Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 7


    "అలాగే డాడీ?"
    "ఆడపిల్లలు కోకొల్లలుగా దొరుకుతారు చిరంజీవి! వాళ్ళక్కావలసింది డబ్బు. నీకు తెలుసో తెలీదో తొంభయ్ శాతం మంది ఆడపిల్లలు కేవలం ఆర్ధిక రక్షణకోసం పెళ్ళి చేసుకుంటారు. మిగతా పదిమందీ మగాడిని స్వారీ చేయాలని చేసుకుంటారు. కనుక డబ్బు పారెయ్! ఆడపిల్లలతో ఆనందంగా గడుపు. అంతేగాని చస్తే పెళ్ళి చేసుకోకు! పెళ్లి చేసుకోవటం కోసం వాళ్ళు రకరకాలుగా నాటకాలాడతారు. కన్నీళ్లు పెడతారు! మీ రూపం నాలో పెరుగుతోంది 'మోహన్' అంటారు, వినకు! కనకు! వాళ్ళు చాలు అనేవరకూ డబ్బు విసురు! ఏరుకుని వెళ్ళిపో మను! బట్ డోంట్ బిలీవ్!"
    "ఓ.కే.డాడీ."
    చిరంజీవి క్లబ్ బిల్డింగ్ లో తనాఫీస్ లోకొచ్చి కూర్చున్నాడు. తను ఇంటర్వ్యూ చేయాల్సిన కొత్త మెంబర్స్ కూర్చుని ఉన్నారు బయట.
    ప్యూన్ వచ్చాడు గదిలోకి "సార్! క్లబ్ మెంబర్ షిప్ ఇంటర్వ్యూ త్వరగా తీసుకుంటే బావుంటుంది సార్! వాళ్ళు వచ్చి గంటవుతోంది"
    "ఆల్ రైట్ ఒన్ బై వన్ పంపించు" ప్యూన్ వెళ్ళిపోయాడు.
    ఓ నడివయసతను లోపలికొచ్చాడు.
    "మీ పేరు?"
    "కృష్ణమూర్తి!"
    "మీ ఆవిడ పేరు?"
    "రుక్మిణి!"
    "మీరు విడాకులు తీసుకుని ఎన్ని రోజులయింది?"
    "రెండు రోజులు!"
    "పెళ్ళయి ఎన్ని రోజులయింది?"
    "పదిహేనేళ్ళు."
    "మరెందుకింతకాలం ఆలస్యం చేశారు?"
    "పొరబాటయిపోయింది! క్షమించండీ!"
    "జాలీ క్లబ్ లో చేరదల్చుకున్నవాళ్ళు పెళ్ళయిన పదేళ్ళలోపే విడాకులు తీసుకోవాలి. మరీ ఇంత లేటయితే కష్టం."
    "ఇంకోసారిలాంటి పొరబాటు చేయనని హామీ ఇస్తున్నాను."
    "అంటే ఇంకో పెళ్ళి చేసుకోవాలన్న ప్లాన్ ఉందా?"
    "ప్రస్తుతానికి లేదండీ!"
    "అంటే తరువాత చేసుకుంటారాండీ?"
    "నో నో నో! పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదు."
    "ఆర్ యూ షూర్?"
    "యస్! అయామ్ షూర్!"
    "ఇంతకూ మీకూ, మీ ఆవిడకూ ఎందుకు పేచీ వచ్చింది?"
    "మా ఆవిడకు ఆ మధ్య సడెన్ గా జ్వరం వచ్చింది. ఒకవేళ తను చచ్చిపోతే నేను ఇంకో పెళ్ళి చేసుకోనని మాట ఇమ్మంది."
    "ఇంకో పెళ్ళెందుకు చేసుకుంటాను? రాధ ఉంది కదా అన్నాను. అంతే ఆ జ్వరంతోనే లేచి నన్ను పట్టుకుని కొట్టి, అడ్డం వచ్చిన డాక్టర్ ని తన్ని విడాకులు అప్లయ్ చేసింది."
    'ఇంతకూ రాధెవరు?"
    "మా పక్కింట్లో వుంటుంది. పొరబాటున నోరు జారేశాను. పొరబాటున ఆ పేరు వాడానే అన్నా వినిపించుకోలేదు. దాంతో వళ్ళు మండి, విరక్తి కలిగి నేనూ విడాకులకు ఒప్పుకున్నాను. మొన్నే విడాకులు మంజూరయింది."
    "ఆల్ రైట్! పాతికవేలు మెంబర్ షిప్ ఫీజ్ కట్టండి!"
    "ఓ.కె. థాంక్యూ!"
    "మీరు పొరబాటునయినా సరే యింకెవరినయినా పెళ్ళి చేసుకుంటే మీ మెంబర్ షిప్ రద్దయిపోతుంది. మీ పాతికవేలు మీకిక రాదు."
