Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 8


    ఆడది కేవలం ఆట వస్తువు అనే తన మనస్తత్వం సడెన్ గా ఎందుకు మారిపోయింది? ఆ అమ్మాయిని చూస్తుంటే అదివరకు ఆడపిల్లను చూసినప్పుడు కలిగే సెక్స్ ఆలోచనలు ఎందుకు కలగటం లేదు?
    అతనికేమీ అర్థం కావటం లేదు. అంతా అగమ్యగోచరంగా ఉంది. హాల్లో జనమంతా ఆ అమ్మాయి సెక్స్ విన్యాసాలకు కేకలు వేస్తున్నారు. విజిల్స్ కొడుతున్నారు. తన మిత్రబృందం కూడా జనంతోపాటు కామెంట్స్ చేయటం చిరంజీవికి నచ్చటం లేదు.
    "ఇడియట్స్! స్టాపిట్! మీకేం బుద్ధుందా లేదా? ఆ అమ్మాయి అంత బాగా డాన్స్ చేస్తోంటే ఏమిటా కూతలు? అంటూ పైకిలేచి కుర్చీ ఎక్కి నిలబడి "సైలెన్స్! ఎవ్విరిబడి! సైలెన్స్! ఖామోష్! అరె సాలేఖామోషుండమని చెప్పేది మీక్కాదు బే" అంటూ బిగ్గరగా అరిచేసరికి మొత్తం థియేటరంతా అతనివేపు తిరిగి అతనినే చూడసాగారు.
    అతని మిత్ర బృందం అమాంతం అతనిని కిందకు లాగేశారు.
    "ఏమిట్రా? ఏమయ్యింది?"
    "ఆ పిల్ల చూడండ్రా ఎంత బాగా డాన్స్ చేస్తోందో! అంత మంచి డాన్స్ లు చేస్తోంటే పిచ్చికూతలు కూస్తున్నారా?" ఆవేశంగా అన్నాడు చిరంజీవి.
    అంతా అతనివేపు ఆంధ్రప్రదేశ్ ని చూసినట్లు చూశారు.
    "ఏంట్రా? ఆ అమ్మాయి డాన్స్ బాగా చేస్తోందా?" ఆశ్చర్యంగా అడిగారు ఫ్రెండ్స్.
    "అద్బుతంగా చేస్తోంది! షి డిజర్వ్ స్ ఎ గ్రామీ అవార్డ్" అన్నాడు చిరంజీవి.
    "గ్రామీ అవార్డ్?" నవ్వాపుకుంటూ అడిగాడు.
    "అవును!"
    "ఈ అమ్మాయికా?"
    "ఇంకోసారి ఆమెను 'అమ్మాయ్' అనకండి"
    "మరేమనాలి?"
    "దేవత!"
    "దేవత!" మళ్ళీ నవ్వులు.
    "ఒరేయ్! మర్డర్ చేస్తాను నవ్వారంటే."
    "ఈ పిల్లను దేవత అనటం కంటే మర్డరయి పోవటమే బెటరు."
    మిగతా వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. "అవునవును! చొక్కాలిప్పండ్రా! మర్డరయిపోదాం."
    "లేకపోతే ఏంట్రా? సబ్ స్టాండర్డ్ స్టఫ్. మేకప్ లో కనిపించేసరికి అలా రెచ్చిపోవటమేనా? కొంచెం కామన్ సెన్స్ వుండక్కర్లా?" కోప్పడ్డాడు సీనియర్ శంకర్రావు.
    "అంటే మీకెవరికీ ఆ దేవత నచ్చలేదా?"
    "ఏమాత్రం నచ్చలేదు."
    "నైటింగెలాన్తిల్ ఆ గొంతు కూడా బావుండలేదా?"
    "నైటింగేల్ మరణశయ్య మీదున్నప్పుడు పాడినట్లుంది."
    చిరంజీవికి ఉక్రోషం ఆగటంలేదు. వీలయితే వాళ్ళందర్నీ ఒకే ఒక్క బాంబ్ తో హతం చేయాలని వుంది.
    ఆల్ రైట్! ఆ అమ్మాయి దేవతలాగుంది నీ కళ్ళకు! ఒప్పుకున్నాం! అయితే ఇప్పుడేమంటావ్?"
    "నేనా అమ్మాయిని ప్రేమిస్తున్నాన్రా!"
    ఎవరి మొహాల్లోనూ నెత్తురు చుక్క లేదు.
    "ప్రేమా?"
    "అవును."
    "అంటే జాలీ లైఫ్ క్లబ్ గైడ్ లెన్స్ లో వివరణ ఇచ్చిన ప్రేమేనా?"
    "నో! ఇది రియల్ లవ్."
    "రియల్ లవ్ అంటే?"
    "రియల్ లవ్ అంటే ఆ దేవతని రాత్రింబవళ్ళూ ఆరాధించటం."
    "అంటే గుళ్ళో దేవుడిని ఆరాధించినట్లా?"
