"మర్డర్లు చేయిస్తే మీకెందుకు....మానభంగాలు చేయిస్తే మీకెందుకు? ముందు చక్రవర్తిని తప్పించే మార్గం ఏమిటో అది చెప్పండి...."
"రాస్కెల్....ఎంత ధైర్యంరా నీకు....ఫోన్ లో బెదిరిస్తే నువ్వెవరో తెలుసుకుందామని ఇంత దూరం వచ్చానే తప్ప నీకు లొంగిపోయికాదు. వాడిని బయటకు రప్పించడం కాదు....నిన్ను కూడా అదే సెల్ కు పంపిస్తాను. ఈ పరశురామ్ అంటే ఏమిటో ఇప్పుడే తెలిసేలా చేస్తాను"
పరశురామ్ ఉగ్రుడై చిందులు వేస్తున్నాడు....
"తొందరపడకండి జైలర్ సాబ్....ఇది చూసిన తరువాతనయినా మీ అభిప్రాయం మార్చుకుంటారనుకుంటున్నాను...." అంటూ ఫాంట్ జేబులోనుంచి ఒక ఫోటో తీసి అతని ముందుకు నెట్టారు రాజేంద్ర.
ఒక్కసారిగా పరశురామ్ తల తిరిగినట్టయింది.
"ఇది....ఇ....ది" తడబడుతున్న చేతులతో అందుకుంటూ ఖంగారు పడిపోయాడు.
"పెళ్ళి కాకుండానే విచ్చలవిడిగా తిరుగుతున్న నీ ముద్దుల కూతురు ఎలాంటి స్థితిలో వున్నదో ఒకసారి తనివితీరా చూసుకోండి".
పరశురామ్ ముఖం కత్తివేటుకు కూడా నెత్తురు చుక్కలేనట్టు పాలిపోయింది.
"నమ్మలేకపోతున్నారా జైలర్ సాబ్....మీ అమ్మాయి ప్రియ కాలేజీకి ఎగనామం పెట్టి ప్రేమించిన ప్రియునితో కలిసి హోటల్ గదిలో తన సర్వస్వం అర్పిస్తున్న సమయంలో తీసిన నగ్నసత్యం అది"
పరశురామ్ కళ్ళల్లో ఎర్ర జీరలు స్పష్టంగా అగుపిస్తున్నాయి....
"ఒక రౌడీని జైలునుంచి తప్పించడంకోసం పరువుగల ఒక ఆడపిల్ల శీలాన్ని ఫలంగా పెట్టావన్నమాట"
పరశురామ్ మాటలకు పెద్దగా నవ్వాడు రాజేంద్ర.
"ఎందుకలా నవ్వుతావ్"
"నవ్వక మరేం చేయ మంటారు....మీరన్న డైలాగ్ కు నవ్వుకాక మరేం వస్తుంది? ఒక మనిషిని మరొక మనిషి సహకరించుకోవడం పూర్వ సమాజ లక్షణం....ఒక మనిషి బలహీనతను మరొక మనిషి స్వార్ధానికి ఉపయోగించుకోవడం ప్రస్తుత సమాజ లక్షణం....మీ చట్టం నా స్నేహితునికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. అందుకే అతడ్ని కాపాడుకోడానికి తప్పు అని తెలిసినా నేను ఈ మార్గం అనుసరించక తప్పలేదు. మీరు ఇది బ్లాక్ మెయిలింగ్ చేయడమని అనుకుంటారో, బెదిరించడమని అనుకుంటారో, మీ ఇష్టం....అనవసరమయిన సంభాషణతో కాలయాపన చేయకుండా ఒక నిర్ణయానికి రండి"
పరశురామ్ కాసేపు తీవ్రంగా ఆలోచించాడు.
తను అతను కోరినట్టు చేయకపోతే, కూతురు చేసిన పనికి తన పరువు బజారున పడుతుంది. తన కుటుంబం తల ఎత్తుకోలేని పరిస్థితి ఎదురుకావచ్చు....
