తరువాత అనుకోని పరిణామాలన్నీ జరిగాయి. అపర్ణ వారం రోజులు జపాన్ పర్యటన ఖరారు కావడం. వెళ్ళే ముందు సహారా ఎయిర్ పోర్ట్ లో "చూడబ్బాయ్...నేనులేను గదా అని వెధవ వేషాలేశావంటే...కుదరదు... రెండ్రోజుల కొకసారి నేను రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల మధ్య ఫోన్ చేస్తాను. ఆ టైమ్ లో తప్పని సరిగా నువ్వుండాలి. లేకపోతే చాలా గొడవలై పోతాయి..." అంది నవ్వుతూ.
అది తలుచుకుని శ్రీధర్ కూడా నవ్వుకున్నాడు.
ఆ తరువాత ఎం.బి.ఏ. సెకండియర్ కూడా- తమ మధ్య వున్నది స్నేహమో...ప్రేమో...ఆరాధనో అర్థం కాకుండానే పూర్తయిపోయింది.
ఆ తరువాత ఇద్దరూ ఇండియా వచ్చేశారు.
తన నేటివ్ ప్లేస్ బొంబాయి గనుక తను ఆ ప్లయిట్ ఎక్కితే- అపర్ణది ఏలూరు గనుక హైదరాబాద్ కనెక్టెడ్ ఫ్లయిట్ ఎక్కేసింది.
అప్పటి నుంచి ఫోన్స్ లోనే మాటలు. తను హైదరాబాద్ వచ్చాక అపర్ణ నాలుగైదుసార్లు తన ఫ్లాట్ కొచ్చింది.
వచ్చినప్పుడల్లా వారం రోజులుండి వెళ్ళిపోయేది.
వస్తే ఒక్కతే వచ్చేది కాదు- తన నాట్య బృందంతో వచ్చేది.
తను అపర్ణతో కోరుకునే ఏకాంతం దొరకటం దుర్లభమయ్యేది.
ఆమెను చూస్తూ ఆ చిరాకును మర్చిపోయేవాడు శ్రీధర్.
ఈ మధ్యనే తాను న్యూయార్క్ వెళ్ళింది. వెళ్ళి కూడా వారమయింది. అక్కడికి చేరుకున్న మరుసటి రోజు నుంచే రోజూ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఫోన్ చేస్తుండేది.
ఈ రోజు ఏమయి వుంటుంది?
ముసురుకుంటున్న ఆలోచనల్ని కట్టిపెట్టి, గోడ గడియారం వైపు చూశాడు శ్రీధర్. రాత్రి ఒంటి గంటయింది. ఆలోచనల్నుంచి పూర్తిగా తేరు కున్నాక గాని తనెంత ఆకలితో వుంది అతనికి అర్థం కాలేదు. న్యూయార్క్ నుండి ఫోన్ చేస్తానన్న అపర్ణ ఎందుకు ఫోన్ చేయలేదు?
ఆలోచిస్తూ మరి ఫోన్ రాదని నిర్ణయించుకుని, ఫ్లాట్ కి తాళంవేసి కారిడార్లోకి వచ్చాడు శ్రీధర్.
వరుసగా ట్యూబ్ లైట్ల వెలుగుతో కారిడార్ తెల్లగా, అందంగా మెరిసిపోతోంది.
ఆ ఫ్లాట్ కి అరకిలోమీటరు దూరంలో మెస్ వుంది. రోజూ ఆ మెస్ లో డిన్నర్ చేయడం అలవాటు. ఆలోచిస్తూనే మెస్ కి బయలుదేరాడు. అపర్ణ వంట బాగా చేస్తుంది. ఆమె హైదరాబాద్ లో వుంటే రోజూ రకరకాల వంటలు చేసేది. చికెన్ స్పెషలిస్ట్ అపర్ణ.
మూసేసి వున్న మెస్ ని చూసి నిరాశగా నాలుగైదు వీధులు తిరిగి, ఎక్కడా ఏ హోటల్ తెరిచి వుండకపోవడంతో ఆకలికి తోడు నీరసం పెరగ్గా, నీరసంగా ఫ్లాట్ కి తిరిగొచ్చేసరికి రాత్రి రెండయింది. అపార్ట్ మెంట్స్ చీకటి నిశ్శబ్దంలో మునిగిపోయి వున్నాయి. లాన్ లోంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి, లిఫ్ట్ వైపు నడుస్తుండగా, సరిగ్గా లిఫ్ట్ అప్పుడే పైకి వెళ్లింది. ఆ టైమ్ లో లిఫ్ట్ పనిచేయట మేమిటో అర్థంకాక మెట్లమీంచి నడుద్దాం... అనుకుని మెట్లెక్కి సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాడు.
