తండ్రితో చెబుతున్నాడు శేషు.
"జయ మేనత్తగారు నాన్నా! నేను అమ్మా అని పిలుస్తాను. (ఆగి అన్నాడు) ఎంత మంచి అమ్మో మాటల్లో చెప్పలేను. కట్టుకున్న భర్త నిరాదరించినా, కన్నవారికి దూరంగా బతుకుతున్నా-వారి మీద మమతానురాగాలే ప్రాణంగా చేసుకొని బ్రతుకుతున్న అమ్మ!"
వామనరావు మెలికలు తిరిగిపోతుండగా సుభద్ర కలగజేసుకొని మాటాడింది.
"నాయనా శేషూ! ఇప్పుడివన్నీ ఎందుకులే నాయనా! మీ నాన్నగారిది మెత్తని మనసు. నా కథ వింటే బాధపడిపోతారు. వస్తాబాబూ! వెళ్ళొస్తా!"
అంటూ ఆమె అక్కడ్నించి వెళ్ళిపోతుండగా వామనరావు కూడా వెడుతూ అన్నాడు.
"ఆవిడ్ని పంపించి వస్తాను!"
వామనరావు బయటకొచ్చేడు.
సుభద్ర-వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది. వామనరావు గంభీరంగా అన్నాడు-
"నిన్ను వాడు పరిచయం చేసిన తీరు చూస్తూంటే నాకేదో అనుమానంగా వుంది. వాడికి నువ్వు కన్నతల్లివని చెప్పేసేవా?"
ఆ మాటకి ఆమె గిరుక్కున వెనక్కి తిరిగి-అతని వేపు సూటిగా చూస్తూ అన్నది.
"లేదు చెప్పలేదు. ఆ మాట కూడా మీరే చెప్పాలి. చెబుతారు."
వామనరావు కోపంగా అన్నాడు-
"నో! అది జరిగే పనికాదు. చెప్పవలసిందేదో వాడికి చిన్నప్పుడే చెప్పేను."
సుభద్ర ఆవేదనగా అన్నది-
"ఏమని చెప్పేరు? నేను-చచ్చిపోయేనని కదూ! హు...మీదెంత మంచిమనసో, మీ ఆవేశం అంత చెడ్డదండీ! ఏమైందీ మీ సిద్ధాంతం? ఏమైందీ మీ జీవిత లక్ష్యం? జగన్నాధాన్ని జగ్గూ అని పిలిచే స్నేహమా మీది? జయ పుట్టగానే మీ కోడలిగా చేసుకుంటానని జగన్నాధానికి మాట యిచ్చేరా? అనుక్షణం మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటో అదే సుఖమనుకుంటున్న మిమ్మల్ని ఏవనాలి? (ఆగి అన్నది) ఏ మనిషిని కాదని మీ జీవితంలోంచి పంపించి వేసేరో-ఆ మనిషి రక్త సంబంధాన్నే ఇంటికోడలిగా తెచ్చుకున్నారండీ! ఇప్పుడు చెప్పండి? ఎవరు ఓడిపోయేరు? ఎవరు గెలిచేరు? (కళ్ళు తుడుచుకొని అన్నది) జరిగిందేదో జరిగిపోయింది. కన్నతల్లి కరువైందని నమ్ముతున్నాడు శేషు! మీరు సుఖంగా వుండాలంటే వాడు ఆ నమ్మకంతోనే వుండాలి! మన రహస్యాన్ని దాచండి!"
అనేసి ఆమె కారెక్కింది. కాదు కదిలింది. సుభద్రా అన్నాడు వామనరావు.
వామనరావు ముఖమ్మీద బోలెడు దుమ్ము పోసి ఆ కారు వెళ్ళిపోయింది.
* * *
వామనరావు వీధిలోకి నడుస్తున్నాడు భారంగా.
సుభద్ర చివర్లో హెచ్చరించిన మాటలే అతని చెవుల్లో రింగున మోగుతున్నాయి.
"కన్నతల్లి కరువైందని నమ్ముతున్నాడు శేషు. మీరు సుఖంగా వుండాలంటే వాడు ఆ నమ్మకంతోనే వుండాలి. మన రహస్యాన్ని దాచండి!"
ఆ హెచ్చరిక వామనరావుని కలలోకి తీసుకెళ్ళింది.
* * *
అది వామనరావు ఇల్లే.
అయితే ఆ ఇంట్లో ఔట్ హౌవుస్ కంటే అధ్వాన్నంగా వున్న దిక్కుమాలిన గది.
ఆ గదిలో నులక మంచం. ఆ మంచమ్మీద, గడ్డం మాసిపోయి-మురికి బనీనుతో వున్నాడు వామనరావు. అతనెంతో దైన్యస్థితిలో అల్లాడిపోతున్నట్టు కనిపిస్తున్నాడు.
ఒక లోతుగిన్నెలో ముష్టి వాళ్ళకు పెట్టే ముష్టి అన్నం పట్టుకుని పనిమనిషి ఆ గదిలో కొచ్చేడు. ఆ గిన్నె మంచమ్మీద పెట్టి 'ఊ తిను' అన్నాడు.
వామనరావు చాలా బాధగా అంటున్నాడు.
