అదే తన చివరి చూపన్నట్టు ఆఖరిసారిగా ధీరని చూసింది ఆర్తి. ధీర మనసునీ, శరీరాన్నీ యిచ్చింది మరెవరికో అయినా కర్మకాండలు చేయాల్సింది కట్టుకున్న భర్త మాత్రమే అన్నట్టు వీడ్కోలు తీసుకుని వెళ్లిపోయాడు శ్యాం చివరి భాద్యతలా.
ఆమె ఇంటికెలా వచ్చిందో తెలీదు.
ఆలోచనలు చురకత్తులై మెదడుని గుచ్చుతుంటే అది వైరాగ్యమో లేక కరగనంటున్న శిలాక్షణాలు అందించే భేదమో నిస్త్రాణగా సోఫాలో వాలిపోయింది.
ఎందుకిలా జరిగింది?
ఏదో చేస్తానని డాంబికంగా మాట్లాడిందే.
మరి పిరికిదానిలా ప్రాణాలెందుకు తీసుకుంది?
ధీర మాటలు, నవ్వులు, చిలిపి తగవులు, ఉపదేశాలూ, ఉద్దేశాలూ తలపుకొస్తూంటే నరాలతో అల్లిన పొదరిల్లులాంటి నిన్నటి స్నేహబంధం ఎందుకిలా తెగిపోయిందో, ధీర ఎందుకిలాంటి పనిచేసుకుందో అర్ధంకాక మధ్యాహ్నందాకా అలాగే వుండిపోయింది.
ఆకలిదప్పులు మరిచి ఆ రోజంతా అలాగే గడిపేదే.
కానీ 'పోస్ట్' అన్న కేకతో తేరుకున్న ఆమె నీరసంగా బయటికి నడిచింది. కవరుపై అక్షరాల్ని చూడగానే ఆమె గుండె లయతప్పింది. అది ధీర రాసిందే. బహుశా చివరిక్షణాల్లో పోస్ట్ చేసి వుంటుంది.
ఉద్విగ్నంగా తెరిచింది.
"నా ప్రియమైన ఆర్తీ!"
ధీర పక్కన నిలబడి పలకరిస్తున్నట్టు అనిపించగానే ఆమె కళ్ళనుంచి జివ్వున నీళ్ళు తిరిగాయి.
"ఇది నేను రాస్తున్న ఆఖరి లేఖ. అంతకన్నా మరణవాంగ్మూలం అంటే బాగుంటుందేమో. బహుశా ఇది నీకు అందేసరికి నేనీ లోకంలోనే వుండను. ఉండకూడదనే బలంగా నిర్ణయించుకున్నాను."
నాకు తెలుసు - ధీర ఆత్మహత్య చేసుకునేతంట పిరికిదా అని నువ్వు ఆలోచిస్తున్నావు కదూ?
ఇది పిరికితనం కాదు ఆర్తీ....... సాహసం. ప్రేమనే యుద్దరంగంలో అడుగుపెట్టిన నేను క్షతగాత్రనై నన్ను నేను కోల్పోవడం. అంతే తప్ప ఓటమి కాదే.
రాయప్రోలు విరహ వీధి చదివావా?
"హేమ పాత్రల జందన మొండిపోయె
ద్వారములు మోయుచున్నవి హారములను
సానలందింకె స్నాన కషాయగంధ
యబల యెవని కోసం సగమయి కృశింతు."
వెలుగులాంటి ప్రేమైతే పౌరుషంగా దయాకర్ ని అందుకునేదాన్ని. నావాడని అందరిముందూ తేల్చి చెప్పేదాన్ని కానీ నేను పాడిన యుగళగీతం చీకటి చిట్టడవిలోదనీ, ఆశల్ని అంటించి రవ్వంత వెలుగును నింపుకోగలనే తప్ప అదే శాశ్వతమైన కాంతిగా మార్చుకోలేనని యిప్పటికి అర్ధమైందే.
నిజం.........
నీ దగ్గర నుంచి హోటలుకి వచ్చానా......
