"అవును....అయితే...."
"ఏమీ లేదు జైలర్ సాబ్....చాలా సంవత్సరాలనుంచి మావాడొకడు మీ జైలులో విశ్రాంతి తీసుకుంటున్నాడు....ఆ రోజు వాడిని విడిచి పెడతారేమోనని...."
"నోర్ముయ్ రా బేవకూఫ్....ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్ధం అవుతుందా?"
"నేను చెప్పే విషయం విన్న తరువాత మీలో ఇప్పుడు ఉన్నంత ఆవేశం వుండదని నాకు తెలుసు....జైలర్ సాబ్, ఇప్పుడు మీరు నోరు మూయిస్తే రేపు ఉదయం పేపర్ చూసి నువ్వు, నీ కుటుంబం మొత్తం నోరు మూసుకోవలసి వస్తుంది...."
"ఏమిటి నువ్వనేది...."
"వివరాలు తెలుసుకోవాలని వుందా....అయితే సరిగ్గా సాయంత్రం ఏడుగంటలకు హోటల్ కృష్ణా ఒబెరాయ్ కు ఒక్కరే రండి....మీకు తోడుగా ఎవరినయినా తెచ్చుకుంటే మీ పరువు ప్రతిష్టలే మంటగలిసిపోతాయి...."
ఫోన్ పెట్టేసిన చప్పుడు....
పరశురామ్ కు అంతా అయోమయంగా వున్నది....
జైలులో వాడి తాలూకూ బేవకూఫ్ ఎవడై వుంటాడో!
అయినా, తనకు వార్నింగ్ ఇవ్వడమేమిటి?
అసలు ఏం జరుగబోతున్నది?
తన ఇరవైయేళ్ళ సర్వీసులో ఇలాంటి వార్నింగ్ ఎప్పుడూ చవిచూడలేదు.
అయినా ఇలాంటి విషయాలలో రౌడీలు పోలీసులకంటే ఎంతో ఫాస్ట్ గా ఉంటారో అతనికి తెలుసు. పైగా ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఏకంగా తన కుటుంబానికే ఎసరు పెట్టినట్టున్నాడు.
అసలు ఏం చేయబోతున్నాడో ఆ దుర్మార్గుడు....?
అందుకే,సాయంత్రం అతను రమ్మన్న హోటల్ కు తన బలగంతో కాకుండా, తను ఒక్కడే వెళ్ళదలచుకున్నాడు.
అందులో తనకు వచ్చే ప్రమాదం ఏమీలేదు.
ఎందుకంటే....
అవతల వ్యక్తికి తన అవసరం ఎంతోవుంది.
ఆలాంటప్పుడు తను ఒంటరిగా దొరికినప్పుడు ఎలాంటి అఘాయిత్యం చేయడు.
ఆ నిర్ణయం తీసుకున్నాక జైలర్ పరశురామ్ మనసు కుదుటపడింది.
* * *
హోటల్ కృష్ణా ఒబెరాయ్!
సమయం ఏడు గంటలు.
"రండి పరశురాం గారూ, మీకోసమే ఎదురు చూస్తున్నాను"
తనను చూసీ చూడడంతోనే కౌంటర్ దగ్గరే స్వాగతం పలికిన వ్యక్తిని ఎగాదిగా చూశాడు జైలర్ పరశురాం.
ఫోన్ లో బెదిరించిన వ్యక్తి ఎత్తుగా, దృడంగా చూడడానికి భయంకరంగా వుంటాడనుకున్నాడు పరశురామ్.
కానీ, అతనలా లేడు.
వెరీ యంగ్ అండ్ స్మార్ట్ బోయ్....చాలా సింపుల్ గా, హుందాగా వున్నాడు. అతను చెప్పబట్టి గూండా అనుకోవాల్సిందే తప్ప ఎవరూ నమ్మలేని స్పుర ద్రూపి అతను.
"రాజేంద్ర అంటే...."
"ఎస్. నేనే".
"ఉదయం నాకు ఫోన్ చేసింది" అప్పటికీ నమ్మకం చిక్కక అన్నాడు పరశురాం.
"అంతలా ఆశ్చర్యపోకండి జైలర్ సాబ్....మిమ్మల్ని ఇక్కడకు రమ్మని ఫోన్ చేసింది నేనే! కమాన్ సార్....లోపలకు వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం...." అంటూనే రెస్టారెంట్ లోపలకు దారితీశాడతను.
ఒక మూలగావున్న టేబుల్ దగ్గర ఇద్దరూ ఎదురెదుగా కూర్చున్నారు.
ఇంతలో సర్వర్ వచ్చాడు.
"ఏం తీసుకుంటారు?" రాజేంద్ర అడిగాడు పరశురామ్ ని.
"ఏమీ అక్కరలేదు. ముందు నన్ను ఎందుకు రమ్మన్నావో చెప్పు" ముక్కుసూటిగా ప్రశ్నించాడు పరశురామ్.
"ఇక్కడకొచ్చి కూర్చుని ఏమీ తీసుకోకపోతే బాగోదు" అంటూ రెండు థమ్స్ అప్ కు ఆర్డర్ ఇచ్చి, సర్వర్ ను పంపించి వేశాడు రాజేంద్ర.
అతనివైపు పరీక్షగా చూశాడు జైలర్ పరశురాం.
అసలు ఇతను ఏమాశించి తనను పిలిపించి వుంటాడో?
తన హోదా తెలిసిన కేడీలు చాలామంది భయంతో గజగజవణికిపోవడం తనకు తెలుసు. కానీ, ఇతను భయం మాట అటుంచి చాలా ధీమా ప్రదర్శిస్తున్నాడు.
అదే ఆశ్చర్యంగా వుంది పరశురామ్ కు....
"ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు...."
నా ఆలోచనలతో నీకెందుకు....ముందు విషయం ఏమిటో చెప్పు.
"మీరు ఒక ఖైదీని తప్పించుకునేటట్టు చేయాలి"
"చాలా చిన్న కోరికనే కోరావు....బహుశా నా గురించి నీకు పూర్తిగా తెలియదనుకుంటాను"
"తెలిసే అడుగుతున్నాను....మరికొన్ని క్షణాలలో మీ మనసు మారిపోతుందనీ నాకు తెలుసు...." చెరిగిపోని చిరునవ్వుతో అన్నాడు రాజేంద్ర.
తనెటూ ఆ అవకాశం కల్పించనని తెలుసు కాబట్టి, తప్పించుకోవడానికి అంత ఉబలాటపడే ఆ ఖైదీ ఎవరో తెలుసుకోవాలనే బుద్ధి పుట్టింది పరశురామ్ కు.
"ఆ ఖైదీ ఎవరు?"
"చక్రవర్తి...."
"ఓ....మంచి క్రిమినల్ నే ఎన్నుకున్నావే...బయటకు తీసుకెళ్ళి వాడిచేత ఇంకా ఎన్ని మర్డర్లు చేయించాలనో...."
పరశురామ్ గొంతులో అవహేళన!