Previous Page Next Page 
గోరింటాకు పేజి 7


    అయితే ఇవన్నీ ఇదివరకు లేవా? ఇప్పుడు కొత్తగా అనుభవిస్తున్నాడా?

 

    ఉన్నాయి. కాని, అప్పుడు ఇవన్నీ ఆలోచించేందుకు వ్యవధిలేదు. ఇంట్లో తనని ఆలోచించకుండా చేయడానికి తల్లీ, తండ్రీ మొదలైనవారున్నారు. తను దాక్కోడానికి వీలుగా విశాలమైన రాజారావున్నాడు. అతని నీడలో తను మరుగున పడిపోయేవాడు. అలాగ తను ఆక్రమించడానికి ఎవరో ఒకరు కావాలి. ఎప్పుడూ ఎవరిదో ఒకరి ప్రభావం తనమీద నిరవధికంగా ప్రసరింపబడుతూ వుండాలి. లేకపోతే తన జీవితం చీకటిలో నల్లముసుగు.

 

    కాలేజీలో కొంతమందితో పరిచయమయింది. కాని వాళ్ళలో తనను సేదతీర్చేవాడు ఒక్కడూ లేడు.

 

    ఈ స్థితిలో రాజారావు వుత్తరాలు ఒకింత మనశ్శాంతి. తండ్రి ఉత్తరాలలోని ఆప్యాయత కొంచెం వూరడింపు.

 

    తృప్తి లేకపోయినా ఒక్కడే నగరమంతా తిరిగేవాడు. పబ్లిక్ గార్డెన్స్ కు వెళ్ళేవాడు. చార్ మినార్ ఎక్కి క్రిందికి చూస్తూ నిలబడేవాడు. బస్సులో ఎక్కి ఊరకనే ఈ చివరినుంచి ఆ చివరిదాకా తిరిగి వచ్చేవాడు. తరుచు సినిమాలు చూసేవాడు. విషాదమనే తుషారబిందువులు మీదకు చిలికినప్పుడల్లా కనిపించిన హోటలికిపోయి ఇంట తినేసి వస్తూండేవాడు. గోల్కొండ వెళ్ళి కొండ ఎక్కకుండానే తిరిగి వచ్చాడు.  

 

    ఇలా రోజులు వెళ్ళబుచ్చుతున్న చక్రపాణికి ఒక హోటల్లో భోజనం చేస్తూండగా ఎదురుగా కూర్చున్న ఒక యువకుడు తనవంక తదేకంగా చూడటం కనిపెట్టాడు. వెంటనే కంగారుపడ్డాడు. తర్వాత సిగ్గుపడ్డాడు. పిదప సంకోచంలో పడ్డాడు. తనవంక ఒక వ్యక్తి చూస్తున్నాడని తెలిశాక, అతనికి ముద్ద నోట్లోకి పోలేదు. కొంచెం ఆగి దిటవు తెచ్చుకుని మెల్లగా తలయెత్తి అతడివంక సూటిగా చూశాడు.

 

    ఆ యువకుడు మందహాసం చేశాడు.

 

    చక్రపాణి అతనికోసం నవ్వినట్లు కాకుండా, మొత్తానికి నవ్వేశాడు.

 

    ఒకవేళ ఇదివరకు అతన్తో పరిచయమేమయినా వుందా? ఎప్పుడూ చూచినట్లు లేదు మరి! మనిషి బక్కపలుచగా, నల్లగా వున్నాడు. మధ్యపాపిట తీశాడు. ఇరవై ఒకటి, రెండేళ్ళకు మించి వుండవు. షార్క్ స్కిన్ ప్యాంటూ, శ్లాక్ వేసుకున్నాడు. అతన్లో ఎక్కడో ఒకచోట ఏదో ఆకర్షణ వున్నట్లు తోచింది చక్రపాణికి. అన్నం తినటం మాని ఎక్కడా అని ఆలోచించసాగాడు. కళ్ళా? నడతా? అతన్లోని చొరవా? చురుకుతనమా?         

 

    చక్రపాణి ఇలా ఆలోచనల్లో వుండగానే ఆ యువకుడు ఇలా అన్నాడు "మిమ్మల్ని ఎక్కడో చూచినట్లుగా వున్నదండీ."

 

    "నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదండీ" అనేశాడు చక్రపాణి చప్పున.

 

    ఆ యువకుడు నవ్వి "నేనూ మిమ్మల్ని చూసివుండను. కాని కొందర్ని చూడగానే అలా అనిపిస్తుంది."

 

    "మీ పేరు?" అనడిగాడు చక్రపాణి.

 

    "బ్రహ్మానందం."

 

    అతను అడిగినమీదట చక్రపాణి తనపేరు చెప్పాడు. అతను ఇక్కడ లా కాలేజీలో చదువుతున్నాడట . అతనుకూడా ఇక్కడకు కొద్దిరోజుల క్రిందటే వచ్చాడు. అతనికీ రూం దొరకలేదు. ప్రస్తుతం అదే ప్రయత్నంలో వున్నాడు. చక్రపాణికి అతనుకనిపించటం కొండెక్కినంత సంతోషం కలిగించింది. ఇతన్ని ఒక ఆధారంగా చేసుకోవాలనుకున్నాడు. ఏదో ఆకర్షణకనిపిస్తోంది అతన్లో.

