వాంగ్ యీచూ, చింగ్ చాంగ్ ముఖముఖాలు చూచుకున్నారు.
"చైనీస్ భాష వచ్చా?" అన్నాడు చూ.
"చైనా వెళ్ళే అవసరం వచ్చిన మర్నాడు నేర్చుకుంటాను. అయినా ఇప్పుడావిషయం దేనికి?"
వాంగ్ యీచూ జవాబు చెప్పలేదు. భార్యవైపు తిరిగి చైనిస్ భాషలో సంభాషణ మొదలుపెట్టాడు. చూ, చాంగ్ పదినిమిషాలు మాట్లాడుకున్నారు చైనిస్ భాషలో. తరువాత నావైపు తిరిగాడు చూ.
నాకు చైనిస్ భాష వచ్చు. కాని, వారు మాట్లాడుకుంటున్నది అర్ధంకానట్లు మొహంపెట్టాను.
"నాకు తెలియని భాషలో మాట్లాడుకుని గూడు పుఠాణీ చేస్తున్నారా?" కోపంగా అడిగాను.
"నా మాట కాదనకుండా ఉంటే మీ ఇష్టంవచ్చినట్లు చేస్తాను" చూ అన్నాడు.
"ఓ. కే. డబ్బు గురించేనా? ఎన్ని వేలు కావాలి?"
"డబ్బు కాదు."
"మరి?"
"మీ మధ్య వున్న రహస్యం ఏమిటి? మైకేలు, లల్లూరాం ఒకరికోసం ఒకరు ఎందుకు వెతుకుతున్నారు?"
కాసేపు దీర్ఘంగా ఆలోచించాను .
"మిష్టర్ వాంగ్ యీచూ! టూకీగా రెండుముక్కలు చెపుతాను. ఆ విషయం వెంటనే మరచిపో. అలా మరచిపోవటం నీ ప్రాణానికే మంచిది, నేను, మైకేలు, లల్లూరామ్ కొంతకాలంక్రితం ప్రాణమిత్రులం. ఓ సందర్భంలో నిధి రహస్యం ఒకటి మాకు తెలిసింది. ఆ నిధిని పొందాలంటే ముగ్గురం ఓ మాటమీద ఉండాల్సింది. ఎవరికివారం విడిపోయాము. గర్భశత్రువులం అయ్యాము. ఎవరికివారం మందిమార్ బలం పోగుచేసుకున్నాము.
ఇదిలా వుంటే మరో చిక్కువచ్చింది. నిధి స్వంతం చేసుకోవాలంటే ముగ్గురం కలవాలి. మా ముగ్గురివద్దవున్న ఆ రహస్యం ఒకేచోట చేర్చితేగాని, నిధిని పొందలేము. మేము మళ్ళీ ప్రాణమిత్రులం కాదలచుకోలేదు. ఒకరినొకరు చంపి ఆ రహస్యం సొంతం చేసుకోవాలని, ముగ్గురం మారువేషాలలో ఉండి సమయంకోసం ఎదురు చూస్తున్నాము.
మైకేల్ గాడు మూడుసార్లు నాచేత వెంట్రుకవాసిలో ప్రాణం తప్పించుకుని మా ఊరినుంచి పారిపోయి ఈ రంగూన్ వచ్చాడు. వాడిని తరుముతూ నేవచ్చాను. నన్ను తరుముతూ లల్లూరాం వచ్చాడు. లల్లూరాం అనుచరులను నా మీదకు తోలాడు. లాభం లేకపోయింది. తానే బైలుదేరి వచ్చాడు, చచ్చాడు. వీడి అనుచరులను నావైపు తిప్పుకుని లల్లూరాంవద్ద దాగింది బైటకు లాగుతాను.
పోతే, మైకేల్, వాడు ఎంతకాలం మారువేషాలతో మారుమూలలు దాగి నా కళ్ళుకప్పి తిరుగుతాడు? ఓసారి కొట్టిన దెబ్బకు మూతి పళ్ళు ముందు రెండూ ఊడి కిందపడ్డాయి. మూడో పన్ను కూడా ఊడినట్లయితే మోజుపడి కట్టించుకున్న బంగారుపన్ను కూడా ఊడి కిందపడేది. తొర్రి వెధవ.
"ఈ రంగూన్ మారుమూలల్లో వాడెక్కడ దాక్కున్నా వెతికి యమలోకానికి పంపకపోతే నాపేరు సాహూచం" ఆవేశంతో చెపుతున్న నేను చటుక్కున నోరు మూసుకున్నాను.
