Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 7


    "తండ్రికి ఒక్కగానొక్క కూతుర్ని కావడం, భర్తకు ఇక్కడ మరో భార్య ఉండటంతో ఆయన నన్ను కాపురానికి తీసుకొని రాలేదు. అప్పుడప్పుడు వచ్చివెళుతూ ఉండేవారు. వీడు పుట్టినప్పుడు వచ్చారాయన. అంతే మళ్ళీ రాలేదు.
    "అక్కడ మా నాన్నగారు చనిపోవటంతో నేను ఒంటరి దానినయిపోయాను. జీవితమంతా గడిచిపోయాక ప్రొద్దువాటారే ఈ సమయంలో నేను అత్తవారి ఊరు వెతుక్కుంటూ, భర్త ఇంటికి వచ్చాను. కానీ, నా దౌర్భాగ్యం నన్ను ఇంకా వెన్నాడుతూనే ఉంది. భర్త ఆశ్రయం కోరి వచ్చిన నాకు భర్తే దూరమయ్యాడు"
    ఆమె దుఃఖాన్ని చూసి చలించిపోయారంతా.
    రమణకంతా అగమ్యగోచరంగా ఉంది. అర్ధమయ్యీ కాకుండానూ ఉంది.
    అంతా నిశ్శబ్దంగా ఉన్నారు.
    వెంట తెచ్చుకున్న సూట్ కేస్ తెరచి, ఓ గ్రూఫ్ ఫోటో అందించింది ఆమె. అందులో శివయ్య, ఆమె, ఒక నెలల పసిబాబు ఉన్నారు.
    గోపీని దగ్గరకి తీసుకొని తల నిమురుతూ ఉండిపోయాడు రమణ.
    'తనిప్పుడు ఏకాకి కాడు. తనకు తమ్ముడున్నాడు. తనకో తల్లి ఉంది. ఆదరించటానికీ. ఆప్యాయత చూపటానికీ పెద్దరికం నెరపటానికీ ఆమె ఉంది. భగవంతుడు తనపై దయచూపాడు. అనుకున్నాడు రమణ.


                                             *    *    *


    ఊరుముందుకు వచ్చిన రమణయ్యని పలకరించాడు పక్క పొలం పరశురామయ్య.
    "ఏం రమణయ్యా? పొలం విరగబండింది. ధాన్యలక్ష్మి నీ ఇంట తాండవమాడుతోంది. భగవంతుడు దయ చూశాడు కొడుకు పుట్టాడు."
    తన ఆలోచనలో తను మునిగిపోయి గతాన్నంతా నెమరువేసుకుంటూన్న రమణయ్య ఆ పలకరింపుకి ఉలిక్కిపడ్డాడు.
    ఒక్కసారిగా స్మృతిలోకి వచ్చినట్లయి, "అవునయ్యా! అవును" అన్నాడు యధాలాపంగా.
    "మా నోళ్ళంతా తీపి చెయ్యాలి నీ పిసినిగొట్టుతనం ఇక మానుకో. అబ్బాయి పెళ్ళప్పుడూ ఒకర్నయినా పిలవకుండా పెళ్ళిచేశావు. నీ పెళ్ళీ అంతే! ఇప్పుడయినా నలుగురిని పిలిచి విందుచెయ్యి. మనకి ఏదయినా శుభం కలిగితే ఏడుపుగొట్టువాళ్ళ దృష్టి సోకకుండా ఉండాలనే ఈ విందులూ, వినోదాలూ ఏర్పాటు చేశారు పూర్వికులు. మన ఇంట తిని మనల్నే చూసి ఏడ్చిపోరుకదా ఎవరయినా?"    
    "బాగా చెప్పావు పరుశురామయ్యా! తప్పకుండా బారసాల బ్రహ్మాండంగా జరిపిస్తాను. పెళ్ళి పందిరంత వేయించి, బాజా భజంత్రీలని పిలిపించి, నరసారావుపేట నుంచి డాన్సు వాళ్ళను పిలిపించి, డప్పులు మోయింపించి, మందుతో విందుచేయిస్తాను."
    "ఏ మినిస్టరుగారి కుమారుడి బారసాలో అన్నట్టుగా జర్పిస్తాను. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ సంపదంతా తనది, తను అనుభవించాలి. ఇదంతా తనహక్కు అనే మట్టి మనిషి పుట్టాడయ్యా! వాడి సొమ్ము వాడి బారసాలకి ఖర్చుచేయనా?" అని విసవిసా నడిచి పోతూన్న రమణయ్యని చూసి. అతని మాటలకు నివ్వెరపోయిన పరశురామయ్య అలాగే నిలుచుండిపోయాడు.


