Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 6


    ఈ విషయం కంటే ఇంకా దారుణం తనను బాధపెడుతున్న విషయం ఇలాంటి మోసం రాజేశ్వరి అనుమతితో జరగటం. అతనికి ఆ కనకరాజుతోపాటు రాజేశ్వరిని ఇంటినుంచి బయటకు గెంటేయాలన్నంత కోపం వచ్చింది.
    ఇంతకాలం తనామెకు భయపడ్డాడు. ఆమె చెప్పిందల్లా చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆమె ఇంతవరకూ మంచి ప్రవర్తనతో ఉంది కాబట్టి. ఇలాంటి భయంకరమైన ద్రోహాలు మాత్రం తను సహించలేడు.
    ఆవేశంగా ఇంటికి చేరుకున్నాడతను.
    రాజేశ్వరి పక్కనే కనకరాజు తలకు కట్టు కట్టుకుని కూర్చున్నాడు.
    "రాజేశ్వరీ! ఏమిటి నువ్వు చేసిన పని?" ఆవేశంగా ఏమాత్రం తగ్గకుండా అడిగాడతను.
    అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది.
    "కనకరాజు చెప్పాడు కదా?" తాపీగా అంది.
    "నీకేమైనా బుద్ధుందా లేదా? ఇంత ఘోరం నాతో చేయిస్తావా? ఆ మోసం చేయడానికి మా సిబ్బందిని ఉపయోగిస్తావా? ఇంక రేపు వాళ్ళకు ముఖం ఎలా చూపించాలి నేను? ఇంతకాలం సంపాదించుకున్న పరువూ మర్యాదలు మంట గలిపేస్తావా నువ్వు?"
    "అంటే అదే మీరు చేస్తే నీతీ, నేను చేస్తే మోసమూనా?" వెటకారంగా అడిగిందామె.
    ఆమె చెంప ఛెళ్ళుమనిపించబోయాడు కాని అతని చేతిని చటుక్కున పట్టుకుని మధ్యలోనే ఆపేసిందామె.
    ఆమె కళ్ళు క్షణంపాటు చింత నిప్పుల్లా మెరిసినాయి.
    ఈశ్వరరావులోని ఆవేశం చల్లారిపోయింది ఒక్కసారిగా. చేయి వెనక్కు లాగేసుకున్నాడు.
    "మీరు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళ కోసం నెంబర్ వన్ ఎకౌంట్స్ నెంబర్ టూ ఎకౌంట్స్ మెయింటెయిన్ చేయటం లేదూ? కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్ కోసం రెండు రకాల లెక్కలు తయారుచేయడం లేదూ? సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ వాళ్ళకోసం ఒకటే నెంబర్ గల రెండు ప్రొడక్ట్స్ ని లారీల్లో పంపడం లేదూ?" చాలా కూల్ గా అడుగుతుందామె.
    "అదీ ఇదీ ఒకటేనా?"
    "తప్పు చిన్నదయినా పెద్దదయినా తప్పే! మోసం చిన్నదయినా పెద్దదయినా మోసమే"
    "అయినా నీకేం తక్కువయిందని ఇంత కక్కుర్తి పడ్డారిద్దరూ? మీకేం తక్కువ చేశాన్నేను?"
    ఆమె దెబ్బ తగిలిన పులిలా ఆగ్రహంతో చూసింది.
    "ఈశ్వరరావు! యూ ఆరే ఛీట్! హాయిగా బ్యాంక్ లో ఉద్యోగం చేసుకుంటున్నదానిని నాకు అరచేతిలో స్వర్గం చూపించి పెళ్ళి చేసుకున్నావ్! నిన్ను పెళ్ళి చేసుకుంటే నేను ఓ కోటీశ్వరురాలినవుతానన్నావ్! నీలాంటి వయసు మళ్ళినవాడినెందుకు చేసుకోవాలి నేను? ఇంత కాలానికి నువ్వు చేసిన మోసం బయటపడింది! మన లాయర్స్ ని రహస్యంగా పిలిచి అడిగితే అంతా చెప్పేశారు.
    నీ ఆస్థిలో తొంభయ్ శాతం పిత్రార్జితం! అంటే మొత్తం ఆస్తంతా ఆటోమేటిగ్గా నీ మొదటి భార్య కొడుకు చిరంజీవికి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను, నా కూతురూ రోడ్లమీద అడుక్కోవాలి! ఎందుకంటే నువ్వు నాకు కట్టిన తాళికి దేవుడు తప్ప ఇంకెవరూ విట్ నెస్ లు లేరు.
    ఇంత దారుణానికి పాల్పడిన నీకు నేను చేసిన మోసం గురించి ప్రశ్నించే హక్కు ఏమాత్రం లేదు. నేనేం చేస్తే అది నువ్వు చేయాలి, నేనేం చేస్తే దాన్నే నువ్వు సమర్థించాలి. నీమీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో ఆమాత్రం తెలివితేటలు నాకున్నాయి. ఆ మాత్రం సామర్థ్యం నాకుంది. నీ మాయమాటలకు లోబడి నా యవ్వనాన్ని నాశనం చేసుకున్నాను కానీ నా జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోలేను. అంత త్యాగం చేయాల్సిన అవసరం నాకు లేదు.
