విద్యార్థులు మొహం చూసుకున్నారు - అవధానిగారివంక జాలిగా చూశారు. "మాష్టారూ... అయ్యో.. వింటుంటేనే మాకింత బాధగా వుంది, మీరెలా భరిస్తున్నారో ఇదంతా - మాష్టారు మేం ఏం చెయ్యగలం చెప్పండి - మహా అయితే అందరం చందాలేసుకుని తలా ఐదో పదో ఇవ్వగలం.. మా స్టూడెంటు లీడర్ కి చెప్పి అందరం తోచిందేదో యిచ్చే ప్రయత్నం..."
"వద్దు బాబూ... వద్దు... డబ్బుకోసం నేనడగడంలేదు నాయనా.. చిన్నవాళ్ళు, చదువుకునే విద్యార్థుల దగ్గర డబ్బు దండెత్తేంతకి దిగజారి ఆత్మాభిమానాన్ని వదులుకోలేను నాయనా.. డబ్బు సహాయం ఎవరెన్నాళ్ళు చేయగలరు బాబూ... నాదో చిన్నమాట... విన్నాక మీ అభిప్రాయం చెప్పండి"
"ఏమిటి మాష్టారు అది - మా వల్ల అయ్యేది ఏదన్నా చేస్తాం..."
"నాయనా ఆ భరోసా చాలు.. చూడండి బాబూ... మిమ్మల్ని కించపరుస్తున్నాననుకోకుండా వినండి..." ఆయన అందరివంక చూసాడు. కుతూహలంగా అందరూ చెప్పమన్నట్టు చూసారు.
"బాబూ... నాల్గురోజులకిందట బజార్లో స్టూడెంట్లు నాలుగు బస్సులు తగలబెట్టారు. మీరో కాదో నాకు తెలీదు - విద్యార్థులని మాత్రం అందరూ చెప్పుకుంటూంటే విన్నాను. నాయనా మీరు భావిభారతపౌరులు.. మీ శక్తి సామర్థ్యాలు పురోగమనం వైపు మళ్ళాలిగాని యిలా తిరోగమనం వైపు కూడదు బాబూ... మీ సామూహిక శక్తి మంచి పనులకి మళ్ళించండి నాయనా - బస్సులు తగులెట్టుకుంటే నష్టపోయేది మీరే.. పరీక్షలకి వెళ్ళకపోతే నష్టపోయేది మీరే.. స్ట్రైకులు చేస్తే దానివల్ల నష్టపడేదీ మీరే.. తాత్కాలిక విజయం మీది అవచ్చు. పరీక్షలు బాయ్ కట్ చేస్తే చదువు ఆలశ్యం అయ్యేది మీకే. కాపీలు కొట్టి పాసయితే రేపు ఉద్యోగంలో చేరాక ఎలా రాణించగలరు.. లేదుబాబూ - ఉపన్యాసాలు ఇవ్వాలని పిలవలేదు - నేననేది మీరు.. అంటే విద్యార్థులు.. దేశంలో అన్నిటికంటే చైతన్య శక్తి అన్నమాట. అలాంటి శక్తిని ఇలా నిరుపయోగపరచకండి బాబూ... మీరంతా కలిస్తే సాధించరానిది ఏది వుండదు! మిమ్మల్ని అడ్డుకుని ఆపగల శక్తి ఎవరికీ లేదు! ఆ శక్తితో మీరేదన్నా చేయగలరు తల్చుకుంటే... బాబూ ఆ శక్తిని నా కూతుర్ల లాంటి అభాగినులని ఆదుకోడానికి వియోగించండి.. రోజూ పేపర్లలో చూస్తున్నారు.. ఎందరెందరో అమాయక యువతులు కట్న కానుకలకి బలి అయ్యి ఆహుతులవుతున్నారు. పేపర్లో కనీసం రోజుకి ఒక యువతి అత్త, ఆడబిడ్డల ఆరడికి అగ్నికి సమిధలవుతున్నారు.. ఎందరో యువతులు అత్యాచారాలకి గురవుతున్నారు. మీరు అలాంటి వారి బతుకులు తల్చుకుంటే బాగుచేయలేరా. లంచగొండితనం, బ్లాక్ మార్కెట్ - అధిక ధరలు, అక్రమాలని తల్చుకుంటే మీరు అదుపులో పెట్టలేరా?"
