Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 8


అందరూ ప్రేమ ఆశిస్తారు
    
    ఈ సృష్టిలో... నాకు తెలిసినంతవరకు ప్రతిమనిషీ ఇతరులనుంచి పేమను పొందాలని ఆశిస్తూనే వుంటాడు.
    
    తప్పులేదు.
    
    మనం బ్రతకాలంటే ప్రేమను పొందటం అవసరం.
    
    అంటే ప్రేమ లేకపోతే మనిషి బ్రతకలేడు.
    
    కాని... ప్రేమను పొందటం ఎంత అవసరమో, ఇవ్వటం, ఇవ్వగలగటం అంతే అవసరం.
        
    మనం ప్రేమ ఇవ్వాలి. ఇతరుల్ని ప్రేమించగలగాలి.
    
    ఎందుకంటే... జీవితసత్యాలను అన్వేషిస్తూ పోతున్నప్పుడు..... ఒక దశలోకి చేరుకుంటున్న సమయాన ప్రేమించగలగటంలోని సౌందర్యాన్నీ, ఆనందాన్నీ ఆస్వాదించగలగాలి.
    
    ప్రేమ చాలా ఉదాత్తమైన పదం. అటువంటి ప్రేమ ఇప్పుడు సంకుచిత్త్వంతో, స్వార్ధంతో నిండిపోయి వెర్రివేషాలేస్తోంది.
    
    ఇప్పుడు మనం మంచి స్నేహితులు, అన్నాచెల్లెళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు.....వీరి మధ్య వున్న ప్రేమ సంబంధాల గురించి తాత్కాలికంగా వదిలేసి ప్రేయసీ ప్రియులు, భార్యభర్తలు.... వీరిమధ్య గల ప్రేమను గురించి ఆలోచిద్దాం.
    
    ఈ మధ్య నా వద్దకు ఓ యువతి వస్తోంది. పూర్తిగా అపరిచిత. ఆ అమ్మాయికి ఇరవై రెండు, ఇరవై మూడేళ్ళుంటాయి. ఈ సృష్టిలోని పాతకథే. ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే  ఆ వ్యక్తి అవివాహితుడేమీ కాదు. నలభై, నలభై రెండేళ్ళ మధ్యవాడు. ఇద్దరు పిల్లలు. ఇద్దరి మధ్యా ఆరాధన, ప్రేమ భార్యపిల్లలు వేరే ఇంట్లో వుండగా అతను ఉద్యోగరీత్యా ఈ ఊళ్ళో ఒక్కడే వుంటున్నాడు. ఆ అమ్మాయి అతని ఇంటికి వెళ్ళేది. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య వున్న వ్యతిరేక వాతావరణం వల్ల ఆమె అతని ఆశ్రయంలో ఊరట పొందింది. శారీరకంగా కూడా తనను అర్పించేసుకుంది. కొన్నాళ్ళు గడిచాక అతను ఆమెతో విముఖంగా వుండడం మొదలుపెట్టాడు. వేరే అమ్మాయితో సఖ్యంగా వుండటం ఆమెచూసింది. ఇద్దరిమధ్యా ఘర్షణ. ఆమె తీవ్రంగా గాయపడటం, మనశ్శాంతి కోసం నా దగ్గరకు వస్తూ వుండటం.
    
    నేను రెండు పాయింట్లు చెప్పాను. "నువ్వు పరిచయాన్నీ, ఊరటనూ ప్రేమగా మలుచుకున్నావు. ఆప్యాయత, ఆత్మీయతలన్నీ ప్రేమలు కాలేవు. మనం ప్రేమ చాలా గొప్పదని అంగీకరిస్తున్నాం కదా ఆస్వాదించకముందే శారీరకమైన అనుభవంతో ముడిపెట్టడం తొందరపాటు చర్యే అవుతుంది. ఒకవేళ నీవు పూర్ణమైన ప్రేమలోకి వెళ్ళిపోయావనుకుంటే.... నీ అర్పణగురించి విచారించాల్సిన పనేలేదు. అంతటి అమూల్యమైన ప్రేమముందు ఇవన్నీ చాలా చిన్నవిషయాలు. అక్కడ ఇవ్వటం, పోగొట్టుకోవడం లాంటివి గణనలోకిరావు. అతను నిన్ను మోసం చేశాడనీ, వంచించాడనీ.....ఇలాంటివి పట్టించుకోవు. సద్భావన, సత్కామన ఇవన్నీ కలిసి ఉన్నతమైన ప్రేమను నిర్మిస్తాయి."
    
    ఆమె నామాటలు అర్ధం చేసుకోలేదేమో అనుకున్నాను. కాని ఆశ్చర్యం! తర్వాత కొన్నిసార్లు కలిసినప్పుడు ఆమెలోని ఆత్మపరిశీలన, ముఖంలో కనబడుతున్న కొత్తకాంతి... ఎదుగుదలను సూచిస్తున్నాయి.
    
    ప్రేమను కించపరచకండి. పరిచయాలన్నీ ప్రేమలు కావు అనుభవాలన్నీ ప్రేమలు కావు. చాలామందికి ప్రేమంటే తెలీదు. వెయ్యి ప్రేమల్లో నిజమైన ప్రేమ ఒక్కటే వుంటుంది. మిగతావన్నీ భ్రమలే. లేక గాయాలు మిగిల్చే ప్రలోభాలు.
    
    ఎందుకంత లోతుల్లోకి వెళ్ళటం?
    