మెట్ల దగ్గర మలుపు తిరుగుతుండగా, 'పాయిజన్' సెంట్ పరిమళం ఒక్కసారి అతని ముక్కుపుటాలకు మత్తుగా తగిలింది. గబుక్కున తల తిప్పి చూశాడతను.
చిన్న గోడ పక్కన అజంతా సుందరిలా నిలబడిన అపరంజి బొమ్మ జయారెడ్డి... ఆ వేళ, ఆ అపరాత్రి వేళ... ఆమె అక్కడ...? ముఫ్ఫై ఏళ్ళ జయారెడ్డి- పాలకోవాలా నునుపుగా వుంది. మరీ పొడవు కాదు, పొట్టీకాదు. విశాలమైన కళ్ళు... ఎప్పుడూ కబుర్లు చెబుతున్నట్టుగా వుంటాయి. సన్నగా, పొడవుగా పెదవులు, కోలముఖం, బాబ్డ్ హెయిర్, ఉల్లి పొరలాంటి చీరలో, చేతిలో బొచ్చుకుక్కతో నిలబడి వుంది.
"హలో ఇదేనా రావడం..." విష్ చేసింది జయారెడ్డి...మత్తుతో కూడిన గమ్మత్తయిన గొంతు ఆమెది. ఇంకా పెళ్ళి కాలేదామెకు. చేసుకోలేదని కొందరంటారు.
ఎవరో మిలట్రీ వ్యక్తిని ప్రేమించి, పెళ్ళి చేసుకుని, ఆ తరువాత అతని పద్ధతులు నచ్చక వదిలేసిందని మరికొందరు అంటారు. అదెంతవరకూ నిజమో తెలీదు. కానీ జయారెడ్డికి చాలా పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ వుంది. ఆమె కాలక్షేపం కోసం అదే అపార్ట్ మెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఓ బ్యూటీపార్లర్ కూడా నిర్వహిస్తుంది.
ఆ బ్యూటీపార్లర్లో 'మెన్స్ సెక్షన్' కూడా వుంది. మెన్స్ బ్యూటీ కోసం పార్లర్ పెట్టడంతో జయారెడ్డికి బాగా పేరొచ్చింది. ఆమె రోజుకో మగాడితో గడుపుతుందని, అందుకే ఇలాంటి బ్యూటీపార్లర్ పెట్టిందని కొంతమంది కామెంట్ చేస్తుంటారు. అది విన్నప్పుడల్లా శ్రీధర్ కి బాధగా అనిపిస్తుంది. కానీ ఆమె ఎప్పుడూ డిగ్నిఫైడ్ గానే కనిపిస్తుంది. ఒకటి రెండుసార్లు అపర్ణతో పాటు ఆ బ్యూటీపార్లర్ కి వెళ్ళాడు శ్రీధర్.
అప్పుడు పరిచయం జయారెడ్డి...అప్పటి నుంచి ఎప్పుడు కనబడినా 'ఒక్కసారి మా బ్యూటీపార్లర్ కి రమ్ది౧ మీ రూపురేఖల్ని మార్చేస్తాను' అంటుంది జయారెడ్డి.
'అవసరం వచ్చినప్పుడు వస్తాను' అంటుంటాడు శ్రీధర్.
"ఏమిటి ఒంటరిగా వస్తున్నారు...అపర్ణ లేదా?" అడిగింది జయారెడ్డి.
"లేదండి...అబ్రాడ్ వెళ్ళింది" చెప్పాడు శ్రీధర్.
"మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిందే...మీ మీద బాగా నమ్మకం అనుకుంటాను" అంది జయారెడ్డి నర్మగర్భంగా.
"అంటే" ఆ ప్రశ్న వెనుక తాత్పర్యం అర్థం కాలేదు శ్రీధర్ కు.
"ఆ అమ్మాయి ఫ్లాట్ లో వుంటే మీరసలు ఫ్లాట్ లోంచి కూడా బయటకు రారు. ఆమె మిమ్మల్ని బాగా కమాండ్ చేస్తుందనుకుంటాను" మగాడ్ని రకరకాల ప్రశ్నల ద్వారా తికమక పెట్టేయడం జయారెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.
"అపర్ణ కమాండ్ చెయ్యదు" నెమ్మదిగా అన్నాడు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగిస్తూ.
"పోనీ డిమాండ్ చేస్తుందా?" వెంటనే అందామె నవ్వుతూ.
ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు శ్రీధర్.