ప్రగతి వంటిమీద చీర జారిపోయింది.
కానీ -
అదే క్షణంలో
ఇంకో చీర -
సరికొత్త పట్టుచీర ఆమె వంటిమీదకి వచ్చేసింది.
సాహస్ రూపంలో వున్న కెప్టెన్ టూటూ మొహం మాడిపోయినట్లయింది.
ఏమిటిది? ఏమవుతోంది?" అనుకున్నాడు టూటూ అసహనంగా.
అదే టైంలో -
ఎంతో రిలీఫ్ గా అనుకున్నాడు సాహస్.
"జపమాల"
జపమాలని స్మరిస్తేనే ఇంత ప్రభావం చూపిస్తే ఇంక అది తన దగ్గర వుంటే?
ఆ జపమాల సాయంతో ఈ ప్రపంచంలోని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసెయ్యగలడు తను.
ఎక్కడుంటుంది జపమాల?
ఇంతకీ అది రుద్రాక్షమాలా?
స్ఫటికమాలా?
ఎలా ఆ జపమాలని తన చేతిలోకి తెచ్చుకోవడం?
మిలియన్ డాలర్ క్వశ్చన్.
"ఈ భూగోళాన్ని ఒక ఆట ఆడించి వస్తా" అని ప్రొఫెసర్ అన్ వేషితో చెప్పి స్పేస్ షిప్ లోంచి అదృశ్యమయిన గ్రహాంతరవాసి కూకూ మరుక్షణంలో టెలిస్కోపు కొండ పరిసరప్రాంతాల్లో ప్రత్యక్షం అయింది.
ఈ భూలోకవాసులలో అతి తెలివైనవాడు సాహస్ అనే యువకుడు అని కెప్టెన్ టూటూ అనడం విని వున్నది కూకూ. తన మనో నేత్రంతో అతన్ని చూడగలిగింది. చాలా తెలివైనవాడే కాక చాలా అందగాడని కూడా అర్థం చేసుకోగలిగింది. వెంటనే అతన్ని ప్రత్యక్షంగా చూడాలనిపించింది ఆ అమ్మాయికి.
అంతే! తక్షణం వచ్చేసింది.
ఎలా?
ప్రగతి రూపంలో.
ఈ సాహస్ కి ప్రగతి అనే ఒక సన్నిహితురాలు వుందని కూడా తెలిసిపోయింది కూకూకి.
ఈ సాహస్ కొండల్లో వుండగా ఆ ప్రగతి ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి పాలెస్ కి దగ్గరగా వున్న క్వార్టర్స్ లో వుంటుందని కూడా తెలుసుకుంది కూకూ.
అంతేకాదు -
ప్రగతి క్వార్టర్స్ లోకి కెప్టెన్ టూటూ సాహస్ రూపంలో వెళ్ళి ఆ పిల్లని వశం చేసుకోవాలనుకుంటున్నాడని కూడా అట్టే శ్రమపడకుండానే అర్థమైపోయింది ఆమెకి.
తను వీళ్ళందరినీ ఆట పట్టించదలచుకుంది కదా!
మరి అందుకనే-
అక్కడ కెప్టెన్ సాహస్ రూపంలో ప్రగతి దగ్గరకెళ్తే...
కెప్టెన్ కి అసిస్టెంట్ అయిన తను ఇక్కడ ఈ సాహస్ దగ్గరికి ప్రగతి రూపంలో వచ్చింది.
ఇంకేం!
కావలసినంత కన్ ఫ్యూజన్!
కావాల్సినంత ఆనందం.
తనవైపే వయ్యారంగా నడిచి వస్తున్న ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాడు సాహస్.
నవ్వింది ప్రగతి రూపంలో వున్న కూకూ.
"సాహస్! ఏమిటి ప్రగతి ఇలా ఇక్కడికి ఎలా వచ్చేసిందా అని ఆశ్చర్యంగా వుందా?" అంది.
ఆ మాటలు విని ఇంకా ఆశ్చర్యపోయాడు సాహస్.
"ప్రగతా? ప్రగతి ఇక్కడికి వచ్చిందా? ఏదీ?" అన్నాడు ఆత్రంగా అటూ ఇటూ చూస్తూ.
ఈసారి అతనికంటే ఎక్కువగా ఆశ్చర్యపోయింది కూకూ. హఠాత్తుగా ఏదో అనుమానం వచ్చి ఒక్కసారిగా తనవైపు తాను చూసుకుంది.
తను కోరుకున్నట్లుగా ప్రగతి రూపంలో లేదు.
తను తన యథారూపంలోనే వుంది.
పద్ధెనిమిది అడుగుల ఎత్తు!
ఒంటికి లేత ఆకుపచ్చ ఛాయ!
మృదువైన పొలుసులు!
ఏమిటిది?
ఎందుకిలా జరుగుతోంది?
తాము కామరూపులు కదా!


