Previous Page Next Page 
లక్ష్యం పేజి 7


    ఆ రాత్రంతా మహతి నిద్రపోకుండానే ఆలోచిస్తూ గడిపింది.

 

    ఉదయాన్నే-

 

    "ఏమయింది మహతి...? నువ్వెందుకిలా అసందర్భంగా మాట్లాడావు? మధుకర్ రాత్రికి రాత్రే బెంగుళూరు ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ రెంటికి సంబంధం వుందా?" మేరీ బెడ్ కాఫీ తీసుకుంటూ అడిగింది.

 

    మహతి ఆ మాటల్ని విన్నది... అయినా మౌనంగా కిటికీలోంచి పల్చబడుతున్న మంచుపొగనే చూస్తోంది. "ఈ ఆలోచనలు, మనస్థాపాలు, లోలోన కుళ్ళిపోవటాలు, ఫ్రస్టేషన్, డిప్రెషన్, ఉద్వేగం, ఉద్రేకం... ఏమిటివన్నీ...? వాటి మూలంగా జీవితంలో ఎంత విలువైన వాటిని పోగొట్టుకుంటున్నామో తెలుసా? కాలచక్రం మన అందాలకు, కోర్కెలకు, అనుభూతులకు, అనుభవాలకు వయస్సుని జోడించి వృద్ధాప్యానికి చేరువ చేస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే... ఏమీ వుండదు. నా మాట విను- ఒక్కసారి మనస్సుకు ప్రాముఖ్యత ఇస్తే, అది మనల్ని పిచ్చివాళ్ళగా మార్చివేస్తుంది .  

 

    నువ్వూ, మధుకర్ ప్రేమించుకున్నారు.

 

    బాగా గాఢంగా ప్రేమించుకున్నారు. శాశ్వతంకాని చిన్న చిన్న బేదాభిప్రాయాలకు, వైరుధ్యాలకు ఆ ప్రేమని- ఆ ప్రేమ ద్వారా లభించే అమర సుఖాన్ని ఎందుకు బలిపెట్టుకుంటారు...?" మేరీ అంది క్రితం రాత్రి తాను విజయ్ తో పంచుకున్న మధురానుభూతుల్ని నెమరువేసుకుంటూ.

 

    "అవును- మేరీ చెప్పింది అక్షరాల నిజం- చేతివేళ్ళ మధ్య నుంచి విలువైన కాలం ఇసుకలా జారిపోతున్నా, చూస్తూ కూర్చోవటం మూలంగా ఫలితం ఏమిటి?" అంది సుధారాణి కాఫీ తీసుకోవటం పూర్తయ్యాక సిగరెట్ వెలిగించుకుంటూ.

 

    మహతి విసురుగా తలతిప్పి పొగని రింగులుగా వదులుతున్న సుధారాణికేసి ఒకింత అసహనంగా, అయిష్టంగా చూసింది.

 

    "కొందరికి జీవితలక్ష్యం కేవలం సుఖించటమే, అనుభవించటమే కావచ్చు. మరికొందరికి ఎలా సంపాదించినా, ఎక్కువ సంపాదించామా లేదా అన్నదే లక్ష్యం కావచ్చు. మరికొందరికి తన గురించి తనే ఎంతో ఎక్కువగా చెప్పుకుని ఆత్మవంచన చేసుకోవటమే లక్ష్యం కావచ్చు."

 

 

    అంతమాత్రాన, అవి నిగ్గుదేల్చిన నిజజీవితపు సత్యాలు, లక్ష్యాలు కావు.

 

    ప్రేమా పెళ్ళి, సెక్స్, పిల్లలు, భద్రత, సంపద, పాపులారిటీ, ఇమేజ్, సమాజంలో విశిష్ట వ్యక్తిగా గుర్తింపు ఇవన్నీ కావాల్సిందే. కానీ వీటన్నింటిని స్వయంకృషితో, స్వశక్తితో సాధించుకున్నావా? కావా? అన్నది నాకు కావాలి. జీవితాన్ని ఎదుర్కొని ఒక మనిషి బ్రతకగలడు. జీవితం నుంచి పారిపోయి ఒక మనిషి బ్రతకగలడు. జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొని సాగించే యాత్రకు మజిలీ వుంటుంది. పలాయనానికి మజిలీ ఏముంటుంది-? నేను మీకర్థం కాను- ఒక్కొక్కసారి నాకే నేను అర్థం కాను.

 

    నాలో రేగే అనుమానాల్ని, సందేహాల్ని, అస్థిత్వపు ఆరాటాన్ని అణగదొక్కుకుని ఎటువేపు నీ పయనం అని అడక్కుండా కేవలం నన్ను ప్రేమించాడు గదా, నేనూ అతన్ని ప్రేమించాను గదా అని కళ్ళు మూసుకుని నేను వెళ్ళలేను.

 

    మధుకర్ మంచివాడే కావచ్చు- అందగాడే కావచ్చు- పరిపూర్ణ ఆరోగ్యంతో శారీరక దృఢత్వాన్ని కలిగి వున్నవాడే కావచ్చు. కాని ఇవేవీ నా హృదయాన్ని స్పందింపజేయలేవని అనిపిస్తోంది. ఈక్వెల్ వేవ్ లెంత్ - సమానంగా, సమాన స్థాయిలో మా మనస్సులు వైబ్రేట్ కావేమోననే సందేహం.   

 

    మధుకర్ మదర్ పొందుతున్న సంతృప్తి  నాకు లభిస్తుందా? నేను పొందగలనా? నేను పొందవలసిన సంతృప్తి మధుకర్ స్వశక్తిమీద నిలబడగలిగినప్పుడే నాకు దక్కుతుంది.

