ రమ్మనరు. తప్పకుండా వెళ్ళండి__మీ పని అయిపోయినట్లే!" అన్నాడు.
    ఎందుకో ఆ మాటలు చాలా చెడుగా వినిపించాయి ఆమెకి. "నేను బొంబాయి వెళ్ళలేను!" అంది.
    "అదేం?"
    "నా దగ్గర అంత డబ్బు లేదు."
    "ఆయన మిమ్మల్ని రమ్మన్నారు. అంటే రానుపోను విమానం ఖర్చులు, అక్కడ హోటల్ ఎకామడేషన్ అన్నీ ఆయన భరిస్తారన్నమాటే! మీరు వెళ్ళదలచుకుంటే చెప్పండి ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను."
    "అయినా నేను వెళ్ళను."
    "మీ ఇష్టం, మీ మేలుకోరి ఒక మాటమాత్రం చెపుతున్నాను. మీ ఇష్టం లేకుండా బలాత్కారంగా ఏదీ జరగదు, అది ఖచ్చితంగా చెప్పగలను. మరొకటి! ఆయన ఎవరికంటే వాళ్ళకి ఇలాంటి అవకాశమివ్వరు. మీరు వెళ్ళటమే మంచిది, ఆలోచించుకోండి. ఈ వారమంతా ఆయన బొంబాయిలోనే ఉంటారు. మీరు రేపయినా మీ అభిప్రాయం నాకు చెప్పవచ్చును."
    ఆ మాటలనేసి అతడు తల వంచుకుని తన పని తాను చూసుకోసాగాడు. అక్కడ అంతా యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది.
    వేద ఇంటికిరాగానే అన్న ఎంతో ఆరాటంగా, "జయపాల్ గారిని కలుసుకున్నావా? ఏం జరిగింది?" అని అడిగాడు. నోటితో అడగకపోయినా దైన్యంనిండిన కళ్ళతో అదే ప్రశ్న అడిగాడు మంచంలో ఉన్న తండ్రి. రూపుదాల్చిన శోకదేవతలా మాట్లాడటానికీ, ఆలోచించటానికీ కూడా ఓపిక లేక అయోమయంగా చూడసాగింది తల్లి. గీత గబగబా వంటింట్లోకి పరుగెత్తి కాఫీ వేడి చేసి గ్లాసులోపోసి అక్కకిచ్చింది. ఒక మూలకి కూలబడి, గీతకి కళ్ళతోనే కృతజ్ఞత చెప్పుకుంటూ, నెమ్మదిగా కాఫీ సిప్ చేస్తూ "ఆయనకి నన్ను ఇక్కడ కలుసుకోవటానికి వీలు లేకపోయింది. నన్ను బొంబాయికి రమ్మన్నారు" అంది. కొన్ని క్షణాలు అతిదారుణమైన నిశ్శబ్దంతో దొర్లిపోయాయి. ముందుగా అన్నగారే గొంతు విప్పాడు.
    "అంతదూరం నువ్వు వెళ్ళక్కర్లేదు. అదొక లేని పోని ఖర్చు" అన్నాడు. వేద అన్న ముఖంలోకి చూస్తూ "ఖర్చు మనకేమీ లేదు అంతా ఆయనే భరిస్తారట!" అంది. జ్ఞానస్వరూప్ గొంతు పొడారిపోయింది. పెదవులు కదిలాయి. కాని మాటలు బయటికి రాలేదు. పాలిపోయిన ముఖంతో అతను, తీక్షణమైన చూపులో వేద, ఒకరినొకరు చూసుకుంటూ వుండిపోయారు కొంతసేపు. వేద తల వంచుకుని స్థిమితంగా కాఫీ త్రాగసాగింది. జ్ఞానస్వరూప్ గొంతు సర్దుకున్నాడు.
    "పోనీ, వెళ్ళరాదూ? ఆయన నిజంగా ఉద్యోగం ఇప్పిస్తారేమో? ఈ రోజుల్లో ఆశ్రయింపులు లేకుండా ఏ పనీ జరగటం లేదు."
    అతని గొంతు అతనికే వికృతంగా వినిపించింది .వేద తండ్రి వైపు చూసింది. పెద్ద దగ్గుతెర వచ్చి ఆ ముసలి బక్క ప్రాణాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. తల్లి గభాలున లేచివచ్చి భర్త గుండెలను చేతితో రాస్తూ వేద ముఖం చూసి పైటకొంగుతో ముఖం దాచుకుంది. దూరంగా కూచుని అందరి మాటలూ వింటున్న గీత లేచివచ్చి అక్క దగ్గిరగా కూచుంది. వేద అన్నను ఉద్దేశించి "ఆడపిల్ల ఒక్కర్తి అంత దూరం వెళ్ళిరావటం క్షేమంకాదు నాతో నువ్వూ రారాదూ?" అంది. జ్ఞానస్వరూప్ మండిపడుతూ "నీకు ప్రయాణం ఖర్చులు ఆయన భరిస్తాడన్నావ్! నా ఖర్చు లెవడు భరిస్తాడు మరి?" అన్నాడు.
    "ఎవరు భరిస్తారు? నువ్వే భరించాలి!"
    "నా దగ్గరెక్కడున్నాయ్ డబ్బులు?"
    "ఎలాగో తంటాలుపడు!"
    "తల పగలగొట్టుకున్నా మెదడు పగులుతుందికాని పైసలురావు."
