వామనరావు ఇల్లు. రాత్రి.
తలుపు తీసుకుని వామనరావు తూలి పడ్డాడు. లైట్ వెలిగింది.
శేషు వామనరావుని పట్టుకుని గాభరాగా 'నాన్నా' అన్నాడు.
వామనరావు చాలా అనవసరంగా చేతులు జోడించేడు. అంతే అక్షరం పలకలేదు.
ఆవేళకి అక్కడికి జయ వచ్చింది. శేషు చేతుల్లో మామగార్నీ, ఆయన పరిస్థితినీ చూసి కలవర పడిపోయింది.
జయతో అంటున్నాడు శేషు.
"చాలా రోజుల తర్వాత-మానాన్న మళ్ళీ క్లబ్బుకి వెళ్ళేడు జయా!"
శేషు చేతుల్ని విడిపించుకొని అన్నాడు వామనరావు.
"అవున్రా వెడతాను. అన్ని వేపుల్నించీ అందరూ దెబ్బ తీస్తుంటే మనిషేమవుతాడు? క్లబ్బు కెడతాడు. ఆ దెబ్బల్ని మరిచిపోయేందుకు యిష్టమొచ్సినట్టు తాగుతాడు. (ఆగి అన్నాడు) ఒరే శేషూ-మీ అమ్మ చచ్చిపోయిందని నీతో అబద్ధం చెప్పేన్రా!"
శేషు బాగా షాక్ తిన్నాడు. శేషుతోపాటు జయకూడా షాకై పోయింది.
వామనరావు చెప్పుకుపోతున్నాడు.
"అది బతికే వుందిరా! నన్ను దెబ్బ తియ్యడానికి యింకా బతికే వుంది! సుభద్రా-"
"మా అత్తయ్య!" అన్నది జయ.
వామనరావు వత్తివత్తి పలికేడు-
"అవునమ్మా! అవును! మీ అత్తయ్యే నీకు అత్తయ్య! ఆ అమ్మే వీడికి అమ్మ! ఒరే శేషూ-ఇప్పుడే చెబుతున్నాను వినండి! నేను సుఖంగా బతకాలంటే మీ అమ్మ నాకు దూరంగా వుండాలి. దగ్గిరైందో మీ అందరికీ నేను దూరమవుతాను. అయ్ టెల్యూ-శాశ్వతంగా దూరమైపోతాను...దూరమై-"
అంటూ అతను కింద పడిపోయేడు.
ఆ రాత్రి శేషు తన గదిలో జయతో అంటున్నాడు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే వున్నాయి.
"ఆమెను చూడగానే, ఆ తల్లి నా కన్నతల్లేనని అంతరాత్మ అప్పుడే చెప్పింది జయా! కాకపోతే-అమ్మలేని వాడినని నాన్న నా చిన్నప్పుడే చెప్పేడు. నాన్న అబద్ధం చెప్పడనే ఉద్దేశంతో ఆమెను నా తల్లిగా గుర్తించలేక పోయాను. కన్నతల్లిగా గుర్తించలేకపోయాను. (ఆగి అన్నాడు) ఆమె కథ విన్నప్పుడు ఆ తండ్రీ కొడుకులెవరో దురదృష్టవంతులనుకున్నానే గాని-ఆ దౌర్భాగ్యులం మేమే అని ఇప్పుడు తెలిసింది!"
జయ అనునయంగా అన్నది-
"ఇప్పుడు మాత్రం మించిపోయిం దేముందండీ? పదండి. వెళ్ళి అత్తయ్యని మనింటికి తీసుకొద్దాం."
శేషు నిట్టూర్చి అన్నాడు.
"అమ్మ రాదు జయా! మా నాన్న ఎంత ఆవేశపరుడో, మా అమ్మ అంత అభిమానవంతురాలు. 'నాయనా శేషూ నువ్వు నా బిడ్డవు బాబూ' అని ఆవిడైనా చెప్పవచ్చు గదా! ఊహు...చెప్పదు. చెప్పలేదు. నాన్న మనసారా పిలుస్తేనే గాని అమ్మరాదు. ప్రాధేయపడి నేను నా తల్లిని తీసుకొస్తే-అమ్మని తెచ్చినందుకు నాన్న మనకు శాశ్వతంగా దూరమవుతాడు."
"అట్లా ఎందుకనుకోవాలి? మీరంటే ఆ ఇద్దరికీ ఎంతో వాత్సల్యం? భయపెట్టో, బెదిరించో ఆ ఇద్దర్నీ మీరు కలపలేరా?"
"కలపగలను. ఒకే ఇంట్లో వున్నా వాళ్ళు అమ్మా నాన్నల్లా వుండలేరు. నేను ఆడుకునే బొమ్మల్లా వుంటారు. నాక్కావల్సింది బొమ్మలు కావు జయా-మనుషులు! మమతానురాగాలు-పెంచుకునే మనుషులు."