    "అంతకన్నా కొంచెం ఎక్కువే."
    "అంటే ఆ అమ్మాయిని అదివరకు అమ్మాయిలలాగా హోటల్ రూమ్ కి గానీ, పిక్నిక్ లకుగానీ తీసుకెళ్లవ్."
    "ఆ దేవత స్థానం అలాంటి చీప్ ప్లేసెస్ లో కాదు! మా ఇంట్లో!"
    "అంటే?"
    "ఆ దేవతను పెళ్ళిచేసుకుంటాను."
    అందరి ముఖాల్లోనూ భయం కనిపించింది.
    "ఒరేయ్! నీకు వంట్లో బావుందా?"
    "ఇంత ఆరోగ్యంగా ఇంతకు ముందెప్పుడూ లేదు."
    "ఒక్కసారి వెనక్కు తిరిగి చూడ్రా! సగం హాలు ఆ పిల్ల డాన్స్ కి ఖాళీ అయిపోయింది."
    చిరంజీవి నమ్మలేక వెనక్కి తిరిగి చూశాడు. జనమంతా అతి భయంకరంగా ఒకరినొకరు తోసుకుంటూ బయటకు పరుగెడుతున్నారు. చిరంజీవికి ఆ దృశ్యం అమితమైన బాధ కలిగించింది.
    "ఇడియట్స్! కళలను ఆరాధించలేని మూర్ఖులు. అందాన్ని గుర్తించలేని ఆదివాసులు" కసిగా అన్నాడతను.
    "ఒరేయ్! నీకు చిన్నప్పటినుంచీ మీ డాడీ నూరిపోసిన విషయాలన్నీ గాలికొదిలేసి ఇప్పుడీ పిల్లను పెళ్ళి చేసుకుంటానంటావా?"
    "ఇంతకాలం డాడీ ఆడపిల్లను ఎప్పుడూ పెళ్ళి దృష్టితో చూడకు అంటే నా మనసులో చీర, జాకెట్టు వేసుకున్న అమ్మాయిలే కనిపించేవారు. అందుకే వాళ్ళను చూసినప్పుడు సరదాగా ఎంజాయ్ చేయాలనే కోరిక తప్ప మరో కోరిక కలిగేదికాదు. కానీ ఈ దేవత జీన్స్ వేసుకుని కనిపించేసరికి ప్రేమలో పడిపోయాను."
    ఆ దేవత తన డైలాగ్ మధ్యలో మర్చిపోయి ప్రేక్షకులవైపు చూసి నవ్వింది. జనం మళ్ళీ కేకలేశారు. దాంతో నటిస్తున్న మిగతావాళ్ళు వాళ్ళ నోటికొచ్చినట్లు మాట్లాడటం ప్రారంభించారు. మొత్తం రసాభాస అయిపోయింది. కొంతమంది పిచ్చి కేకలు వేసి బిగ్గరగా నవ్వుతున్నారు.
    చిరంజీవికి ఇక కోపం ఆగలేదు.    అమాంతం ముందు వరసలోకి దూకి చేతికి దొరికినవాడినల్లా చావగొట్టడం ప్రారంభించాడు. అదిచూసి మిగతావాళ్ళు చిరంజీవి మీదకు దూకారు.
    తమ ఫ్రెండ్స్ ని వాళ్ళు ఎటాక్ చేయటం చూసిన చిరంజీవి బాచ్ వాళ్ళు అమాంతం వాళ్ళమీదకు దూకారు. కొద్దిక్షణాల్లో మొత్తం రణరంగమయిపోయింది. పోలీసులు పరుగుతో లోపలికొచ్చారు. డ్రామా ఆగిపోయింది, కర్టెన్ లాగేశారు.
    ఆ దృశ్యం ఆఖరి వరసలోని కుర్చీలో కూర్చుని చూస్తున్న సింహాద్రికి అమితమైన దుఃఖం కలిగింది. తను రాసిన మొట్టమొదటి నాటకం అది.
    ఆ నాటకం సక్సెస్ అయితే సినిమా ఫీల్డ్ కి వెళ్ళిపోవాలని ఎంతగానో ఆశపడ్డాడు. వెళ్ళడానికి అవకాశం కూడా వుంది. ఎందుకంటే చాలామంది ప్రముఖ నిర్మాతలు, డైరక్టర్లు ఆ డ్రామా చూస్తున్నారు. కానీ రిహార్సల్ లోనే తనకు ఆ హీరోయిన్ మీద అనుమానం కలిగింది.
    ఆ డ్రామా ఒకవేళ సర్వనాశనం అంటూ జరగటం తటస్థిస్తే ఆ బాధ్యత కేవలం సంగీతదే అవుతుందని తను ముందే నిర్ణయించుకున్నాడు. ఆమెను ఆ వేషం నుంచి తీసేసి ఇంకో అమ్మాయిని వేయమని ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ప్రిన్సిపాల్ ని బ్రతిమాలాడు.

 Previous Page Next Page