"ఇది, మనుషులు తినే తిండికాదురా గోవిందా! నేను తిననని మీ అమ్మగార్తో చెప్పు?"
ఆ మాటమీద అమ్మగారు అక్కడికి రానే వచ్చేరు. ఆమె సుభద్ర. మహాలక్ష్మిలా వెలిగిపోతోంది.
"పెట్టిందేదో తినండి...అల్లరిచేస్తే అబ్బాయి ఊరుకోడు."
వామనరావు బిక్కకోపంతో అరిచేడు.
"ఎందుకూరుకుంటాడే, ఊరుకోడు. సర్వదాస్థి వాడిపేరిట రాసి వెధవనై పోయేనుగదా ఊరుకోడు. సుభద్రా-కొడుకుని వెనకేసుకొచ్చి నన్ను చీకటిగదిలో బంధిచేవ్. ఒ.కె. అనుకున్నాను! కుక్కి మంచమే సింహాసనమన్నావ్. ఇట్సాల్ రైటనుకున్నాను. చివరికి కుక్కలుకూడా ముట్టని తిండి తినమంటున్నావ్! అయ్ టెల్యూ సుభద్రా-మొగుడ్ని హింస పెడితే పుట్టగతులుండవు. ఏదైనా సహిస్తాను. కాణీ, తిండి విషయంలో రాజీపడను. పడలేను. అయ్ డోంట్ వాంటిట్."
అంటూ ఆ గిన్నె విసిరేసేడు.
అది తిన్నగా శేషు కాళ్ళదగ్గిర పడింది. శేషు యముడిలావున్నాడు. అతని చేతిలో కొరడాకూడా వుంది.
అతన్ని చూస్తూ సుభద్ర "సుపుత్రా" అన్నది.
"మాతా!" అన్నాడు సుపుత్రుడు.
"మీ నాన్నగారి ఆగడం చూసేవా?"
"చూస్తున్నాను మాతా చూస్తున్నాను."
"చూడటం కాదు సుపుత్రా చేతిలో కొరడాకి పనిచెప్పు" అన్నదామె.
అంతే. తల్లి యిచ్చిన ఆజ్ఞతో శూరుడైపోయి తండ్రిమీద కొరడాని ఛెళ్ళు మనిపించేడు.
బాధతో మెలికలు తిరిగిపోతూ 'నాయనా' అన్నాడు వామనరావు.
"హు నాయనా?" అంటూ మళ్ళీ ఒకటి తగిలించేడు.
"నా తల్లికీ నాకూ ఇన్నేళ్లూ ఎడబాటు చేసింది చాలక నాయనా అంటూ ప్రేమ నటిస్తున్నావా? ప్రేమ" అంటూ రెండు మూడుసార్లు ఛెళ్ ఛెళ్ మనిపించేడు.
ఆ దెబ్బలకు తాళలేక అన్నాడు వామనరావు.
"ఒరే శేషూ! కన్న తండ్రినిరా! కనికరం లేకుండా కొరడాతో కొట్టడం న్యాయం కాదురా?"
మళ్ళా ఛెళ్ ఛెళ్ మనిపిస్తూ అంటున్నాడు శేషు.
"ఏది న్యాయం? అమ్మ చచ్చిపోయిందని చెప్పి నన్ను నమ్మించడం న్యాయమా? కన్న తల్లి ప్రేమ ఏమిటో నా అనుభవానికి రానీకుండా చేయడం న్యాయమా? అయ్ టెల్యూ. నిన్ను పచ్చడి పచ్చడి జేసేస్తేనేగాని నా కసి తీరదు. నా మాతృ హృదయం సంతోషించదు."
"శేషూ, నాయనా, కొట్టొద్దురా' అంటూ కేకలు పెడుతున్నాడు వామనరావు.
కల తొలగిపోయింది.
* * *
ఆ వేళకి వామనరావు క్లబ్బు గుమ్మంముందు నిలబడ్డాడు. అతను బాగా నలిగిపోయి ఉన్నాడు.
క్లబ్బులోపల చాలా సందడిగా వుంది. రణగొణ ధ్వనుల్తో చెవులు హోరెత్తిపోతున్నాయి.
ఉన్నట్టుండి-
అంత భీభత్సమూ అకస్మాత్తుగా ఆగిపోయింది. దానిక్కారణం లేకపోలేదు. శ్రీశ్రీశ్రీ వామనరావుగారు మతిలేని మనిషిగా క్లబ్బులో ప్రవేశిస్తున్నారు.
క్లబ్బులోకి వచ్చి కౌంటర్ దగ్గిర నిలబడి ఫుల్ బాటిల్ తీసుకున్నాడు. ఆ సీసా ఎత్తి గడగడా తాగేసేడు. గంభీరంగా మూతి తుడుచుకుని నిష్క్రమిస్తున్నారు.
ఆ నిశ్శబ్దం అట్లాగే రాజ్యం చేస్తోంది. వామనరావు బయటకు వెళ్ళి పోయిం తర్వాత ఉత్తర క్షణంలో మళ్ళా అంతే భీభత్సంగానూ, రణగొణధ్వని ప్రారంభమైంది.
* * *