"మేమా.. మేం ఏంచేస్తాం మాష్టారు - ప్రభుత్వం - చట్టం - న్యాయస్థానాలు చేయలేనిది మేం ఎలా చెయ్యగలం?"
"ప్రతిది ప్రభుత్వం ఏం చెయ్యగలదు నాయనా - శాసనాలంటే చేస్తుంది - ప్రజలు అమలుపరచకపోతే ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? కట్నాలు తీసుకోడానికి వీల్లేదంటే తీసుకుంటున్నారు. తీసుకురాని ఆడపిల్లలు అత్తింట నలిగిపోయి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటివారికి మీరు బుద్ధి చెప్పలేరా నాయనా.. మీ అందరూ కలిస్తే భయపడనివారెవరు? వూరూరా మీ స్టూడెంట్ లీడర్లు అందరిని పోగుచేసి ఒక్కొక్క వీధికి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ని తయారుచేసి ఆ వీధిలో ఇలాంటి అరాచకాలు ఏం జరుగుతున్నదీ తెల్సుకుని, అందరూ కలిసి ఆ ఇంటిమీదకి దండెత్తి బుద్ధిచెప్పి అమాయక స్త్రీల బతుకులు బాగుపరచే ప్రయత్నం చేయవచ్చు - ఏ ఇంట్లోనైనా ఏ కోడలైనా కట్నకానుకల వల్ల బాధపడ్తుంటే ఆ అత్తవారికి బుద్ధిచెప్పచ్చు - మళ్ళీ అలాంటి ప్రయత్నం జరగకుండా వారానికి ఓ శలవురోజు అలా ఇళ్ళకి వెళ్ళి చూసిరావాలి... ప్రతిసారి మీ జోక్యం వుంటుందని తెలిశాక ఏ అత్త ఆడబిడ్డలు కోడలిని రాచిరాపడడానికి భయపడ్తుంది - బాబూ... కన్నబిడ్డ కోసం అలమటించే నా కూతురి తల్లి హృదయం అర్థం చేసుకుని అడుకోలేరా? కన్నతండ్రినే ఏహ్యించుకునే నా కూతురి కాపురం నిలిపి ఆ తండ్రి హృదయక్షోభ తగ్గించు బాబూ. మీరంతా కల్సి ఆలోచించండి. మీ లీడరుతో మాట్లాడండి.. ఏ విధంగా చేస్తే బాగుంటుందో అలోచించి పథకం తయారు చేసుకోండి... నాలాంటి అభాగ్యులని ఆదుకోండి - ఏ న్యాయస్థానం ఏ పోలీసులు చేయలేని పని మీరు చేయగలరు... బాబూ యిది చెప్పడానికే పిలిచాను.. నా బిడ్డల కాపురం. నా బిడ్డలలాంటి తోటి అభాగినుల బతుకులు నిలబెట్టండి - అది వేడుకోడానికే యిదంతా చెప్పాను.. బాబూ మీ దయ...." మురళీకృష్ణ చేయిపట్టుకుని విచలితుడై అన్నాడాయన.
