"దొంగ వెధవల్లారా మా యింట్లో జొరబడి నన్నే బెదిరిస్తారా.. మిమ్మల్ని పోలీసులకి పట్టివ్వకపోతే చూడండి.. ఆ పిల్లాడి ఒంటిమీద చేయివేస్తే జైల్లో తోయిస్తాను. నా కోడలు, నా మనవడు. నాయిష్టం వచ్చినట్టు చేస్తాను. మధ్యన మీరెవర్రా అడగడానికి.." ముసలావిడ రంకె వేసింది.
చేత్తో వున్న లాఠీతో ఒక్కటేశాడు ఒకడు "నోర్మూయ్.. పిలు ఏ పోలీసులని పిలుస్తావో.. పిలిస్తే మేంగాదు నీవు జైల్లో కూర్చుంటావు - కోడల్ని కాల్చుకుతిన్నందుకు రెండేళ్ళు, తల్లినించి బిడ్డని వేరుచేసినందుకు మరో రెండేళ్ళు జైల్లో కూర్చుందుగాని.. ఇదిగో యిప్పుడే చెపుతున్నాం పిల్లాడిని తీసికెళ్ళాక అమ్మాయి పిచ్చి కుదిరాక కాపురానికొస్తుంది, అప్పుడు ఏవన్నా చేశావో - నోరు మెదిపావో, యీ ఇంటితో సహా నీకు నిప్పు పెట్టేస్తాం.. ఇదిగో ఈ వీధిలో వుంటున్న రాంబాబు మావాడే. వారానికి ఓ రోజు వచ్చి చూస్తాడు నీ సంగతి ఏదన్నా పిచ్చివేషాలేసావో నీ అంతు చూస్తాం మళ్ళీ అందరం వచ్చి - పిల్ల పెళ్ళి చేసి కాపురానికి పంపిస్తే వెండిచెంబు, సైకిలు, రేడియో అంటూ ప్రాణాలు తీసి కోడల్ని కాల్చుకుతింటావా.. యిదిగో నీవు చేసే వెధవపనికొక్క దెబ్బ చొప్పున యిలా దెబ్బలు రుచి చూడు. రుచి చూశాక మరి నోరెత్తకుండా కూర్చో.. పిల్లాడిని మేం తీసుకువెళ్తున్నాం. నీ దిక్కున్నచోట చెప్పుకో" పదిహేనుమంది పదిహేను లాఠీ దెబ్బలు రుచి చూపించి, గోడుగూడున ఏడుస్తున్న ముసలమ్మ కట్టు విప్పేసి, పిల్లాడిని భుజానికి ఎత్తుకెళ్ళిపోయారు.
* * * * *
"ఏవండీ సూరమ్మగారంటే మీరేనా.. యిదిగో మీ కోడలిని కాపురానికి తీసుకొచ్చాం.. పసుపు, కుంకుమ, చలిమిడి తెచ్చిందిలెండి. పదమ్మా లోపలికి నీవు.. "పదిమంది అన్నదమ్ములు చెల్లెలిని కాపురానికి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు.
"ఏయ్.. ఎవరు మీరు.. మా కోడలిని కాపురానికి తీసుకురావడానికి మీరెవరు ఏమిటిదంతా.. ఒసేయ్.. ఏ మొహంతో వచ్చావు నీవు.. మీ నాన్న కట్నం ఇచ్చి పంపించాడా యింతకీ.. ముందా డబ్బులేవి... పండగకిస్తానన్న రేడియో ఇచ్చాడా?
"ఏవండోయ్ మామ్మగారూ కట్నం తీసుకోడం నేరమండీ. ఆ నేరానికి మిమ్మల్ని జైల్లో కూర్చోపెడతారని తెలుసా.. అంచేత అమ్మాయిని కట్నం ఏది అని అడక్కండి.. అడిగితే యిప్పుడే పోలీసులని పిలుచుకొస్తాం." ఏయ్ మీరెవరు? ఏమిటే గుంపంతా ఇంట్లోకి జొరబడ్డారు? బయటికి పదండి బయటికి అసలు మీరెవరు? ఏవండోయ్ ఈ కుర్రాళ్ళంతా ఎవరో వచ్చి గొడవ చేస్తుంటే వినపడ్డంలేదా?" "ఏవండీ మగమహారాజుగారు మీరుండీ చాతకాని చవటలా, పెళ్ళాం కోడలిని కాపురానికి తీసుకెళ్ళకపోయినా నోర్మూసుకు చూస్తున్నారా.. అయ్యా తమరు కూస్తో చదువుకున్నట్టున్నారు. కట్నం తీసుకోడం నేరం అని, ఆ కారణంగా కోడలిని కాపురానికి తీసుకెళ్ళకపోవడానికి మీకేం హక్కులేదని తెలియదా.." వ్యంగ్యంగా అడిగారు.