    "సరే."
    అతను వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూలన్నీ చకచక అయిపోయినాయి. టైమ్ చూసుకున్నాడు చిరంజీవి. సాయంత్రం ఏడూ ఇరవై అయ్యింది. ఏడున్నరకి తనకోసం ఫ్రెండ్స్ రవీంద్రభారతిలో ఒక ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులు ఇచ్చే కల్చరల్ ప్రోగ్రామ్ కి టికెట్స్ రిజర్వ్ చేసి ఉంచారు. అతను హడావుడిగా రవింద్రభారతికి బయల్దేరాడు.
    రవీంద్రభారతి హౌస్ ఫుల్ అయిపోయిందారోజు. ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్ సామాన్యమైనది కాదు. అందులోని డ్రామాలు ఓ సెక్సీ డాన్స్ సీక్వెన్స్ లో ఓ మంత్రిగారి సెకండ్ సెటప్ తాలూకూ కూతురు డాన్స్ చేస్తోంది.
    ఆ డాన్స్ ద్వారా ఆ పిల్లను సినిమాల్లో హీరోయిన్ చేసేయాలని ఆ పిల్ల తల్లి మంత్రికి ఆంక్ష పెట్టింది.
    గత్యంతరం లేక మంత్రిగారు తన ఇన్ ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఆ ప్రోగ్రామ్ కి సినిమా ఫీల్డ్ లో ఉన్న ముఖ్యమైన నిర్మాతలను, డైరక్టర్లను హాజరయ్యేలా చూశారు.
    వాళ్ళు ముందు తమకు షూటింగ్ లున్నాయనీ, ఆ ఫంక్షన్ కి రావటం కుదరదనీ వంకలు చెప్పారు. కానీ రాకపోతే మీరు తీసిన సినిమాలు సెన్సార్ బోర్డ్ లో 'బాన్' చేయిస్తానని మంత్రిగారు అరవడంతో రాక తప్పలేదు వారికి.
    ప్రోగ్రాం ప్రారంభమయింది.
    ముందు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లోని పాటగాళ్ళు తలో పాట పాడారు. తరువాత డ్రామా ప్రారంభమయ్యింది.
    మంత్రిగారి సెకండ్ సెటప్ తాలూకూ కూతురు సంగీత అందులో హీరోయిన్. ఆమె ఆధునిక విద్యార్ధినిగా జీన్స్, బనీన్ తో వేదిక మీదకి వచ్చేసరికి ముందు వరసలోనే కూర్చున్న చిరంజీవి ఆమె అందం చూసి స్టన్ అయిపోయాడు. ఒక్కసారిగా తనెక్కడో దేవలోకంలో విహరిస్తున్నట్లనిపించింది. ఆ అమ్మాయి ఒక దేవతలా కనబడుతోంది. అలాంటి అందాన్ని తను అంతవరకూ ఏ అమ్మాయిలోనూ చూడలేదు.
    ఆ అమ్మాయి హావభావాలతో డైలాగులు చెప్తోంటే తనను తను పూర్తిగా మర్చిపోయాడతను. మరికొద్ది సేపట్లో వెస్ట్రన్ మ్యూజిక్ ప్రారంభమయ్యింది. దానికి తగ్గట్లు బ్రేక్ డాన్స్. ఆ అమ్మాయి డాన్స్ అద్భుతంగా చేస్తున్నట్టనిపించిందతనికి.
    MTV చూస్తున్న థ్రిల్ కలుగుతోంది. కళ్ళప్పగించి ఆమెవంకే చూస్తున్నాడు. సెక్సీగా విరుచుకోవటం, భంగిమలు మార్చటం చూసేసరికి అతనికి ఆ అమ్మాయి మీద హఠాత్తుగా ఒక్కసారిగా ప్రేమ కలిగింది. ఆమె ధరించిన జీన్సూ, ఆ బనీను అతనికి వెర్రెత్తించేస్తున్నాయి! ఎంతోమంది అమ్మాయిలను తను చీర, జాకెట్లతో చూశాడుగానీ వాళ్ళ మీద ఎప్పుడూ ఎలాంటి ఆకర్షణా కలగలేదు గానీ, ఇప్పుడు మొదటిసారిగా ప్రేమంటే ఏమిటో తెలిసిపోయింది.
    అసలు ప్రేమ ఇంత అనుభూతిని కలిగిస్తుందనే తెలీదు. ప్రేమకూ, కోరికకూ తేడా వుంటుందని కూడా తెలీదు. పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలనిపిస్తోంది.
    ఎందుకిలా మారిపోయాడు తను? ఇంతకాలం తన తండ్రి, ఇతర జాలీ లైఫ్ మెంబర్సూ తనకు నూరిపోసిన పాఠాలన్నీ ఏమయిపోయినాయి?

 Previous Page Next Page