"అయితే-ఇప్పుడేం చేయాలి?"
శేషు కళ్ళు తుడుచుకుంటో తన నిర్ణయం చెప్పేడు.
"ఆ ఇద్దరూ-ఎవరి ప్రమేయం లేకుండా వారికి వారే దగ్గిరవ్వాలి. అల్లాంటి సంఘటన కోసమే మనమే ఒక ఉపాయం ఆలోచించాలి."
47
ఉదయం
రోడ్డుమీద శేషు కారు జోరుగాపోతోంది. దారికడ్డంగా నిలబడి ఆపమన్నట్టు సైగ చేసేడు సింహాచలం.
శేషు కారు ఆపి, తలుపు తీసేడు. సింహాచలం కారెక్కుతుంటే శేషు అన్నాడు.
"వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు సమయానికి కనిపించేవు."
సింహాచలం కూచున్నాడు. కారు కదిలింది. సింహాచలం అన్నాడు.
"నేను మాత్రం తీగను వెతికే పట్టుకున్నాను!" అంటూ పిస్తోలు తీసి శేషు డొక్క మీద వుంచేడు.
"ఏమిటో గుచ్చుకుంటోంది?" అన్నాడు శేషు.
"దానిపేరు పిస్తోలు. చెప్పినట్టు వినకపోతే పేలుతుంది. పేలితే ప్రాణాలు పోతాయ్."
శేషు ఆందోళనగా అన్నాడు.
"సింహాచలం!"
"నోరెత్తేవంటే పేలుతుంది. కుడిపక్కకి తిప్పు" అన్నాడు సింహాచలం.
శేషు కుడిపక్కకి తిప్పేడు కారుని.
* * *
అదొక డెన్.
ఆ డెన్ లో స్థంభానికి శేషుని కట్టేయడం పూర్తి చేసేడు సింహాచలం.
శేషు ఆవేశంగా అంటున్నాడు.
"ఏమిటిది? నీకేమైనా పిచ్చిక్కెందా?"
"పిచ్చే బ్రదర్. ఇది ప్రేమ పిచ్చి."
"ప్రేమ పిచ్చి?"
"సులోచన నా క్లాస్ మేట్. మేమిద్దరం అపారంగా ప్రేమించుకున్నాం. మీనాన్న ఆమెను లక్షాధికారికిచ్చి పెళ్ళి చేస్తాట్ట. పెళ్ళి! నేనూ లక్షాధికారిని కావాలి నాకు లక్షలు కావాలి."
"అందుకని నన్ను కిడ్నాప్ చేసేవా?"
సింహాచలం కౄరంగా నవ్వబోయేడు. కానీ కుదరలేదు. అట్లా నవ్వుతూనే అన్నాడు.
"లక్ష కావాలంటే ఇదొక్కటే మార్గం. మీ నాన్న మీకోసం గుండెపగిలేలా ఏడుస్తాడు. లక్ష యిస్తే విడిచిపెడతానని కండీషను పెడతాను. దెబ్బకు లక్ష. ఆ తర్వాత నా పెళ్ళి."
అంటూ మళ్ళా కుదరని క్రూరపు నవ్వు నవ్వేడు. ఈలోగా చాలా ఈజీగా తాడు ఊడదీసుకున్నాడు శేషు అది చూసి ఉలికిపడి పిస్తోలు గురిపెట్టి అన్నాడు సింహాచలం.
"గట్టిగా ముడి పెట్టేను. ఎట్లా ఊడదీసుకున్నావ్?"
శేషు ఒక్కో అడుగు ముందుకువేస్తూ అన్నాడు.
"ఎత్తుకుపోడానికి నేను పసివాడ్ని కాను. ఆ ఫీల్డులో నీకు అనుభవం కూడా లేదు. అంచేత, ముళ్ళూ తాళ్ళూ పనిచేయవు .అర్థమైందా?"
"అయ్యింది కాణీ, నా చేతిలో పిస్తోలుంది జాగర్త. అడుగు ముందుకువేస్తే పేలుతుంది పేలితే."
"ప్రాణాలు పోతాయ్!"
అంటూ ఆ పిస్తోలుని ఒక తన్ను తన్నేడు శేషు. ఆ తర్వాత సింహాచలం కాలరు పట్టుకుని గుంజుతూ అన్నాడు.
"పెళ్ళిచేసుకోవాలనుకుంటే ఇదొక్కటేనా మార్గం?"
"లాటరీ టిక్కట్లకంటే ఇదే బెటరనిపించింది సార్" అన్నాడు సింహాచలం డీలాపడిపోతూ.
"ఫార్ములాలు చెప్పగలిగే మేధావివి! ఇంత దిక్కుమాలిన ఆలోచనెందుకు చేసేవ్?"


