కళ్ళు తెరచి చూసేసరికి మొదట ఎక్కడో ఉన్నట్లనిపించింది. క్రమంగా ఎవరిదో మంచంమీద, మెత్తటి పరుపుమీద పడుకుని వున్నట్లు భోదపడింది. పైన సీలింగ్ ఫ్యాన్ గిరగిర తిరుగుతుంటే ఒక్కక్షణం తన శరీరం కూడా గిర్రున తిరుగుతున్నట్లనిపించింది.
చిన్నగది. బెడ్ రూమ్ లా వుంది. ముఖంమీద నీళ్ళు జల్లారు. చెంపలు చల్లగా, తడిగా అనిపించాయి.
"ఎలావుంది?" మేనేజరుగారి గొంతు వినిపించింది.
ప్రక్కకి చూసేసరికి ఆతృతగా, కంగారుగా చూస్తోన్న చంద్రశేఖరం, అతని ప్రక్కన నమ్మిన బంటులా నిలబడి గోపయ్య కనిపించారు.
చోటుగానిచోటు, తన బాస్ ఎదురుగా ఇలా పడివుండటం..... ఆమె లజ్జితురాలై లేచి కూర్చోబోయింది.
"అహహ, లేవకండి. మళ్ళీ కళ్లు తిరుగుతాయి" అతను వ్యాకులపాటుతో ఆమె భుజంమీద చేయివేసి గట్టిగా అదిమినట్లు చేశాడు.
లేవడానికి వీల్లేకుండా అటు పడుకుని వుండిపోయింది గానీ, భుజంమీద అతనిచెయ్యి పడ్డచోట అలవిమాలిన బాధకలిగి "అబ్బా!" అన్నది.
"ఏమయింది? ఏమయింది?" అని అతను ఆదుర్దాగా ముందుకు వంగి, "అరెరే రక్తం!" అంటూ మంచంమీద ఆమె ప్రక్కగా కూర్చుండిపోయి చీరుకు పోయిందేమో? అని గాయం ఎక్కడయిందో చూడటానికి ప్రయత్నిస్తూ "గోపయ్యా! త్వరగావెళ్లి ఇంకాసిని నీళ్ళు, దూదీ అవీ పట్టుకురా. ఊఁ వెళ్ళు" అని అరిచాడు.
ఆమెకి అత్యంత సన్నిహితంగా అతను, ఆమె మెత్తని భుజంమీద అతని చేతులు.
కానీ ఆమె ఇవన్నీ ఆలోచించే స్థితిలో లేదు. ఫస్టైయిడ్ చెయ్యటంకోసం జాకెట్టు ఎక్కడ విప్పేస్తాడోనని హడలిపోయింది. అతని గాభరాలోని సిన్సియారిటీ చూస్తోంటే అంత పనీ చేసేలాగే కనిపించింది.
"అక్కర్లేదులెండి, ఇప్పుడంత ప్రమాదమేం జరగలేదు" అని మళ్ళీ లేవబోయింది.
"అయ్యబాబోయ్! వెంటనే జాగర్త తీసుకోకపోతే సెప్టిక్ అవుతుందండీ."
మాలతి పెదవులమీద చిరుదరహాసం ఉదయించింది. "అవన్నీ మీలాంటి డబ్బుగల వాళ్లకు. మేమసలు వీటి గురించి ఆలోచించనే ఆలోచించం" అంటూ అతనిచేతిని మృదువుగా భుజంమీదనుంచి తప్పించి నెమ్మదిగా లేచి కూర్చోంది.
అప్పటికప్పుడు గోపయ్య అయ్యగారు ఆజ్ఞాపించిన సరంజామా అంతా తీసుకుని సిన్సియర్ గా వచ్చేశాడు.
"అక్కర్లేదుటలే గోపయ్యా! ఆవిడ మొహమాటపడుతోంది" అని అప్పటికే జరిగిన అత్యాచారానికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం జ్ఞాపకం వచ్చి కాబోలు"మా ఇంట్లో జరిగిన ఈ సంఘటనకు నన్ను క్షమించండి" అన్నాడు పశ్చాత్తాపపడుతున్న వాడిలా.
"ఇందులో తప్పు మీదేముందిలెండి? మీరు వద్దని వారిస్తున్నా వినకుండా లోపలకు వచ్చింది నేనే...." అని ఆమె వాచీ చూసుకుని "అయ్యయ్యో! ఎంత ఆలస్యం అయిపోయిందో! అక్కడ భానుమతి నాకోసం కంగారుపడుతున్నాదో ఏమో? ఇహ వెడతాడు" అంటూ లేవబోయింది.