అప్పటికే నాకోసం వెయిట్ చేస్తున్న దయాకర్ ని ఒకనాటి మా ప్రేమలేఖల్ని చూపించి చెడామడా తిట్టాను. బెదిరించి హడలుగొట్టాను. పాపం మానవుడు ఖంగుతిన్నాడు. కంగారుపడ్డాడే. నా మీద దాడికి అతడు సిద్దపడితే ఇంకా ఆవేశాన్ని ప్రకటించి నేను అన్నంతపనీ చేసేదాన్ని. కానీ ఏం చేశాడో తెలుసా?
చేతులు పట్టుకున్నాడు. నన్ను అల్లరిపెట్టకు అంటూ ప్రాధేయపడ్డాడు. దుర్గమారణ్యాన దారి తెలీని బాటసారిలా గాద్గదికంగా చివరికి చేతులు జోడించాడు.
ఏం చేయనే........ఇంకెలా పగతీర్చుకోను? పెంచుకున్న ప్రేమని ద్వేషంగా మార్చుకోగల శక్తి వుంటే, నా కళ్ళలోని వసంతాల్ని ఆర్చేసిన ఆ వ్యక్తిని సంతలో నిలబెట్టే మొండితనమే వుంటే నా కథ మరోలా వుండేది. కానీ ఎంతయినా ప్రేమించాను కదే.
నిన్నటిదాకా నేను అతడితో తిరిగిన బృందావనం ఇప్పుడు కాలి మరుభూమిగా మారినాగానీ అందులో అతడి పాత్రెంతని.
బాగా ఆలోచించాను.
ప్రేమంటే సౌందర్య ప్రభంజనం నిండిన తుఫానా?
సజీవ సమాధిని కట్టి బేషజాన్ని ప్రదర్శించే చితిలాంటి చరిత్రా?
లేక మరణించాక కూడా మన ముందు మిగిలే తాజ్ మహలా?
మూడోదే నిజమనిపించింది.
అందుకే నా కంటి ద్వారాల వెనుక నక్కిన అశ్రువులతో ప్రేమకి నా చివరి నీరాజనాలు తెలియచెప్పి దయాకర్ కి ప్రేమలేఖలన్నీ యిచ్చాను. నువ్వు మట్టిదీపానివే తప్ప వెలుగు వెన్నెలవి కావని తిట్టి సాగనంపాను.
ఆ తర్వాత తెలిసింది ఆర్తీ! శూన్యమనే పదానికి అర్ధం అప్పుడు బోధపడిందే. అందుకే మయ సృష్టి శిల్పంలాంటి భ్రాంతితో అటు కట్టుకున్నవాడ్ని దూరం చేసుకునీ ఇటు కావాలనుకున్నవాడికి దూరమై బ్రతకలేమని వెంటనే స్పురించింది.
తెల్లారేలోగా బ్రతుకుని తెల్లార్చుకోవాలనిపించింది.
అయితే ఆఖరి క్షణాల్లో సైతం ఒక్క నిజాన్ని చెప్పకపోతే అన్యాయమౌతుందే.
ప్రేమ నేరం కాదు. ప్రేమలేని జీవితం ఘోరం. అది లేకుండా బ్రతకడం దారుణం. నిజం ఆర్తీ! జరిగిన దానికి ఇప్పటికీ నేను పశ్చాత్తాపపడను. హంసలా నేను నాదైన జీవితంలో బ్రతికింది ఆరునెలలైతేనేం నూరేళ్ళ నా బ్రతుకు పుస్తకానికి నాకు నేను పీఠిక రాసుకున్నంత సంతృప్తిగా వెళ్ళిపోతున్నాను. నేనే కాదే నువ్వు కానీ మరెవరైనా కానీ ప్రేమ రాహిత్యంలో బ్రతకటం శాపం. "యు లివ్ టు లవ్ అండ్ లవ్ టు లివ్"
ఉంటానే మరి.........నీ ధీర"
ధారకడుతున్న కన్నీళ్ళలో అక్షరాలు అలికినట్టు కనిపిస్తుంటే ఒకసారి కాదు -మరోసారి......ఇంకోసారి చదివింది.
ధీర లేదు. కానీ దాని లేఖ వుంది. ఆ లేఖలో పిరికితనం లేదు. ప్రేమ కోసం తను పడిన ఆర్తి వుంది. ప్రేమించిన మనిషిని కాపాడాలనే కాంక్షతో తనను తాను ఆహుతి చేసుకోగలిగే చేవ వుంది.