"బాబూ.. ప్రతి వూరికీ, ప్రతి గ్రామంలో మీ విద్యార్ధులున్నారు... ఏ వూరిలో, ఏవాడలో ఏ అన్యాయం, అత్యాచారం జరిగినా మీరున్నారు అణచడానికన్న భయం ప్రతి ఒక్కరికి కల్గించాలి.. ప్రతి వీధిలో ఏ వీధిలో వుండే అబ్బాయిలు ఆ వీధి బాగోగులు తమవిగా భావించి వారానికొక్కరోజు ప్రతి ఇంటికి వెళ్లి ఏ అన్యాయాలు, అక్రమాలు అత్యాచారాలు జరుగుతున్నాయో తెల్సుకుంటూండాలి.. విద్యార్ధులంటే ప్రతివారికి దడ వచ్చేట్టు చెయ్యాలి. అప్పుడు యీ అరాచకాలకి అన్యాయాలకి తావుండదు నాయనా.. ఏం చేస్తారో మీదే భారం.. యీ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రేపటి పౌరులయిన మీదే!...."
'మాష్టారు.. తప్పకుండా మా చాతనయిన సహాయం చేస్తాం.. మా స్టూడెంట్ లీడర్ ని కలుసుకుని మాట్లాడతాం.. రేపొచ్చి ఏ సంగతి చెపుతాను. పదండిరా వెడదాం.." అందరూ మాష్టారికి నమస్కారం చేసి శలవు తీసుకున్నారు.
* * * * *
"అయ్యో.. అయ్యో.. ఎవర్రా మీరు.. ఏమిటి దౌర్జన్యం యింట్లో జొరబడి.. ఒరేయ్ వెధవల్లారా, ఓరి నాయనో నన్నెందుకిలా కట్టేస్తున్నార్రా.. బాబోయ్.. నాయనోయ్.. రండర్రోయ్.."
"ఏయ్ ముసలీ నోరు మూసుకుని కూర్చుని మేం చెప్పేది విను ముందు. అట్టే మాట్టాడావంటే పళ్ళు రాలిపోతాయి... నిన్నాదుకోవడానికి నీ బాబు ఎవడూ రాడు."
"ఓరి మీ జిమ్మడిపోను, దొంగవెధవల్లారా ఏం కావాల్రా మీకు?"
"చస్ నోరుముయ్యి.. యీ పిల్లాడెవరు? నీ మనమడా? అంటే కొడుకు కొడుకు? మరి కోడలు ఎక్కడో పుట్టింట్లో వుంటే ఆ పిల్లాడిక్కడెందుకున్నాడు.... పాలు తాగే పసివాడ్ని తల్లి నుంచి వేరు చేస్తావా, నీ దుర్మార్గాన్ని యింక మేం సహించం... లాంఛనాల కోసం తల్లీ పిల్లల్ని వేరుచేస్తావా, రాక్షసీ నేవూ ఒక తల్లివే, డబ్బుకోసం యింత నీచానికి దిగుతావా...'
"ఓర్నాయనో.. ఆ దొంగముండ రౌడీ వెధవల్ని పంపించింది బాబోయ్.. దానమ్మ కడుపుకాలా.. దీనసాధ్యం కూలా..'
"ముసలిదానా.. పోనీ చేయి చేసుకోవడం ఎందుకని చూస్తున్నాం.. నీ కోడలిని ఒక్కమాట అన్నావా అంటే మక్కెలిరగదంతాం.. పిల్లాడిని తల్లినుంచి వేరుచేసి కోడల్ని పంపించే అధికారం నీకెవరిచ్చారో మూడేళ్ళుగా ఆ తల్లి పిచ్చిదయింది నీవల్ల. యిదిగో నీ మనవడ్ని తీసుకెళ్తున్నాం దిక్కున్నచోట చెప్పుకో. యీ పిల్లాడిని తల్లికప్పగించి. ఆ తల్లి పిచ్చి తగ్గితే మళ్లీ యిద్దర్నీ తీసుకొస్తా.. నీ కొడుకుతో చెప్పు. ఈలోగా పిచ్చివేషాలు వేసి మరో పెళ్ళికి ప్రయత్నిస్తే ఏ కీలుకాకీలు విరగొడ్తాం. ఈ ఇల్లు పీకి పందిరేస్తా.. జాగ్రత్త."