"అహహ, లేవకండి. కళ్ళు తిరుగుతాయేమో. పోనీ హార్లిక్స్ ఏమన్నా... గోపయ్యా!"
గోపయ్య యజమాని క్రొత్తఆజ్ఞ నిర్వర్తించటానికని లోపలకు పోబోతున్నాడు.
"ఆగు గోపయ్యా!" అని ఆమె లేచి నిలబడి "ఈసారి వచ్చినప్పుడు ఆతిథ్యమిద్దురుగానిలెండి. నన్ను వెళ్లనివ్వండి" అని గదిలోంచి బయటకు వచ్చేసింది.
అతనుకూడా వెనకనే వచ్చి "పదండి, దిగబెడతాను అన్నాడు.
అదే సమయానికి ఇంట్లో ఎక్కడినుంచో దబదబ తలుపులు బాదుతూ "ఒరేయ్! నన్ను బంధిస్తారేమిట్రా ? విడిపింపించండ్రా. అదేవత్తో ఆ పిల్ల వచ్చి నాకొడుకుని ఎత్తుకుపోతుందిరా" అని గట్టిగా అరుస్తోన్న స్త్రీ కంఠం వినిపించింది.
మాలతి మళ్ళీ ఒక్కక్షణం వణికిపోయినట్లయింది. తేరుకుని "నేనెలాగో వెళ్ళిపోతానులెండి. మీరింట్లో వుండటం అవసరమనుకుంటాను....." అంది.
"కాదు, మిమ్మల్ని వంటరిగా పంపించలేను. రండి" అంటూ ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా "గోపయ్యా! అమ్మగార్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు" అని హెచ్చరించి బయటకు నడిచాడు.
ఇద్దరూ గేటుదాటి ఇవతలకు వస్తుంటే లోపల్నుంచి ఆ స్త్రీ పెడుతూన్న కేకలు వినిపిస్తూనే వున్నాయి.
అతను స్టీరింగుముందు కూర్చున్నాడు. ఆమె బేక్ డోర్ తెరచి ఎక్కింది.
"అన్నట్లు కోఠీ అని చెప్పావు కదూ? దీనికంతటికీ పొరపాటు నాదే" అన్నాడు. కారు కదిలింది.
దారిలో ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. మధ్య మధ్య ఆమె అతనివంక చూసీచూడనట్లుగా చూసింది. అలసిపోయినట్లు, నిస్సహాయంగా, జాలిగా ఎలాగో కనిపించాడు. ఎందుకో అతనిపట్ల ఆమె హృదయం సానుభూతితో నిండిపోయింది. చిన్నది కానీ పెద్దదికానీ ఏదో వేదన, ఏదో చరిత్ర వుంది అతని వెనుక.
కోఠీ చేరాక "ఎటు పోనిమ్మంటారు చెప్పండి?" అనడిగాడు.
మాలతి ఆ సందుల్లో డైరెక్టు చేసింది. ఒక చిన్న డాబాఇంటి ముందు కొచ్చాక "ఆఁ ఇక్కడే, ఆపండి" అంది.
ఆమె కారుదిగాక అతను నొచ్చుకుంటూన్నట్లుగా "ఈవేళ జరిగిందాని గురించి తర్వాతెప్పుడయినా మాట్లాడుకుందాం" అన్నాడు.
"మరేం బాధపడకండి" అందామనుకుంది కానీ అనలేకపోయింది. "అలాగే" అంది చేతులు జోడించి నమస్కారం చేస్తూ.
ఫియట్ కారు హుందాతో కూడిన జుయ్యిమన్న శబ్దంచేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కారు సందుమలుపు తిరిగేదాకా ఆ చీకట్లో రోడ్డుమీద అలాగే నిలబడి, ఒక నిట్టూర్పుతో ఆ అధ్యాయాన్ని పూర్తిచేసి మాలతి గేటు తెరుచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది.
3
మాలతి గదిలోకి ప్రవేశించేసరికి - పెద్దలైటు వెలుగుతుంది. భానుమతి తల క్రింద రెండు మెత్తటి దిండ్లు పెట్టుకుని పడుకుని కళ్ళు తెరుచుకుని పైకప్పుకేసి చూస్తోంది.
అలికిడి విని తల త్రిప్పిచూసి చిన్నగా నవ్వి "అమ్మో! ఇప్పుడా రావటం? ఇంతసేపూ ఉత్తరాలు టైపు చెయ్యటమే ?"