    ఈశ్వరరావుకి నోట మాట రాలేదు. గుడ్లప్పగించి ఆమెవంకే గుడ్లగూబలా చూస్తుండిపోయాడు. ఆమె అంటున్న మాటల్లో చాలావరకూ నిజం ఉంది! ఒక విధంగా తనామెను మోసగించాడు.
    కానీ మరో విధంగా ఆమె కూడా తనను మోసగించింది. తనను కేవలం ప్రేమకోసం ప్రేమిస్తోందని, డబ్బు కోసం ప్రేమించటం లేదని ఆ రోజున చెప్పింది. అయితే మనకిక 'బ్రేక్' ఉండదు కదా అని తను ఆశపడి దేవుడు ముందే తాళి కట్టేశాడు. ఆమెకో ప్లాటూ, కారూ, పదిలక్షల బ్యాంక్ బాలెన్సూ ఏర్పాటు చేశాడు. ఆమె తమ్ముడికి సహాయం చేయమని బలవంతం చేస్తే వాడికి పెట్రో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టించాడు. వాడేమో ఇంటర్నేషనల్ చీట్ అయి మొత్తం దేశాన్ని ముంచేశాడు.
    "నీ సంగతి నాకు మొత్తం తెలిసింది ఈశ్వరరావు! నీకు ఇద్దరే కాదు! వందమంది పెళ్ళాలున్నా ఇంకో ఆడది కనబడితే చాలు-దానివెంట పడతావు! చివరకు నిన్ను నమ్మిన వాళ్ళందరినీ నట్టేట్లో ముంచేస్తావ్. నిన్ను నేను ఛస్తే నమ్మను!"
    ఈశ్వరరావుకి ఇంక అక్కడ నుంచోబుద్ధికాలేదు. ఆమెను మెడబట్టి బయటకు గెంటి శాశ్వతంగా ఆమె పీడ వదిలించుకోవాలన్నంత కోపం వచ్చింది.
    కానీ ఎందుకో భయం. ఆమె కళ్ళల్లోకి చూడాలంటే భయం!
    అక్కడినుంచి వెంటనే 'జాలీ లైఫ్' క్లబ్ కి వచ్చేశాడు. గార్డెన్ లో ఓ చెట్టుకిందున్న టేబుల్ దగ్గర కూర్చుండిపోయాడు ధీనంగా.
    బేరర్ పరుగుతో వచ్చాడు "ఏం కావాల్సార్?"
    "బ్రాంది!"
    "ఓ.కే. సర్" అంటూ వెళ్లి ఓ గ్లాసులో బ్రాందీ రెండు షోడాలు తీసుకొచ్చి ఆయన ముందుంచాడు.
    చకచకా బ్రాందీ అంతా తాగేశాడతను.
    అలా రెండు మూడు సార్లయ్యాక కూడా నిషా ఎక్కకపోయేసరికి ఈశ్వరరావుకి ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా రెండు పెగ్గులకే తనకు వళ్ళంతా తిమ్మిరెక్కినట్లయిపోతుంది. లోలోపల ఎందుకో భయం అలాగే ఉంది. రాజేశ్వరి మాటల్లో కంటే ఆమె గొంతులో ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లనిపిస్తోంది.
    ఆమె మాటల అర్థం ఏమిటి? తనమీద నిజంగానే రివెంజ్ తీర్చుకుంటుందా? ఒకవేళ తీసుకుంటే ఎలా తీసుకుంటుంది?
    "హలో డాడీ" తూలుతూ వచ్చాడు చిరంజీవి చేతిలో గ్లాస్ పట్టుకుని.
    "హలో చిరంజీవి!"
    "హౌ ఆర్ యూ డాడీ!"
    "ఫైన్ సన్!"
    "టూర్ నుంచి ఎప్పుడు వచ్చారు డాడీ?"
    "రాత్రే వచ్చాను."
    "హౌ ఈజ్ లైఫ్ డాడీ?"
    "బిలో నార్మల్."
    "ఓ! ఎందుకని డాడీ?"
    "మగాడికొచ్చే ప్రతి పెద్ద కష్టం వెనుక ఒక స్త్రీ ఉంటుందని 'జాలీ లైఫ్; కొటేషన్స్ లో ఉన్న విషయం మర్చిపోయావా సన్?"
    "నో డాడీ! అంత మంచి కొటేషన్ ని ఎలా మర్చిపోతాను?"
    "గుడ్! కీపిటప్! అంతకంటే ఎక్కువగా చెప్పి నీ మనసుని పొల్యూట్ చేయటం నాకిష్టం లేదు. ఎప్పటికీ నువ్వు 'పెళ్ళి' అనే తప్పటడుగు మాత్రం వేయకు చిరంజీవి! అది మగాడి జీవితాన్ని నరకం చేసేస్తుంది. జీవచ్చవంలా మార్చేస్తుంది. జీవోస్మృతుడిగా చేసేస్తోంది. మృత జీవుడిగా మిగిల్చేస్తుంది."

 Previous Page Next Page