    ఒక అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయికోసం అమ్మాయి ఆరాటపడి, ఒకరికోసం ఒకరు తహతహలాడిపోయి, ఒకరికొకరు దగ్గరవ్వాలన్న తపనతో దగ్ధమైపోయి, ఇంట్లోవాళ్ళు అంగీకరించకపోతే, సమస్తం త్యజించి వెళ్ళిపోయి, అదీ సాధ్యం కాకపోతే ఆత్మహత్యలు చేసుకుని..... ఇది ప్రేమ కాదా? దీన్ని  తక్కువ చూపు చూడాలా?
    
    నిజమే... వారి ఆకర్షణలో బలీయమైన శక్తి వుంది. కాని అంతకుమించిన తెలివితక్కువతనం వుంది.
    
    ఎందుకంటే...
    
    అది పరిపూర్ణ ప్రేమ అయితే- కొన్నాళ్ళకి అపార్ధాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? మధ్యలో అంతరించిపోయి దాని స్థానంలో ద్వేషం చోటు చేసుకుంటోంది? ఒకరినుంచి ఒకరు విడిపోయి మరోవ్యక్తితో జీవితం కోరుకుంటున్నారు? కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తితో ప్రేమ నశించకపోయినా మరోవ్యక్తితో అదే స్థాయిలో ప్రేమనెందుకు పెంచుకుంటున్నారు?

    
    నేను మహోన్నత ప్రేమను నిర్వహించబోవడంలేదు. నా మనసుని కలచివేస్తున్న ప్రశ్నలు మీముందు వుంచుతున్నాను. పరిపూర్ణమైన ప్రేమ అయితే? ఎదుటివారిని ఎప్పటికప్పుడు అర్ధం చేసుకుంటుంది. తన మనసు, తన హక్కులు, తన సుఖం... ఇవన్నీ వుంటే తప్పులేదు. కాని వీటిని ఎప్పటికప్పుడు పక్కనపెట్టి ఎదుటివారి శ్రేయస్సు గురించే నిరంతరం ఆలోచిస్తూ వుంటుంది. అక్కడ అపార్ధాలుండవు. దెబ్బలాట లుండవు. విడిపోవటాలుండవు. ఆత్మహత్యలుండవు. ఒకరినుంచి ఒకరికి ఓ తేజస్సు వింత ఆనందం ప్రవహిస్తూ వుంటుంది. ఒక్కోసారి ఆ ప్రవాహం ఉప్పెనలా పొంగుతూ వుంటుంది. ఒక్కోసారి పవిత్ర ప్రశాంతంలా సాగుతూ వుంటుంది. అది నిరంతర చైతన్యం.
    
    దయ వుంచి వీటిని ఊహలుగా, కలలుగా కొట్టిపారేయకండి. అలా చేస్తున్నారంటే మీరు అహంకారంతో ఆత్మవంచన చేసుకుంటున్నారన్నమాట. ఓ మంచి జీవితాన్ని ఆస్వాదించటానికి సిద్దపడలేకపోతున్నారన్నమాట.
    
    ఎందుకంటే....
    
    ఎందుకంటే...
    
    ఈ సత్యాన్ని రాయబోతూంటే ఓ పవిత్ర సంతోషంతో నా కళ్ళలో నీటిబిందువులు నిండుతున్నాయి.
    
    అలాంటి జీవితాలను నేను సందర్శించగలిగాను.
    
    ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే మనకు అనుభవంలోకి రానివన్నీ మిథ్య, అభూతకల్పన, కేవలం ఊహ అని కొట్టిపారెయ్యొద్దని ప్రతి చిన్న విషయంలోనూ మనం తెలుసుకోవాల్సింది ఎంతోవుంది. అసలు మనకు తెలిసింది చాలా తక్కువ. మనం కలుసుకున్న వ్యక్తులకన్నా, మన పరిధిలోకి వచ్చిన వ్యక్తులకన్నా ఎంతో గొప్పవారు, ఉన్నతమైనవారు, అపూర్వమైనవారు ఎక్కడో అక్కడ వుంటూనే వున్నారు. హఠాత్తుగా తారసపడినప్పుడు తళుక్కుమంటూ వుంటారు. ఇంతకాలం ఎలా మిస్ అయిపోయామన్న ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది.
    
    వెయ్యికి ఒకరే కావచ్చు. అలాంటి మహోన్నత వ్యక్తులూ, అలాంటి ప్రేమలూ, ఈ యుగంలో కూడా వున్నాయి. అవి లేవని ఆత్మవంచన చేసుకుని మీ చిన్నపరిధిలో వుండిపోకండి.
    
    ప్లీజ్! ప్రేమ విషయంలో స్థాయిని పెంచుకునేందుకు ప్రయత్నించండి.
    
    ప్రతిమనిషీ ఏ అంశం గురించైనా సరే... అందులో తల దూరుస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు తప్పనిసరిగా వేసుకుంటూ వుండాలి. అసలు ప్రశ్నలేకపోతే మనిషి ఎదగడానికి అవకాశం లేదు.
    
    ఇప్పుడు ప్రేమగురించి....
    
    ఆ వ్యక్తిలో ఏంచూసి నేను ప్రేమిస్తున్నాను?
    
    అందమా? మానసిక సౌందర్యమా?
    
    మంచితనమా, లేక సంఘంలో వున్న పరపతా?
    
    లేక అతనికి లేక ఆమెకు గల అపారమైన వ్యక్తిత్వమా?
    
    అసలు మిగతావేమీ లేకపోయినా ఆ విశిష్ట వ్యక్తిత్వాన్ని ఆరాధించగల శక్తి నాలో ఎంత వుంది?

 Previous Page Next Page