పెళ్ళి కాకుండానే హోటల్ గదుల్లో శృంగారం ఒలకబోస్తున్న కూతురి నగ్న ఫోటోలు పేపర్లకు ఎక్కితే తన ఇంటిల్లపాదీ తలదించుకోవలసి వస్తుంది.
ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన కుటుంబగౌరవం....పరువు_ప్రతిష్టలు ఒక్కసారిగా....ఆ తరువాత జరిగేది ఊహించలేకపోయాడు పరశురామ్!
"ఆల్ రైట్....చక్రవర్తికి తప్పించుకునే అవకాశం కల్పిస్తాను....కానీ అతను జైలు ఆవరణ దాటిన మరుక్షణం ఏం జరిగినా నా పూచీ వుండదు....తిరిగి పట్టుపడడమంటూ జరిగితే నన్ను నిందించకూడదు.... మరొకసారి అతన్ని తప్పించమని నన్ను అడగకూడదు. సరేనా...." అప్పటికే ఒక నిశ్చయానికి వచ్చి స్థిరమయిన గొంతుతో చెప్పాడు పరశురామ్.
"ఓకే....ఎగ్రీడ్...."
"బట్ వన్ థింగ్....నెగిటివ్ తో సహా ఈ ఫోటో ఖచ్చితంగా ఇస్తావన్న గ్యారంటీ ఏమిటి? నేను నిన్నెలా నమ్మడం...."
"వెరీ వెల్....మీరు మాట ఇచ్చారంటే తప్పరని నాకు తెలుసు....అందుకే అవకాశాన్ని మీకే వదిలేస్తున్నాను....మీమీద నమ్మకంతో నమ్మకంతో ఫోటో ప్లస్ నెగిటివ్ లను ఇప్పుడే ఇచ్చేస్తాను....ఫోటో మీ చేతిలోకి వచ్చింది కదా అని చక్రవర్తిని వదిలిపెట్టకుండా వుంటే నేను మరో ప్రయత్నం చేసుకోకతప్పదు...." అంటూ ఒక కవర్ ను పరశురామ్ చేతిలో ఉంచాడు రాజేంద్ర.
రెండు నిమిషాలపాటు పరశురామ్ మాట్లాడలేదు....
"మిస్టర్ రాజేంద్రా....నిజానికి ఇప్పుడు చక్రవర్తిని వదలకుండా అతనిని తప్పించుకునే వీలులేని చోటకు మార్చడం నాకు చిటికెలో పని....కానీ నేను అలా చేయదలచుకోవడంలేదు....నువ్వు నన్ను కలిసినట్టు కానీ.... చక్రవర్తిని విడిపించడంలో నా హస్తం వున్నట్టు కానీ నువ్వు బయటపెట్టడానికి వీల్లేదు...."
"ఆ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు వద్దు. మీలాగానే నేను మాటమీద నిలబడే మనిషిని.... మీకు ఎలాంటి హానీ తలపెట్టనని మాట ఇస్తున్నాను...." అన్నాడు రాజేంద్ర.
వాడిపోయిన ముఖంతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆ హోటల్ లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు జైలర్ పరశురామ్!
* * *
ఆ రోజు....
సెంట్రల్ జెయిల్ లో వార్షికోత్సవ సభ జరుగుతుంది....
సాయంత్రం ఏడు గంటలకు హోమ్ శాఖ సహాయ మంత్రి ప్రసంగం వుంది.
మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జైలర్ పరశురామ్ ఖైదీల సెల్స్ వైపు వెళ్ళాడు. తనను ఎవరూ గమనించడంలేదని రూఢి చేసుకున్నాక చక్రవర్తిని ఒంటరిగా కలిశాడు.
"మిస్టర్ చక్రవర్తీ....ఈరోజు సాయంత్రం ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది" తనను ప్రత్యేకంగా పిలిచి ఆవిషయం ఎందుకు చెబుతున్నాడో అర్ధంకాక విస్తుపోవడంతో పాటు అయోమయంగా పడ్డాడు చక్రవర్తి.
"ఏమిటాలోచిస్తున్నావ్?"