"మైకేల్ ఎలా వుంటాడు?" వాంగ్ యీచూ అడిగాడు.
"పొట్టిగా, బూడిదపట్టిన గుమ్మడికాయలా ఉంటాడు. మిడిగుడ్లు, ముందు రెండుపళ్ళూ లేవు. ఎడంకాలు ఎత్తి ఎత్తి నడుస్తాడు. ఏం? మైకేల్ గాడు కనపడితే చెయ్యి కలపాలనా?"
"ఊహూ, ఊరికే అడిగాను."
"నాతో చెయ్యి కలుపు. నీ ప్రాణంలా నన్ను చూచుకో. లక్షాధికారిని చేస్తాను మిష్టర్ చూ! లక్షలు నాకో లెక్క కాదు. నాకు కావలసింది అది...అది... నా రహస్యం చెప్పాగాబట్టి ఈ నిముషం నుండి నాకు నీవు ప్రాణమిత్రుడివి. గర్భశతృవ్వి. ముద్దుకు ముద్దు. గుద్దుకు గుద్దు. ఓకే, గుర్తుంచుకుని మెలుగు. ఇప్పుడు ఈ లల్లూరాంని ఎలా మాయం చేద్దామంటావు మిష్టర్ చూ?"
"ఆ పని నాకు వదిలెయ్యండి."
"నో. నో, ఏ పని చేసినా నాతో చెప్పాలి. నా కళ్ళ ముందు జరగాలి."
"మా హోటల్లో పలురకాల మాంసాహారం ఉంటుందని మీకు తెలుసుగా? ఈ శవాన్ని ముక్కలు ముక్కలుగా తురమటం మాంసంలో గుచ్చెత్తటం, ఆ తర్వాత అది ఘుమఘుమలాడే కూరలుగా మారిపోతుంది. ఎముకలను ముక్కలు చేసి గొర్రెలు, చేపలు, మేకలు, పందులు, పడేసే బొమికలు చర్మాలు ఉంచే వేస్టు డ్రమ్ లో వీడి బొమికలు పడేయటం. వేస్ట్ డ్రమ్ ని ఎవరూ చూడరు. డ్రమ్ము మూతతో సహా ఉంటుంది .దానిని ఉదయమే కూలీ బండి వచ్చి తీసుకెళుతుంది. బొమికలను మురుగునీరు పోయే కాలవలో బోర్లిస్తారు.
మురికినీటి కాల్వలో కొట్టుకుపోతాయి బొమికలు. ఖాళీ డ్రమ్ తిరిగి క్షేమంగా వస్తుంది. దీనిలో ఏమీ ప్రమాదం లేదు."
"మాంసం మనిషిదనిగాని, లేక మనం చేసే పని హోటల్ కుక్స్ గాని, బేరర్స్ కనిపెడితే, మొదటికే మోసం వస్తుందే? పోనీ ఓ పని చేద్దాం. ఖాళీ పెట్టె ఉంటే చూడు. లేకపోతే తెప్పించు. వీడిని దానిలో పెట్టి నా అనుచరులకు అప్పగిస్తాను. చేయవలసింది వారే చేస్తారు.
"మీరు చెప్పిందానికన్నా నేచెప్పింది చేయటమే క్షేమం. మాంసం కొట్టు నా ఆధీనంలో ఉంటుంది. పైనే మన పని ముగించి బొమికలను, మాంసాన్ని చేర్చవలసిన చోటుకి చేరుద్దాం."
"సరే, కాని అంత పనీ నా కళ్ళ ఎదుట జరగాలి. ప్రస్తుతం చేయవలసింది_నాకు కావలసింది వీడివద్ద ఉన్నదా? వెతకాలి."
వాంగ్ యీచూ, అతని శవాన్ని చూస్తూ ఉండిపోయాడు.
నేను అతని వద్దకు వెళ్ళి పక్కనే కూర్చున్నాను. ముందుగా కాలి బూట్లు ఊడదీశాను. మేజోళ్ళు తీశాను. పరీక్ష చేశాను. బూటు మడమలలో పాయిజన్ ది చిన్న బాటిల్ ,సిరంజీ, నీడిల్ ఇంజక్షన్ ది దాచి వుంది. యధాప్రకారం బూటు తొడిగాను. పాంటు కోటు జేబులు వెతికాను. తల మీద జుట్టు అటూ ఇటూ చెరిపి చూశాను. నిట్టూర్పు విడిచి లేచి నుంచున్నాను.