 

    ఆ సాయంత్రానికి ఇద్దరూ బాగా పరిచితులయిపోయారు. లోకాన్ని గురించి తనకంటే ఎక్కువ తెలిసినట్లుగా అనిపించింది చక్రపాణికి. ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్ళారు.

 

    మరునాటినుంచీ ఇద్దరూ కలిసి ఇళ్ళకోసం తిరగసాగారు. అమ్మాయిలతో మాట్లాడుతుంటే చక్రపాణి సిగ్గుపడుతూ వుండేవాడు.

 

    ఒకరోజున ఎవరో చెబితే ఒక సాయిబుగారింటికి వెళ్ళారు. అందులో రెండు గదుల భాగం ఒకటి ఖాళీగా వున్నది. ఆ భాగానికీ, మిగతా ఇంటికీ అసలు సంబంధంలేదు. ఇది ఇవతల రోడ్డుమీదకి వున్నది. వాళ్ళ ఇల్లు ప్రక్కరోడ్డుమీదకి వున్నది. ఆ సాయిబుగారు నిజాంగారి ప్రభుత్వం రోజుల్లో తాసిల్దారు. ఉర్దూ ధారాళంగా మాట్లాడుతారు. తెలుగు రానే రాదు. ఇంగ్లీషు ఘోరం.

 

    వీళ్ళిద్దరికీ సంకటావస్థ వచ్చిపడింది. ఇద్దరికీ హిందీ సరిగ్గారాదు. మొత్తానికి తిప్పలుపడి తాము వచ్చిన పనిని గురించి అభివర్ణింపసాగారు.

 

    "ఐ డోన్ట్ గేవ్ ఘర్ స్టూడెంట్స్ కో, బట్ యువర్ ఫేసెస్ వర్ గుడ్. మై వైఫ్ షి ఓనర్. ఐ ఆస్క్ హర్" అన్నాడు.

 

    ఆయనకి ఇద్దరు కొడుకులున్నారట. స్కూల్ ఫైనల్ ఏదో చదువుతున్నారు. వాళ్ళిక్కడ వుంటే ఇంత తిప్పలు వుండేవి కావు. బడికిపోయినట్లున్నారు. ఆయన ఇంట్లోకిపోయి ఒక పది నిమిషాలాగి వచ్చాడు బయటకు.

 

    "ఫోర్ హండ్రెడ్ ఎండ్ ఫిఫ్టీ, రెన్ట్" అన్నాడు.

 

    ఇద్దరకూ గుండె లవిసిపోయినాయి. "మైగాడ్!" అన్నాడు బ్రహ్మానందం.

 

    "ఓ...! ఐ సారీ! ఛాలీస్ పర్ పాంచ్."

 

    "ఫార్టీఫైవ్" అన్నాడు చక్రపాణి.

 

    "యస్. దటీజ్."

 

    "హమ్మయ్య" అనుకుని కుర్రాళ్ళిద్దరూ ఊరడిల్లారు.

 

    ఇంతలో ఆయన తమ ఇంటికి మొన్న వచ్చిన దొంగనుగురించి, తాను అప్పటినుంచీ చేసిన బందోబస్తు గురించి అభివర్ణింపసాగాడు.

 

    "చోర్ కేమ్, జంప్డ్ ఆన్ ది విన్ డో. ఉదర్ - క్యావ్ వాట్... యస్...ఎన్ టర్డ్. హి జంప్డ్ ఇన్ టూ మై ఘర్. ఐ సీన్ హిమ్. అండ్ హి రన్ ఎవే."

 

    "భాయ్! కుచ్ ఛాయ్ పీతేహో. యు బడా జంటిల్ మన్. వెల్ పర్సనాలిటీ."

 

    "అక్కర్లేదు" అని చెప్పారు.

 

    స్టవ్ అదీ పెట్టటానికి వీలులేదని చెప్పసాగాడు. "ఫైర్ యు డోన్ట్ ఫుట్ వాట్ ఈజ్ వాట్? ఫై...! ఛూలా స్మోక్. వాల్స్ విల్ బి ఖరాబ్."

 

    వీళ్ళకి అర్థమయింది తలవూపారు.

 

    "ఎనదర్ టూ ఇంపొటెంట్."

 

    ఇద్దరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు.

 

    "సారీ మాఫ్ కీజియే, మాఫ్ కర్నా భాయ్! ఇంపార్టెంట్ న్యూస్."

 

    "వార్తలు ఏవో చెబుతున్నాడుగావును" అన్నాడు బ్రహ్మానందం.

 

    "ది విన్ డో ఆన్ దట్ సైడ్. ఇట్ ఈజ్ క్లోజ్ డ్. ఓపెన్ నై. డోన్ట్ ఓపెన్. జనానాహై అందర్. మై వైఫ్ గుస్సా. డేంజర్ బురావుమెన్."       

 Previous Page Next Page