                             *    *    *


    రమణయ్య ఇంటికి వచ్చాడు.
    ఆ సరికి అబ్బాయిని లాలిలో పడుకోబెట్టి రాధ వద్ద ఉండి పడక సరిజేస్తూంది ఆయా.
    నేరుగా లాలి వద్దకు వెళ్ళాడు రమణయ్య.
    అబ్బాయిని చూడగానే అతని కళ్ళు మెరిశాయి.
    బొద్దుగా, నల్లని జుత్తుతో, పసిడి ఛాయతో బంగారు ముద్దలా మెరిసిపోతున్నాడు కుర్రవాడు. ఆ బుల్లి పెదాల్ని ముద్దుపెట్టుకోవాలనీ, ఆ చిన్నారి చేతుల్ని అందుకుని తనకి ఆసరాగా ఉంచుకోవాలనీ అనిపించింది రమణయ్యకి.
    జీవితంలో ఒడుదుడుకులకు లోనై కష్టాలనే తనభాగంగా స్వీకరించిన రమణయ్యకి వాడి పుట్టుక మండువేసవిలో తొలకరిలా అనిపించింది.
    చేతులుచాచి వాడిని తాకబోయిన రమణయ్యని చూసి. "ఆగండి బాబూ! కాళ్ళూ చేతులూ కడుక్కుని రండి బయటినుంచి వచ్చి అలాగే పిల్లల్ని తాకకూడదు" అంది అప్పుడే రాధ గదిలోంచి బయటికి వచ్చిన ఆయా.
    "ష్! దేశంలోంచి దాన్ని తరిమెయ్యాలని చూస్తూ ఉంటే ఇంకా ఎక్కడుందమ్మా ఆచారం?" అని, "ఊఁ ఊఁ కానీ. ఈ పదిరోజులూ మీరాడినట్లే ఆడాలికదా!" అని పెరట్లోకి వెళ్ళిపోయాడు రమణయ్య.
    కాళ్ళు శుభ్రంగా కడుక్కుని వచ్చిన రమణయ్య ఊయలవద్ద నిలుచున్నాడు.
    ఆయన మనస్సు ఆనందంతో పొంగిపోతూంది.
    తన బ్రతుక్కొక చుక్కానిలా, అంధకార బంధురమైన తన జీవితంలో వేగుచుక్కలా కనుపించాడు వాడు.
    వాడినే పేరుతో పిలుచుకోవాలా? అని ఆలోచించాడు ఒక క్షణం సేపు.
    తన తండ్రి పేరు. తాత పేరు స్పురించాయి ఆయనకి. వాళ్ళంతా పాలేళ్ళుగా జీవితం సాగించారు. వీడు - ఈ చిన్నబాబు మోతుబరి రైతు రమణయ్య తమ్ముని కొడుకు. ఆ తమ్ముడు ఎం.ఎ. చదువుకున్నాడు. వీళ్ళ హోదాకి తగినట్లుగా బ్రతకాలి వీడు.
    'పేరులో ఏముంది అనుకోవచ్చు. కానీ, పేరులోనే ఒక్కో మనిషి అదృష్టం బయటపడుతుంది. మంచిపేరు చూసి పెట్టాలి' అనుకున్నాడు రమణయ్య.
    వెళ్ళి వంటింట్లో తనకై తనే వడ్డించుకుని అలవాటు ప్రకారం పచ్చటి మెతుకులు తిని తిరిగిపోవాలని తయారై లాలి వద్దకు వచ్చి 'ఒరే బాబూ! పచ్చడి మెతుకులు తిని నీకు పసిడిపలుకులు దాచుతున్నానురా బాబూ! మా బ్రతుకులో బంగారు పంట పండించాలిరా నీవు' అనుకుని, ఆనందంతో తిరిగిన కన్నీళ్ళని తుడుచుకుని కండువా భుజంపై వేసుకుని, "తిరిగి నేను పొలం వెళుతున్నానమ్మా" అని కేకేసి వెళ్ళిపోయాడు రమణయ్య. దారిలో పోస్టాఫీసుకు వెళ్ళి తమ్ముడికీ టెలిగ్రామ్ ఇచ్చి చెప్పివెళ్ళాడు. తిరిగి అతని ఆలోచనలు అతన్ని ఆక్రమించాయి.


                                     5


    "విశాలా!" ఆశ్చర్యంగా కేకవేసింది మాణిక్యమ్మ.
    "అమ్మా! తల్లివి నీవే ఇంతగా ఆశ్చర్యపోతే ఇతరులు ఏమంటారో ఆలోచించు. నేనేం కానిపని చేయలేదు. చేయబోను. మన వంశానికీ, గౌరవానికీ హాని కలిగించే పని నేనెప్పుడూ చేయను. నేను భూషయ్యగారి కూతుర్ని.
    రమణ ఈ ఇంట్లో ఒకడుగా పెరిగాడు.
    మేము ముగ్గురమూ కలిసి చదువుకున్నాము. కలిసి తిరిగాము.
    అతనూ ఈ ఇంటి మనిషిగా మెసిలాడు.
    ఎవరూ రమణని పరాయివ్యక్తిగా భావించరు.
    నన్నిచ్చి పెళ్ళి చేయటం మనకి పరువు తక్కువకాదు. మర్యాద నష్టం కాదు.
    ఇంకెందుకమ్మా మీ అభ్యంతరం !
    మాణిక్యమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
    కన్నీళ్లు పైట చెంగుతో వత్తుకుని. అంది. "విశాలా! నీకింకా చిన్నతనం వదల్లేదమ్మా. ఈ లోకంలో మనతిండి తిని, మన బట్ట కట్టుకున్నా మనం ఈ లోకానికి వెరవాలమ్మా.
    ఈ సంఘం ఎవరు? అంతా మనమే కదా అనవచ్చు.
    తప్పు చేసిన వారిపై విసిరే రాళ్ళలో మనదీ ఒకటి అవుతుంది తప్ప. అయ్యో! మనమూ ఈ తప్పుచేశామే? అని ఎవరూ ఆలోచించరు. విశాలా!
    గొంగళిలో తింటూ వెంట్రుకలు లెక్కపెడతారమ్మా జనులు.
    నా మాట విను రమణపై ఆశవదులుకో.
    అతను మన కులం వాడైనా, మన పాలేరు. అతనికి ముందూ వెనకా అంటూ ఎవరూ లేరు. సవతి తల్లి, తమ్ముడు ఎప్పటికీ అతని వారు కాలేరు.
    ఇంత ఐశ్వర్యం ఉంది నీకు.
    అలాంటి దిక్కులేని వాడికి ఎలా ఇవ్వగలం. చెప్పు?
    విశాల ఏదో చెప్పబోయింది.

 Previous Page Next Page