    "అయితే నేను వెళ్ళను."
    జ్ఞానస్వరూప్ కోపోద్రేకం అవధులు దాటింది.
    "వెళ్ళవూ! అయితే మానెయ్యి. నేనొక్కడినే యంత్రంలా సంపాదించి మీ అందరినీ పోషిస్తోంటే, మీ కందరికీ గీర్వాణాలు తెగబలిసి పోతున్నాయి ఇక నావల్ల కాదు నేనీ ఇంట్లోంచి పోతున్నాను__మీ ఏడుపు మీరేడవండి?"
    తన బట్టలు నాలుగు గబగబ సంచిలో కుక్కుకుని ప్రయాణమయ్యాడు జ్ఞానస్వరూప్.
    "ఒరేయ్! ఉన్నదంతా కరిగించి నిన్ను బి.ఇ. చదివించానురా! నువ్వేదో తవ్వి తలకెత్తుతావనుకున్నారా! ఇప్పుడే తలకి కొరివి పెట్టకురా!" అని దగ్గుతెరల మధ్య తండ్రి ఏడుస్తూ అరుస్తుండగా చేతిసంచితో ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు జ్ఞానస్వరూప్.
                                   7
    ఎవరో మాంత్రికుడు తనను వినువీధులలోకి విసిరేశాడు. రెక్కల పక్షిలా తను ఆకాశంలో హాయిగా ఎగిరిపోతోంది. అంతలో విచిత్రంగా ఆ రెక్కలు మాయమయ్యాయి. అంత ఎత్తునుంచి తను దభాలున నేలకూలింది.
    ఉలికిపడి కళ్ళు తెరిచింది వేద. విమానం ఆకాశంలో మబ్బులను చీల్చుకుంటూ ఎగిరిపోతోంది. కిటికీలోంచి క్రింది ఇళ్ళు, మేడలూ, కొండలూ, సరసులూ, అన్నీ చిన్నపిల్లల ఆట బొమ్మలలా పేర్చినట్లు చిన్నచిన్నవిగా కనిపిస్తూ చకచక వెనక్కు సాగిపోతున్నాయి. కొంత యెత్తుకు ఎగరగలిగితే ప్రపంచమంతా బొమ్మలకొలువులా కనిపిస్తుంది. స్థిరమై నిలిచేది ఉండనే ఉండదు, అబ్బ! ఏమి కల? కలకాదు. తనకు నిద్రపట్టనేలేదు. కల వచ్చేందుకు! ఇది తన మనసు తన ప్రమేయం లేకుండానే సాగిస్తున్న ఊహామాలిక. అంటే తన అంతరాంతరాల్లో తను ఎగరబోతున్న ఎత్తులనుంచి ఏనాడో నేలకూలే ప్రమాదం ఉందన్న హెచ్చరిక ఉందన్నమాట! అయినా ప్రయాణం చేస్తూనే ఉంది. ఒకసారి ప్రయాణం ప్రారంభించాక, అదీ విమానంలో__ఆ ప్రయాణం చివరివరకూ సాగవలసిందేగా!
    ఏడుపులమధ్య, శాపనార్ధాలమధ్య ,దేనినీ లెక్కచెయ్యకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అన్న అప్పుడు. తను ఏ ఆలోచనా లేకుండా ప్రయాణానికి సిద్ధమయింది. తల్లి, తండ్రీ ఆశీర్వదించి....అవును, ఆశీర్వదించి, (గురజాడ ఏం రాశారూ? "తల్లి, తండ్రీ దీవించే! దీవెన వింటూ ఫక్కున నవ్వెను పుత్తడిబొమ్మ పూర్ణమ్మ) పంపించారు. పూర్ణమ్మ ఫక్కున నవ్వింది. ఒక గమ్యాన్ని నిర్ణయించుకొంది గనుక__తను నవ్వలేదు. ఏ గమ్యమూ తనకు లేదు గనుక. పూర్తిగా కళ్ళు తెరుచుకుని అయోమయంలోకి చొచ్చుకుపోతోంది.
    విమానం ఆగింది. అంతా కొత్త. ప్రతిక్షణమూ తోటిప్రయాణీకులను చూసి వాళ్ళేంచేస్తే అదిచెయ్యటమే! కాఫీ సర్వ చేసినప్పుడు, ముందు సీట్ లోంచి, టేబిల్ లాడ్రా చేసుకోవటం తెలీదు. చెకింగ్ కి వస్తున్నప్పుడు టికెట్ చూపించాలని తెలియదు. అంతా తడబాటు, అంతా కంగారు. తోటి ప్రయాణికులంతా ఎవరెవరినో చూసి చేతులు ఊపుతున్నారు. దూరంనుంచే చిరునవ్వులతో పలకరిస్తున్నారు. ఇదిమాత్రం తోటి ప్రయాణీకులను చూసి తాను చెయ్యలేకపోయింది. తనను ఆహ్వానించే వాళ్ళెవరూ లేరు. పర్స లో డబ్బుంది. వెళ్ళవలసిన చోటేదో అడ్రస్ ఉంది.
    "తాజ్ లో మీకు రూమ్ బుక్ చేయించాను. మీరు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకి రాగానే టాక్సీ చేయించుకుని తాజ్ కి వెళ్ళిపొండి. మీ పేరు చెప్పండి వాళ్ళే రూమ్ చూపిస్తారు. మీకేశ్రమా ఉండదు. 

 Previous Page Next Page