"ఎవరుమీరు? ఏమిటిదంతా?" కోపంగా అన్నాడాయన.
"మీ పాలిటి యమదూతలం! ఎక్కడ అన్యాయం జరిగినా ఎదుర్కోడం మా రామదండు లక్ష్యం. అన్యాయాలని, అక్రమాలని చీల్చి చెండాడడం మా వృత్తి - మీ కోడలిని కాపురానికి తీసుకురాకుండా కట్న కానుకలకోసం బాధపెడ్తున్నారని తెల్సింది. అన్యాయం సహించాం కనక అమ్మాయిని కాపురానికి తీసుకొచ్చాం. ఆ పిల్లని మళ్ళీ మీరు ఏమన్నా అన్నా, బాధలు పెట్టినా వూరుకోం.. ఇదిగో యీ ప్రకారం మీ వీధివాడు, మా తరుపున ప్రతివారం మీ యింటికి వచ్చి ఆ అమ్మాయిని మీరేం బాధపెడ్తున్నారో అడిగి వెళతాడు. ఏదన్నా జరిగిందో మీ అంతు తేలుస్తా.. ఉత్తి బెదిరింపనుకుంటున్నారేమో మీరు, మీ ఇల్లు మీ సామాన్లు తిన్నగా వుండాలంటే యిది నిజం అని గుర్తించండి.. పోలీసులకి కంప్రయిట్ యిస్తే నష్టపోయేది మీరే.. ఏమ్మా కమలా నీకేం భయంలేదు, ఏమన్నా అంటే వెంటనే యీ ప్రకాశంకి వెళ్ళి చెప్పు. అయ్యా, అమ్మా బుద్ధిగా మసులుకుంటే మీకే మంచిది వస్తాం. టాటా ఛీరియో..." అల్లరిగా టాటా చెప్పి అంతా కదిలారు.
* * * * *
'బాబూ మీ రుణం ఎలా తీర్చుకోను నాయనా. నాకింత ఉపకారం చేసారు.. చాలు బాబూ యింకేం కోరను. ఒక్కమాట బాబూ, దౌర్జన్యానికి వీలయినంతవరకు దిగకండి.. నాలాంటి అభాగ్యులని ఆడుకోండి, మీ తోడబుట్టిన లాంటి స్త్రీలకి న్యాయం చెయ్యండి.. మీరెంచుకున్న విధానం బాగుంది. ప్రతి వూరు, వాడలో యిలా జరిగిననాడు కన్నీళ్ళుండవు బాబూ.." అవధాని గారు కళ్ళు చెమర్చుతూ వుండగా అన్నారు.
"మాష్టారూ - మా చేతిలోది మేం చేస్తాం కాని అమ్మాయిలూ ధైర్యంగా యీ అన్యాయాలని ఎదుర్కోవాలి.. వారు నిస్సహాయులైనపుడు మా సహాయం కోరాలి.. ప్రతి వూర్లో మా కాలేజి పిల్లలందరికి విషయం కరపత్రాలు పంచిపెట్టి చెప్పాం. వారి డ్యూటీ బోధపరిచాం.. పేపర్లో కూడా వేయిస్తున్నాం. ఆడపిల్లలు తమలో తాము కుమిలిపోయి అన్యాయంగా బలైపోకుండా ధైర్యంగా ముందుకు వచ్చి మాకు కంప్లయింట్ యిస్తే తరువాత సంగతి మేం చూసుకుంటాం.."
"అలాగే బాబూ. నా చాతనయినంత వరకు అందరికి చేను చెప్తాను. బాబూ యిలాగే లంచగొండులని, బ్లాక్ మార్కెటీర్స్ ని కూడా అదుపులోకి తేవాలి బాబూ."
"ఇదిగో మీతోటే మా 'రామదండు' ప్రారంభోత్సవం జరిగింది. రామరాజ్యం నెలకొల్పడానికి సమయం కావాలి మాష్టారూ. ఒక్కరోజులో ఏ అన్యాయాన్ని రూపుమాపలేం.. మమ్మల్ని ఆశీర్వదించండి మాష్టారూ... మీ ఆశయం మాలో ఉత్తేజాన్నిచింది.. అది అణగారిపోయి ఆరంభశూరత్వం అవకుండా వుండాలని దీవించండి."
అవధానిగారు సంతోషంతో తబ్బిబ్బులవుతూ "మంచి పనికి ఎప్పుడూ భగవంతుని దీవినే వుంటుంది నాయనా.. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు" ఆనందాశ్రువులు తుడుచుకున్నారాయన.
(జ్యోతి మంత్లీ)
* * * * *