 

    మధుకర్ సూపర్ రిచ్ ఫ్యామ్లీకి చెందినవాడు. మధు పుట్టేసరికి తరగని సంపదని వాళ్ళ ఫాదర్ కూడబెట్టారు.

 

    శ్రమ విలువ మధుకి తెలీదు.

 

 

    కాని వాళ్ళ నాన్నగారికి తెలుసు.

 

    స్వయంకృషితో ఎంతో సంపదని ఒక్క తరంలోనే సంపాదించి సమాజంలోనే విశిష్టమైన వ్యక్తిగా, వ్యాపారవేత్తగా సంపాదన శక్తిగా గుర్తించబడ్డాడు.

 

    అదే విషయాన్ని నలుగురూ ఆశ్చర్యంగా, అభినందనా పూర్వకంగా చెప్పుకుంటుంటే, మధు ఫాదర్ లోలోపల ఆనందిస్తారు- సంతృప్తి చెందుతారు- తనను తలుచుకుని తనే గర్వపడతాడు.

 

    ఆపైన మధు ఫాదర్ పొందే ఆనందం, గర్వం, తృప్తికి వెలకట్టగలరా? నా భర్త రాత్రింబవళ్ళు శ్రమించి పైకొచ్చారు అని తనలో తానే అనుకుని మురిసిపోతుంది అతని మదర్. ఆ సందర్భంలో అద్భుతమైన ఆనందోద్వేగాన్ని అనుభూతిస్తుంది.

    మరిది నాకు అక్కర్లేదా?

 

    మధుని పెళ్ళి చేసుకొంటే- నాకూ అలాంటి గర్వాన్నే సొంతం చేసుకోవాలనిపించదా?

 

    నా భర్త తన తల్లిదండ్రుల చాటున, నేను నా భర్తచాటున, మాకు పుట్టే పిల్లలు మరోచాటున, నీడన బ్రతకవలసి రావడం దుర్భరం కాదా?

 

    స్వయంకృషితో కోట్లకు కోట్లు గడించిన వాళ్ళు తమ పిల్లలకు బోల్డెంత సంపాదించి పెట్టామని ఆనందిస్తారు. నలుగురు పొగిడితే లోలోనైనా సంతసిస్తారు.

 

    మరలాంటి అద్భుతమైన ఆనందం, పొగడ్త, గర్వం తమ పిల్లలు కూడా స్వంతం చేసుకోవాలని వాళ్ళకి అనిపించదేం?! ఈ నా వాదన మీకు విచిత్రంగా అనిపించవచ్చు. కాని సున్నితంగా, నిశితంగా ఆలోచించగలిగితే అదే ప్రాముఖ్యత ఇవ్వవలసిన జీవితపు నగ్నసత్యంగా కనిపిస్తుంది.

 

    మధు పై నేను చూపించగల ప్రేమలో నిజాయితీ వుండాలి. చైతన్యం వుండాలి. నిత్య యౌవ్వనం వుండాలి. బలమైన పునాది వుండాలి.

 

    ఒక స్త్రీ అసమర్ధుడు, దుర్భలుడైన భర్తనికాని, బలహీనమైన తల్లిదండ్రుల మీదే ఆధారపడే పేరసైట్ లాంటి బిడ్డల్ని కాని ఈ సమాజానికి, దేశానికి అందించటం మహాపాపం, నేరం..." ఆమె కంఠంలో అన్ని ఎమోషన్స్, వేటికవే స్పష్టంగా పలికాయి.

 

    మేరీ, సుధారాణి నిజంగానే విస్తుపోయారు.

 

    మహతి ఆలోచనా పరిధిని, భావోద్వేగపు పదునుని, అసాధారణమైన నమ్మకాన్ని తలుచుకుని మతి పోగొట్టుకున్నారు

.

    "నా ఆలోచనా విధానం మీకు నచ్చలేదా? అందులో నిజాయితీ లేదా? కొత్త కోణం మీకు కనిపించలేదా!" మహతి తిరిగి అంది.

 

    అప్పటికి తేరుకున్న సుధారాణి... "నీ కోర్కెలన్నీ ఒక కలగా అనిపిస్తున్నాయి. నీ అంత సున్నితంగా, పదునుగా చాలా తక్కువమంది ఆలోచిస్తారేమో...? అయినా నీ కోర్కె నెరవేరుతుందా? ఏమో - కోట్లాది సంపదని ఒదులుకుని మధుకర్ నిన్ను చేరుకుంటాడా? కలలు, కథలు, కాకరకాయలు వేరు, జీవితం వేరు. ఆ జీవితం విసిరే సవాళ్ళను, కోరుకునే సుఖాలు, సౌఖ్యాలు, సంపద వేరు. మరొక్కసారి ఆలోచించరాదూ" అంది నెమ్మదిగా.

 

    మహతి మాట్లాడలేదు.

 

    తన అందమైన పలువరుస తళుక్కుమనేలా నవ్వింది. "నీవంటే పడిచచ్చే మధుకర్ నీవనుకున్న విధంగా మారకపోగా, నీమీద పగబట్టి, నిన్ను సొంతం చేసుకుంటే?" మేరీ అంది.

 

    "పశుత్వం ప్రేమని చంపేస్తుందే తప్ప, బ్రతికించలేదు" బేస్ వాయిస్ లో గంభీరంగా అంది మహతి.

 

    ఆ ఇద్దరూ వెంటనే ఏం మాట్లాడలేకపోయారు.

 Previous Page Next Page